
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. రాములోరిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
పలువురు వీఐపీలకు కూడా అయోధ్య ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు అందజేశారు. ఇక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, మహారాష్ట్రలు సెలవు ప్రకటించాయి.
అయోధ్యలో రామ మందిరంలో గురువారం మంత్ర ఉచ్ఛరణల నడుమ బాల రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని బయటి ప్రపంచానికి చూపించలేదు. తాజాగా, ఆ రాముడి విగ్రహం ముఖాన్ని రివీల్ చేశారు.
ఐదేళ్ల బాలుడి రూపంలో నిలబడి ఉన్న స్థితిలో ఈ విగ్రహాన్ని చెక్కారు. 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. కృష్ణ వర్ణపు శిలతో అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కారు. ఈ బాల రాముడి చేతిలో బంగారి విల్లు, బాణం ఉన్నాయి. రాముడి బంగారు వర్ణం అస్త్రాలను చేత పట్టుకుని నిలబడిన స్థితిలో ఈ విగ్రహాన్ని అరుణ్ యోగి రాజ్ చెక్కారు.
జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠకు ముందు 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ (జనవరి 12న వీడియో సందేశంలో) తెలిపారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు . దీక్షలో భాగంగా ప్రధాని మోదీ నేలపై నిద్రిస్తూ కొబ్బరినీళ్లు తాగుతున్నారు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు.
రాముడి భక్తుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని పలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నాసిక్ నలో కాలారామ్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లేపాక్షి వీరభధ్రస్వామి ఆలయం, కేరళలోని గురువాయుర్ శ్రీకృష్ణఆలయంలో పూజలు నిర్వహించారు.
హిందూ పురాణ గాధలు తెలిపేలా అయోధ్య ఆలయంలో శిల్పకళ సంపద వుంది. హిందూ దేవతామూర్తులు శిల్పాలను కూడా ఆలయగోడలపై అందంగా చెక్కారు. రామయ్య ప్రియభక్తుడు హనుమంతుడి శిల్పాలు అయోధ్య మందిరానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి.
రామాయణ గాధను తెలిపే అనేక శిల్పాలను అయోధ్య నగరమంతా ఏర్పాటుచేస్తున్నారు. ఇలా సీతమ్మ కోసం లంకకు వెళ్లేందుకు సముద్రంలో వంతెన కడుతుండగా ఉడత సాయం చేయగా...దాన్ని ఆప్యాయంగా రామయ్య నిమిరిని శిల్పాన్ని ఇక్కడ చూడవచ్చు.
అయోధ్య నగరంలో ప్రతి గోడ రామాయణానికి సంబంధించిన ఏదో సన్నివేశాాన్ని గుర్తుచేసేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. రామయ్య చిత్రాలతో కూడిన ఈ రంగురంగుల పెయింటింగ్స్ అయోధ్య నగరానికి మరింత అందాాన్ని అద్దుతున్నాయి.
రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22న అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ అయోధ్య పర్యటన అధికారిక షెడ్యూల్ వెలువడింది.
ప్రధాని సోమవారం ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో ప్రాణ ప్రతిష్ట పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు అయోధ్యలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2:15 గంటలకు కుబేర్ తిలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రామ మందిర ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ట్రస్టు సభ్యుల్లో అనిల్ మిశ్రా కూడ ఒకరు. 40 ఏళ్లుగా ఆయన అయోధ్యలో రామాలయం కోసం కృషి చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్టకు ముందు వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు అనిల్ మిశ్రా కర్తగా వ్యవహరిస్తారు.
అయోధ్యలో ఘనంగా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ తెలంగాణలోని హైదరాబాద్ లోనూ ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలను కృష్ణ ధర్మపరిషత్ తన భుజాలపై వేసుకుంది.
రేపు (జనవరి 22) హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ వేడుకకు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.
దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇస్రోకు చెందిన ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంతరిక్షం నుంచి రామ మందిరం ఎలా ఉంటుందో తెలిపే అయోధ్య చిత్రాన్ని తీసింది.
ప్రముఖులు అయోధ్యకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అయోధ్య నగరాన్ని ఉత్తర ప్రదేశ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు తమ ఆధీనంలోని తీసుకున్నాయి. కేవలం స్థానికులు, పాసులు వున్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.
పదివేలమందికి పైగా రాష్ట్ర, కేంద్ర బలగాలు అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. 100 మందికి పైగా డిఎస్పీలు, 320 మంది సిఐలు, 800 మంది ఎస్సైలు, వేలాదిమంది కానిస్టేబుల్స్ అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రాణప్రతిష్ట కార్యక్రమం తర్వాతి రోజునుండి అయోధ్య ఆలయంలో కొలువైన అయోధ్య రామున్ని సామాన్య భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో రామయ్య దర్శనం కోసం అయోధ్యకు వచ్చే భక్తులు ఆకలితో బాధపడకుండా పలు ధార్మిక సంస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
పాట్నాకు చెందిన మహవీర్ ఆలయ ట్రస్ట్ అయోధ్యలో రామ్ కి రసోయి పేరిట వంటశాలను ప్రారంభించింది. రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతిరోజూ ఉచితంగా ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ఈ వంటశాలను ఏర్పాటుచేసారు. ప్రతిరోజూ దాదాపు 10వేల మంది రామభక్తులకు రుచికరమైన వంటకాలను అందించి కడుపునింపనుంది ఈ రామ్ కి రసోయి.
ఇక ఇస్కాన్, నిహాంగ్ సింగ్స్ వంటి సంస్థలు కూడా అయోధ్యకు వచ్చే భక్తులకు ఆహారాన్ని అందించేందుకు సిద్దమయ్యాయి. బాబా హర్జీత్ సింగ్ రసూల్ పూర్ నేతృత్వంలోని నిహాంగ్ సిక్కుల గ్రూప్ అయోధ్య చార్ ధామ్ మఠ్ లో లంగర్ పేరిట వంటశాలను ఏర్పాటు చేసారు.