`రామ్‌ నగర్‌ బన్నీ` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 4, 2024, 4:12 PM IST

ఈటీవీ ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్‌ హీరోగా పరిచయం అవుతూ `రామ్‌ నగర్‌ బన్నీ` సినిమాలో నటించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

ఈటీవీ ప్రభాకర్‌ ఎంతటి పాపులరో మనకు తెలిసిందే. ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్‌ అనిపించుకున్నాడు. సీరియల్స్, టీవీ షోస్‌, సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు చంద్రహాస్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. శ్రీనివాస్‌ మహత్‌(వెలిగొండ శ్రీనివాస్‌) దర్శకత్వంలో `రామ్‌ నగర్‌ బన్నీ` సినిమాని తీశారు. దీనికి ప్రభాకర్‌తోపాటు ఆయన భార్య మలయజ ప్రభాకర్‌ నిర్మాతలు కావడం విశేషం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

కొడుకుని నిలబెట్టడం కోసం పేరెంట్స్ సాహసం చేశారని చెప్పొచ్చు. యాటిట్యూడ్‌ స్టార్‌గా సోషల్‌  మీడియాలో పాపులర్‌ అయిన చంద్రహాస్‌ హీరోగా పరిచయం అవుతూ చేసిన `రామ్‌ నగర్‌ బన్నీ` నేడు శుక్రవారం(అక్టోబర్‌ 4)న విడుదలైంది. యాటిట్యూడ్‌తో పాపులర్‌ అయిన చంద్రహాస్‌.. హీరోగా అదరగొట్టాడా? సినిమా ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథః 
రామ్‌ నగర్‌ బన్నీ(చంద్రహాస్‌) బీటెక్‌ చదువుతుంటాడు. అమ్మాయిలను పడేయడమే లక్ష్యంగా తిరగుతుంటాడు. పక్క కాలేజీలో అమ్మాయిలు బాగున్నారని తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి అక్కడ ఏకంగా లెక్చరర్‌కే లైనేసి దొరికిపోతారు. బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. కానీ ఎప్పుడు గెలవలేదు. పక్కింటి అమ్మాయి శైలు(విష్మయ శ్రీ) బన్నీని బాగా ఇష్టపడుతుంటుంది. కానీ ఆమెని బన్నీ పట్టించుకోడు. ఈ క్రమంలో బాక్సింగ్‌ సెంటర్‌లో దీపు(రీచా జోషి) పరిచయం అవుతుంది.

ఆమెకి ట్రైనింగ్‌ ఇచ్చే క్రమంలో ఇద్దరు లవ్‌ లో పడతారు. ఇంటికి కూడా తీసుకొస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో కూడా చెబుతాడు. ఓ రోజు పార్టీలో దీపు ఫ్రెండ్‌ నైనా(అంబిక వాణి)కి మందు ఎక్కువవడంతో పబ్‌లో గోల చేస్తుంటుంది. ఆమెని వాళ్లింట్లో డ్రాప్‌ చేయమని చెబుతుంది దీపు. దీంతో నైనాని అలా చూసి ఆమెకి పడిపోతాడు బన్నీ. నైనా మాయలో పడి దీపుకి బ్రేకప్‌ చెబుతాడు. నైనాతో  కలిసి గోవాకి వెళ్తాడు. చెల్లి కోసం తండ్రి దాచిన ఆరు లక్షలు తీసుకుని ఆమెతో గోవా వెళ్లి ఎంజాయ్‌ చేస్తాడు బన్నీ.

తీరా అక్కడ తన మాజీ బాయ్‌ ఫ్రెండ్‌ని కనెక్ట్ అవుతుంది నైనా. ఇది చూసి షాకైన బన్నీకి హార్ట్ బ్రేక్‌ అవుతుంది. ఆ బాధలో ఇంటికి వస్తే ఆరు లక్షలు తీసుకెళ్లాడని తన ఫ్రెండ్స్ ని, తనని చితక్కొడతాడు తండ్రి. అదే సమయంలో దీపు వేరే అబ్బాయితో లవ్‌లో పడుతుంది. అది చూసితట్టుకోలేక ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని కొడతాడు. దీంతో దీపు లాగిపెట్టి కొట్టి ప్రేమ విలువ తెలియదంటూ క్లాస్‌ పీకుతుంది. అప్పుడు జ్ఞానోదయం అయిన బన్నీ.. నిజమైన ప్రేమ శైలుదే అని ఆమె కోసం వెతుకుతాడు. కానీ ఆమె ఉందడు.

బన్నీ చేసిన మోసానికి వేరే చోటికి వెళ్లిపోతుంది. కొన్ని రోజులు పిచ్చోడవుతాడు. తండ్రి ఇంట్లోకి రానివ్వడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఓ రిచ్‌ లేడీ తార(రీతూ మంత్ర) తగులుతుంది. ఆమె బన్నీకి బాగా కనెక్ట్ అవుతుంది. ఆంటీ ఏజ్‌ లో ఉన్న తారకి బన్నీ ఎందుకు కనెక్ట్ అయ్యాడు?, ఆమెతో పెళ్లికి ఎందుకు సిద్ధమయ్యాడు? ఆ తర్వాత ఏం జరిగింది? శైలు తనకు దక్కిందా లేదా? ఈ క్రమంలో చోటు చేసుకున్న ట్విస్ట్ లేంటనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 

ఈ మధ్య కొత్త తరహా కంటెంట్‌ మాత్రమే ఆడియెన్స్ కి ఎక్కుతుంది. అయితే యాక్షన్‌ మూవీస్, లేదంటే డివోషన్‌ మూవీస్‌, అది కాదంటే మంచి థ్రిల్లర్స్, బోల్డ్ కామెడీ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ప్రభాకర్‌ తన కొడుకు చంద్రహాస్‌ని యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో ఆడియెన్స్ కి పరిచయం చేశాడు. కొన్ని బోల్డ్ సీన్లని దట్టించి యూత్‌ని టార్గెట్‌ చేస్తూ ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల యూత్‌కి కనెక్ట్ అయితే సినిమాలు బాగా ఆడుతున్నాయి. `మ్యాడ్‌`, `కమిటీ కుర్రొళ్లు`, `టిల్లు స్వ్కేర్‌` వంటి సినిమాలు అలాంటి కోవకు చెందినదే.

`రామ్‌ నగర్‌ బన్నీ`లోనూ అయా అంశాలను మేళవించారు. అలాగని అవి మరీ బోల్డ్ కాదు, అలాగని తక్కువగానూ లేవు. నేటి కుర్రాళ్లు ఎలా ఉన్నారనేది ఈ సినిమాలో చూపించారు. ఒక అమ్మాయి తో ప్రేమలో పడటం, ఆమెనే సర్వస్వం అనుకోవడం, ఆ తర్వాత ఆమె కంటే మంచి అమ్మాయి తగిలితే మొదటి అమ్మాయికి బ్రేకప్‌ చెప్పి, మరో అమ్మాయితో వెళ్లిపోవడం చేస్తున్నారు. సరిగ్గా అవే ఎలిమెంట్లని ఇందులో క్లారిటీగా చూపించారు. ఈ సినిమాలో ఉన్న హైలైట్‌ పాయింట్‌, ప్లస్‌ పాయింట్‌ ఇదే అని చెప్పాలి. 
 

సినిమా మొదటి భాగం మొత్తం బన్నీ, వాడి ఫ్రెండ్స్ అల్లరి చిల్లరగా తిరగడం, అమ్మాయిలకు లైనేయడం, చదువుకోకుండా ఎగ్జామ్స్ రాయడం వంటివి నేటి యువతని ప్రతిబింబించేలా తెరకెక్కించారు. ఈ క్రమంలో చోటు చేసుకునే అంశాలను ఫన్నీ వేలో చూపించారు. దీనికితోడు వరుసగా అందమైన అమ్మాయిలతో లవ్‌ లో పడటం, ఎంజాయ్‌ చేయడం, మరో అందమైన అమ్మాయిని కనిపించగానే మళ్లీ ప్రేమలో పడటం, చివరకు బ్రేకప్‌ లు పడటం నేటి టీనేజ్‌ కుర్రాళ్ల లైఫ్‌ని, కాలేజ్‌ స్టూడెంట్స్ లైఫ్‌ను ప్రతిబింబిస్తుంది.

ఈ విషయంలో కొంత ఆడియెన్స్ కనెక్ట్ అవుతుంటారు. అయితే ఆ తర్వాత తన బ్రేకప్‌ అవడంతో, దీపు అనే అమ్మాయి క్లాస్‌ పీకడంతో సడెన్‌గా శైలు అమ్మాయి నచ్చడం అనేది కన్వన్సింగ్‌గా లేదు. ఆమె కోసం పిచ్చోడవడమనేదాంట్లో ఎమోషన్ లేదు, ఫీల్‌ అసలే లేదు. ఏదో సీన్లు వచ్చిపోతున్నట్టుగానే ఉంటాయి. ఇక సెకండాఫ్‌లో తార అనే ఆంటీతో లవ్‌ ట్రాక్‌, డబ్బు కోసం ఆమెకి కనెక్ట్ కావడమనే పాయింట్‌ కాస్త కామెడీగా అనిపించినా, అది ఎక్కువ సేపు సస్టెయిన్‌ కాలేదు.

ఈ పాత్రల మధ్య డ్రామా పాత సినిమాలను తలపిస్తుంది. ఆ తర్వాత సినిమా అంతా రెగ్యూలర్‌గా రొటీన్‌గా సాగుతుంది. లవ్‌ కోసం మళ్లీ ఆయన తాపత్రయపడటం అనేది రొటీన్‌గానే ఉంటుంది. దీంతో సినిమా స్లో అయిపోతుంది. ఆడియెన్స్ కి బోర్‌ తెప్పిస్తుంది. సెకండాఫ్‌ సినిమా మొత్తం రొటీన్‌ డ్రామాలోకి వెళ్లిపోతుంది. శ్రీనువైట్ల మార్క్ డ్రామా కామెడీని తలపిస్తుంది.

లవ్‌ స్టోరీలో కొత్తదనం లేదు. ఫీల్‌ అంతకంటే లేదు. ఏదో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతుంటాయి. అదే సమయంలో ఫన్‌ సీన్లు కాలేజీలు, ఎగ్జామ్స్ లో, పబ్‌లో కొంత వరకు వర్కౌట్‌ అయ్యాయి. రొటీన్‌ స్టోరీ ముందు, రెగ్యూలర్ కమర్షియల్‌ లవ్‌ ట్రాక్‌ ముందు అది కూడా తక్కువే అయిపోయింది. సినిమా మొత్తం ఏదో హడావుడిగా సాగిపోతుంది, హడావుడి వన్‌ బై వన్‌ సీన్‌ రావాలన్నట్టుగానే ఉంది తప్పితే, ఎందులోనూ ఎమోషన్స్ లేదు, సోల్‌ లేదు.

దీంతో ఆడియెన్స్ వాటిని సీన్లుగానే చూస్తాడు తప్ప, కథనంతో ట్రావెల్ కాలేని పరిస్థితి. దీనికితోడు లౌడ్‌ డైలాగ్‌లు, సీన్లు, బన్నీ పాత్ర చేసే హడావుడి కొంత వరకు బాగానే ఉన్నా, ఇంకొంత ఇబ్బంది పెట్టేదిగా అనిపిస్తుంది. కొత్తదనం ఏముంది అనేది వెతికితే ఇందులో దొరకడం కష్టం. పాత సినిమాల సీన్లని కలిసి తీసినట్టుగానే అనిపిస్తుంది. అదే సమయంలో లాజిక్‌కి అందని సీన్లు చాలానే ఉన్నాయి. చంద్రహాస్‌ని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో కంటెంట్ కంటే కమర్షియల్‌ అంశాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఉంది. కనీసం సినిమా మొత్తం ఫన్‌ వర్కౌట్‌ చేసినా సినిమా అదిరిపోయేది. 
 

నటీనటులుః 

చంద్రహాస్‌.. కి హీరోగా తొలి సినిమానే అయినా ఎక్కడా ఆ ఫీలింగ్‌ కలగదు. మంచి అనుభవం ఉన్న కుర్రాడిలానే చేశాడు. డాన్సులతో అదరగొట్టాడు. నటన పరంగానూ మెప్పించాడు. ఫన్‌ బాగా చేయగలిగాడు. హీరోగా నిలబడే స్టఫ్‌ అయితే చంద్రహాస్‌లో ఉంది. ఈ సినిమా ఫన్‌ ఒక ప్లస్‌ అయితే, చంద్రహాస్‌ క్యారెక్టరైజేషన్‌, అతని నటన, డాన్సులు మరో ప్లస్‌ అవుతాయి. చంద్రహాస్‌కి ఈ మూవీతో పెద్ద సినిమాలు వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే హీరోయిన్లు అందరు బాగా చేశారు.

శైలుగా చేసిన విస్మయి శ్రీ ఆకట్టుకుంది. దీపుగా చేసిన రీచాజోషి కాసేపు అదరగొట్టింది. నైనాగా చేసిన అంబిక వాణిసైతం కాసేపు అలరించింది. ఇక తారగా చేసిన రీతూ మంత్ర మాత్రం అదరగొట్టింది. బన్నీ తండ్రిగా మురళీధర్‌ గౌడ్‌ తన మార్క్ నటనతో ఇరగదీశాడు. నవ్వులు పూయించారు. బన్నీ ఫ్రెండ్స్ కొత్తవాళ్లు. కానీ బాగా చేశారు. అలాగే రివ్యూ లక్ష్మణ్‌కి మంచి క్యారెక్టర్‌ పడింది. అతనికి ఛాన్స్ లు క్యూ కడతాయి. మిగిలిన ఆర్టిస్ట్ లంతా ఓకే అనిపించారని చెప్పొచ్చు. 
 

టెక్నీషియన్లుః 
టెక్నీకల్ గా సినిమాకి మంచి టెక్నీషియన్లు పనిచేశారు. ఆ క్వాలిటీ అన్ని విషయాల్లోనూ కనిపిస్తుంది. అష్కర్ అలీ కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదనే దానికిది నిదర్శనం. అలాగే మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఆర్ట్స్ వర్క్ అదిరిపోయింది. అశ్విన్‌ హేమంత్‌ మ్యూజిక్‌ బాగుంది. బీజీఎం కూడా అదిరిపోయింది.

పెద్ద స్టార్‌ హీరో రేంజ్‌ మ్యూజిక్‌ అందించారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఆ విషయంలో రాజీ లేదు. ఇక దర్శకుడు శ్రీనివాస్‌ మహత్‌ ఎంచుకున్న కథ రొటీన్‌గా ఉండటమే ఇందులో పెద్ద మైనస్‌. దీనికితోడు రొటీన్‌ కమర్షియల్‌ తెలుగు సినిమా ఫార్మూలాని ఎంచుకోవడమే పెద్ద మైనస్‌. కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసి ఉంటే బాగుండేది. యూత్‌ ఫుల్‌ కంటెంట్‌ కాస్త రిలీఫ్‌నిచ్చే అంశమని చెప్పాలి.  

ఫైనల్ గాః రొటీన్‌ కమర్షియల్ లవ్‌ స్టోరీ. హీరోకి మాత్రం ఒక విజిటింగ్‌ కార్డ్ లా పనిచేస్తుంది. 

రేటింగ్‌ః 2 

Latest Videos

click me!