ఐపీఎస్ అధికారి పేరుతో రూ.10 కోట్ల మోసం: మిమ్మల్నీ మోసం చేస్తారు జాగ్రత్త

First Published | Oct 6, 2024, 4:00 PM IST

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించి తన వద్ద రూ.10 కోట్లు దోచేశారని హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి నవజోత్, బాంబే పోలీసుల పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. అయితే  TGCSB అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో నవజోత్, బాంబే పోలీసులను నిందితులుగా నమోదు చేయడం విశేషం. ప్రాథమిక ఆధారాలు, ఫిర్యాదు ప్రకారం వారి పేర్లు నిందితులుగా పెట్టామని, అసలు నిందితులు దొరికిన తర్వాత మారుస్తామని పోలీసులు తెలిపారు. 
 

సోషల్ మీడియాలో పాపులర్ అయిన బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి నవజోత్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడి దగ్గర  రూ.10 కోట్లు కొట్టేశారు. బాధితుడు కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగుచూసింది. ప్రజలను మోసం చేయడానికి సైబర్‌ నేరగాళ్లు సెలబ్రిటీల పేర్లు వాడుతున్నారని ఈ కేసు ద్వారా మరోసారి బయటపడింది. జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ పేరును కూడా సైబర్ నేరగాళ్లు తరచుగా ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్న విషయం ఇటీవల వెలుగుచూసింది. 
 

ఐపీఎస్ అధికారి నవజోత్, బాంబే పోలీసులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు రూ.10 కోట్లు దోచేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని వారు బెదిరించారని బాధిత వృద్ధుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. దీంతో TGCSB అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో నవజోత్, బాంబే పోలీసులను నిందితులుగా పేర్కొన్నారు. దీని గురించి STOIని వివరణ కోరగా, అసలు నిందితులను  ఇంకా కనుక్కోలేదని, ఫిర్యాదుదారు నుండి ప్రాథమిక సమాచారం ఆధారంగా మోసానికి వినియోగించిన వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశామని తెలిపారు. దీని అర్థం వారే నిందితులు కాదని, అసలు నేరస్థులను పట్టుకున్న తర్వాత పేర్లు సవరిస్తామని చెప్పారు. 
 


రూ.10 కోట్లు ఎలా దోచేశారంటే..

ముంబయిలోని ఓ ప్రభుత్వ బ్యాంకుకు చెందిన అధికారినంటూ బాధిత వృద్ధుడికి జూలై నెలలో ఒకరు కాల్ చేశారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ కార్డును దుర్వినియోగం చేసి రూ.లక్ష విత్‌డ్రా చేశారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయమని ఓ ఫోన్ నంబర్ ఇచ్చారు. వృద్ధుడు ఆ నంబర్ కు కాల్ చేశారు. అటువైపు ఓ వ్యక్తి మాట్లాడుతూ తాను బాంబే పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీ ఆధార్ ను ఓ నేరస్థుడు ఉపయోగిస్తున్నాడని, ఇది ఓ రకంగా మీరు నేరస్థుడికి సహాయం చేసినట్లేనని ఆరోపించాడు. ఖాతా మనీలాండరింగ్‌తో లింక్ అయ్యిందని బెదిరించాడు. దీంతో వృద్ధుడు భయపడ్డారు. ఈ ఫోన్ కాల్ గురించి ఎవరికీ చెప్పొద్దని, సీక్రెట్ గా విచారణ చేస్తున్నామని ఆ పోలీసు చెప్పారు. ఈ విషయం ఎవరికైనా చెబితే మూడు నుండి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని బెదిరించాడు. 

ఈ కేసును ఐపీఎస్ అధికారి నవజోత్ విచారిస్తున్నట్లు మోసగాళ్లు తనతో చెప్పారని బాధిత వృద్ధుడు తెలంగాణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఐపీఎస్‌ అధికారినని చెప్పిన ఓ మహిళ ప్రతి రెండు గంటలకొకసారి వృద్ధుడికి ఫోన్ చేసి వేధించింది. ఆ తర్వాత మూడు రోజుల్లో డబ్బు తిరిగి వస్తుందని హామీ ఇవ్వడంతో వేరే ఖాతాలకు ఆ వృద్ధుడు 10 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను బదిలీ చేశాడు.

బాధిత వృద్ధుడు అతని భార్య రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నారు. వారు తమ ఆస్తులన్నింటినీ విక్రయించి మోసగాళ్లకు బదిలీ చేశారు. బాధితుడు నగదు బదిలీ చేసిన ఖాతాలన్నీ మ్యూల్ ఖాతాలేనని అధికారులు గుర్తించారు. ఇంకో విషయం ఏమిటంటే నవజోత్ బీహార్ క్యాడర్ అధికారి మాత్రమే. మోసగాళ్లు అంచనా వేసినట్లు ముంబైకి చెందినవాడు కాదని గుర్తించారు. 
 

Latest Videos

click me!