శివానీ రాజశేఖర్.. మొదటి సినిమా నుంచి ఓటీటీకే పరిమితమయ్యింది. చివరగా ఆమె `కోటబొమ్మాళి పీఎస్` చిత్రం థియేటర్‌లోకి వచ్చింది. ఇందులో రాహుల్ విజయ్‌తో కలిసి నటించింది. శ్రీకాంత్ మెయిన్ లీడ్ చేశారు. ఈ మూవీకి మంచి పేరొచ్చినా ఎన్నికల సమయంలో రావడంతో పెద్దగా ఆడలేదు. కానీ మంచి కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తున్నారు శివానీ, రాహుల్ విజయ్. ఈ ఇద్దరు మరోసారి జోడీ కడుతూ `విద్య వాసుల అహం` చిత్రంలో నటించారు. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి నిర్మించారు. ఇది ఈనెల 17(గురువారం అర్థరాత్రి) నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
వాసు(రాహుల్ విజయ్) మెకానికల్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తుంటాడు. శాలరీ తక్కువే. పెళ్లీడుకొచ్చినా మ్యారేజ్ చేసుకునేందుకు వెనకాడుతుంటాడు. నచ్చిన అమ్మాయి రాదని, స్వేచ్ఛగా ఉండలేమనే ఆలోచనతో ఆయన పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినా నో చెబుతుంటాడు. మరోవైపు విద్య(శివానీ రాజశేఖర్) కూడా తనకు నచ్చిన వాడు, తనని ఇష్టపడేవాడు, ప్రాక్టీకల్‌గా ఉండేవాడు దొరకడం కష్టమని చెప్పి పెళ్లి ప్రస్తావనని దాటవేస్తూ వస్తుంది. పైగా వంట చేయాలి, ఇంట్లో పనులు చేయాలనే బద్దకం కూడా ఆమె మ్యారేజ్‌కి నో చెప్పడానికి ఓ కారణమని చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఓ రోజు గుడికి వెళ్తారు. అక్కడ పూజారి చెప్పిన ప్రవచనాలు విని వీరిలో మార్పు వస్తుంది. నందికి తమ కోరికలు చెప్పుకొని ఇంటికొస్తారు. ఇద్దరిలోనూ మ్యారేజ్‌పై పాజిటివ్ అభిప్రాయం వస్తుంది. ఇక పేరెంట్స్ మ్యారేజ్ ప్రస్తావన తేవడంతో ఎట్టకేలకు ఒప్పుకుంటారు. అయితే విద్య తాను చేసుకునే వాడు ఎలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం ఓ పరీక్షా పత్రాన్ని కూడా రెడీ చేస్తుంది. తాను నచ్చిన వాళ్లు ఆ పేపర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫిల్టర్ చేయగా ఫైనల్‌గా వాసు ఫిల్ చేసిన పేపర్ నచ్చుతుంది. అతన్ని పెళ్లి చూపులకు రమ్మని చెబుతుంది. ఇద్దరు తొలి చూపులోనే ఇంప్రెస్ అవుతారు. పెళ్లి చూపుల టైమ్‌లోనే రోజంతా మాట్లాడుకుంటారు. ఒకరినొకరు నచ్చుతారు. పెళ్లికి ఓకే చెప్పడంతో ఆ తంతు పూర్తవుతుంది. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఇద్దరి మధ్య మనస్పర్థాలు స్టార్ట్ అవుతాయి. ఇద్దరు గత ప్రేమలకు సంబంధించిన చర్చ రాంగ్ రూట్‌లో వెళ్తుంది. దీంతో ఫస్ట్ నైట్ జరగక్కుండానే తెల్లారుతుంది. మరోవైపు ప్రారంభంలో ప్రేమతో ఉన్న ఈ ఇద్దరి మధ్య రాను రాను గొడవలు ప్రారంభమవుతాయి. మరి ఆ గొడవలకు కారణమేంటి? ఇద్దరి మధ్య వచ్చే గొడవలేంటి? ఆ గొడవలు ఎలాంటి మలుపులకు దారి తీశాయి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.
విశ్లేషణః
కొత్తగా పెళ్లైన జంటలో ఉంటే ప్రేమాభిమానాలు, ఆ తర్వాత వచ్చే మనస్పర్థాలు, అహం ఎలాంటి గొడవలకు దారి తీస్తుందనేది, అర్థం చేసుకునే విషయంలో వచ్చే డిఫరెన్సెస్ వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు రొమాన్స్ అంటే బోల్డ్ గా మారిన నేపథ్యంలో చాలా పద్ధతిగా ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఎక్కడా వల్గారిటీ లేకుండా చాలా నీట్‌గా తెరకెక్కించారు. పద్ధతైన మాటలు, లోతైన అర్థాన్నిచ్చే మాటలు ఈ మూవీకి పెద్ద అసెట్‌గా, ప్లస్‌గా మారాయి. దీనికితోపాడు కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య ప్రేమల, అలకలు, మనస్పర్థాలు, గొడవలు అనే అంశాన్ని చాలా రియలిస్టిక్‌గా రూపొందించారు. ఇదొక సందేశాత్మక చిత్రమని చెప్పొచ్చు, కానీ ఎక్కడ అలాంటి ఓవర్ డ్రామాకి వెళ్లలేదు, ఏది ఎంత కావాలో అంతే చూపించారు. చాలా సింపుల్ వేలో మూవీని తెరకెక్కించాడు దర్శకుడు మణికాంత్ గెల్లి.
సినిమా కథగా చెప్పాలంటే ఇది చాలా సింపుల్ స్టోరీ. ఎన్నో ఆశలు, అంచనాలతో పెళ్లి చేసుకున్న జంట ఆ తర్వాత ఎలాంటి ఈగోకి పోతుంది, అహం వల్లే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయి. అది ఫ్యామిలీని ఎలా డిస్టర్బ్ చేస్తుందనే విషయాన్ని ఈ మూవీలో చూపించాలనుకున్నారు దర్శకుడు మణికాంత్ గెల్లి. అయితే ఎందులోనైనా ఎమోషన్స్, డ్రామా చాలా ఇంపార్టెంట్. అది పండితేనే సినిమా రక్తికడుతుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. అయితే `విద్య వాసుల అహం` చిత్రం ఓటీటీలో రూపొందించింది. ఓటీటీ కోసం చేసింది. కంటెంట్ పరంగా చిన్న పాయింట్. దానితోనే సినిమాని లాగడం పెద్ద టాస్క్. దర్శకుడు గంటన్నరలోనే ఈ కథని ముగించాడు. అదే ఈ మూవీకి పెద్ద ప్లస్ అయ్యింది. కానీ లవ్‌లోగానీ, రొమాన్స్ లోగానీ డెప్త్ లేదు, ఎమోషనల్స్ రక్తికట్టలేదు. డ్రామా అసలే పండలేదు. అన్నింటిని లైటర్ వేలో చూపించాడు. మొదటి భాగం చాలా వరకు చాలా అసహజంగా అనిపిస్తుంది. రొటీన్‌గా అనిపిస్తుంది. పైగా స్లోగా సాగుతుంది. వారి డైలాగ్ డెలివరీ, సీరియల్‌ని తలపిస్తుంటుంది. ఫస్టాఫ్ లో హీరోహీరోయిన్ల ఇంట్లో పెళ్లి మ్యాటర్, వాళ్ల సమాధానాలు రొటీన్‌గా ఉంటాయి. పైగా అవి చాలా వరకు సీరియస్ చూస్తున్నట్టుగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఈగోల మ్యాటర్ అంతగా పండలేదు. లాజిక్ లెస్‌గానూ అనిపిస్తుంది.
అయితే భార్యాభర్తల మధ్య ఈగోలు, మనస్పర్థాలు చాలా ఉంటాయి. ఇంకా బాగా తీయోచ్చు. మరింతగా రక్తికట్టేలా ఆయా సీన్లని డిజైన్ చేయోచ్చు. కానీ ఈ సినిమాలో అది జరగడలేదు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలకు సంబంధించిన ఫన్ వర్కౌట్ కాలేదు. అక్కడక్కడ బలవంతంగా కొంత ఫన్ బాగుంది. తప్పితే మిగిలిన సీన్లు అన్నీ ఏదో అలా సాగిపోతున్నట్టుగానే ఉంటుంది. డ్రామా తేలిపోతుంది. భార్య భార్తల మధ్య రొమాన్స్ మోతాదు కూడా తగ్గింది. ఆ ఫీల్ ని ఆడియెన్స్ ఫీల్ కాలేకపోతారు. ఇక పెళ్లి కొడుకుకోసం అమ్మాయి పెట్టే కండీషన్లు కొత్తగా ఉన్నా అసహజంగా అనిపిస్తాయి. దీంతో సినిమా ఆశించిన స్థాయిలో ఫన్‌నిగానీ, ఎంటర్‌టైన్‌మెంట్ ని గానీ ఇవ్వలేకపోయింది. జనరల్‌గా థియేటర్లో కంటే ఓటీటీ సినిమాల్లోనే ఏదైనా ఎక్కువ డోస్ ఉంటుంది. కానీ ఇందులో తక్కువ డోస్ ఇవ్వడం కాస్త నిరాశ పరిచే అంశంగా చెప్పొచ్చు. టైమ్ పాస్‌గా మాత్రం ఓ సారి చూసేలా ఉండే మూవీ ఇది.
నటీనటులుః
వాసు పాత్రలో రాహుల్ విజయ్ బాగా చేశారు. పాత్రకి న్యాయం చేశాడు. బాగా సూట్ అయ్యాడు. ఇటీవల ఆయన మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వెళ్తున్న తీరు బాగుంది. లవర్ బాయ్‌గా, కాసేపు ఈగోలకు పోయే భర్తగా మెప్పించాడు. ఇక విద్య పాత్రలో శివానీ రాజశేఖర్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆమె కళ్లు చాలా బాగున్నాయి. కళ్లతోనే మాట్లాడింది, యాక్ట్ చేసింది. ఎక్స్ ప్రెషన్స్ గతంతో పోల్చితే చాలా బెటర్ అయ్యింది. ఆమెలో మంచి నటి ఉన్నారని మాత్రం చెప్పొచ్చు. ఈ రెండే సినిమా మొత్తం సాగుతాయి. ఇక మిగిలిన పాత్రల్లో పేరెంట్స్ గా రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ, రూపలక్ష్మి, రాజశ్రీ నాయర్ తమ పాత్రల మేరకు నటించారు. అయితే ఈ పాత్రలు వచ్చినప్పుడు మాత్రం సీరియల్‌ని తలపించడం గమనార్హం. శ్రీనివాస్ అవసరాల, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి ఇతర పాత్రల్లో ఓకే అనిపించారు.
టెక్నీకల్‌గాః
కళ్యాణ్ మాలిక్ సంగీతం సినిమాకి ప్లస్. చాలా వినసొంపైన పాటలు అందించారు. పాటలు, బీజీఎం బాగుంది. ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్ వల్లూరి కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సినిమా కలర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. రిచ్‌గానూ ఉన్నాయి. సత్య గిడుతూరి ఎడిటింగ్‌కి ఇంకాస్త పని చెప్పాల్సింది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఉన్నంతలో బాగా చేశారు. ఇక దర్శకుడు మణికాంత్ గెల్లి ఎంచుకున్న కథ బాగుంది. ఇటీవల కాలంలో ఇలాంటి రామ్ కామ్ మూవీస్ చాలా తక్కువగా వస్తున్నాయి. అయితే దాన్ని అంతే బాగా రక్తికట్టించేలా తెరకెక్కించి ఉంటే ఫలితం బాగుండేది. డ్రామా, ఈగోల మ్యాటర్ మరింతగా ఫోకస్ పెడిగే బాగుండేది. వాటి తాలుకూ డోస్ తగ్గింది.
ఫైనల్‌గాః విద్య వాసులకు `అహం` తగ్గింది. కానీ సరదాగా చూసే మూవీ.
రేటింగ్‌ః 2.75
తారాగణం:- రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్, వైవ రాఘవ
సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్ ప్లే & దర్శకత్వం:- మణికాంత్ గెల్లి
బ్యానర్:- ఎటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: తన్విక జశ్విక క్రియేషన్స్.
నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి
సహ నిర్మాతలు: రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట
తారాగణం:- రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి, రాజశ్రీనాయర్, వివరరాఘవ
సంగీతం:- కళ్యాణి మాలిక్
రచన:- వెంకటేష్ రౌతు
డీఓపీ:- అఖిల్ వల్లూరి
ఎడిటర్:- సత్య గిడుతూరి