Madhya Pradesh Assembly Election Results 2023: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ కార్యాలయాల వద్ద సంబరాలు, హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు మంచి ఆధిక్యం లభించింది. ఉదయం 11 గంటలకే బీజేపీ ట్రెండ్స్ కొనసాగింది. ప్రస్తుతం సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ లో బీజేపీ 165 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 63 స్థానాల్లో మాత్రమే లీడ్ లో ఉంది.
Election Results 2023, BJP celebrations: మధ్యప్రదేశ్ లో స్పష్టమైన అధిక్యంతో ముందుకు సాగుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ తో పాటు రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో కూడా బీజేపీ గెలుపు దిశగా ముందుకు సాగుతోంది.
'ప్రజల విశ్వాసం, కార్యకర్తల అంకితభావానికి నిదర్శనం' అని మధ్యప్రదేశ్ బీజేపీ ట్వీట్ చేసింది. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటికే ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభించారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ పార్టీ కార్యకర్తలు అభినందించారు.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధనా సింగ్, ఇద్దరు కుమారులతో కలిసి తన అధికారిక నివాసం బాల్కనీ నుంచి విజయ చిహ్నాలను ప్రదర్శించారు. బీజేపీ గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ భారీ ఆధిక్యం సాధించడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంతోషం వ్యక్తం చేస్తూ, 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం మధ్యప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుందని అన్నారు.
కౌంటింగ్ కు ముందు ఏ పార్టీకి స్పష్టమైన గెలుపు అంచనాలను ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేకపోయాయి. అయితే, ఇప్పుడు వస్తున్న ఫలితాలు గమనిస్తే 160కి పైగా స్థానాల్లో బీజేపీ అధిక్యంతో ముందుకు సాగుతోంది.
2018తో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో 160 స్థానాల్లో ఆధిక్యం సాధించిన బీజేపీకి 51 సీట్లు అనూహ్యంగా పెరుగుతుండటం గమనార్హం. ఇక్కడ ప్రధాని మోడీ సహా పలు కీలక నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.