
కొత్త హీరో అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ `వన వీర`. సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటించింది. నందు, పృథ్వీ, కోన వెంకట్, శివాజీ రాజా, ఆమని, సత్య, చమ్మక్ చంద్ర, రచ్చ రవి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. కథ, స్క్రీన్ ప్లే విశ్వజిత్ అందించారు. శాంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి, అంచనాలను పెంచాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన `వనవీర` సినిమా న్యూ ఇయర్ సందర్భంగా నేడు గురువారం( జనవరి 1న) విడుదలయ్యింది. మరి సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
తూర్పుగోదావరి జిల్లాలోని వనపురానికి చెందిన రఘు(అవినాష్ తిరువీధుల) తండ్రి(శివాజీ రాజా)తో కలిసి జీవిస్తుంటాడు. అన్న విదేశాల్లో సెటిల్ కాగా, రఘు ఏ జాబ్ చేయకుండా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. తన మరదలు ఇందు(సిమ్రాన్ చౌదరీ)తో కలిసి తిరుగుతుంటాడు. రఘుకి నాన్న కొనిచ్చిన బైక్ అంటే చాలా ఇష్టం. స్థానిక రాజకీయ నాయకుడు దేవా(నందు) వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటాడు. పై నాయకుడు తన ఇంటికి వస్తుండటంతో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ ర్యాలీ కోసం రఘు బైక్‌ని తీసుకుంటారు. కానీ దాన్ని మళ్లీ తిరిగి ఇవ్వరు. దీంతో బైక్ కోసం దేవా ఆఫీస్ కి వెళితే తక్కువ కులం వాడు అని అవమానిస్తారు అతని అనుచరులు. దేవాకి కులం అంటే పిచ్చి. దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు. ఈ క్రమంలో రఘుని ఆయన మనుషులు అవమానించడంతో తన ఈగో హర్ట్ అవుతుంది. పైగా రోజూ బైక్ కోసం వెళితే ఇదిగో అదిగో అని టైమ్ పాస్ చేస్తుంటారు. దీంతో బైక్ కోసం నానా రచ్చ చేస్తాడు. దేవా అనుచరులను కూడా కొడతాడు. దీంతో దేవాకి మండుతుంది. రఘుని దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తారు. కానీ రఘు.. రివర్స్ ఎటాక్ ప్లాన్ చేస్తాడు. దేవాకి పోటీగా తమ కులం వాడిని ఎమ్మెల్యేగా నిలబెడతాడు. దీంతో ఇరు వర్గాల పోరు పీక్‌లోకి వెళ్తుంది. మరి ఈ పోటీలో గెలుపు ఎవరిది? దేవాని రఘు టార్గెట్ చేయడానికి ఉన్న అసలు కారణం ఏంటి? రఘు అన్నకి జరిగిన అవమానం ఏంటి? రఘు నాన్న ఏమైపోయాడు? రామాయణంలోని వానరుల కథకి, దీనికి ఉన్న లింకేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా.
మైథాలజీ అంశాలకు కులాన్ని జోడించి కమర్షియల్ మూవీగా చేసిన ప్రయత్నం `వన వీర`. వానర జాతికి సంబంధించిన కథ నేటి సమాజంలో ఎలా మిళితమై ఉంది? వాళ్లు తమ ఆత్మగౌరవానికి ప్రమాదం వస్తే ఎలా తిరగబడతారు? అనేది ఇందులో చూపించారు. అయితే సినిమా మెయిన్‌గా విలేజ్ రాజకీయాన్ని కులానికి ముడిపెట్టి రూపొందించడం ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. దాన్ని నేటి వాస్తవ పరిస్థితులకు లింక్ చేసి చూపించిన తీరు బాగుంది. అదే ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం చదువుకునే వారి శాతం పెరిగినా, కులాల మధ్య గ్యాప్ కూడా పెరుగుతుంది. ఆయా పట్టింపులు ఎక్కువ అవుతున్నాయి. రాజకీయాల్లో అది మరింతగా ఉందనే విషయాన్ని ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు. సినిమా మాస్, కమర్షియల్ కామెడీ, ఫ్యామిలీ అంశాల మేళవింపుతో సాగుతుంది. చాలా నీట్‌గా దీన్ని రూపొందించారు. ఫస్టాఫ్ అంతా సరదాగా సాగుతుంది. హీరో సరదా పనులు, తండ్రితో బాండింగ్‌ని, మరదలితో ప్రేమని ఆవిష్కరించారు. అదే సమయంలో బైక్ అంటే ఎంత ఇష్టమో చూపించారు. దీనికితోడు కులం పేరుతో తమని అవమానిస్తే, దానికి రివేంజ్ తీర్చుకోవడానికి హీరో ఆడిన డ్రామా, చేసిన పనులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ వరకు ఇలా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్‌లో హీరో తిరుగుబాటుతో సీరియస్‌గా మారుతుంది. సెకండాఫ్ అంతా హీరోకి, విలన్ నందు పాత్రకి మధ్య కోల్డ్ వార్‌గా, ఆ తర్వాత అది కాస్త డైరెక్ట్ వార్ గా మారుతుంది. ఎన్నికల్లో పోటీ కోసం దేవా హీరోని వాడుకోవాలనుకోవడం, దాన్ని రఘు తిప్పికొట్టడం ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే డ్రామా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ ఎపిసోడ్ నుంచి రెగ్యూలర్ కమర్షియల్ వైపు టర్న్ తీసుకుంటుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టుగానే సాగుతుంది. అయితే అది ఎంగేజ్ చేసేలా రూపొందించడం విశేషం. క్లైమాక్స్ లో సత్య ఎంట్రీ హైలైట్‌గా చెప్పొచ్చు. మరోవైపు మధ్య మధ్యలో వన వీరులకు సంబంధించిన కథని చెప్పడం, ఈ క్రమంలో రామాయణంలోని కథని వివరించే సీన్లు గూస్ బంమ్స్ తెప్పిస్తాయి. అయితే చివర్లో ఆయా అంశాలు ఉంటాయని అంతా భావిస్తారు. కానీ ఈ విషయంలో నిరాశ పరిచారు. వన వీరుడిని ఏఐ ద్వారా విజువల్‌గా ఆవిష్కరించారు, కానీ యాక్షన్ పార్ట్ లో భాగం చేస్తే అదిరిపోయేది. దీనికితోడు కొన్ని సీన్లు లాజిక్ లెస్‌గా ఉన్నాయి. హీరో తండ్రి పాత్రలోని ట్విస్ట్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఫినిషింగ్ రెగ్యూలర్‌గా ఉంది. అక్కడ చిన్న మ్యాజిక్ చేస్తే బాగుండేది.
రఘు పాత్రలో అవినాష్ అదరగొట్టాడు. మాస్ హీరో లెవల్‌లో నటించాడు. మంచి అనుభవం ఉన్న నటుడిగా మెప్పించాడు. యాక్షన్, కామెడీ, ట్విస్ట్ ల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక ఆయన మరదలు పాత్రలో సిమ్రాన్ చౌదరీ చాలా బాగా చేసింది. చాలా చోట్ల తన నటనతో కట్టిపడేసింది. దేవాగా నందు ఇరగదీశాడు. చాలా సెటిల్డ్ గా చేశాడు. రాజకీయ నాయకుడిగా అదరగొట్టాడు. రచ్చ రవి, సత్య, చమ్మక్ చంద్ర పాత్రలు సర్‌ప్రైజ్ చేస్తాయి. శివాజీ రాజా కాసేపు మెప్పించాడు. కోన వెంకట్, పృథ్వీ కాసేపు మెరిసి అలరించారు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
సినిమాకి వివేక్ సాగర్ సంగీతం చాలా ప్లస్ అయ్యింది. పాటలు బాగున్నాయి. బీజీఎం అదిరిపోయింది. యాక్షన్, ఎలివేషన్ సీన్లని బాగా హైలైట్ చేసింది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్‌లు సినిమాకి మరో ప్లస్. సుజాత సిద్ధార్థ్ కెమెరా వర్క్ చాలా బాగుంది. విజువల్స్ కట్టిపడేశాయి. చోట కే ప్రసాద్ ఎడిటింగ్ ఉన్నంతలో ఫర్వాలేదు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. పెద్ద సినిమా రేంజ్‌లో ఖర్చు చేశారు. ఇక దర్శకుడు అవినాష్ మంచి కథని ఎంచుకున్నాడు. దాన్ని అంతే బాగా తెరపై ఆవిష్కరించారు. రామాయణంలోని అంశాలను, అందులోని వన వీరుల కథని, నేటి రాజకీయాలకు, ఇప్పటి కులాలకు మేళవిస్తూ రూపొందించిన తీరు, దాన్ని వివరించిన తీరు అదిరిపోయింది. అయితే చాలా చోట్ల రెగ్యూలర్ ఫార్మాట్ కనిపిస్తుంది. కొత్తదనం లేదనే ఫీల్‌ని తెస్తుంది. క్లైమాక్స్ ని మరింత బాగా చేసుకోవాల్సింది. రెగ్యూలర్‌గా ముగించాడు. కాకపోతే ఎమోషనల్ అంశాలను బాగా చూపించారు. కుల వివక్షతని ఆవిష్కరించిన తీరు కూడా బాగుంది.
ఫైనల్‌గా: కుల వివక్షతని కొత్తగా కొత్త కోణంలో చెప్పిన మూవీ. విభిన్నమైన ప్రయత్నంగా నిలుస్తుంది. వనవీరుల గొప్పతనం చెప్పే మూవీ అవుతుంది.
రేటింగ్: 2.75