పాయల్‌ రాజ్‌పుత్‌ `రక్షణ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Jun 7, 2024, 4:46 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ కెరీర్‌ ఇటీవల `మంగళవారం`తో గాడిన పడింది. అనంతరం ఇప్పుడు ఆమె `రక్షణ` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. నేడు రిలీజ్‌ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

`ఆర్ఎక్స్ 100` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో తెలుగులో స్టార్‌ అయిపోయింది పాయల్ రాజ్‌పుత్‌. బోల్డ్ అండ్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో తెలుగులో సంచలనంగా మారింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ సరైన సినిమాలు ఎంపిక చేసుకోలేక తడబాటు పడింది. దీంతో కెరీర్‌ మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో గతేడాది `మంగళవారం`తో మరోసారి సక్సెస్‌ గాడిన పడింది. ఈ మూవీ పాయల్‌ కెరీర్‌కి బూస్ట్ ఇచ్చింది. అనంతరం ఇప్పుడు ఆమె `రక్షణ` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. రోషన్‌, మానస్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రణదీప్‌ ఠాకోర్‌ స్వీయదర్శకత్వంలో నిర్మించారు. నేడు శుక్రవారం(జూన్‌ 7న) ఈ మూవీ విడులైంది. ఈ సినిమాతో పాయల్ కి మరో విజయం దక్కిందా? తేడా కొట్టిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
ఏసీపీ కిరణ్‌(పాయల్‌ రాజ్‌పుత్‌)ని తన ఫ్రెండ్‌ ప్రియా ఆత్మహత్య వెంటాడుతుంది. ఆమెది సూసైడ్‌ కాదు, హత్య అని ఆమె బలంగా నమ్ముతుంది. అందుకు కారణం తను ఆత్మహత్య చేసుకున్న ప్లేస్‌లో లాలిపాప్‌ తింటూ ఓ వ్యక్తి కనిపించడమే, అతనెవరనేది తెలియదు. ఆ తర్వాత అమ్మాయిలను వేధిస్తున్న అరుణ్‌(మానస్‌)ని ట్రాప్‌ చేసి పట్టుకుని వార్నింగ్‌ ఇస్తుంది కిరణ్‌. అందరి ముందు తనని అవమానించినందుకు అరుణ్‌.. కిరణ్‌పై కక్ష్య తీర్చుకోవాలని ప్లాన్‌ చేస్తాడు. ఆమె పేరుతో ఓ కాల్‌ గర్ల్ తరహాలో వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేసి వేధిస్తుంటాడు. దీంతో అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది కిరణ్‌. కానీ ఊహించని విధంగా అరుణ్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తన వేధింపుల కారణంగానే అతను సూసైడ్‌ చేసుకున్నాడని భావించిన పోలీసులు కిరణ్‌ని సస్పెండ్‌ చేస్తారు. అయినా ఆ కేసుని వదలదు. అరుణ్‌ది కూడా  తన ఫ్రెండ్‌ తరహాలోనే సూసైడ్‌ కాదని, హత్యనే అయి ఉంటుందని, దీని వెనకాల ఎవరో వ్యక్తి ఉన్నాడని, ఆ లాలిపాప్‌ పర్సనే ఇవన్నీ చేస్తున్నాడని భావిస్తుంది ఏసీపి. డ్యూటీకి అతీతంగా ఓ పోలీస్‌ సహాయంతో ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంది. మరి విచారణలో తెలిసిన నిజాలేంటి? నగరంలో జరిగే యాక్సిడెంట్స్ కి, అజ్ఞాత వ్యక్తికి సంబంధం ఉందా? ఆ సూసైడ్స్ కారణం ఎవరు? అతని మోటివేషన్‌, మోటో ఏంటి? కిరణ్‌ అతన్ని కనిపెట్టిందా? చివరికు ఏమైంది, ఈ క్రమంలో ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 

క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాలు ఇటీవల వరుసగా ఓ ట్రెండ్‌ మాదిరిగా వస్తున్నాయి. యాక్షన్‌ సినిమాలతోపాటు ఇప్పుడు ఎక్కువగా క్రైమ్‌ థ్రిల్లర్సే బాగా ఆదరణ పొందుతున్నాయి. ఓటీటీలో ఇవి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. రెండు గంటలసేపు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. మంచి ఆదరణ పొందుతున్నాయి. అందులో భాగంగా ఈ శుక్రవారం రెండు థ్రిల్లర్‌ మూవీస్‌ వచ్చాయి. స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `సత్యభామ`తో వచ్చింది. ఆమెతోపాటు పాయల్‌ `రక్షణ`తో వచ్చింది. ఈ మూవీ మర్దర్‌ మిస్టరీలోని లోతులను ఆవిష్కరిస్తూ, అమ్మాయిలను ఇన్‌స్పైర్‌ చేసేలా ఉంటుంది. కొంత సందేశం, కొంత కమర్షియాలిటీ, ఇంకొంత థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లతో సాగుతుంది. సినిమా ప్రారంభం నుంచే మర్దర్‌ మిస్టరీతో సాగుతుంది. డైరెక్ట్ స్టోరీలోకి వెళ్లారు దర్శకుడు. అది కూడా ఫాస్ట్ గా గతాన్ని చూపించి ఇన్వెస్టిగేషన్‌లోకి దిగిపోయాడు. ఈ క్రమంలో పోలీస్‌ డిపార్ట్ మెంట్‌లో ఉన్న లొసుగులను టచ్‌ చేస్తూ వాస్తవంగా ఇలాంటి క్రైమ్‌లో పోలీసులు ఏం చేస్తారో చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు మర్దర్స్ విషయంలో నేరస్థులు ఎంతటి ఇంటలిజెంట్‌గా ఉంటారు, వారి సైకో బుద్ధి ఎలా ఉంటుందో ఇందులో టచ్‌ చేస్తూ మహిళల ఎదుగుదలకు గల అడ్డంకులను చూపించారు. ఇవన్నీ చాలా రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు ప్రణదీప్‌ ఠాకోర్‌. 
 

ఇన్వెస్టిగేషన్‌లో వచ్చే ట్విస్ట్ లు ఫర్వాలేదనిపిస్తాయి. మరోవైపు ఇన్వెస్టిగేషన్‌లో డెప్త్ ఎలా ఉంటుందనేది, క్లూ కూడా లేని కేసులను ఎలా ఇన్వెస్టిగేట్‌ చేయోచ్చు, ఎలా క్లూలు పట్టుకోవచ్చు అనేది ఈ మూవీలో స్పష్టంగా చూపించారు. ఊహించని విధంగా స్క్రీన్‌ ప్లే నడిపిస్తూ ఆసస్పెన్స్ ని జనరేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు. సినిమా కూడా ఆడియెన్‌ని ఎంగేజ్‌ చేస్తుంది. అయితే మర్దర్‌ మిస్టరీ నేపథ్యంలో వచ్చే థ్రిల్లర్స్  చిత్రాలకు చాలా వరకు ట్విస్ట్ లు, టర్న్ లు చాలా ముఖ్యం. ఇందులో ఆయా ఎలిమెంట్ల డోస్‌ తగ్గింది. దీనికితోడు స్లో నెరేషన్‌ ఇబ్బంది పెట్టే అంశం. రేసీగా స్క్రీన్‌ప్లే నడిపించడంలో దర్శకుడు సక్సెస్‌ కాలేకపోయాడు. ఆద్యంతం ఎంగేజింగ్‌గా, చూపు తిప్పుకోలేని విధంగా స్క్రీన్‌ప్లే రన్‌ అవుతూ, ట్విస్ట్ లు ఉంటే సినిమా థ్రిల్‌ ఇస్తుంది. `రక్షణ` సినిమాలో వాటి మోతాదు సరిపోలేదు. ఇంకా బాగా వర్క్ చేయాల్సింది, బాగా తీయాల్సింది. దీనికితోడు ఇందులో ఎప్పుడో ఇరవై, ముప్పై ఏళ్ల నాటి ఫ్లేవర్‌ కనిపించడం గమనార్హం. కానీ క్లైమాక్స్ మాత్రం సర్‌ప్రైజింగ్గా అనిపిస్తుంది. కాస్త రేసిగా వెళ్తుంది. సెకండాఫ్‌ స్లో నరేషన్‌కి క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు అలరించేలా ఉంటాయి. అదే సినిమాకి ప్రధాన బలం. ఓవరాల్‌గా మూవీ ఇలాంటి మర్డర్‌ మిస్టరీ, థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారిని మెప్పించే మూవీ అవుతుంది. 
 

నటీనటులుః 
పాయల్‌ రాజ్ పుత్‌ ఏసీపీ కిరణ్‌ పాత్రలో అదరగొట్టింది. ప్రారంభంలో ఆమె చేసిన యాక్షన్‌ బాగుంది. క్లైమాక్స్ లోనూ బాగుంది. మధ్యలో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్‌ చుట్టూ తిప్పడంతో ఆమెలోని యాక్షన్‌ మిస్‌ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ పోలీస్‌ పాత్రలో పాయల్ బాగా చేసింది. భావిష్యత్‌లో తను బలమైన పాత్రలు కూడా చేయగలదని నిరూపించుకుంది. ఇక అరుణ్‌ పాత్రలో మానస్‌ నెగటివ్‌ రోల్‌లో అదరగొట్టాడు. ఆయన పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. సడెన్‌గా క్లోజ్‌ అవుతుంది. విలన్‌ పాత్రలో రోషన్‌ అదరగొట్టాడు. నరసింహ, వినోద్‌ బాల, శివన్నారాయణ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. కానీ పాయల్ మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించిందని చెప్పొచ్చు. 
 


టెక్నీషియన్లుః 
మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలకు మ్యూజిక్‌ చాలా ముఖ్యం. బిజీఎం ఎంత కొత్తగా, ఆకట్టుకునేలా, ఎంగేజ్‌ చేసేలా ఉంటే సినిమా అంత రక్తికట్టిస్తుంది. `రక్షణ` చిత్రానికి మహతి సాగర్‌ సంగీతం, బీజీఎం అందించారు. కాకపోతే ఏమాత్రం కొత్తదనం లేదు. పాటలు ఓల్డ్ మూవీస్‌ని తలపించేలా ఉంది. బిజీఎం కూడా కొత్తగా లేదు. అనిల్‌ బండారి కెమెరా వర్క్ బాగుంది. ఉన్నంతలో డీసెంట్‌గా ఉంది. కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మరోవైపు ఎడిటింగ్‌ పరంగా చాలా వర్క్ ఉంది. సినిమాని ఫాస్ట్ గా నడిపించడంలో గ్యారీ బి హెచ్‌ సక్సెస్‌ కాలేకపోయాడు. నిర్మాణ విలువలు ఓకే. మరోవైపు దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్‌ చాలా మంది సీనియర్‌ దర్శకుల వద్ద పని చేశాడు. ఆ అనుభవం సినిమాలో కనిపిస్తుంది. కాకపోతే బలమైన కథని ఎంచుకోవాల్సింది, కథనాన్ని కూడా ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఉన్నంతలో ఓకే అనిపించినా, ఇప్పుడున్న జనరేషన్‌, ఓటీటీ కాలంలో మరింత గ్రిప్పింగ్‌గా, వేగంగా సాగే స్క్రీన్‌ప్లే, ట్విస్ట్ , టర్న్ లతో సినిమా సాగితేనే జనం ఆదరిస్తున్నారు. అందుకే మరింత కేర్‌ తీసుకోవాల్సింది. 
 

ఫైనల్‌గాః ఓవరాల్‌గా `రక్షణ` థ్రిల్లర్‌ సినిమాలు నచ్చే వారిని కొంతవరకు నచ్చే చిత్రమవుతుంది. 

రేటింగ్‌ః 2.5

న‌టీన‌టులు:
పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

దర్శకుడు, నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్, 
నిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్, 
ఛాయాగ్రహణం: అనిల్ బండారి, 
సంగీతం: మహతి సాగర్, 
సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్, 
ఎడిటర్: గ్యారి బి హెచ్,
 

Latest Videos

click me!