Vrusshabha Review: వృషభ మూవీ రివ్యూ, మోహన్‌ లాల్‌ సినిమా ఎలా ఉందంటే ?

Published : Dec 25, 2025, 06:11 PM IST

మోహన్‌ లాల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `వృషభ`. పీరియాడికల్‌ ఫాంటసీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఈ గురువారం విడుదలయ్యింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? 

PREV
15
వృషభ మూవీ రివ్యూ

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్ ఈ ఏడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో మంచి జోరు మీదున్నారు. `లూసిఫర్‌ 2` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మరో రెండు సినిమాలు చేసి బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. వీటితోపాటు ఇంకో రెండు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. అలా తెలుగులో `కన్నప్ప` సినిమాలో మెరిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు `వృషభ` అనే చిత్రంలో నటించారు. ఫాంటసీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో ఆయనతోపాటు సమర్జిత్‌ లంకేష్‌, నయన సారిక జంటగా నటించారు. రాగిని ద్వివేది, అజయ్‌, భద్రం, అలీ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నంద కిశోర్‌ దర్శకత్వం వహించారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. తెలుగులో ఈ మూవీని గీతా ఆర్ట్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్‌ చేసింది. క్రిస్మస్‌ కానుకగా నేడు గురువారం(డిసెంబర్ 25)న మలయాళంతోపాటు తెలుగులో విడుదలైన ఈ మూవీ మన ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? మోహన్‌ లాల్‌కి నాల్గో హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

25
వృషభ మూవీ కథ

రెండు కాలాల్లో సాగే చిత్రమిది. కొన్ని వందల ఏళ్ల క్రితం త్రిలింగ రాజ్యంలో ఒక ఆత్మలింగం ఉంటుంది.  సాక్షత్తు ఆ పరమశివుడే అక్కడ కొలువైనాడని అంతా నమ్ముతుంటారు.  ఎంతో మంది రాజులు ఆ రాజ్యాన్ని అక్రమించుకోవాలని ప్రయత్నించినా వృషభ రాజుని ఢీ కొట్లలేకపోతారు. చాలా మంది ఆ శివ లింగాన్ని దొంగిలించాలని ప్రయత్నిస్తారు. వారిని వృషభ రాజు రాజా విజయేంద్ర వృషభ(మోహన్‌ లాల్‌) రక్షణగా నిలుస్తాడు.  ఓసారి శత్రువులపై దాడి చేసినప్పుడు వృషభ రాజు వేసిన బాణం ఓ చంటిపిల్లాడిని చంపుతుంది. దీంతో ఆ పిల్లాడి తల్లి పుత్రశోకం తప్పదు. నీ బిడ్డ చేతిలోనే నీ ప్రాణాలు కూడా పోతాయి అనే శాపం ఇస్తుంది. అప్పుడే విజయేంద్ర వృషభకి మగబిడ్డ పుడతాడు. కానీ కొన్ని రోజులకే నీళ్లల్లో పడి కనిపించకుండా పోతాడు.  

కట్‌ చేస్తే, ప్రస్తుతం ఆది దేవ్ వర్మ(మోహన్‌ లాల్‌) పెద్ద వ్యాపారి. తన కొడుకు తేజ్‌(సమర్జిత్‌ లంకేష్‌)తో కలిసి ఉంటాడు. తేజ్‌ అమ్మ చిన్నప్పుడే చనిపోతుంది. ఆది దేవకి  కలలో రాజులు, గుర్రాలు, పిల్లాడిని చంపినట్టుగా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా  కనిపిస్తుంటుంది.  దీంతో మానసికంగా అవి ఇబ్బంది పెడుతుంటాయి. తేజ్‌, దామిని(నయన సారిక) డాక్టర్‌ని సంప్రదించగా, సమస్య లేదని చెబుతారు. కానీ ఒక అఘోర(రవి శంకర్‌)ని కలవాలని సైకియాట్రిస్ట్ చెబుతాడు. అక్కడికి వెళ్లాక ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. అదే సమయంలో ఆది దేవ వర్మ ఫస్ట్ లవ్‌ గురించి తెలుస్తుంది. దీంతో ఆమెని కలుద్దామని ఆది దేవ్‌ సొంతూరు వెళ్తారు. అక్కడ టెంపుల్‌లోకి అడుగుపెట్టాక తేజ్‌లో మార్పు వస్తుంది. ఏదో శక్తి అతన్ని ఆవహించినట్టుగా ఫీలై పడిపోతాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న రౌడీలు  తేజ్‌ని చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. ఆ సమయంలో ఆది దేవ వర్మ ఎంట్రీ ఇస్తాడు. కానీ అనూహ్యంగా తేజ.. తండ్రినే  కత్తితో పొడుస్తాడు.  దీంతో అంతా షాక్‌. మరి సొంత కొడుకు తండ్రిని ఎందుకు చంపాలనుకున్నాడు? ఆది దేవ మొదటి లవర్‌ ఎవరు? వీరికి గత జన్మలకు ఉన్న సంబంధమేంటి? అనంతరం కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.

35
వృషభ మూవీ ఎలా ఉందంటే

పునర్జన్మల కథ ఇది. మగధీర సినిమాలో ఎలా అయితే హీరోహీరోయిన్లు 400ఏళ్ల తర్వాత జన్మించి తమ ప్రేమ కోసం తపిస్తారో, ఇది కూడా అలానే. కాకపోతే ఇందులో తల్లి కొడుకు సెంటిమెంట్‌, తండ్రిపై కొడుకు పగతీర్చుకోవడం చూపించారు. అయితే ఆ పగతీర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ గొడవేంటి? అనేది సినిమా. పాయింట్‌ పరంగా ఇది చాలా చిన్నది. అదే సమయంలో కథ పరంగా చాలా పెద్దది. కానీ ఇందులో తెరపై ఆవిష్కరించిన తీరు మాత్రం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఆది దేవ వర్మ గొప్ప వ్యాపార వేత్తగా ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత ఆయన్ని కలలు వెంటాడటం, వాటిని తెలుసుకునేందుకు వెళ్లిన కొడుకు ఆపదలో పడటం, చివరికి తండ్రినే చంపాలనుకోవడం, ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేదు.  ఏమాత్రం ఎంగేజ్‌ చేసేలా లేదు. అదే సమయంలో అంతా అసహజంగా అనిపిస్తుంది. డ్రామా పండలేదు, ఎమోషన్స్ అంతకంటే వర్కౌట్‌ కాలేదు. ట్విస్ట్ ఆశ్చర్యపరిచినా, అది అంతగా కిక్‌ ఇవ్వదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్‌  చేస్తుంది. సెకండాఫ్‌లో అసలు తండ్రికి, కొడుక్కి మధ్య గొడవేంటి? గత జన్మలో ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు అఘోర వద్దకు వెళ్లగా, అక్కడ అసలు విషయం తెలుస్తుంది. మరి కొడుకు నుంచే తండ్రికి ప్రాణగండం ఉండగా, దాన్ని తప్పించుకునేందుకు ఏం చేశారనేది ఆసక్తికరం. అనంతరం కథ పీరియడ్‌ కాలంలోకి వెళ్తుంది. రాజుల కాలంలోకి వెళ్తుంది. ఆ ఎపిసోడ్‌ కూడా ఏమాత్రం ఎంగేజ్‌ చేసేలా లేదు. మొదట ఆడియెన్స్ కి ఆ కాలం నాటి ఫీల్‌ ఇవ్వలేదు. కాకపోతే యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్ లో యాక్షన్‌ కూడా ఆకట్టుకుంది. కానీ వాటిని ఇరికించినట్టుగానే ఉంది. అయితే ఈ సినిమాలో మెయిన్‌గా ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. అందుకే సినిమానే కనెక్ట్ కాలేదు. దీంతో తెరపై సీన్లు కనిపించాయి తప్పితే, ఓ కథని చూస్తున్న ఫీలింగ్‌ లేదు. అదే ఈ మూవీకి మెయిన్‌ మైనస్‌గా చెప్పొచ్చు.

45
వృషభ మూవీలోని నటీనటుల పర్‌ఫెర్మెన్స్

ఇందులో మోహన్‌ లాల్‌ ద్విపాత్రాభినయం చేశారు. రాజా విజయేంద్ర వృషభగా, ఆది దేవ వర్మగా ఆకట్టుకున్నారు. అయితే ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆయన వచ్చినప్పుడన్నా ఏదైనా మ్యాజిక్‌ జరుగుతందా? అంటే అది లేదు.  నటుడిగా మోహన్‌ లాల్‌ బాగా చేశాడు. రాజుగా ఆయన నుంచి సరైన నటన్ని రాబట్టుకోలేకపోయారని చెప్పొచ్చు. ఇక హైందీవాగా, తేజ్‌గా సమర్జిత్‌ లంకేష్‌ చాలా బాగా నటించాడు. అతని పాత్ర సినిమాని నడిపిస్తుంది. అతనే అసలు హీరో అని చెప్పొచ్చు. ఇక ఆయన ప్రియురాలు దామినిగా నయన సారిక మెప్పించారు.  తేజ్‌ తల్లిగా, మోహన్‌ లాల్‌ భార్య పాత్రలో, లవర్‌గా  రాగిని అదరగొట్టింది. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి.

55
వృషభ మూవీలోని టెక్నీషియన్ల పనితీరు

టెక్నీకల్‌గా సినిమా బాగుంది. సామ్‌ సీఎస్‌ మ్యూజిక్‌  ఆకట్టుకుంది. బీజీఎం అలరించేలా, ఎంగేజ్‌ చేసేలా ఉంది. కానీ అది కొంత వరకే పరిమితం. కెమెరామెన్‌ ఆంటోని సామ్సన్‌ కె  విజువల్స్ ఆకట్టుకునేలా, గ్రాండియర్‌గా ఉన్నాయి. కేఎం ప్రకాష్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ఇంకా క్లారిటీ మెయింటేన్‌ చేయాల్సింది. దర్శకుడు  నందకిశోర్‌ ఎంచుకున్న కథ బలంగానే ఉన్నా, దాన్ని అంతే ఎమోషనల్‌గా, ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో సక్సెస్‌ కాలేకపోయారు. కథని కన్విన్సింగ్‌గా తెరపై ఆవిష్కరించలేకపోయారు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. సినిమా చాలా రిచ్‌గా ఉంది.

ఫైనల్‌గా: పూర్తిగా నిరాశ పరిచిన `వృషభ`. మోహన్‌ లాల్‌కి నాల్గో హిట్‌ మిస్ అయినట్టే.

రేటింగ్‌ : 2

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories