Monkey attends phone call
Monkey attends phone call : కోతుల నుండే మనిషి పుట్టాడని అంటారు... అందువల్లేనేమో అప్పుడప్పుడు కోతులు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. అచ్చం మనుషుల్లా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలా తాజాగా ఓ కోతి సెల్ ఫోన్ ను ఉపయోగిస్తూ కనిపించింది... కేవలం పట్టుకుని తిరగడమే కాదు ఫోన్ వస్తే లిప్ట్ కూడా చేసింది. ఈ విచిత్ర ఘటన కేరళలో వెలుగుచూసింది.
monkey
తెలివైన కోతి :
కోతులు ఎప్పుడూ కుదురుగా వుండవు... తింగరి వేషాలు వేస్తూనే వుంటాయి. ఇతర ప్రాణులను మరీ ముఖ్యంగా మనుషులను తమ కోతిచేష్టలతో ముప్పుతిప్పలు పెడుతుంటాయి. పంటలను నాశనం చేయడం, అహారం లాక్కెళ్లడం లేదంటే చిన్నారులు, మహిళల వెంటపడుతూ భయపెట్టడం చేస్తుంటారు. కానీ కేరళలోని ఓ కోతి అచ్చం మనిషిలాగే ప్రవర్తించింది.
కేరళలోని మలప్పురం జిల్లా తిరూరులోని సంగమం రెసిడెన్సి పైఅంతస్తుపై ఓ యువకుడు అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ పని చేస్తున్నాడు. ఈ సమయంలో అతడు సెల్ ఫోన్ ను పక్కనున్న అల్యూమీనియం షీట్ పై పెట్టాడు. అతడు పనిలో బిజీగా వుండగా ఎక్కడినుండి వచ్చిందో గానీ ఓ కోతి ఆ సెల్ ఫోన్ పై కన్నేసింది. మెళ్ళిగా ఆ భవనంపైకి చేరుకుని యువకుడి సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లింది.
కోతి తన సెల్ ఫోన్ తీసుకెళ్లడం గమనించిన యువకుడు దాన్ని వెంటపడ్డాడు. కానీ అతడికి దొరక్కుండా ఫోన్ తీసుకుని ఓ చెట్టెక్కింది కోతి. స్థానికులతో కలిసి కోతి వద్దనుండి తన ఫోన్ తీసుకునేందుకు యువకుడు చాలా ప్రయత్నించాడు. కానీ కోతి సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదు.
ఇలా కోతిచేతిలో ఫోన్ వుండగానే ఓ కాల్ వచ్చింది. దీంతో కోతి ఏం చేస్తుందా అని అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అప్పుడే ఓ గమ్మత్తు జరిగింది... ఆ ఫోన్ స్క్రీన్ పై టచ్ చేసి టక్కున కాల్ లిప్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. ఆ కోతి తెలివి చూసి అవాక్కవడం అక్కడున్నవారి వంతయ్యింది. దానికి మాటలు రాక సరిపోయింది...లేదంటే ఫోన్ ఎత్తి మాట్లాడేదని అక్కడున్నవారు సరదాగా మాట్లాడుకున్నారు.
monkey
చివరకు సెల్ ఫోన్ యువకుడి చేతికెలా వచ్చిందంటే :
కొబ్బరి చెట్టు ఎక్కిన కోతిని యువకుడు వదిలిపెట్టలేదు... స్నేహితులతో కలిసి గంటలతరబడి అక్కడే వేచివున్నాడు. రాళ్లను దానిపైకి విసిరి కవ్వించాడు. ఇలా చాలాసేపటి తర్వాత అతడి ప్రయత్నాలు ఫలించి కోతి ఆ చెట్టు పైనుండి దూకేసింది. ఈ క్రమంలోనే దాని చేతిలోని సెల్ ఫోన్ పడిపోయింది. ఇలా యువకుడి ఫోన్ కోతి దగ్గరనుండి బయటపడింది.
అయితే కోతి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లడం సాధారణ విషయమే... కానీ అది ఫోన్ కాల్ ఎత్తడం, చెవి దగ్గర పెట్టుకోవడమే అసాధారణ విషయం. నిత్యం మనుషులను గమనించే ఆ జంతువు ఇలా వ్యవహరించి వుంటుందని అంటున్నారు.