Manmohan Singh
Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ అత్యవసర విభాగంలో చేరారు. 92 ఏళ్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. భారతదేశ ప్రధానమంత్రిగా రెండు పర్యాయాలు కొనసాగిన మన్మోహన్ సింగ్.. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.
మన్మోహన్ సింగ్ ఏం చదువుకున్నారు?
మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విప్లవానికి ఆర్కిటెక్ట్‌గా గర్తింపు పొందారు. ఆయన 1932 సెప్టెంబర్ 26న ఉమ్మడి భారతదేశ పంజాబ్ ప్రావిన్స్ లో (ప్రస్తుతం పాకిస్తాన్ లో భాగంగా ఉంది) జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేమ్బ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థికశాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది.
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఎకనామిక్స్ నుంచి 1952లో బ్యాచిలర్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీలను పొందాడు. ఆయన అప్పుడు టాప్ ర్యాంకు విద్యార్థిగా తన చదువులను పూర్తి చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థికశాస్త్రంలో డి.ఫిల్ (Doctor of Philosophy) పొందారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రచించిన "ఇండియాస్ ఎగ్‌స్టార్ట్ ట్రెండ్‌స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ సెల్ఫ్-స్టెయిన్డ్ గ్రోత్" (క్లారెండన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్, 1964) అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక డెల్హీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో పని చేసిన సంవత్సరాలతో మరింత పటిష్టం చేసుకున్నారు. ఈ సంవత్సరాలలో ఆయన UNCTAD కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన మన్మోహన్ సింగ్, ఆ తర్వాత భారత ప్రభుత్వంలో చేరి వాణిజ్యం, ఆర్థిక ప్రణాళికలో తన నైపుణ్యంతో గుర్తింపు పొందారు.
1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తరువాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు.
1991లో పీవీ నరసింహా రావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా తన బడ్జెట్ ప్రకటించడం ఒక మైలురాయిగా మారింది. లిబరలైజేషన్‌ను స్వీకరించి, సోషలిస్టు యుగ పరిమితులను అంగీకరించి ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ మార్కెట్లకు స్వాగత పలికారు. భారత ఆర్థిక వ్యవస్థను కొత్త మార్గంలో ముందుకు నడిపించారు. ఆర్థిక విజయంల్లో సత్తా చాటిన సింగ్ రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించకపోయినప్పటికీ, 2004లో సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ను భారతదేశపు మొదటి సిక్కు ప్రధానిగా ఎన్నుకుంది. 2009 మే 22న రెండవసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశారు.
సింగ్ నాయకత్వంలో భారతదేశం అనూహ్యమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. 7.7% వృద్ధి దశాబ్దం పాటు కొనసాగింది. కోట్లమంది పేదరికం నుండి బయటపడ్డారు, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. భారతదేశం ఒక ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. 2024 ఫిబ్రవరి 8న మన్మోహన్ సింగ్ రాజ్యసభకు వీడ్కోలు పలికారు. పార్లమెంట్ ఆయన విశిష్ట సేవలను కొనియాడింది.