అదే నిజమైతే ... కేటీఆర్ కంటే ముందే కవితకు సీఎం ఛాన్స్ : రేవంత్ రెడ్డి

First Published | Nov 25, 2024, 6:56 PM IST

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డలు కేటీఆర్, కవితల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి పదవికోసం కేసీఆర్ కుటుంబంలో పోటీ నెలకొందని... అయితే ముందు ఆ పదవి ఎవరి దక్కనుందో తెలిపారు. 

KTR Kavitha

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఇప్పటివరకు జైలుకు వెళ్లినవారు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు... కాబట్టి తాను కూడా జైలుకు వెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ తహతహలాడుతున్నాడని రేవంత్ అన్నారు. ఇలా జైలుకెళ్లినవారు సీఎం అయ్యేదుంటే ముందుగా కేసీఆర్ కూతురు కవిత అవుతారంటూ సీఎం ఎద్దేవా చేసారు. 

కేసీఆర్ కుటుంబంలో సీఎం పదవి కోసం పోటీ ఎక్కువగా వుందని రేవంత్ అన్నారు. జైలుకు వెళ్ళిన తన చెల్లి ఎక్కడ ముందుగా సీఎం అవుతుందోనన్న భయం కేటీఆర్ కు పట్టుకుందన్నారు. జైలుకు వెళ్లినవారు సీఎం అవుతారని కేటీఆర్ బలంగా నమ్ముతున్నాడు... అందువల్లే ఎప్పుడెప్పుడు జైలుకు వెళదామా అని ఎదురుచూస్తున్నాడని సీఎం రేవంత్ అన్నారు. 
 

Anumula Revanth Reddy

అదానీ వ్యవహారంలో రేవంత్ ట్విస్ట్ : 

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ వేడుకలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ డిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఆదాని గ్రూప్ నుండి తెలంగాణ ప్రభుత్వం నిధులు అందుకుందంటూ జరుగుతున్న ప్రచారంపై రేవంత్ స్పందించారు. చట్టబద్ధంగా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశాలు ఇవ్వాలనేది నిబంధన అని పేర్కొన్నారు. నిబంధనల మేరకు టెండర్లను దక్కించుకున్న ఏ సంస్థలకైనా పెట్టుబడులకు అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టంగా వివరించారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీ కోసం కార్పస్ ఫండ్ కింద పలు కంపెనీలు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని గుర్తుచేసారు. అందులో భాగంగా అదానీ కూడా రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇప్పటివరకు ఆదానీతో సహా  ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫండ్ తీసుకోలేదు. ఆదాని గ్రూప్ వివాదాల నేపథ్యంలో వారు ఇస్తామన్న రూ.100 కోట్లు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని... ఈ మేరకు లేఖ రాసినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేసారు. 

తెలంగాణ ప్రభుత్వానికి రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని ఈ లేఖ ద్వారా అదానీ గ్రూప్ ను కోరినట్లు రేవంత్ తెలిపారు. పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో అదానీ విషయంలో జరుగుతున్న వివాదానికి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీ వివాదాస్పదం కావడం ఇష్టం లేదని... అందుకే అదానీ నుంచి రూ.100 కోట్లు తీసుకోకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూసి వివాదాస్పదం చేయవద్దని రేవంత్ కోరారు. 


Anumula Revanth Reddy

డిల్లీ పర్యటనపై రేవంత్ క్లారిటీ ;

తాను ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మీడియా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తోందని రేవంత్ అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి చర్చనే చేపట్టారని అన్నారు. కానీ ఇప్పుడు తాను ఢిల్లీకి వచ్చింది స్పీకర్ ఓంబిర్లా కూతురు వివాహానికి హాజరు కావడానికేనని... ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. అయితే రేపు (మంగళవారం) తెలంగాణ లోక్ సభ, రాజ్యసభ సభ్యలతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం తరపున సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను తీసుకొచ్చేందుకు కావాల్సిన కార్యాచరణ రూపొందిస్తామని...ఇందుకోసం అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. 

కొంతమంది అర్రాస్ పాటలా నా పర్యటనకు లెక్కలేస్తున్నారు... తానేమీ మీలా మోదీ ముందు మోకరిల్లాడానికి ఢిల్లీవెళ్లడం లేదంటూ బిఆర్ఎస్ నాయకులపై రేవంత్ విమర్శలు గుప్పించారు. ఎవరి కాళ్ళో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ అనుమతి ఇవ్వొద్దని కోరేందుకో తాను  ఢిల్లీ వెళ్లడం లేదన్నారు.

గత పదేళ్లుగా తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది... కేంద్రం నుచి నిధులు తెచ్చుకోవడం మన హక్కు అని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు బీజేపీతన ట్రెజరీ నుంచి ఏం ఇవ్వడం లేదు... కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచే ఇస్తుందన్నారు. రాజకీయ పక్షపాతం చూపకుండా వారిని వెళ్లి కలిసినపుడే నిధులు రాబట్టుకోగలం...ఇందుకోసం ఎన్నిసార్లయినా ఢిల్లీ వెళతానని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. 

Latest Videos

click me!