దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. కాగా...అయినా కేసుల సంఖ్య పెరగడంతో లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా దేశంలో వేలాది శుభకార్యాలు వాయిదా పడ్డాయి.
అయితే... ఓ ప్రేమ జంట మాత్రం లాక్ డౌన్ లో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి పోలీసులే సాక్ష్యంగా నిలవడం గమనార్హం.
ఓ పోలీసు అధికారి, ఆయన భార్య ఇద్దరూ కలిసి ఆ దంపతులకు కన్యాదానం చేసి మరీ పెళ్లి చేయడం విశేషం. ఈ సంఘటన పూణేలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిత్య సింగ్ బిస్తీ.. పూణేలో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. అదే నగరంలో నేహా కుశ్వ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి లాక్ డౌన్ కి ముందే పెళ్లి నిశ్చయమైంది. మే 2వ తేదీ పెళ్లి చేయాలని ఇరు వైపులా కుటుంబసభ్యులు భావించారు.
అనుకోకుండా కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. పెళ్లేమో డెహ్రాడూన్ లో జరగాల్సి ఉంది. వధూవరులు మాత్రం పూణేలో ఇరుక్కుపోయారు. ఇక వీరి పెళ్లి జరగడం కష్టమని అందరూ భావించారు. అయితే.. పోలీసులే దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు.
పెళ్లికుమారుడి తండ్రి ఆర్మీలో కల్నల్, పెళ్లికుమార్తె తండ్రి కూడా ఆర్మీలో కల్నల్, డాక్టర్. కానీ వారు కూడా ఉద్యోగం రీత్యా వేరు వేరు ప్రాంతాల్లో పోస్టింగ్‌లో ఉండిపోయారు.
అనుకున్న ముహూర్తానికి కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ ఇద్దరూ.. పోలీసుల సహకారం తీసుకున్నారు. హదాప్సర్ పోలీసు స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇన్‌స్పెక్టర్ ప్రకాశ్ అన్ని ఏర్పాట్లు చేశారు. వధూవరులు ప్రస్తుతం ఉంటున్న అమనోరా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోనే పెళ్లి నిర్వహించారు.
పోలీసులు పెళ్లి పెద్దలుగా పాల్గొన్నారు. ఓ పోలీసు ఆఫీసర్ దంపతులు కన్యాదానం చేశారు. పురోహితులను కూడా పోలీసులే తీసుకువచ్చారు. పెళ్లి జరగదు అనుకున్న సమయంలో పోలీసులు దేవతల్లా వచ్చి దీవించారని వధూవరులు ఇద్దరూ అన్నారు.లాక్ డౌన్ వేళ.. పోలీసుల సమక్షంలో జరిగిన వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.