
Chhaava telugu : ఇవాళ దేశం మొత్తం మాట్లాడుతున్న సినిమా విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఛావా” (Chhaava).హిందీలో ఈ సినిమా రికార్డ్ లు బ్రద్దలు కొడుతూ దూసుకుపోతోంది.నిస్తేజంగా ఉన్న బాలీవుడ్ కి ఈ సినిమా ఊపిరి పోసిందనే చెప్పాలి.
ఈ క్రమంలో తెలుగులోనూ ఈ సినిమా చూడాలనే అభిమానుల కోరిక, విజ్ఞప్తిల మేరకు ఈ సినిమాని తెలుగులో పెద్ద తెరపై తెచ్చారు. గీతా డిస్ట్రిబ్యూషన్ సంస్ద ఈ సినిమాని తెలుగులోకి తెచ్చి రిలీజ్ చేసింది. ఇంతకి హిందీలో సినిమా అంత పెద్ద హిట్ అవ్వటానికి గల కారణం ఏమిటి, తెలుగువారికి నచ్చుతుందా, అసలు సినిమాలో ఏముంది?
కథేంటి
ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా)కు ఎదురేలేదు. పోటీ అసలు లేదు అన్న భావనలో ఉంటాడు. అంతేకాదు మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని దాన్ని దక్కించుకోవాలనుకుంటాడు. అది చాలా సులభమైన పనిగా బావిస్తాడు.
అలాంటి కీలకమైన సమంలో కదనరంగంలోకి దూకుతాడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). ఛత్రపతి శివాజీ కుమారుడుగా స్వరాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా సింహంలా ముందుకు సాగే శంభును ఎదిరించటం మొఘలుల వల్ల కాదు. ఎదురుగా శంభాజీని దెబ్బతీయలేమని సంఘమేశ్వర్ లో ఆయన అతితక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకున్న మొఘలులు ఓ పన్నాగం పన్నుతారు.
శంభాజీని వెనక దారిన బంధించడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వేల మందిని మొండి చెయ్యితో ఎదిరించి సింహలా ముందుకు దూకుతాడు. కానీ శత్రుసైన్యంతో చేతులు కలిపి స్వామి ద్రోహం చేసిన వారి వలన దెబ్బతినాల్సి వస్తుంది.
.
అప్పుడు ఔరంగజేబు శంభాజీకి ఓ ప్రతిపాదన పెడతాడు. తమ మతమైన ఇస్లామ్ స్వీకరించి, తన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తే యథేచ్ఛగా మరాఠా రాజ్యాన్ని శంభాజీ ఏలుకోవచ్చునన్నదే ఆ ప్రతిపాదన. అందుకు శంభాజీ ఒప్పుకోడు. దాంతో పోరాటం తప్పదు
ఈ క్రమంలో చివర క్షణందాకా చేతులు సంకెళ్ళతో కట్టేసేవరకు పోరాడుతూనే ఉంటాడు శంభు. అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు చేతికి చిక్కిన శంభును ఏ స్థాయిలో హింసించాడు? ఆ హింసను శంభు మహారాజ్ ఎంత ధైర్యంగా భరించాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఇది కల్పిత గాథా లేక చరిత్రా అంటే ఇదిమిద్దంగా ఎవరూ చెప్పలేరు. ఇది సినిమా. ఇందులో ఓ కథ ఉంది అంతే. అది చరిత్ర కూడా కావచ్చు . అంతవరకునే తీసుకునే మాట్లాడుకుందాం. ఎందుకంటే మధ్యయుగం నుండి ఆధునిక భారతీయ చరిత్ర వరకు సంవత్సరాల తరబడి రాజకీయ దృశ్యం నిరంతరం మారుతూ, పరిణామం చెందిన విధానంలో చాలా సంక్లిష్టతలు ఉన్నాయి.
దాంతో చరిత్ర విషయంలో కొన్ని సిద్ధాంతాలు దానికి కౌంటర్ గా ప్రతి-సిద్ధాంతాలు ఉంటాయి. అయితే అదే సమయంలో CHHAAVA లాంటి జనాలకు తెలియని వీరుల కథలు, చరిత్రలు ఈ దేశంలో చాలా ఉంటాయి.
మరీ ముఖ్యంగా మహారానా ప్రతాప్ (16 శతాబ్ది ఉదయ్ పూర్ మేవాడ రాజు), ఆయన కొడుకు మహారానా అమర్ సింగ్, సామ్రాట్ పృధ్వీ రాజ్ చౌహాన్ (12 వ శతాబ్దం అజ్మీర్) ఇలా చాలా మంది చరిత్ర వీరులు మన కళ్ల ముందు కనపడతారు. ఆ కాలమాన పరిస్దితులని బట్టి వారికి న్యాయం, ధర్మం అనిపించవి వారు చేసుకుంటూ చరిత్ర కెక్కారు.
అయితే ఇప్పుడు ఆ నాటి చరిత్రలు తెరకెక్కించాలంటే ఖచ్చితంగా సినిమాటెక్ ఎక్సపీరియన్స్ ఇవ్వటం కోసం కొన్ని మార్పులు, చేర్పులు, కల్పనలు చేయాలి, అంతమాత్రాన వాటిని చరిత్ర వక్రీకరణలు అనలేం. చరిత్రే పూర్తి వక్రీకరణతో కూడిన వాదన కూడా కొట్టిపారేయలేం.
అంతెందుకు చరిత్రలో చాలా సార్లు మొఘలులతో కలిసి పనిచేస్తూ తమ రాజ్యాన్ని కాపాడుకున్న మన రాజులు ఉన్నారు.అలాగే వారిపై పోరాటం చేసిన వారు ఉన్నారు. అప్పటి కాల సామాజిక పరిస్దితులను ఇప్పటి పరిస్దితులతో ముడివేయలేం. ఈ విషయాన్ని ప్రక్కన పెట్టి స్క్రిప్టు పరంగా చూస్తే సినిమా కు వంద శాతం మార్పులు పడతాయి.
ఎక్కడైతే ఎమోషన్ రైజ్ చేయాలో, ఎక్కడకి సెటప్ పూర్తి చేసి,కథలోకి రావాలో, కథలో మలుపులు వంటివి ఫెరఫెక్ట్ గా కుదిరాయి. ఫస్టాఫ్ లో కాస్త అటు ఇటు తడబడినా,సెకండాఫ్ మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో పెట్టిచే కంటతడి మొత్తం ఒక్క దెబ్బకు అన్ని మైనస్ లు ప్లస్ చేసేస్తుంది. అలాగే అనవసర ట్విస్ట్‌లు, పాటలు, సబ్‌ప్లాట్స్ జోలికి పోకుండా 'ఛావా'ను నడపటం కలిసొచ్చింది.
టెక్నికల్ గా ...
సినిమాలో ఎక్కువ హైలెట్ అయినవి యాక్షన్ దృశ్యాలే. యుద్ద సన్నివేశాలే. మరీ ముఖ్యంగా మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టు ముట్టడానికి వస్తున్న దిల్లీ సైన్యంపై శంభాజీ, అతడి సేన సాగించే మెరుపు దాడులు, గెరిల్లా పోరాటాలు ఆద్యంతం ఉత్కంఠగా చూపించటం టీమ్ అంతా పూర్తి స్దాయిలో సక్సెస్ అయ్యింది.
మరాఠా సేనలు 'జై భవానీ', 'హర హర మహదేవ్'అంటూ విరుచుకు పడే సీన్స్ ని అంతే కన్సీన్సింగ్ గా, నైపుణ్యంతో తీసారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ . అందుకు టెక్నీషియన్స్ పూర్తి సహకారం ఇచ్చారు.
సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాని నెక్ట్స్ లెవిల్ లో కూర్చో బెట్టాయి. ముఖ్యంగా 5000 మంది ముఘల్ సైన్యంతో ఛావా పోరాడే సీక్వెన్స్ ను మర్చిపోవటం కష్టమే. తెలుగు డైలాగులు, డబ్బింగ్ రెండూ బిలో యావరేజ్ గా ఉన్నాయి. ఇంకాస్త జాగ్రత్తపడాల్సింది.
నటీనటుల్లో
శంభాజీగా విక్కీ కౌశల్‌ను తప్ప వేరొకరిని ఊహించుకోలేం అనే స్దాయిలో నటించారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో విక్కి నటన కన్నీరు పెట్టించాడు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. అశుతోష్ రాణా (Ashutosh Rana), ప్రదీప్ రావత్ (Pradeep Rawat) లాంటి ఎంతో మంది నటులకు మంచి పాత్రలు, ఎలివేషన్స్ పడ్డాయి.
ఫైనల్ థాట్:
'ఛావా'... చేవ ఉన్న సినిమా! మతం, చరిత్ర వంటి విషయాలను ప్రక్కన పెట్టి ఈ సినిమాగా చూస్తే ఖచ్చితంగా గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఒకప్పటి మన భారతంపై ఎంతో కొంత అవగాహన అయితే కలిగిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు ఎమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లి వీరత్వం, అమరత్వం వంటి భావోద్వేగాలను మనలో అదే స్దాయిలో కలిగించటంలో పూర్తి స్దాయి సక్సెస్ అయ్యే సినిమానే.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3
నటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక, అక్షయ్ ఖన్నా, అషుతోష్ రాణా, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటి తదితరులు;
సంగీతం: ఏఆర్ రెహమాన్;
సినిమాటోగ్రఫి : సౌరభ్ గోస్వామి (Saurabh Goswami)
నిర్మాత: దినేశ్ విజన్ (Dinesh Vijan)
దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్;
తెలుగు రిలీజ్ : గీతా డిస్ట్రిబ్యూషన్
విడుదల: 07-03-2025