Ranga Ranga Vaibhavanga
మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన డెబ్యూ హీరోగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈ సినిమాతో 100కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా తర్వాత భారీ ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన ‘కొండపొలం’ తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఎలా ఉంది.. ఉప్పెన లా ముందుకు ఉరికిందా..కొండ పొలంలా కొండెక్కిందో చూద్దాం.
కథాంశం
రిషి (పంజా వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) 'ఖషీ' టైప్ లో ఒకే రోజున ఒకే ఆస్పత్రిలో ఒకరి కోసం మరొకరు పుట్టిన జంట. వాళ్ళిద్దరివీ పక్క పక్క ఇళ్ళు. రిషి తండ్రి (సీనియర్ నరేష్), రాధా తండ్రి (ప్రభు) క్లోజ్ ప్రెండ్స్. దాంతో యాజటీజ్ గా ' నువ్వే కావాలి' టైప్ లో జీవితాలు నడుస్తూంటాయి. అయితే... చిన్నతనంలో తాను వద్దని చెప్పినా స్కూల్‌లో ఒక అబ్బాయితో రాధ మాట్లాడటం రిషికి నచ్చదు. దాంతో గొడవ పెట్టేసుకుంటాడు. అది పెరిగి పెద్దదై ...మాట్లాడుకోవడం మానేస్తారు. అక్కడ నుంచి ఇగోల గోల. అలా కొట్టుకుంటూ,తిట్టుకుంటూ పెరిగిన వీళ్లిద్దరూ ఒకే మెడికల్ కాలేజ్ లో జాయిన్ అవుతారు.
మెడిసన్ చదివే వయస్సువచ్చినా ఇద్దరూ చచ్చినా మాట్లాడుకోరు. కానీ శ్రీను వైట్ల 'ఆనందం' సినిమాలోలాగ .. ఇద్దరికీ ఒకరంటే చచ్చేంత ప్రేమ. ఇదిగో ఇంకాసేపట్లో వాళ్లిద్దరూ ఇగోని పక్కన పెట్టి ఇద్దరూ మాట్లాడేసుకుంటారు అనుకునే సమయానికి రెండు కుటుంబాల మధ్య గొడవలు. దాంతో ఇద్దరూ విడిపోతారు. ఇప్పుడు వీళ్లిద్దరూ తమ మధ్య ఉన్నది ద్వేషం కాదని ప్రేమ అని ఒకరికొకరు ఎలా ఎక్సప్రెస్ చేసుకుంటారు... తమ ఇగోలను ప్రక్కన పెట్టి ఎలా ఒకటై..తమ కుటుంబాలను కలుపుతారు..అసలు వీళ్ల కుటుంబాలను విడతీసేటంత గొడవ ఏం జరిగింది...అనేది తెలియాలి..తెలుసుకోవాలని అనిపిస్తే సినిమా చూడవచ్చు.
విశ్లేషణ
ఇలాంటి రొమాంటిక్ కామెడీ జానర్ సినిమాల్లో పెద్దగా చెప్పుకోవటానికి కథేమి ఉండదు కాబట్టి వెతకటం కూడా అనవసరం. లీడ్ పెయిర్ ..ఎలా విడిపోయారు..చివరకు ఎలా ఒకటయ్యారు అనేది ఎంత అందంగా, ఆకట్టుకునేలా చెప్పారనేదే యుఎస్ పిగా పనిచేస్తుంది. డైరక్టర్ తను చూసిన పాత సూపర్ హిట్స్ ప్రేరణతో తయారుచేసుకున్న కథని అంతే పాతగా చెప్పే ప్రయత్నం చేసాడు. ఖుషీ ఇప్పటికీ నచ్చదా, నువ్వే కావాలి ఎన్ని సార్లు టీవిల్లో చూసాం.,అలాంటింది అలాంటి సినిమానే ఇది ఎందుకు ఆడదు అనిపిస్తుంది. అయితే చూసేవాడికి కూడా అదే సమస్య. ఇప్పటికే ఎన్నో సార్లు చూసేసిందే మళ్లీ చూపెడతాడేంటి. అంతగా కాకపోతే రీరిలీజ్ అయ్యినప్పుడు మళ్లీ ఆ సినిమాలు థియోటర్ లో చూద్దాం..ఇప్పుడీ పాత చింతకాయ పచ్చడి వ్యవహారం ఎందుకు అనిపిస్తుంది.
మన సినిమా పెద్దలు చెప్పే మాట ఒకటుంది..పాత కథను కొత్తగా చెప్పాలని...ఇదే మర్చిపోయాడు గీరీశాయ. స్క్రీన్ ప్లే కూడా అంతే నీరసంగా రాసుకున్నాడు. ఒక మాదిరిగా సినిమాలు చూసే ప్రతీ ఒక్కరు నెక్ట్స్ పదో సీన్ లో ఏం జరుగుతుందో ..ఇంటర్వెల్ ఏమిటో..సెకండాఫ్ ఏమిటో పసిగట్టేస్తాడు. పాపం అంత కష్టపడి వేసుకున్న ప్రేక్షకుడు అంచనాలను మనం ఎందుకు వెనక్కి లాగాలి అని డైరక్టర్ అనుకున్నట్లు సినిమా సాగుతుంది. అయితే డైరక్టర్...`నువ్వే కావాలి, ఖుషి` ఈ జనరేషన్ వి కాదు కదా..ఇప్పటి కుర్రాళ్ళు చూడలేదు కదా...వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు అనే సదుద్దేశ్యంతో ఈ సాహసానికి పూనుకుని ఉండవచ్చు. కానీ వాళ్లు థియేటర్ కు రావాలి అంటే ఈ జనరేషన్ కుర్రాళ్ల మనో భావాలు...సీన్స్ ఉండాలి కదా..అప్పటికి అవి ఫ్రెష్...కొత్త.
టెక్నికల్ గా...
ఇలాంటి లవ్ స్టోరీ లకు పాటలు, విజువల్స్ రెండు పిల్లర్స్ గా నిలవాలి. పాటల్లో సిరిసిరి మువ్వల్లేతో పాటు తెలుసా తెలుసా, కొత్తగా లేదేంటి పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఛల్తాహై. కెమెరా వర్క్ బాగుంది. కలర్ ఫుల్ గా విజువల్స్ ని తెరపై పరిచారు. ఎడిటింగ్ కూడా ఎక్కడా పెద్ద లాగ్ లేదు.మిగతా డిపార్టమెంట్స్ బాగానే సపోర్ట్ ఇచ్చాయి. దర్శకత్వంలో మెరుపులు లేవు కానీ నడిచిపోయింది. అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు ...మెయిన్ కావాల్సిన కంటెంట్ సినిమాని ముంచేసినప్పుడు మిగతావి ఎంత బాగుంటే ఏముంటుంది..అదే జరిగింది.
నటీనటుల్లో ..
సీన్స్ లో జోష్, విషయం లేనప్పుడు హీరో మాత్రం ఏం చేయగలుగుతాడు. వైష్ణవ్ తేజ్ ఉన్నంతలో బాగానే చేసాడు. ఉప్పెన కన్నా మెచ్యూర్డ్‌గా అనిపించాడు. డాన్స్ లు జస్ట్ ఓకే. ఇంకా కష్టపడాలేమో.లేక పోతే ఈ పోటీలో తన ముద్ర వేయలేడు. అలాగే పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేయకుండా ఉండే బాగుండేది. కేతిక శర్మ జస్ట్ ఓకే. నరేష్, ప్రభు కారెక్టర్స్ ఎన్నో సార్లు చేసినవి. అలీ, నవీన్ చంద్ర పాత్రలు మామాలే.
బాగున్నవి
లీడ్ పెయిర్
పాటలు
ప్రొడక్షన్ వాల్యూస్
బాగోలేనివి
రొటీన్ కథ..
ఊహకుల అందేలా రాసుకున్న స్క్రీన్ ప్లే
నవ్వించని కామెడీ సీన్స్
మనస్సును పట్టే భావోద్వేగాలు లేకపోవటం
Ranga Ranga Vaibhavanga
ఫైనల్ థాట్
ఒక్క క్షణం అయినా “కొత్తగా లేదేంటి”....
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
సెకండాఫ్‌తో పోలిస్తే.. ఫస్టాఫ్ కాస్త బెటర్ . ఓవరాల్‌గా రంగరంగ వైభవంగా ఓ పరమ రొటీన్ సినిమా
నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ, నవీన్ చంద్ర, సీనియర్ నరేశ్, ప్రభు, ప్రగతి, తులసి, సుబ్బరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, 'స్వామి రారా' సత్య, 'ఫిష్' వెంకట్ తదితరులు
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ: బాపినీడు బి
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గిరీశాయ
విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2022