కథేంటి.. జైల్లో ఉన్న గౌతమ్ (విజయ్ దేవరకొండ) తన జీవితంలో జరిగిన విషయాలని గుర్తు చేసుకుంటాడు. గౌతమ్ ఓ ఔత్సాహిక రైటర్. కానీ ఇలా ఉంటే లోకం ఊరుకుంటుందా.. ఉద్యోగం, సద్యోగం చేయకుండా ఏ పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఉన్నాడని,ప్రపంచ ప్రసిద్ద బేవార్స్ అని ముద్ర వేసేస్తుంది. సర్లే లోకం ఏమనుకుంటే మనకేంటి...మన ఇంట్లో వాళ్లు ఊరుకుంటే చాలదా అని సరిపెట్టుకుందామంటే యామిని (రాసి ఖన్నా) ఒప్పుకోవటం లేదు. యామినీ ఎవరూ అంటే..గౌతమ్ ని ఇష్టపడి ప్రేమించి,కష్టపడి సహజీవనానికి సరే అన్న అమ్మాయి. పెళ్లాం అయితే విడాకులు,ప్రేమించిన అమ్మాయి అయితే పెటాకులు (బ్రేక్ అప్) ఇలాంటి సిట్యువేషన్ లో సహజం. గౌతమ్ జీవితం కూడా అటు వైపే ప్రయాణం పెట్టుకుంది.
అటువంటి ప్రష్టేషన్,పిచ్చ కోపం ఉన్న సిట్యువేషన్ లో ఏ మగాడైనా ఏం చెయ్యగలడు. మందేసి ముసుగేస్తాడు (అలవాటుఉంటే)కానీ గౌతమ్ సృజనాత్మకమైన రైటర్ అని ముందే చెప్పుకున్నాం కదా...అతని క్యారక్టరైజేషన్ ప్రకారం..ఊహల్లో కు వెళ్లి కథలను కనటం మొదలెడతాడు. సర్లే తను రాసే కథల్లో వేరే వారిని చూసుకోవటం ఎందుకు అని తనను తానే చూసుకుంటాడు. తన జీవన సహచరి యామిని మెట్రో అమ్మాయి కాబట్టి...నిర్దాక్ష్యణంగా వదిలేసి బ్రేకప్ అనేసి వెళ్లిపోయింది. అందుకే తను రాసే కథలో ఈ సారి సువర్ణ (ఐశ్వర్యా రాజేష్) అనే పల్లె అమ్మాయిని పాత్రగా తీసుకుంటాడు. ఆమె కు జోడిగా బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుడు,లీడర్ అయిన శీనయ్య(మళ్లీ విజయ్)ని దింపుతాడు.
అయితే వీళ్లిద్దరిదీ సహజీవనం కాదు పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఓ బిడ్డతో హ్యాపీగా ఉంటున్న వీరి జీవితంలోకి స్మిత(కేధరిన్) వెల్ ఫేర్ ఆఫీసర్ గా వస్తుంది. ఆమె అందానికి ముగ్దుడై, ఓ బలహీన క్షణాన ఆమెతో కమిటైపోయిన శీనయ్య...భార్యకు దొరికిపోతాడు. భర్త ప్రవర్తనకు కు సువర్ణ ఎలా స్పందించింది... సరే అని ఎడ్జెస్ట్ అయ్యిందా, లేక ఏదైనా నిర్ణయం తీసుకుందా...ఈ కథ రాయటంతో తన ప్రస్టేషన్ నుంచి బయిటపడ్డాడా గౌతమ్..లేక మరిన్ని ఊహాత్మక కథలు రాసాడా..చివరగా జైలు పాలు ఎందుకయ్యాడు. ఏ సాహసం చేసి వరల్డ్ ఫేమస్ లవర్ అని ఎలా అనిపించుకున్నాడు. తిరిగి యామిని వెనక్కి వచ్చి గౌతమ్ ని క్షమించి జీవితంలోకి ఆహ్వానించిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే... ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆంథాలజీ సీజన్ నడుస్తోంది. మూడు, నాలుగు కథలను తీసుకుని, వాటిని కలిపే ఓ థ్రెడ్ ని ఎంచుకుని ఓ కథగా మలచడమే ఆంథాలజీ. కొత్తగా వస్తున్న వెబ్ సీరిస్ లు, సినిమాలు ఈ తరహాలో ప్రెజెంట్ చేయటానికి ఈ తరం దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకే కథను రెండు గంటలు సేపు చెప్పటం కన్నా...మూడు నాలుగు కథలను చెప్పటం ఆసక్తిగా అనిపిస్తుంది. ఇది కథల సమాహారంగా చెప్పవచ్చు. అయితే ఈ కథలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంది..వాటిని కలిపే థ్రెడ్ బలంగా ఉంటేనే ఈ తరహా ప్రయోగాలు వర్కవుట్ అవుతాయి.
ఇదే తరహా కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. ఓ రచయిత తన పర్శనల్ లైఫ్ లో పడే స్ట్రగుల్ ని తను రాసే కథల సమాహారంతో ఆవిష్కరించి, తనను తాను తెలుసుకుని,పరిస్దితులను చక్కదిద్దుకునే వైనమే ఈ సినిమా కథ. ఈ సినిమా మెయిన్ థ్రెడ్ కాస్త బలహీనంగా, సినిమాటిక్ గా అనిపిస్తుంది. అందుకు కారణం మెయిన్ థ్రెడ్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవటమే కారణం అని అర్దమవుతుంది. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది మెయిన్ థ్రెడ్ నే. మిగతావి ఎంత బాగున్నా...అవి కేవలం ఊహలే అని చూసేవాడికి తెలుసు కాబట్టి వాటిని లైట్ తీసుకుంటాడు ప్రేక్షకుడు.
ఈ కథల్లో శ్రీను, సువర్ణ స్టోరీ సీరియస్ గా ఉన్నా ఇంట్రస్టింగ్ గా ఉంది. సెకండాఫ్ లో వచ్చే ప్యారిస్ ఎపిసోడ్ జస్ట్ ఓకే అనిపించింది. మెయిన్ థ్రెడ్ (గౌతమ్-యామిని)కు ఈ కథలు ఇముడ్చుకునేటంత బలంగా రాయలేదు. ఇంకాస్త ఆ థ్రెడ్ గా వర్క్ చేస్తే బాగుండేది. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగా రొటీన్ గా, ప్రెడిక్టుబుల్ గా ఉన్నాయి.
సినిమాలో హిట్స్ .. ఎప్పటిలాగే విజయ్ దేవరకొండ ఫెరఫార్మెన్స్, మూడు డిఫరెంట్ పాత్రల్లో వైవిద్యం చూపించిన తీరు శీనయ్య, సువర్ణ సీన్స్ ఐశ్వర్యా రాజేష్ ఫెరఫార్మెన్స్ వైవిధ్యమైన కథ, ప్రొడక్షన్ వ్యాల్యూస్
సినిమాలో ఫట్ లు.. కథలో ఆత్మ లోపించటం సెకండాఫ్ ఎంగేజ్ చేయకపోవటం ఎంటర్టైన్మెంట్ లేకపోవటం ఇబ్బంది పెట్టే సాంగ్స్
విజయ్ దేవరకొండదే విజయం కథల్లో వైవిధ్యం, నటనలో మెచ్యూరిటీ చూపుతూ విజయ్ దేవరకొండ కెరీర్ ని బాగా మలుచుకుంటున్నారని ఈ చిత్రం చూస్తుంటే అర్దమవుతుంది. ఒకే మూసలో కొట్టుకుపోకుండా, అన్ని వర్గాలకు చేరవ అయ్యేలా ఇలాంటి కథలు ధైర్యం చేసి చేయటం గొప్ప విషయం. అందుకు విజయ్ దేవరకొండను ఖచ్చితంగా అభినందించాలి.
దర్శకుడు,మిగతా డిపార్టమెంట్స్... దర్శకుడు తన విభిన్న తరహా కథా సంవిధానంతో మంచి మార్కులే వేయించుకుంటాడు. అయితే క్యారెక్టర్స్ ఉన్నంత బలంగా సినిమాలో సన్నివేశాలు ఉండవు. దాంతో ప్రధాన పాత్ర అయిన గౌతమ్ ...ఏం కోరుకుంటున్నాడు..ఏం దొరికింది అనే విషయం అర్దం అవటం కష్టంగా ఉంటుంది. అలాగే ఈ అన్ని వర్గాలకు ఈ ఆంథాలజీ నేరేషన్ ఎంతవరకూ డైజస్ట్ అవుతుందనేది వేచి చూడాల్సిన విషయం. దర్శకుడుగా అక్కడక్కడా మెరుపులు మెరిపించారు. కానీ మిగతాదంతా సాదాగా సాగిపోయింది. హీరోయిన్స్ లో ఐశ్వర్యా రాజేష్ చాలా బాగా చేసింది. కేథరిన్ జస్ట్ ఓకే, రాశిఖన్నా...గ్లామర్ డాల్.
ఇక ఈ స్క్రిప్టుకు మంచి మ్యూజిక్ పడితే ఆ కథ వేరుండేది. కానీ అది మొహమాటం లేకుండా మిస్సైంది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ సినిమా థీమ్ కు తగినట్లు సాగింది. ఎడిటింగ్, మిగతా డిపార్టమెంట్స్ జస్ట్ ఓకే. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగా పేలాయి. కానీ ఎఫ్ వర్డ్ వాడటం, మరికొన్ని అసభ్యత అనిపించే డైలాగులు తగ్గిస్తే బాగుండేది.
ఫైనల్ థాట్... ఫేమస్ అవ్వాలంటే కొత్తదనాన్ని ఆహ్వానించాల్సిందే. ఆ వంకతో పాతదే ముస్తాబు చేసి కూర్చోబెడితే కష్టం.