Champion Movie Review: ఛాంపియన్‌ మూవీ రివ్యూ.. శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?

Published : Dec 25, 2025, 12:40 PM IST

Champion Movie Review: శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ హీరోగా నటించిన మూవీ `ఛాంపియన్‌`. నిజాంపై బైరాంపల్లి ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో సాగే ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
16
ఛాంపియన్‌ మూవీ రివ్యూ

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ `పెళ్లి సందడి` సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత `నిర్మల కాన్వెంట్‌` చిత్రంతో మెప్పించాడు. కానీ అవి ఆకట్టుకోలేకపోయాయి. కొంత గ్యాప్‌ తో ఇప్పుడు `ఛాంపియన్‌`తో వచ్చాడు. స్వప్న సినిమాస్‌ సమర్పణలో జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మించింది. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. రోషన్‌ సరసన అనస్వర రాజన్‌ హీరోయిన్‌గా నటించింది. కళ్యాణ చక్రవర్తి, అర్చన, సంతోష్‌ ప్రతాప్‌, ప్రకాష్‌ రాజ్‌, రచ్చ రవి, అభయ్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. క్రిస్మస్‌ కానుకగా నేడు గురువారం(డిసెంబర్‌ 25)న విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? రోషన్‌కి హిట్‌ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
ఛాంపియన్‌ మూవీ కథ

1947లో భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన కథ ఇది. దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వస్తుంది. కానీ హైదరాబాద్‌ సంస్థానం మాత్రం నిజాం ఆధీనంలో బంధీగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు రజాకార్లకి, నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. మరోవైపు మైఖేల్‌ (రోషన్‌) ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌. సికింద్రాబాద్‌ బ్లూస్‌ టీమ్‌ కి మెయిన్‌ ప్లేయర్‌గా ఉంటాడు. పోలీస్‌ టీమ్‌తో ఆడిన గేమ్‌ లో అదిరిపోయేలా ఆడి మెప్పిస్తాడు. మైఖేల్‌ ఆటని చూసి బ్రిటీష్‌ రిటైర్డ్ ఆఫీసర్‌ బ్రిటన్‌కి చెందిన మాంచెస్టర్‌ ఫుట్‌ బాల్‌ టీమ్‌లో ఆడే ఆఫర్‌ ఇస్తాడు. కానీ అక్కడికి వెళ్లేందుకు ఒక చిక్కు వస్తుంది. మైఖేల్‌ తండ్రిపై దేశద్రోహిగా ముద్ర ఉంటుంది. దీని కారణంగా మైఖేల్‌ని అధికారులు అడ్డుకునే అవకాశం ఉంది. ఎలాగైనా లండన్‌ వస్తే గేమ్‌ ఆడించే బాధ్యత తాను తీసుకుంటానంటాడు ఆ అధికారి. అందుకోసం మరో దారి ఎంచుకుంటాడు మైఖేల్‌. ఆయుధాలు సరఫరా చేస్తే తీసుకెళ్లేందుకు ఆయుధాల డీలర్‌ ఓకే చెబుతాడు. ఆయుధాలు బీదర్‌కి తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోతాడు మైఖేల్‌. ఆ అధికారి బాబూ దేశ్‌ముఖ్‌(సంతోష్‌ ప్రతాప్‌). మైఖేల్‌తో గేమ్‌ ఆడిపోయిన ప్లేయర్‌. దీంతో మైఖేల్‌పై కక్ష పెంచుకుంటాడు. అయితే మైఖేల్‌ ఆ పోలీస్‌ని కొట్టి అతన్నుంచి తప్పించుకుని బైరాంపల్లి అనే విలేజ్‌కి వస్తాడు. అక్కడ 15 రోజులు షెల్టర్‌ తీసుకుంటాడు. రాజిరెడ్డి(కళ్యాణ్‌ చక్రవర్తి) నాయకత్వంలోని ప్రజలు నిజాంకి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. వీరికి సుందరయ్య(మురళీ శర్మ) సపోర్ట్ చేస్తుంటారు. ఆ ఊరుపై నిజాం సైన్యం, దేశ్‌ముఖ్‌ సైన్యం ఎటాక్‌ చేస్తుంది. ఆ సమయంలో ఊరికోసం నిలబడతాడు మైఖేల్‌. అదే సమయంలో ఆ ఊర్లో నాటకాలు వేసే చంద్రకళ(అనస్వర)ని ఇష్టపడతాడు. ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ తన లక్ష్యానికి ఇవన్నీ అడ్డు కాకూడదని ఊరి పెద్ద రాజిరెడ్డి అంగీకారంతో వెళ్లేందుకు రెడీ అవుతాడు. కానీ మరోసారి నిజాం రజాకార్లు ఎటాక్‌ చేస్తారు. మరి మైఖేల్‌ తన లక్ష్యం కోసం ఇవన్నీ వదిలేసి వెళ్లిపోయాడా? ఊరికోసం నిలబడ్డాడా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.

36
ఛాంపియన్‌ మూవీ ఎలా ఉందంటే?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్‌ సంస్థానం నిజాం నవాబ్‌ ఆధీనంలో ఉంటుంది. కాశీం రజ్వీ రజాకార్లతో కలిసి అనేక ఆగడాలకు పాల్పడుతుంటాడు. వారిపై తెలంగాణలోని అనేక ప్రాంతాలు తిరుగుబాటు చేస్తుంటాయి. అందులో ప్రధానమైనది బైరాంపల్లి. అక్కడి ప్రజలను నిజాం పోలీసులు, రజాకార్లు ఊచకోత కోస్తారు. అనేక దారుణాలకు పాల్పడతారు. అయితే ఆ బ్యాక్‌ డ్రాప్ కి మైఖేల్‌ అనే ఆటగాడి జీవితాన్ని ముడిపెడుతూ ఈ మూవీని రూపొందించారు. రియాలిటీకి ఇది దూరంగా ఉన్నా, అందులోని కల్పిత అంశాలతో సినిమాని రూపొందించిన తీరు మాత్రం బాగుంది. కథగా కన్విన్సింగ్‌గా లేదు. కానీ తెరకెక్కించిన తీరు మాత్రం బాగుంది. రజాకార్లకి, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రజల మధ్య హీరో లవ్‌ ట్రాక్‌ జోడించడం విశేషం. అది కొంత అసహజంగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా ఎమోషన్‌, లవ్‌ ట్రాక్‌ మాత్రం బాగుంది. ఓ వైపు ప్రజల ఇబ్బందులను చూపిస్తూనే అందులోనే కామెడీ మేళవించిన తీరు బాగుంది. సినిమాకి అది పెద్ద రిలీఫ్‌ అని చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్‌లో హీరో పోలీస్‌ టీమ్‌ తో గేమ్‌ ఆడి గెలవడం, ఆ తర్వాత లండన్‌ ఆఫర్‌ రావడం, అందుకోసం ఆయుధాలను తీసుకెళ్లడం, ఇంతలో పోలీసులకు దొరికిపోయి బైరాంపల్లిలోకి రావడం ఎంగేజింగ్‌గా సాగుతుంది. మధ్యలో కథని డైవర్ట్ చేసేలా ఉన్నా, కామెడీ మెప్పిస్తుంది. రచ్చ రవి, అభయ్‌ వంటి వారు బాగా ఆకట్టుకున్నారు. అంతలోనే హీరోయిన్‌తో పరిచయం, లవ్‌ ట్రాక్‌, నాటకాలు వేయడం వంటి సీన్లని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌ లోనూ హీరో అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నాలు చేయడం, కొంత లవ్‌ట్రాక్‌, మరోవైపు బైరాంపల్లిపై ప్రతీకారానికి దేశ్‌ ముఖ్‌లు, కాశీం రజ్వీ ప్లాన్స్ చేయడం వంటి అంశాలను చూపించారు. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. అది రియాలిటీకి దూరంగా ఉన్నా, సినిమాగా చూసినప్పుడు మాత్రం అదిరిపోయింది.

46
ఛాంపియన్‌ మూవీలో మైనస్‌లు

అయితే సినిమా చాలా వరకు స్లోగా ఫస్టాఫ్‌లోనూ స్లోగా ఉందంటే, సెకండాఫ్‌లోనూ అదే కంటిన్యూ అవుతుంది. నిడివి కట్‌ చేయాల్సింది. నాటకాల ఎపిసోడ్‌, ఊర్లు జనం డిస్కషన్‌, కొన్ని స్లో ఫీల్‌ని తెప్పిస్తాయి. కథని డైవర్ట్ చేస్తాయి. సీరియస్‌గా సాగే కథకి అడ్డంకిగానూ మారతాయి. సెకండాఫ్‌లో కొంత ల్యాగ్‌ అనిపిస్తుంది. అంతా టైమ్‌ పాస్‌ వ్యవహారంలా నడుస్తుంది. అయితే లవ్‌ట్రాక్‌ని ఎస్టాబ్లిష్‌ చేసే ప్రయత్నం అంతగా వర్కౌట్‌కాలేదు. లవ్‌ ట్రాక్‌ బలంగా ఆవిష్కరించలేదు. ఎమోషన్స్ పరంగానూ తేలిపోయింది. కళ్యాణ్‌ చక్రవర్తి పాత్ర కూడా అంతగా ప్రభావం చూపేలా లేదు. ఇంకా బాగా చేయాల్సింది. సీరియస్‌ కథని కామెడీగా చూపించడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. హీరో ఎపిసోడ్లు తప్ప మిగిలినవి ఇప్పటికే ఆడియెన్స్ పలు సినిమాల్లో చూడటం మైనస్‌గా చెప్పొచ్చు.

56
ఛాంపియన్‌ మూవీలోని నటీనటుల ప్రదర్శన

మైఖేల్‌ పాత్రలో రోషన్‌ ఇరగదీశాడు. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్‌ అతని నటన, లుక్‌. ఈజ్‌తో కనిపించాడు. నటన, డాన్సులు, లవ్‌ ఎపిసోడ్లు, డైలాగ్‌ డెలివరీ బాగా కుదిరాయి. యాక్షన్‌లోనూ అదరగొట్టాడు. రోషన్‌ని హీరోగా నిలబెట్టే మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఇక హీరోయిన్‌గా అనస్వర రాజన్‌ చాలా బాగా చేసింది. ఆమె నటన ఆకట్టుకుంటుంది. కళ్యాణ్‌ చక్రవర్తి నటన పర్వాలేదు. కానీ డైలాగ్‌ డెలివరీ నీరసంగా ఉంది. విలన్‌ సంతోష్‌ ప్రతాప్‌ బాగా చేశాడు. ప్రకాష్‌ రాజ్‌ పటేల్‌గా కాసేపు మెరిశారు. అర్చన పాత్ర కొంత వరకు పరిమితం. రచ్చ రవి, అభయ్‌ అదరగొట్టారు. మురళీధర్‌ గౌడ్‌ మరోసారి మెప్పించాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

66
ఛాంపియన్‌ మూవీ టెక్నీషియన్ల పనితీరు

సినిమాకి మిక్కీ జే మేయర్‌ సంగీతం పెద్ద అసెట్‌. సినిమాని నిలబెట్టింది ఆయన బీజీఎం అనే చెప్పాలి. పాటలు సైతం అదిరిపోయాయి. చాలా రోజులు గుర్తిండిపోతాయి. ఇక కెమెరా వర్క్ చాలా బాగుంది. పీరియడ్‌ లుక్‌ని చాలా సహజంగా ఆవిష్కరించారు. ఇందులో ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. అది మరో హైలైట్ గా చెప్పొచ్చు. ఎడిటింగ్‌ పరంగా ఇంకాస్త జాగ్రత్త పడాలి. కొంత ట్రిమ్‌ చేయాలి. దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం ఎంచుకున్న కథ బాగుంది. అయితే అది ఇప్పటికే చూశాం, దానికి హీరో లవ్‌ ట్రాక్‌ని జోడించి కొత్తదనం తీసుకొచ్చారు. లవ్‌ స్టోరీ, ఎమోషన్స్ ని మరింత బలంగా చెబితే సినిమా వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా:

 రజాకార్ల ఎపిసోడ్‌ చూసినదే అయినా, బైరాంపల్లి ప్రజల తిరుగుబాటుని ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కోణంలో కొత్తగా ఆవిష్కరించిన సినిమా `ఛాంపియన్‌`.

రేటింగ్‌: 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories