చాందిని చౌదరి `యేవమ్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Jun 14, 2024, 5:26 PM IST

తెలుగు హీరోయిన్‌ చాందిని చౌదరి నెమ్మదిగా తెలుగులో బిజీ అవుతుంది. విభిన్నమైన కథా చిత్రాలతో మెప్పిస్తుంది. తాజాగా ఆమె `యేవమ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకుంది చాందిని చౌదరి. ఇవి సినిమా అవకాశాలను తెచ్చిపెట్టాయి. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. `ప్రేమ ఇష్క్ కాదల్‌` చిత్రంలో ప్రామినెంట్‌ రోల్‌ చేసింది. `కేటుగాడు` మూవీతో హీరోయిన్‌గా మారింది. కొన్ని పెద్ద సినిమాలు, కొన్ని చిన్న చిత్రాలు, మరికొన్ని యావరేజ్‌ చేసింది. కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్న సమయంలో `కలర్‌ ఫోటో` ఆమె లైఫ్‌ని మార్చేసింది. నెమ్మదిగా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఆఫర్లని దక్కించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతుంది చాందిని. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ మూవీతో వస్తుంది. `యేవమ్‌` అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో నటించింది. ప్రకాష్‌ దంతలూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆషురెడ్డి, భరత్‌, వశిష్ట ముఖ్య పాత్రలు పోషించారు. నవదీప్‌ నిర్మించిన  ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది.  సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
సౌమ్య(చాందిని చౌదరి) తాను స్వాతంత్రంగా ఎదగాలని, తన కాళ్లపై తాను నిలబడాలనుకునే మనస్థత్వం కలిగిన అమ్మాయి. ఇంట్లో పేరెంట్స్ ని ఎదురించి మరీ పోలీస్‌ అధికారి(ఎస్‌ఐ) అవుతుంది. వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుంది. అందులో ఇన్‌స్పెక్టర్‌ అభి(భరత్‌ రాజ్‌)లో సిన్సియారిటీ, ఇన్నోసెంట్‌ చూసి  ఆయన్ని అభిమానిస్తుంది.  మరోవైపు యుగంధర్(వశిష్ట సింహ) హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలని ట్రాప్ చేసి అత్యాచారం చేసి చంపేస్తుంటాడు. ఓ అమ్మాయికి అలాంటి ట్రాప్ కాల్ రావడంతో ఆమెకి బదులు సౌమ్య వెళ్తుంది, కానీ యుగంధర్ తనని చూసి ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని చెప్పి సౌమ్యకి యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ జరగడంతో సౌమ్య, అభి మరింత దగ్గరవుతారు. అభి చెప్పిన మాటలకు ఇంప్రెస్‌ అవుతుంది సౌమ్య. కానీ అభికి అప్పటికే పెళ్లి అవుతుంది. తన భార్య(అషురెడ్డి) తనని వదిలేసి వెళ్లిపోయిందని, ఆమె అంచనాలకు తగ్గట్టుగా తాను లేనని చెప్పి వెళ్లిపోయిందని చెబుతాడు అభి. దీంతో అతనిపై మరింత ప్రేమ పెరుగుతుంది. అభితో ఓ రోజు వనభోజనంకి వెళ్లినప్పుడు ఓ ట్విస్ట్ రివీల్‌ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? పోలీసులు యుగంధర్ ని పట్టుకున్నారా? యుగంధర్, అభికి ఉన్న సంబంధం ఏంటి? అభి భార్య ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? ఇందులో స్ల్పిట్‌ పర్సనాలిటీ కాన్సెప్ట్ ఏంటనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః

స్ల్పిట్‌ పర్సనాలిటీ అనే మెంటల్‌ డిజార్డర్‌ నేపథ్యంలో అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. `అపరిచితుడు` సినిమా దానికి పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్‌. మానసిక సమస్య కారణంగా మనిషులు ఇలా అపరిచితుల్లా ప్రవర్తిస్తుంటారు. ఒక వ్యక్తిలోనే మరో స్వభావం కనిపిస్తుంది. దాన్ని వెండితెరపై మరో రూపంలో చూపిస్తుంటారు. `యేవమ్‌` సినిమాలో మరో వ్యక్తిగా చూపించాడు దర్శకుడు. ఆ ట్విస్టే ఈ సినిమాకి పెద్ద బలం. ఆ అంశం పక్కన పెడితే ఇదొక రెగ్యూలర్ మర్డర్ మిస్టరీగా సాగే‌ సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌. కాకపోతే ఇందులో థ్రిల్లింగ్‌ అంశాల డోస్‌ తగ్గించారు. చాలా తక్కువగానే చూపించారు. రెగ్యూలర్‌ సినిమా వేలోఈ మూవీ సాగుతుంది. సినిమా ప్రారంభం నుంచి రెండు పాత్రలను చూపిస్తూ వెళ్లాడు దర్శకుడు. సగం సస్పెన్స్ అక్కడే రివీల్‌ అయ్యింది. కాకపోతే అందులోని మెయిన్‌ ట్విస్ట్ ని చివర్లో చూపించారు. అదే ఇందులో ఎంగేజింగ్‌ పాయింట్‌. రెండు పర్సనాలిటీస్‌ వేర్వేరుగా చూపించి. తెరవెనుక ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. 
 

హీరోల పేర్లు చెప్పి, వారితో డేట్స్ కి వెళ్లే అవకాశాలు ఇస్తామని చెప్పి, రియల్‌ లైఫ్‌లో జరిగే మోసాలను ఇందులో  అచ్చు అలానే ఆవిష్కరించారు. హీరోలతో డేట్ అని చెప్పి యుగంధర్‌ పాత్ర అత్యాచారం చేయడం, చంపేయడం చేస్తుంటాడు. ఇది ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఆడియెన్స్ లో కాస్త భయాన్ని క్రియేట్‌ చేస్తుంది. అమ్మాయిలే టార్గెట్‌గా యుగంధర్‌ పాత్ర ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడటం ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. కానీ అతను చేసేది సేమ్‌ రిపీట్‌ అవుతుంది. ఇలా వరుసగా రెండు మూడు సార్లు చూపించడంతో రొటీన్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. ఇందులోనే సౌమ్య, అభిల మధ్య రిలేషన్‌ని, వారి బాండింగ్‌ని చూపించారు. ప్రేమ కథగా కాకపోయినా, డీసెంట్‌గా లైటర్‌ వేలో వారి మధ్య లవ్‌ రిలేషన్‌ ని చూపించడం బాగుంది. సెకండాఫ్‌లో క్లైమాక్స్ వరకు ఇదే సాగుతుంది. ఇక మధ్య మధ్యలో ట్విస్ట్ లను రివీల్‌ అవుతూనే ఉంటాయి. అవి  ఆడియెన్స్ కి ఓ క్లారిటీ ఇస్తుంటాయి. క్లైమాక్స్ లో అసలు విషయాన్ని రివీల్‌ చేయడం బాగుంది. కానీ అది వాహ్‌ అనిపించేలా అయితే లేదు. ముందు నుంచే హింట్‌ ఇస్తున్న నేపథ్యంలో అది తేలిపింది.
 

దీంతోపాటు సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయిల శక్తి సామర్థ్యాల గురించి చెప్పే విషయాలు ఇన్ స్పైరింగ్‌గా ఉంటాయి. అమ్మాయిలు, మహిళలు ఒంటరి కాదు, వాళ్లు ఏం చేయలేరనే భావనని బ్రేక్‌  చేశారు. సౌమ్య పోలీస్‌ ఆఫీసర్‌గా ఎన్ని అడ్డంకుల ఎదురైనా నిలబడింది, తన కాళ్లపై, తన శక్తిపై నిలబడిందనే విషయాలను చెప్పకనే చెప్పేశాడు. మరోవైపు స్ల్పిట్‌ పర్సనాలిటీలోని ట్విస్ట్ ని థ్రిల్లింగ్‌గా ఆవిష్కరించాడు. కానీ అది ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. సినిమా ప్రారంభంలో కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, ఆ తర్వాత స్లోగా రన్‌ అవుతుంది. కొంత సీరియల్‌ని తలపిస్తుంది. స్లో నరేషన్‌ ఆడియెన్స్ కి బోర్‌ తెప్పిస్తుంది. క్రైమ్‌ థ్రిల్లర్స్ లో ట్విస్ట్, జర్క్ లు ఉంటేనే ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్‌ అవుతుంది. కథతో ఎంగేజ్‌ అవుతూ సినిమాతో ట్రావెల్ అవుతాడు. ఇందులో అది లోపించింది. మధ్యలో సినిమా సాగుతున్న తీరు కాస్త విసుగు తెప్పిస్తుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ రివీల్‌ చేసిన విధానం కూడా పేలలేదు. కాకపోతే ఓ కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇస్తుంది. డిఫరెంట్‌ అనుభూతి కలుగుతుంది. 
 

నటీనటులుః 
చాందిని చౌదరి కంటెంట్‌ ఉన్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటుంది. ఇందులోనూ ఆమె పోలీస్‌ పాత్ర చాలా డిఫరెంట్‌ గా ఉంది. పోలీస్‌ అంటే యాక్షన్‌ అని కాకుండా మరో కొత్త యాంగిల్‌ని చూపించింది. వారిలోనూ ప్రేమని చూపించింది. మహిళలను ఇన్‌స్పైర్‌ చేసేలా ఆమె పాత్ర సాగడం విశేషం. రియాలిటీకి దగ్గరగా ఆమె పాత్రని చూపించడం ఓ ఎత్తైతే, చాందిని కూడా అంతే సహజంగా నటించి మెప్పించింది. ఓవర్‌ గా వెళ్లకుండా, అలాగని లో కాకుండా ఓ మీటర్‌లో చేసి మెప్పించింది. ఇక యుగంధర్‌ పాత్రలో వశిష్ట మరోసారి అదరగొట్టాడు. నెగటివ్‌ రోల్‌లో రెచ్చిపోయాడు. అంతే కన్నింగ్‌, అంతే క్రూరత్వం, అంతే రాక్షసత్వాన్ని చూపించి మెప్పించాడు. ఇన్నోసెంట్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అభి మెప్పించాడు. డిసెంట్‌ యాక్టింగ్‌గా ఆకట్టుకున్నాడు. సిన్సియర్‌ పోలీస్‌గా మెప్పించాడు. బోల్డ్ రోల్‌లో ఆషురెడ్డి అదరగొట్టింది. మిగిలిన పాత్రల్లో దేవి ప్రసాద్‌, గోపరాజు రమణ రెగ్యూలర్‌ రోల్స్ లో మెప్పించారు. 

టెక్నిషియన్లుః
సినిమా విజువల్‌గా బాగుంది. ఎస్‌ వీ విశ్వేశ్వర్‌ కెమెరా ఫ్రేములు ఆకట్టుకునేలా ఉన్నాయి. లొకేషన్లని చాలా సహజంగా చూపించాడు. కీర్తన శేషు, నీలేష్‌ మందలపు సంగీతం ఆకట్టుకుంది. బిజీఎం చాలా బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. ఒగ్గుకథ, యేవమ్‌ టైటిల్‌ సాంగ్‌ కొత్తగా ఉన్నాయి. డీసెంట్‌ బీజిఎం కొత్తగా ఉంది. సుజనా అడుసుమిల్లి ఎడిటింగ్‌ ఓకే, కాకపోతే ఇంకాస్త షార్ప్ చేయాల్సింది. స్క్రీన్‌ప్లే పరిగెత్తించేలా చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నంత బాగానే ఉన్నాయి. దర్శకుడు ప్రకాష్‌ దంతలూరి దర్శకత్వం ఓకే అనిపించేలా ఉంది. స్క్రీన్‌ ప్లే కొత్తగా ఉంది. కానీ సినిమాని పరిగిత్తించేలా స్క్రీన్‌ప్లే రాసుకుంటే బాగుండేది. అదే సమయంలో రొటీన్‌, బోరింగ్‌ సీన్లు కట్‌ చేస్తే, ట్విస్ట్ లు యాడ్‌ చేస్తే సినిమా మరింత బాగుండేది.  

ఫైనల్‌గాః స్ల్పిట్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ని కొత్తగా చూపించిన మూవీ. అదే సమయంలో మహిళలు తలచుకుంటే ఏమైనా చేయగలరనేది చూపించిన మూవీ `యేవమ్‌. 

రేటింగ్‌ః 2.5 

నటీనటులుః చాందిని చౌదరి, వశిష్ట, భరత్‌ రాజ్‌, గోపరాజు రమణ, ఆషురెడ్డి, దేవి ప్రసాద్‌ తదితరులు. 

టెక్నీషియన్లుః 
కెమెరాః ఎస్‌ వీ విశ్వేశ్వర్‌, 
సంగీతంః కీర్తన శేషు, నీలేస్‌ మందలపు
ఎడిటర్‌ః సుజనా అడుసుమిల్లి
దర్శకుడుః ప్రకాష్‌ దంతలూరి
నిర్మాతః నవదీప్‌, పవన్‌ గోపరాజు  
 

click me!