ఏమిటీ సూర్య ఘర్ యోజన
భారత ప్రభుత్వం నిరుపేదల జీవన వ్యయాన్ని తగ్గించేందుకు తీసుకువచ్చిన పథకం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన. ప్రతి నెలా పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టాల్సిరావడం వారిపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఇది గమనించిన మోదీ సర్కార్ సౌరశక్తిని వారికి చేరువచేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో అమలుచేస్తున్నదే ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన.
ఉచిత విద్యుత్ ఎవరికి?
ఈ పథకం ద్వారా ప్రతి నెలా ఉచితంగానే ఇంటికి అవసరమైన విద్యుత్ పొందవచ్చు. ఇలాంటి అద్భుత పథకాన్ని పొందడం ఎలాగో చాలామందికి తెలియదు. కాబట్టి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలా పొందాలి? తదితర వివరాలు తెలుసుకుందాం.
సూర్య గృహ యోజనకు అర్హత
ప్రధాన మంత్రి సూర్య గృహ యోజన ఇప్పుడిప్పుడే ప్రజాదరణ పొందుతోంది. లక్ష నుండి లక్షన్నర లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కుటుంబంలో వుంటే వారికి అవకాశం లేదు.
దరఖాస్తుకు కావాల్సినవి
ఈ సూర్య ఘర్ యోజన పథకానికి దరఖాస్తు కోసం సరైన గుర్తింపు పత్రాలు అవసరం. అంటే ఆధార్ కార్డుతో పాటు అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, ఇప్పుడు కడుతున్న విద్యుత్ బిల్లు ఈ దరఖాస్తుకు అవసరం.
ఆన్లైన్ దరఖాస్తు విధానం
ఆన్ లైన్ లో pmsuryaghar.gov.in వెబ్ సైట్ ద్వారా ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా లబ్ది పొందేందుకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారమ్ యాక్సెస్ చేయడానికి లాగిన్ అవ్వండి. ఫారం నింపిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
ఉత్తరప్రదేశ్ లో ప్రకటన
మొదట ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇళ్లపై ప్రభుత్వమే సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తుంది. ఇలా తయారయ్యే లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది.