
Kingston Movie Review: మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ హీరోగా నిలబడేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు మ్యూజిక్ చేస్తూనే మరోవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అయితే బిగ్ బ్రేక్ ఇచ్చే మూవీ పడటం లేదు. ఈక్రమంలో ఇప్పుడు ఓ ప్రయోగాత్మక మూవీ చేశాడు. సముద్రం బేస్డ్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో `కింగ్‌స్టన్` మూవీని చేశాడు.
దివ్య భారతి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో విడుదల చేసింది. ఈ మూవీతో జీవి ప్రకాష్ నిర్మాతగానూ మారారు. ఉమేష్ కేఆర్ భన్సాల్ మరో నిర్మాత. నేడు శుక్రవారం(మార్చి7)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
తూవట్టూర్ కోస్టల్ విలేజ్‌లో ప్రజలకు చేపలు పట్టడమే ఆధారం. కానీ 1982లో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంటుంది. అందులోకి వేటకు వెళ్లిన వారు శవాలై కొట్టుకొస్తుంటారు. ఇలా ఎంతో మంది మరణిస్తారు. దానికి కారణం అందులో స్టీఫెన్ బోస్(అజాగమ్ పెరుమాల్) ఆత్మ అందరిని వెంటాడుతుందని, ఊరిని వల్లకాడు చేస్తుందని, ఆ ఆత్మని సముద్రంలో పడేస్తారు.
దానివల్లే ఇదంతా జరుగుతుందని జనాన్ని నమ్మిస్తారు. ఆ తర్వాత ఊర్లో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. అదే సమయంలో వేటకు వెళ్లిన చాలా మంది శవాలై వస్తుంటారు. ఏం జరిగిందనేది కింగ్(జీవి ప్రకాష్)కి తాత మార్టిన్(ఈ కుమారవేల్) దెయ్యాల కథలు చెబుతాడు. కానీ దాన్ని కింగ్ నమ్మడు. ఇక కింగ్ పెరిగి పెద్ద అవుతారు. థామస్ అయ్యా(సబుమాన్ అబ్దుసమద్) వద్ద పనిచేస్తుంటాడు.
థామస్ అయ్య ఆ సముద్రంపై పట్టు సాధిస్తాడు. ఆ ఊర్ల జనాలకు ఆయనే దేవుడిగా కనిపిస్తారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాడు. సముద్రంపై చేపల వ్యాపారం చేస్తుంటాడు. ఓ రోజు కింగ్ వెంట వచ్చిన కుర్రాడు నేవీ అధికారుల దాడిలో మరణిస్తాడు. కానీ అతను చనిపోయే ముందు అసలు మనం ఏం పని చేస్తున్నామో? ఆ పెట్టేల్లో ఏముందో తెరిచి చూడండి అన్నా అని అరుస్తాడు.
కానీ కింగ్ వినడు. అతను చనిపోయాక ఆ పెట్టేల్లో ఓపెని చేసి చూడగా, వాటిలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంటుంది. దీంతో థామస్ అయ్యని ఎదురిస్తాడు కింగ్. అతన్ని కొడతాడు, సముద్రంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా చూస్తాడు. ఈ క్రమంలో తన ప్రియురాలు రోజ్(దివ్యాభారతి)ని కిడ్నాప్ చేస్తుండగా పట్టుకుంటాడు.
అదే సమయంలో సముద్రంపై ఉన్న అపవాదు నిజం కాదని, తాము చేపలు పట్టుకొస్తామని సముద్రంలోకి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తారు కింగ్. మరి ఆయనకు సముద్రంలో ఏం కనిపించింది? సముద్రంలో ఏం చూశారు? అక్కడ ఎలాంటి భయానక సంఘటనలను ఫేస్ చేశారు? దీనికి జాంబీలకు ఉన్న లింకేంటి? కింగ్ తాత సాల్మన్(చేతన్) కథేంటి? థామస్ అయ్యా తెరవెనుక చేస్తున్న పనులేంటి? ఆయనకు కింగ్ తాతకి ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
హాలీవుడ్‌లో సముద్రం బేస్డ్ గా చాలా సినిమాలు వచ్చాయి. సముద్ర దొంగల కథతో `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` వంటి మూవీస్ చాలా పాపులర్. కానీ ఇండియాలో ఇలాంటి జోనర్‌లో మూవీస్ రాలేదు. `కింగస్టన్`తో జీవి ప్రకాష్, ఆయన టీమ్ పెద్ద సాహసం చేశారు. అయితే ఓ కొత్త అనుభూతిని ఇచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జీవి ప్రకాష్ చాలా వరకు విభిన్నమైన సినిమాలతో వస్తున్నాడు.
ఈ మూవీతో మరోసారి తన ప్రత్యేకతని చాటుకున్నారు. ఇందులో సస్పెన్స్ ఉంది, థ్రిలర్స్ ఉంది, హర్రర్ ఉంటుంది. జాంబిలు ఉన్నాయి. యాక్షన్ ఉంది. అందులోనే చిన్న లవ్ స్టోరీ కూడా ఉండటం విశేషం. ఇవన్నీ మేళవించిన ఈ సినిమాని రూపొందించడం పెద్ద సవాల్‌తో కూడుకున్నది. దాన్ని కన్విన్సింగ్‌గా చెప్పడమే ఇందులో హైలైట్ పాయింట్. ఆ విషయంలో మేకర్స్ చాలా వరకు సక్సెస్ అయ్యారు.
సినిమా కథగా చూసినప్పుడు ఇది చాలా క్లిష్టమైన స్టోరీ. దాన్ని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడం, కథనాన్ని ఒక ఫ్లోలో రాసుకోవడం పెద్ద సవాల్‌తో కూడుకున్నది. ఈ విషయంలో కమల్ ప్రకాష్ చాలా వరకు కష్టపడ్డాడు అని తెలుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి సస్పెన్స్ అంశాలతో సాగుతుంది.
అదే ఆడియెన్స్ కి థ్రిల్ ఎక్స్ పీరియెన్స్ ని అందిస్తుంది. ప్రతిదీ సస్పెన్స్ గా ఉంటుంది. భయానక శబ్దాలు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అయితే ఫస్టాఫ్ కొంత ల్యాగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ సస్పెన్స్ థ్రిల్ ఎక్స్ పీరియెన్స్ కోసం అలా చేసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సీన్లు ఆద్యంతం థ్రిల్‌కి గురి చేస్తాయి.
ఇక సెకండాఫ్‌లో అసలు కథ ఉంటుంది. అందులో హర్రర్ ఎలిమెంట్లు, జాంబీలు ఎంటర్ అవుతాయి. సముద్రంలోకి హీరో టీమ్ వెళ్లినప్పుట్నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ప్రతి క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ, భయం కలుగుతుంటుంది. విభిన్నమైన సౌండ్లు వణుకు పుట్టిస్తాయి. హర్రర్ ఎలిమెంట్లు, జాంబీలు ఎపిసోడ్లు ఆద్యంతం థ్రిల్‌ని ఇస్తాయి.
అందులోనే నవ్వులు పూయిస్తుంటాయి. భయపెట్టిస్తుంటాయి. ప్రతి క్షణం ఎంగేజ్ చేస్తాయి. సెకండాఫ్ మొత్తం ఇలానే రన్ అవుతుంది. వారి భయం ఆడియెన్స్ నవ్వులు పూయిస్తుంది. భయపెట్టిస్తుంది. థ్రిల్‌కి గురి చేస్తుంది. ఓ కొత్త అనుభవాన్ని అందిస్తుంది. క్లైమాక్స్ లో థ్రిల్ ఫీలింగ్ పీక్‌లో ఉంటుంది. అయితే సినిమాలో స్లో నెరేషన్ ఫీలింగ్ ఉంటుంది.
ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అదే సమయంలో కథని చెప్పే విషయంలో మరింత క్లారిటీ మెయింటేన్ చేయాల్సింది. ఎక్కువ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు చెప్పడంతో కొంత కన్ ఫ్యూజన్ ఫీలింగ్ ఉంటుంది. క్లైమాక్స్ లో మాత్రం ఆ క్లారిటీ ఉంటుంది. కానీ కథనంపై మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. విజువల్ పరంగా, సౌండింగ్ పరంగా, థ్రిల్ విషయంలో కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నటీనటులుః
కింగ్ పాత్రలో జీవి ప్రకాష్ బాగా చేశాడు సెటిల్డ్ గా నటించాడు. అనవసరమైన హీరోయిజానికి పోకుండా బాగా చేశాడు. సినిమాలో కథ చాలా రకాలుగా టర్న్ తీసుకున్నా, మిగిలిన పాత్రలకు స్కోప్ ఉన్నా, తన స్పేస్‌తో తాను హైలైట్ అయ్యేలా తనదైన సహజమైన యాక్టింగ్‌గా మెప్పించాడు. సినిమాని నడిపించాడు.
రోజ్‌గా దివ్య భారతి ఉన్నంతలో బాగా చేసింది. తాను భయపడుతూ అందరిని బయటపెట్టింది. ఇక థామస్ అయ్యగా సబుమాన్ అబ్దుసమద్ నెగటివ్ రోల్‌లో మెప్పించాడు. అతనికి యంగ్ ఏజ్ రోల్ చేసిన వ్యక్తి కూడా మెప్పించాడు. కింగ్ తాత సాల్మన్ గా సీనియర్ నటుడు చేతన్ కాసేపు కనిపించినా, విభిన్నమైన షేడ్స్ చూపించి మెప్పించారు.
బోస్‌గా అజగమ పేరుమాల్ కాసేపు కనిపించినా బాగా చేశాడు. వీరితోపాటు కింగ్ ఫ్రెండ్ రాజేష్ బాల చందిరన్ బాగా చేశాడు. అలాగే అరుణాచలేశ్వరన్, ఫైర్ కార్తీక్, తాతగా కుమారవేల్ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. కానీ పాత్రల పేర్లే కన్‌ఫ్యూజ్ చేస్తాయి.
టెక్నీకల్‌గాః
టెక్నీకల్‌గా సినిమా అదిరిపోయింది. విజువల్స్, ఆర్‌ఆర్ మెయిన్ హైలైట్‌గా చెప్పొచ్చు. గోకుల్ బినోయ్ కెమెరా వర్క్ అదిరిపోయింది. సముద్రంలో విజువల్స్ బాగున్నాయి. వీఎఫ్‌ఎక్స్ కూడా నేచురల్గా ఉన్నాయి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఓకే అని చెప్పొచ్చు. ఈ మూవీలో ఆర్‌ఆర్ మెయిన్ హైలైట్. సముద్రంలో సౌండింగ్ ఓ కొత్త అనుభూతిస్తుంది.
అదే సమయంలో రొటీన్‌కి భిన్నంగా ఉంది. ఎడిటింగ్ పరంగా సాన్ లోకేష్ కొంత కేర్ తీసుకోవాల్సింది. దర్శకుడు కమల్ ప్రకాష్ ఎంచుకున్న కథ అదిరిపోయింది. దాన్ని రాసుకున్న విధానం కూడా బాగుంది. కానీ మరింత సరళంగా కథనాన్ని నడిపిస్తే బాగుండేది. కానీ థ్రిల్‌ని అందించడం, భయపెట్టించడంలో సక్సెస్ అయ్యాడు నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు. ఆ క్వాలిటీ ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది.
ఫైనల్‌గాః విజువల్ ట్రీట్‌తోపాటు యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లింగ్ జర్నీ.
రేటింగ్‌ః 2.75