సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం `వేట్టయన్`. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో, లైకా సంస్థ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. మంజు వారియర్ ఈ చిత్రంలో రజనీకి జోడిగా నటించారు. ఆమె నటించిన 'అదరగొట్ట వచ్చిండే మనసిలాయో' అనే సాంగ్ మాత్రం బాగా వైరల్ అయింది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ తో కలసి నటించిన చిత్రం ఇది కావడం విశేషం. రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. దసరా కానుకగా నేడు అక్టోబర్ 10న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కథః
అథియాన్(రజనీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. ఎస్పీగా పనిచేస్తుంటారు. మారు మూల గ్రామంలో ప్రభుత్వ స్కూల్‌లో గంజాయి దాచిపెడతారు. దాన్ని ఎదురించి బయటకు తీసుకొస్తుంది ఆ స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్). అథియన్ ఆ గంజాయి వెనకున్న వాళ్లని చంపేస్తాడు. దీంతో ఆమె స్టేట్ వైడ్‌గా పాపులర్ అవుతుంది. అంతేకాదు ఆమె ప్రైవేట్ ఎడ్యూకేషన్‌పై కూడా ఫైట్ చేస్తుంది. ప్రభుత్వ స్కూల్స్ లో చదివే విద్యార్థులకు ట్యాబ్‌లు ఇప్పించడం, ప్రైవేట్ కోచింగ్ ఇప్పించాలనుకుంటుంది.
అయితే అందులో మోసం ఉంటుంది. దాన్ని ఎదురిస్తుంది. అంతలోనే శరణ్య హత్యకు గురవుతుంది. రేపు చేసి చంపేస్తారు దుండగులు. ఇదంతా చేసింది గుణ అనే కంప్యూటర్ కుర్రాడు అని పోలీసులు నిర్ధారిస్తారు. అతన్ని పట్టుకోగా తప్పించుకుంటాడు. దీంతో ఎస్పీ అథియాన్ రంగంలోకి దిగిన48 గంటల్లో ఎన్‌కౌంటర్ చేస్తాడు. కానీ ఇది హ్యూమన్ రైట్స్ కమిషనర్ సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, అమాయకుడిని మర్దర్ చేశాడని సరికొత్త కోణాన్ని బయటకు తీసుకొస్తాడు.
మరి ఆ సరికొత్త కోణం ఏంటి? కోచింగ్ సెంటర్ల మోసాలేంటి? దీనికి నటరాజ్(రానా)కి ఉన్న సంబంధమేంటి? అథియాన్ చేసిన మిస్టేక్ ఏంటి? ఇందులో మ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) పాత్ర ఏంటి? శరణ్య హత్యకు అసలు కారకులు ఎవరు? న్యాట్ అనే కోచింగ్ సెంటర్ కథేంటి? అథియన్ ఈ కేసుని ఎలా ముగించాడనేది మిగిలిన కథ.
vettaiyan
విశ్లేషణః
మనం చాలా సార్లు ఎన్‌కౌంటర్ అనే పదం వింటుంటాం. నింధితులు తప్పించుకుని పారిపోతుంటే పోలీసులు కాల్చిచంపేస్తారు. ఏదైనా సెన్సేషనల్ కేసులో రెండు మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుని చంపేసినట్టుగా వార్తలు వస్తుంటాయి. అత్యాచార ఘటనల్లో ఇది ఎక్కువగా వినిపిస్తుంటుంది. దాన్ని సాధారణ ప్రజలు కూడా హర్షిస్తుంటారు. కానీ ఇలాంటి ఎన్‌కౌంటర్‌లో తెరవెనుక అమాయకులు బలైన సందర్భాలే చాలా ఉంటాయి.
అవేవీ బయటకు రానివ్వకుండా పోలీసులు, రాజకీయ నాయకులు మ్యానేజ్ చేస్తుంటారు. కానీ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కేసుల్లో మాత్రం ఇలాంటి ఘటనలు మనం చూసి ఉండం. వారికి బెయిల్‌రావడం, కేసులను సాగదీయడం జరుగుతుంటాయి. వాళ్లంతా పాలిటిక్స్ ని, పోలీస్ వ్యవస్థని మ్యానేజ్ చేయడం వల్లే జరుగుతుందనేది అసలు నిజం. దాన్ని `వేట్టయన్` సినిమాలో బయటపెట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు టీజే జ్ఞానవేల్. పోలీసులు చేసే పొరపాట్లని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల మోసాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఐఐటీ, ఎంబీబీఎస్ సీట్ల కోసం, ర్యాంకుల కోసం టాప్ కోచింగ్ ల సెంటర్లు, పెద్ద విద్యా సంస్థలు పేద ప్రజలను ఎలా దోచుకుంటున్నారో ఇందులో చూపించారు దర్శకుడు. ఇలాంటి కథని రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలు చేయడమే ప్రత్యేకత. వీళ్లు ఈ కథలోకి ఎంటరవడంతో ఈ సినిమా స్థాయి పెరిగిందని, చెప్పాలనుకున్న విషయం తీవ్రత పెరిగింది.
సినిమాగా చూస్తే ఇది దిశా లాంటి ఎన్‌కౌంటర్లని గుర్తు చేస్తుంది. అలాగే కోచింగ్ సెంటర్ల మోసాలను ప్రతిబింబిస్తుంది. సినిమా మొదటి భాగం మొత్తం శరణ్య కేసు చుట్టూ తిరుగుతుంది. ఆమెని చంపిందెవరు, ప్రభుత్వం నుంచి ఒత్తిడి, పోలీసుల ఒత్తిడి వల్ల కింద స్థాయి పోలీసులు ఎలా కేసుని విచారిస్తారు. అదే సమయంలో స్మగ్లర్లకి పోలీసులు ఎలా సపోర్ట్ చేస్తారు? దాన్ని నిజాయితీ పోలీస్ ఆఫీసర్ అయిన అథియన్ డీల్ చేయడం ఆయన ఎంట్రీతో కేసు పరుగులుపెట్టడం, కొత్త కొత్త ట్విస్ట్ లు చోటుచేసుకోవడం, కొత్త పాత్రలు ఎంటరవడం, దీనికితోడు రజనీ మార్క్ ట్విస్ట్ లతో గూస్‌బంమ్స్ తెప్పించారు.
దీంతో మొదటిభాగం మొత్తం ఫాస్ట్ గా సాగిపోతుంది. దీనికితోడు కొన్ని ట్విస్టులు, రజనీ మార్క్ యాక్షన్, ఎలివేషన్లు అదిరిపోయాయి. కంటెంట్ సినిమాల్లో ఇలాంటి ఎలివేషన్లని పెట్టడం, వాటిని కన్విన్సింగ్‌గా చెప్పడం కూడా ఇందులో హైలైట్ పాయింట్. ఇక ఇంటర్వెల్‌లో కేసులో కొత్త మలుపు మరో ట్విస్ట్ ఇస్తుంది. సెకండాఫ్‌లో కథ పూర్తిగా మరో వైపు తిరుగుతుంది. అత్యాచారం కేసు కాస్త ఎడ్యూకేషన్ సిస్టమ్, కోచింగ్ సెంటర్ల మోసం వైపు టర్న్ తీసుకుంటుంది. మరో యాంగిల్‌లో కేసు విచారణ జరుగుతుంది.
ఈ క్రమంలో అనేక కొత్త విషయాలు బయటకు వస్తుంటాయి. మరికొన్ని ట్విస్ట్ లు యాడ్ అవుతుంటాయి. దీంతో మరింత రక్తికడుతుంది. ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ ముందు నుంచి క్లైమాక్స్ వరకు, రానా ఎంట్రీ తర్వాత సీన్ మరో స్థాయికి వెళ్తుంది. కానీ అంతిమంగా ముగింపు కాస్త చప్పగా సాగింది. అది రజనీ స్టయిల్ ఎండింగ్ కాకపోవడం కాస్త డిజప్పాయింట్ చేసే అంశం.
దీనికితోడు సెకండాఫ్ అంతా కోచింగ్ సెంటర్ మోసాలపై విచారణ జరుగుతుంది. అది బాగా స్లోగా సాగుతుంది. సాగదీసినట్టుగా ఉంటుంది. కొంత బోరింగ్ పార్ట్ అని చెప్పొచ్చు. దీంతో కొన్ని ట్విస్ట్ లు ఉన్నా, అవి తేలిపోయాయి. మరోవైపు ఇందులో ఫహద్ ఫాజిల్ పాత్ర ముగింపు కూడా కన్విన్సింగ్‌గా లేదు. ఎండింగ్‌లో రజనీ కాంత్ మార్క్ ఏదైనా సర్‌ప్రైజ్ ప్లాన్ చేయాల్సింది.
దీనికితోడు సినిమాలో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. కేసు విచారణలో పోలీసులు చేసే తప్పులు ఆడియెన్స్ కి ఇట్టే అర్థమైపోతాయి. ఆ తర్వాత అదే కోర్ట్ చెప్పడం గమనార్హం. నెక్ట్స్ ఏం జరుగుతుందనేది అర్థమయ్యేలా ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు. సినిమా అంతా సీరియస్‌గా సాగుతుంది. ఫహద్ పాత్ర కొంత ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. కానీ అది సరిపోలేదు. కొంత ఎంటర్టైన్‌మెట్, గ్లామర్‌పార్ట్ తగ్గింది.
కానీ రజనీ మ్యాజిక్ చేశారు. కానీ కొన్ని చోట్ల ఆయన ఉన్న కూడా బోరింగ్‌గా అనిపించడమే మైనస్‌గా చెప్పొచ్చు. దీనికితోడు చాలా వరకు తమిళ వాసనలు ఉన్నాయి. అవి తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా కనెక్ట్ కావు. ఫస్టాఫ్ ఒకలా, సెకండాఫ్ మరోలా అనిపిస్తుంది. కథగా ఇది మంచి సందేశాత్మక మూవీ అవుతుంది. దాన్ని కమర్షియల్‌గా బ్లెండ్ చేయడమే ఇక్కడ దర్శకుడి సక్సెస్.
నటీనటులుః
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ అదరగొట్టాడు. ఇలాంటి యాక్షన్, స్టయిలీష్ రోల్స్ లో రజనీ రెచ్చిపోతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇందులో కొంత తగ్గి కనిపించారు. పాత్ర డిమాండ్ మేరకు ఆయన అండర్ ప్లే చేయడం విశేషం. అదే సమయంలో రజనీఈ ఇలాంటి ఓ సందేశాత్మక మూవీని ఎంచుకోవడం, సమాజాంలో జరుగుతున్న మోసాలను ప్రతిబింబించే కథని ఎంచుకోవడం విశేషంగా చెప్పొచ్చు. నిజానికి ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ సూపర్‌స్టార్స్ అంతా కలిసి చేయడంతో దీన్ని రేంజ్ పెరిగిందని చెప్పొచ్చు. సత్యదేవ్ పాత్రలో అమితాబ్ బచ్చన్ బాగా సెట్ అయ్యారు. అదరగొట్టారు. ఇక దొంగగా, పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మెప్పించాడు, నవ్వించాడు. కన్నీళ్లు పెట్టించాడు. పోలీస్ ఆఫీసర్‌గా రూపకి బలమైన పాత్రపడింది. ఎడ్యూకేషనిస్ట్ గా నటరాజ్ పాత్రలో రానా మరో అసెట్‌గా నిలిచారు. సెకండాఫ్ లో సినిమా ఆయన వైపు తిరుగుతుంది. ఆ పాత్రలో అదరగొట్టాడు రానా. రజనీ వైఫ్‌గా మంజువారియర్ సైతం మెప్పించింది.శరణ్య పాత్రలో దసర విజయన్ అదరగొట్టింది. తనకు మరో మంచి పాత్ర పడిందని చెప్పొచ్చు. రావు రమేష్, రోహిణి, కిశోర్, అభిరామి వంటి వారు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
టెక్నీషియన్లుః
సినిమాకి మ్యూజిక్ హైలైట్. పాటలతో అదరగొట్టాడు. ఇంట్రో సాంగ్, టైటిల్ సాంగ్ అదిరిపోయాయి. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ మూవీస్ బీజీఎం చాలా ముఖ్యం. అనిరుథ్ తన మార్క్ బీజీఎంతో దుమ్ములేపాడు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. చాలా సీన్లని ఆయన ఆర్‌ఆర్ లేపిందని చెప్పొచ్చు. లేదంటే మూవీ చాలా బోరింగ్‌గా మారేసింది. ఎస్ ఆర్ కథిర్ కెమెరా వర్క్ బాగుంది. అలాగే ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఓకే, సెకండాఫ్‌లో కొంత ట్రిమ్ చేయోచ్చు. ఇక దర్శకుడు టీజే జ్ఞానవేల్ సినిమాకి హైలైట్. పెద్ద సూపర్ స్టార్లని కూడా తన కథలోకి బ్లెండ్ చేసిన తీరు సూపర్. అందరు పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలో చిన్న పాత్రలు తేలిపోతాయి. కానీ ఇందులో అన్ని పాత్రలకు ప్రయారిటీ ఇచ్చాడు. సరైన ఎండింగ్ కూడా ఇవ్వడం, ప్రతి పాత్ర కథకి లింక్ అయ్యేలా ఉండటం విశేషం. అలాగే పోలీస్ వ్యవస్థలో లోపాలను, చట్టాలను, సెక్షన్లనపై ఆయనకున్న కమాండ్, సినిమాలో వాటిని చర్చించిన తీరు. ప్రస్తుతం సమాజంలో చాలా అంశాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన తీరు అభినందనీయం. కోచింగ్ సెంటర్ల మోసాలను చూపించిన తీరు అభినందనీయం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు దేశంలో చాలా మంది ప్రజలు ఫేస్ చేస్తున్నారు. దాన్నే ఇందులో చూపించడం విశేషం. ఓవరాల్‌గా మూవీ అభినందనీయ ప్రయత్నం.
ఫైనల్‌గాః `వేట్టయన్` వేట మొదలు పెడితే తిరుగేలేదు. దసరా వేట ఆయనదే.
రేటింగ్‌ః 3.25