Das Ka Dhamki Telugu Movie Review
ఇంతకుముందు ‘ఫలక్ నుమా దాస్’ అనే రీమేక్ మూవీ తీసిన విశ్వక్ సేన్.. ఈసారి ‘దాస్ కా ధమ్కీ’తో మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ఈ సినిమా అతడి సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ సారి కథనం, మాటలు, దర్శకత్వం, హీరో, నిర్మాత ఇలా అన్నీ తన భుజం మీదే వేసుకుని విశ్వరూపం చూపెట్టే ప్రయత్నం చేసిన విశ్వక్ సేన్ ... ఏ మేరకు న్యాయం చేసాడు? సినిమా కథేంటి?'దాస్ కా ధమ్కీ' విడుదలకు ముందు 'ధమాకా' కథను అటు ఇటు తిప్పి తీశారని ప్రచారం జరిగింది. అందులో నిజం ఉందా. అసలు కథ ఏంటి..వర్కవుట్ అయ్యే కాన్సెప్టు యేనా చూద్దాం.
స్టోరీ లైన్ :
డబ్బున్న వాడిగా బ్రతకాలని కలలు కంటూంటాడు కృష్ణదాస్ (విశ్వక్ సేన్) . ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్ గా పనిచేసే అతను తమ హోటల్ కు వచ్చిన కీర్తీ (నివేదా పేతురాజ్)తో ప్రేమలో పడతాడు. తాను వెయిటర్ అనే విషయం దాచి, ఓ పెద్ద ఫార్మా కంపెనీ సీఈవో అని అబద్ధాలు ఆడతాడు. అయితే అనుకోని విధంగా అతని అసలు ఐడెంటిటీ బయిటపడడం, ఉద్యోగం ఊడటం, తన రూమ్ లోంచి సామానులు బయిటకు విసిరేయబడటం అన్నీ వరసపెట్టి జరిగిపోతాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న పరిస్దితుల్లో ...తను ఆడిన అబద్దం నిజం అయ్యే అవకాసం వస్తుంది.
కృష్ణదాస్ ని సిద్ధార్థ్ మల్హోత్రా (రావు రమేష్) కలుస్తాడు. తన అన్నయ్య కుమారుడు సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్) క్యాన్సర్ చికిత్సకు ఓ డ్రగ్ కనిపెట్టాడని, రీసెర్చ్ మధ్యలో చనిపోయాడని చెబుతాడు. ఆ విషయం ఇంకా ఎవరికీ తెలియదు. తెలిస్తే రూ.10 వేల కోట్ల డీల్ పోతుందని, కుటుంబం నడిరోడ్దున పడుతుందని చెబుతాడు. అచ్చం అతనిలాగే ఉండే అతడిలాగే ఓ వారం రోజులు నటించి తమని ఒడ్డున పడేయమని అడుగుతాడు. దాంతో సంజయ్ రుద్ర ప్లేస్ లో ఫార్మా కంపెనీ సీఈవో గా వెళ్తాడు! కానీ అక్కడే అసలైన ట్విస్ట్...సంజయ్ రుద్ర బ్రతికే ఉన్నాడు...అదెలా జరిగింది...? ఈ డ్రామా వెనక 10 వేల కోట్ల కుంభకోణం ఉందని తెలుస్తుంది. ఆ కథ ఏమిటి? సంజయ్ రుద్రగా వచ్చిన కృష్ణదాస్ ...ఏం చేసి ఒడ్డున పడ్డాడు అనేది దాస్ కా ధమ్కీ సినిమా కథ.
కథా,కథన విశ్లేషణ:
ఈ సినిమా కథ కొత్తదేం కాదు. తెలుగు తెరపై అనేక సార్లు చూసిందే. అయితే పాత కథకే కొత్త ట్విస్ట్ ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేసారు. అయితే ఆ ప్రాసెస్ లో లెక్కలు మించిన ట్విస్ట్ లతో సినిమాని తల క్రిందలు చేసేసారు. మనకు రవితేజ ఆ మధ్యన చేసిన 'ధమాకా'తో పాటు 'ఖిలాడీ'ని కలిపి కొట్టినట్లు అనిపిస్తుందీ సినిమా. అలాగే కొన్ని సీన్లు గతంలో మనం చూసేసనవే రూపం మార్చుకుని ఏ మాత్రం మొహమాటపడకుండా ముందుకు వస్తాయి, ఫైట్లు పాతవే మళ్లీ రీప్లేలో చూస్తున్నట్లు ఉంటింది. అందువల్ల, సినిమా కొత్త గా ఏమీ అనిపించదు. చనిపోయాడు అనుకున్న రెండో విశ్వక్ (సంజయ్) బతికే ఉన్నాడంటూ రావటం పెద్ద ట్విస్ట్ గా పేలుతుందనుకుంటే అదేమీ అనిపించదు.చాలా చోట్ల లాజిక్ లెస్ సీన్లు ఉన్నాయి. సినిమాటెక్ లిబర్టీని బాగా వాడుకుని చేసారు. కామెడీ గా ఉన్నంత సేపు అవి క్యాజువల్ గా అనిపించినా, ఎప్పుడైతే సీన్స్ సీరియస్ మోడ్ లో కి వెళ్తాయో అప్పుడు ఇబ్బందిగా అనిపిస్తాయి. అయితే ఎండ్ టైటిల్ తర్వాత ఓ వచ్చే ఎపిసోడ్‌తో ఇచ్చిన ఇచ్చిన ధమ్కీ సెకండ్ పార్ట్ కు లీడ్ అయినా అది బాగా పేలింది. ఏదైమైనా ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే ప్రాణం. దాన్నే ఇక్కడ వదిలేసారు.
టెక్నికల్ గా...:
దర్శకుడుగా విశ్వక్సేన్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు. కానీ కథా ఎంపికలోనే వెనక బడ్డాడు. సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్‌లన్నీ ఈజీగా మన ఊహలకు అందేలా predictability గా ఉంటాయి. లవ్‌స్టోరీ, మదర్ సెంటిమెంట్ సీన్స్ ఛల్తా హై అన్నట్లు సాగిపోయాయి. కామెడీ ప్రెష్ గా ఉంది. అయితే కథలో ఉన్న ఇంటెన్స్ ని ఎక్కువైన ట్విస్ట్ లు పాడు చేసేసాయి. లియోన్ జేమ్స్ మ్యూజిక్‌లో రెండు సాంగ్స్ అదిరిపోయాయి. పెప్పీ నెంబర్ ఫస్టాఫ్ లో వస్తుంది. మాస్ సింగిల్ తర్వాత వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. దినేష్ కే బాబు, సినిమాటోగ్రఫి డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నీట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది.
నటీనటుల్లో:
విశ్వక్‌సేన్ ఇందులో తొలి సారిగా ద్విపాత్రాభినయం చేసారు. సంజయ్ రుద్ర అనే డాక్టర్‌గా, కృష్ణదాస్ అనే వెయిటర్‌గా రెండుపాత్రలు వేరియేషన్ చూపించే ప్రయత్నించాడు. అయితే రెండో పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉండటంతో కొత్తగా ఉందనుకున్నాడు కానీ ఇబ్బందిగా అనిపించింది. అయితే ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా అన్నింట్లోనూ విశ్వక్ అదరగొట్టేశాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ కీర్తిగా నివేథా పేతురాజ్ గ్లామర్ కే పరిమితం కాలేదు. మేకవన్నె పులి లాంటి క్యారెక్టర్‌లో రావురమేష్ ఎప్పటిలాగే కనిపించారు. హీరో స్నేహితులుగా మహేష్, హైపర్ ఆది కామెడీ కొంతవరకూ బాగానే వర్కవుట్ అయ్యింది.
Das Ka Dhamki Telugu Movie Review
బాగున్నవి?
ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ
విశ్వక్సేన్ నటన
ఇంటర్వెల్ ట్విస్ట్
బాగోలేనివి?
స్క్రీన్ ప్లే సిల్లీగా అనిపించటం
ట్విస్ట్ లతో విసిగించే సెకండాఫ్
ఎడిటింగ్
కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు
ఫైనల్ థాట్:
కథలో ట్విస్ట్ లు ఉండాలి కానీ ట్విస్ట్ ల మధ్యలో కథ ఉండకూడదు. అలా ఉంటే ఏమౌతుంది. అది `దాస్ కా దమ్కీ` అవుతుంది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5/5
బ్యానర్: వాన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ క్రియేషన్స్
నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, అజయ్, రోహిణి, రజిత, రంగస్థలం మహేష్, పృథ్వీరాజ్, కాదంబరి కిరణ్ తదితరులు
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
సినిమాటోగ్రఫి: దినేష్ కే బాబు, జార్జ్ సి విలియమ్స్
ఎడిటింగ్: అన్వర్ అలీ
మ్యూజిక్: లియోన్ జేమ్స్
రిలీజ్ డేట్:22 -03-2023