నవదీప్‌ `లవ్ మౌళి` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Jun 7, 2024, 7:42 PM IST

ప్రారంభంలో హీరోగా రాణించిన నవదీప్‌ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారి మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా `లవ్‌ మౌళి` చిత్రంతో ఈశుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

నవదీప్‌ కెరీర్‌ ప్రారంభంలో `జై`, `గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ`, `మొదటి సినిమా` వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నారు.  `చందమామ` నుంచి సెకండ్‌ హీరోగా టర్న్ తీసుకున్నాడు. క్రమంగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలతో మెప్పిస్తున్నాడు. ఇటీవల ఓటీటీలు వచ్చాక వెబ్‌ సిరీస్‌లలో లీడ్‌ రోల్స్ తో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు `లవ్‌ మౌళి` అనే ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇది థియేట్రికల్‌గా వస్తున్న సినిమా కావడం విశేషం. ప్రముఖ రైటర్‌ విజయేంద్రప్రసాద్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన అవనీంద్ర దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. పంకూరి గిద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో, సీ స్పేస్‌, నైరా క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కింది. బోల్డ్ కంటెంట్‌తో వస్తోన్న ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
మౌళి(నవదీప్‌) చిన్నప్పుడు పేరెంట్స్ విడిపోవడంతో ఒంటరిగా మేఘాలయాల్లో  హ్యూమన్‌ ఎమోషన్స్ తెలియకుండా వైల్డ్ గా పెరుగుతాడు. తనకు ఎప్పుడు ఏం అనిపిస్తే అది చేస్తాడు.  అదే సమయంలో అతనిలో అద్భుతమైన పెయింటింగ్‌ టాలెంట్‌ ఉంటుంది. పెయింట్స్ వేస్తూ వచ్చిన డబ్బులతో లైఫ్‌ని లీడ్‌ చేస్తుంటాడు, తనకు నచ్చినట్టు ఎంజాయ్‌ చేస్తుంటాడు. ప్రేమ, అమ్మాయిలపై రాంగ్ ఒపీనియన్‌ కలిగి ఉంటాడు. అమ్మాయిలంతా ఒక్కటే మోసం చేస్తారనే భావనతో ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ అఘోరా(రానా దగ్గుబాటి) కలిసి ఓ పెయింటింగ్‌ బ్రెష్‌ ఇస్తాడు. దానితో అమ్మాయిల పెయింట్స్ వేస్తే నిజంగానే ఆ అమ్మాయి లైఫ్‌లోకి వస్తుంది. అలా తన ఫాంటసీ ప్రపంచంలో మొదట తాను అనుకున్న లక్షణాలతో అమ్మాయి రావాలని పెయింట్‌ వేస్తే అలాంటి అమ్మాయే వస్తుంది. ఆమెతో కొన్నాళ్లు ఎంజాయ్‌ చేశాక, తన మాట వినడం లేదు, తనకు నచ్చినట్టు ఉండటం లేదని, ఆమెని వద్దనుకుని మరో లక్షణాలతో ఉన్న అమ్మాయి కావాలనుకుంటాడు, కొన్ని రోజులు ఆమెతో ఎంజాయ్‌ చేశాక, ఆమెతోనూ ఇబ్బంది పడతాడు, ఆ తర్వాత మరో లక్షణాలతో ఇంకో అమ్మాయి పెయింట్‌ వేస్తాడు, అలాంటి అమ్మాయే తన జీవితంలోకి వస్తుంది. మరి ఈ ముగ్గురు అమ్మాయిలతో మౌళికి వచ్చిన సమస్య ఏంటి? అసలు ఆయనలో ఉన్న సమస్య ఏంటి? ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటాడు? చివరికి తాను తెలుసుకున్న నిజం ఏంటి? తనలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి? అనేది ఈ సినిమా మిగిలిన కథ. 


విశ్లేషణః
ప్రేమ కథలతో సినిమాలు ఎన్నో వచ్చాయి. ఎన్నో ఆకట్టుకున్నాయి. అలరించాయి. కాంటెంపరరీ లవ్‌ స్టోరీలు కూడా ఎంతో ఆదరణ పొందుతున్నాయి. సమాజంలో ప్రేమపై ఉన్న ఆలోచన, ఆ ఫీలింగ్‌ మారింది. ఒకప్పుడు ప్రేమ పోయెటిక్‌గా ఉండేది, ఇప్పుడు బోల్డ్ గా మారింది. ప్రేమ అంటే ఐ లవ్యూ చెప్పేయడం, ముద్దులు, రొమాన్స్ వరకు వెళ్లిపోవడంగా మారింది. కానీ పాత కాలం నాటి ప్రేమ కథల్లో చాలా డెప్త్ ఉంటుంది. చాలా ఎమోషన్స్ ఉంటాయి. `లవ్‌ మౌళి` చిత్రంలో ఈ రెండింటిని మిక్స్ చేసి రూపొందించారు మేకర్స్. పోయెటిక్‌ వేలో ట్రెండీ లవ్‌ స్టోరీని చెప్పాడు. కొత్త సీసాలో పాత సారా తరహాలో. కొంత కవితాత్మకంగా, మరికొంత బోల్డ్ గా సాగుతుంది మూవీ. అదే సమయంలో చాలా వైల్డ్ లవ్‌ స్టోరీ అని చెప్పొచ్చు. 
 

ఇందులో హీరో పెయింటింగ్ ఆర్టిస్ట్. అతను చిన్నప్పట్నుంచి వైల్డ్ లైఫ్‌లో పెరుగుతాడు, ఆలోచనల్లో ఆ వైల్డ్, పొయెటిక్‌ సెన్స్ ఉంటుంది. పెయింటింగ్‌ వేస్తే అందులోని తాను ఊహించుకున్న అమ్మాయి రావడం అనే ఫాంటసీ ఎలిమెంట్లు కొత్తగా ఉంటాయి. కానీ వచ్చాక ఇద్దరి మధ్య లవ్‌, రొమాన్స్ మాత్రం సేమ్‌. నేటి యువతరంలో డిఫరెంట్‌ ఆలోచనలతో ఉంటున్నారు. రాజీపడటం లేదు. నచ్చిన అమ్మాయి కావాలని, నచ్చినట్టు బతకాలని భావిస్తున్నారు. అమ్మాయిల్లోనూ ఇదే ధోరణి ఉంది. స్వేచ్ఛని కోరుకుంటున్నారు. స్వతంత్ర్యంగా బతకాలనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో హీరో అమ్మాయిలు తనకు నచ్చినట్టే ఉండాలని భావిస్తుంటాను. చిన్నప్పట్నుంచి తాను పెరిగిన విధానం కావచ్చు, చూసిన పరిస్థితులు కావచ్చు, ప్రేమపై ఓ సరైన అభిప్రాయం ఉండదు, దీంతో నచ్చినట్టుగా ఉండాలనుకుంటాడు, తన పార్టనర్‌ కూడా తనకు అనుగునంగానే ఉండాలనుకుంటాడు. అలా అనుకునే అమ్మాయిని పెయింట్‌ చేస్తాడు, కానీ కొన్ని రోజుల్లోనే విభేదాలు వస్తుంటాయి. ఇవన్నీ కాస్త ప్రాక్టికల్‌గా సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. దీంతో నేటితరం యువతకి అంటే ప్రేమలో ఉన్నవారికి, కొత్తగా పెళ్లైనవాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. 
 

అయితే ఫస్టాఫ్‌ అంతా పోయెటిక్‌గా తీయడంతో స్లోగా అనిపిస్తుంది. బోర్ ఫీలింగ్‌ తెప్పిస్తుంది. సెకండాఫ్‌లో రొమాన్స్‌, బోల్డ్ సీన్లు, ఘర్షణ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తాయి. ఎంగేజ్‌ చేస్తాయి. కానీ కొంత సమయం తర్వాత రొటీన్‌గానే అనిపిస్తుంది. చాలా సినిమాల్లో చూసింది ఇదే కదా అనిపిస్తుంది. అదే సమయంలో కవితాత్మకంగా సినిమాని నడిపించడంతో అది నేటితరం యువతకి ఎక్కడం కాస్త కష్టమనే చెప్పాలి. బోల్డ్ సీన్లు, రొమాన్స్ ఘాటు మాత్రం కొంత వరకు ఆకట్టుకుంటాయి. కానీ కథ పరంగా రొటీన్‌గానే ఉంటుంది. అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి, వారి ఆలోచనలకు, ఇష్టాలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పే కాన్సెప్ట్ బాగుంది. అది ట్రెండీగా ఉంటుంది. ఇలా మిగిలిన అన్నీ రెగ్యూలర్‌ సినిమాల ఫీలింగ్‌నే తెస్తాయి. ఫాంటసీ ఎలిమెంట్లు కొత్తగా ఉంటాయి. విజువల్స్ సినిమాలో ఫ్రెష్‌ ఫీలింగ్‌ని తెస్తాయి. మ్యూజిక్‌, బిజీఎం కొత్తగా అనిపిస్తుంది. కానీ ఆర్ట్ మూవీ స్టయిల్‌లో సాగడం సినిమాకి పెద్ద మైనస్‌.  ఆవిషయంలో మేకర్స్ కేర్‌ తీసుకుని, మరింత ఎంటర్‌టైనింగ్‌గా, ఫన్ యాడ్‌ చేస్తూ తీస్తే బాగుండేది. 
 

నటీనటులుః 
సినిమా మెయిన్‌గా నవదీప్‌ పాత్ర మీదనే సాగుతుంది. ఆయన ఆలోచనలు, ఆయన ప్రవర్తన మీదనే సాగుతుంది. ఆ పరంగా నవదీప్‌ నటుడిగా ఇరగదీశాడు. చాలా బాగా చేశాడు. వైల్డ్ బాయ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించి మెప్పించాడు. అఘోరగా రానా మెరిసి సర్‌ప్రైజ్‌ చేశాడు. నవదీప్‌ మేనేజర్‌గా భావనసాగి ఫర్వాలేదనిపిస్తుంది. ఇక తన ఊహల రాణి పంకూరి గిద్వానీ అందంతో మెప్పించింది. రొమాన్స్ తో అదరగొట్టింది. నటనతోనూ అకట్టుకుంది. అలరించింది. ఈ పాత్రలే మెయిన్‌. మిగిలిన పాత్రలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. 
 

టెక్నీకల్‌గాః 
కథ పరంగా కొంత రొటీన్‌గా, ఆర్ట్ ఫిల్మ్ ని తలపించినా, టెక్నీకల్‌గా మాత్రం సినిమా బాగుంది. లొకేషన్స్ అదిరిపోయాయి. మేఘాలయాల్లోని అందాలు విజువల్‌ ట్రీట్‌లా అనిపిస్తాయి. ఈ మూవీ దర్శకుడే కెమెరామెన్ కావడంతో తన ఊహలను వెండితెరపై అందంగా ఆవిష్కరించారు. మ్యూజిక్‌ సినిమాకి మరో ప్లస్‌. గోవింద్‌ వసంత, కృష్ణ ఇద్దరూ మంచి మ్యూజిక్‌ అందించారు. పాటలు వినేలా ఉన్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకుంటుంది. దర్శకుడి విజనరీ అద్భుతంగా ఉంది. కథ పాతదే అయినా నేటి తరానికి మిక్స్ చేస్తూ చేసిన ప్రయత్నం బాగుంది. కానీ కమర్షియల్‌ వేలో తీయలేకపోయాడు. స్లోనరేషన్‌ పెద్ద మైనస్‌. ఫన్‌ ఎలిమెంట్లు పెట్టి మరింత ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్‌ప్లే నడిపిస్తే సినిమా బాగుండేది. 

ఫైనల్‌గాః `లవ్‌ మౌళి` యూత్‌ని టార్గెట్‌ చేసిన పొయెటిక్‌ అండ్‌ బోల్డ్  మూవీ. డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ నిస్తుంది.
రేటింగ్‌ః 2.5
 

Latest Videos

click me!