Gyanesh Kumar : భారత చీఫ్ ఎలక్షన్ కమీషనర్ గా ఐఐటియన్ ... ఎవరీ జ్ఞానేశ్?

Published : Feb 18, 2025, 09:52 AM ISTUpdated : Feb 18, 2025, 10:18 AM IST

భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనుంది... దీంతో నూతన సిఈసిని నియమించారు. ఓ ఐఐటియన్ ఐఏఎస్ కు ఈ బాధ్యతలు అప్పగించారు... ఆయన ఎవరో తెలుసా? 

13
Gyanesh Kumar : భారత చీఫ్ ఎలక్షన్ కమీషనర్ గా ఐఐటియన్ ... ఎవరీ జ్ఞానేశ్?
Chief Election commissioner of India

భారత ఎన్నికల సంఘం నూతన కమీషనర్ గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగియనుంది... ఈ నేపథ్యంలో కొత్త సిఈసి ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమీటి సోమవారం భేటీ అయ్యింది. ప్రస్తుత ఎన్నికల కమీషనర్లలో సీనియర్ అధికారిని ప్రధాన ఎన్నికల కమీషనర్ గా నియమించడం సాంప్రదాయంగా వస్తోంది...దీంతో  జ్ఞానేశ్ కుమార్ ను ప్రధాన ఎన్నికల కమీషనర్ గా నియమించాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. 

సోమవారం అర్ధరాత్రి నూతన సిఈసి నియామకానికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. త్రిసభ్య కమిటీ సిపార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు... దీంతో వెంటనే కేంద్ర న్యాయశాఖ జ్ఞానేశ్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

జ్ఞానేశ్ పదవీకాలంలో దేశంలో పలు కీలక ఎన్నికలు జరగనున్నాయి. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, 2026లో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆయన పర్యవేక్షణలోనే జరుగుతాయి. జనవరి 29, 2029 వరకు జ్ఞానేశ్ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఆఫ్ ఇండియాగా కొనసాగుతారు.
 

23
Gyanesh Kumar

ఎవరీ జ్ఞానేశ్ ఎవరు?

ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో జనవరి 27, 1964 లో జ్యానేశ్ కుమార్ జన్మించారు. చిన్నప్పటినుండి చదువులో మంచి చురుకైన విద్యార్థి... అందువల్లే ప్రతిష్టాత్మక ఐఐటీ లో సీటు సాధించగలిగాడు.

ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు.  ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ ఫైనాన్సియల్ అనలిటిక్స్ ఆఫ్ ఇండియా (ICFAI) లో బిజినెస్ ఫైనాన్స్ చేసారు. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన హర్వార్డ్ లో ఎన్విరాన్మెంటల్ ఎకానమిక్స్ చేసారు.  

జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి. మార్చి 2023లో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అంతకుముందు జ్ఞానేశ్ కుమార్ కేంద్ర హోంశాఖలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. రామమందిర కేసుకు సంబంధించిన న్యాయపరమైన డాక్యుమెంట్లను కూడా చూసుకున్నారు. అమిత్ షాకు సన్నిహితుడిగా పేరున్న జ్ఞానేశ్ కుమార్ సహకార శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

33
Gyanesh Kumar

జ్ఞానేశ్ కుమార్ స్థానంలో వివేక్ జోషి...

ఎన్నికల కమీషనర్ గా ఉన్న జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమీషనర్ గా నియమించడంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఎన్నికల కమీషనర్ గా వివేక్ జోషిని నియమించారు. ఇక ఇప్పటికే సుఖ్ భీర్ సింగ్ సంధు ఎన్నికల కమీషనర్ గా కొనసాగుతున్నారు. ఇలా జ్ఞానేశ్ నేతృత్వంలో ఈ ఇద్దరు కమీషనర్లతో కూడిన ఎన్నికల సంఘం ఇకపై దేశంలో ఎన్నికల వ్యవహారాలను చూసుకుంటుంది. 

ఎన్నికల కమీషనర్ల నియామకానికి సంబంధించి మోదీ సర్కార్ 2023 లో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది... ఆ తర్వాత జరిగిన మొదటి సిఈసి నియామకం జ్ఞానేశ్ దే. అయితే ఈ చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది... దీనిపై ఈ నెల 19న విచారణ జరగనుంది. అయితే అంతకుముందే సీఈసిని నియమించారు...మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
 

click me!