అవికా గోర్‌ `వధువు` వెబ్‌ సిరీస్‌ రివ్యూ, రేటింగ్‌..

First Published | Dec 7, 2023, 10:22 PM IST

అవికా గోర్‌.. ఇప్పుడు ఓటీటీల్లో బిజీ అవుతుంది. ఆమె ఇప్పుడు మరో వెబ్‌ సిరీస్‌ `వధువు` తో వచ్చింది. నందు, అలీ రెజా నటించాన ఈ వధువు వెబ్‌ సిరీస్‌ ఈ రాత్రి(డిసెంబర్‌ 8) నుంచిస్ట్రీమింగ్‌ అవుతుంది. మరి ఇది ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

అవికా గోర్‌.. హీరోయిన్‌ గా కొంత గ్యాప్‌ వచ్చాక మళ్లీ నిలదొక్కుకోలేకపోతుంది. ఆమెకి సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. వచ్చిన ఒకటి రెండు సినిమాలు చిన్నవి కావడంతో అవి వచ్చిన విషయం కూడా ఆడియెన్స్ కి తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీపై ఫోకస్‌ పెట్టింది అవికా. అందులో వరుస సిరీస్‌లతో దూసుకుపోతుంది అవికా గోర్‌. ఆ మధ్య `మ్యాన్షన్‌ 24`లో మెరిసి అదరగొట్టింది. ఇప్పుడు `వధువు` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన `వధువు` వెబ్‌ సిరీస్‌ని ఎస్వీఎఫ్‌ బ్యానర్‌లో శ్రీకాంత్‌ మోహ్తా, మహేంద్ర సోని నిర్మించారు. ఇది ఈ రోజు రాత్రి (డిసెంబర్‌ 8) నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సిరీస్ ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః

ఇందు(అవికా గోర్) పెళ్లి మూడు సార్లు ఆగిపోతుంది. ఓ సారి తాను చేసుకోవాల్సిన వరుడిని తన చెల్లి లేపుకుపోతుంది. దీంతో ఈ సారి ఎలాగైనా పెళ్లి సక్రమంగా జరగాలని, మళ్లీ ఆగిపోతే ఫ్యామిలీ అంతా అల్లకల్లోలం అవుతుందని భావించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పలు అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. పనస పండులో ఉమ్మెత్త ఆకు పెట్టి కుట్టి వస్తుంది. అది చేసింది ఎవరో తెలియదు. ఏవో అనుమానాలు వెంటాడుతుంటాయి. అనుమానిత వ్యక్తులు ఇందుని వెంటాడుతుంటారు. ఎట్టకేలకు ఆనంద్‌(నందు)తో పెళ్లి అవుతుంది. పెళ్లి అయ్యాక పెద్ద సూది గిఫ్ట్ గా వస్తుంది. అది పంపింది ఎవరో తెలియదు. ఆ రోజు రాత్రి బయట భూమిలో పెద్ద సూది పెట్టి ఉంటుంది. అది ఇందుకి గుచ్చుకుంటుంది. అది పెట్టింది ఎవరో తెలియదు. ఇక పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తారు. అక్కడ పెళ్లి కూతురుని ఇంట్లోకి ఆహ్వానించే కుంకుమ నీళ్ల పల్లెంలో కారం కలుపుతారు. అది చేసిందేవరో తెలియదు. వీటిని కనిపెట్టేందుకు సిద్ధమవుతుంది ఇందు. మరోవైపు ఇలాంటి అనేక అనుమానాల మధ్య ఇందు మరిది ఆర్య(అలీ రెజా) భార్య చనిపోతుంది. దీంతో ఆ కేసు ఇన్వెస్టిగేషన్‌కి ఇందు అత్తగారి ఫ్యామిలీ మొత్తం అటెండ్ కావాల్సి వస్తుంది. మరి అన్న ఆనంద్‌ కంటే ముందే తమ్ముడు పెళ్లి అవడానికి కారణం ఏంటి?  ఆమెది హత్యనా? ఆత్మహత్యనా? అసలు ఆమెమె కథేంటి. ఇందుని వెంటాడుతున్న వ్యక్తి ఎవరు? అత్తారింట్లో మతిస్థిమితం లేని మహిళ ఎవరు? ఆమె ఎందుకలా అయ్యింది? అనే సస్పెన్స్ ఎలిమెంట్ల సమాహారమే `వధువు` వెబ్‌ సిరీస్‌ మిగిలిన కథ. 
 


విశ్లేషణః 

వెబ్‌ సిరీస్‌లు అంటే థ్రిల్లర్‌ ప్రధానంగా సాగుతున్నాయి. థ్రిల్లర్‌ సిరీస్‌లకు ఓటీటీలు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఇటీవల చాలా థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసే కథ, కథనాలుంటే వెబ్‌ సిరీస్‌లు ఆడియెన్స్ ని ఆదరిస్తాయి. తాజాగా అవికా గోర్‌ నటించిన `వధువు` కూడా అలాంటి కోవలోనే వచ్చింది. ఆద్యంతం థ్రిల్లర్‌గా, సరికొత్త కథ, కథనాలతో ఈ వెబ్‌ సిరీస్‌ ని రూపొందించడం విశేషం. అడగడుగునా సస్పెన్స్ అంశాలు సిరీస్‌పై ఆసక్తిని పెంచేలా దర్శకుడు ఈ సిరీస్‌ని తీర్చిదిద్దారు. దీనికితోడు ఎపిసోడ్ల నిడివి తక్కువగా ఉండటం మరో ప్లస్‌. దీనికి సస్పెన్స్ లు, ట్విస్ట్ ఆద్యంతం ఎంగేజ్‌ చేసేలా సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠని రేకెత్తిస్తుంటాయి. ఇందు పెళ్లి మూడు సార్లు ఆగిపోవడంతో, ఇక ఇప్పుడు జరిగే పెళ్లైనా సక్రమంగా జరుగుతుందా? ఏదైనా అడ్డంకి వస్తుందా? అని ఫ్యామిలీ అంతా టెన్షన్‌ పడటం, ఎవరు వచ్చి ఏం చెప్పినా ఆందోళన చెందడం వంటి సీన్లు ఆసక్తి కరంగా సాగాయి. పనస పండులో ఉమ్మెత్తాకు ఉండటం, పెద్ద సూది తరచూ కనిపించడం వంటి ఎలిమెంట్లు ఉత్కంఠని రేకెత్తిస్తుంటాయి. 
 

మరోవైపు పెళ్లైక అత్తారింటికి వెళ్లాక అక్కడ చోటు చేసుకునే అనుమానిత సంఘటనలు, వ్యక్తులు, దీన్ని ఇందు గమనించడం, ఆ ఇంట్లో జరిగే విషయాలను ఆమె ఆరా తీయడం ఒక్కో విషయం బయటకు రావడం, సరికొత్త అంశాలు తెరపైకి రావడం మరింత క్రేజీగా అనిపిస్తుంది. ఒక ట్విస్ట్ తర్వాత మరో ట్విస్ట్ ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేస్తుంది. ప్రతిసీన్‌ని చాలా నీట్‌గా రాసుకున్నాడు దర్శకుడు. ఎక్కడ వేస్ట్ సీన్‌ లేకుండా ఆయన ప్లాన్‌ చేశాడు. అదే సమయంలో సస్పెన్స్ అంశాలతో బోర్‌ లేకుండా చేశాడు. జనరల్ గా వెబ్‌ సిరీస్‌లు అంటే సాగతీతకి కేరాఫ్‌ అంటారు. కానీ `వధువు`ని మాత్రం సుత్తిలేకుండా స్ట్రెయిట్‌గా చూపించాల్సిన విషయాన్ని చూపించాడు. కథనం వేగంగా సాగుతూనే ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసేలా ఉండటం విశేషమనే చెప్పాలి. 
 

అయితే ఈ వెబ్‌ సిరీస్‌ ఆద్యంతం ఎంగేజ్‌ చేసేలా సాగినా, చాలా లాజిక్కులను వదిలేసినట్టు ఉంది. ఎంగేజ్‌ చేసే అంశాలకు ప్రయారిటీ ఇచ్చారు. కానీ లాజిక్కులను గాలికి వదిలేశారని చెప్పొచ్చు. అత్తారింట్లో అంత మంది ఉన్నా, ఇందు బయటకు వెళ్లిన విషయాన్ని ఎవరు గమనించకపోవడం, తెలియనట్టుగా ఉండటం, ఆ తర్వాత సడెన్‌గా చర్చలు పెట్టడం కన్విన్సింగ్‌గా లేదు. ఇందు రావడం రావడంతోనే ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించడం అన్నీ ముందే తెలిసినట్టుగా వ్యవహరించడం సెట్‌ కాలేదు. అది ఓవర్‌గా అనిపించింది. మరోవైపు కొత్తగా పెళ్లి చేసుకున్న అవికా, నందులు కలిసి ఉండాల్సింది పోయి నీకు నాకు సంబంధం లేదు అనేలా దూరంగా ఉండటం, నీకు నాకు సంబంధం లేదనేలా ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే ఇంట్లో ప్రతి విషయానికి మరిది రావడం, అతనే వదినతో మాట్లాడటం, నందు ఇంటి బయట సీగరేట్లు తాగుతూ ఎప్పుడూ సీరియస్‌గా ఉండటం ఏంటో అర్థం కాలేదు. అయితే ఆ పాత్రల వెనుక సస్పెన్స్ ఉండే అవకాశం ఉంది, కానీ అది కనెక్ట్ అయ్యేలా లేదు. సిరీస్‌ అన్నప్పుడు సరైన కన్‌క్లూజన్‌ ఇచ్చి, రెండో సీజన్‌కి హింట్‌ ఇస్తారు. కానీ ఇందులో అన్నీ సస్పెన్స్‌ తోనే వదిలేశారు. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ ఇచ్చిన వదిలేసినట్టుగా, మధ్యలోనే కథని వదిలేసినట్టుగా  తీశారు. అది ఆడియెన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అయితే క్లైమాక్స్ లో వర్షంలో అవికా ఎంట్రీ, కారు వచ్చిన తీరు అదిరిపోయేలా ఉంది. కానీ అంతలోనే క్లోజ్‌ కావడంతో అసంతృప్తి ఆడియెన్స్ కి కలుగుతుంది. ఓవరాల్‌గా `వధువు` థ్రిల్లర్‌ని ఇష్టపడే వారికి బాగా నచ్చే సిరీస్‌ అవుతుంది. 
 

నటీనటులుః

ఇందుగా మెయిన్‌ లీడ్‌గా అవికా గోర్‌ బాగా నటించింది. ఆమె చాలా మెచ్యూర్డ్ గా, హుందాగా చేసింది. ఆమె కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌ సిరీస్‌ అవుతుంది. పెళ్లి కొడుకుగా ఆనంద్‌ పాత్రలో నందు నటించారు. ఆయన సీరియస్‌ క్యారెక్టర్‌లో కొత్తగా కనిపించాడు. పాత్రకి యాప్ట్ గా అనిపించాడు. మరిది ఆర్య పాత్రలో అలీ రెజా పాత్ర మరో హైలైట్‌గా నిలుస్తుంది. ఇందు తర్వాత అలీ రెజా పాత్రనే కథని రక్తికట్టిస్తుంది. ఆయన పాత్రలోని సస్పెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. నటుడిగా అలీ రెజాకి మంచి గుర్తింపు తెచ్చే సిరీస్‌ అవుతుంది. నటి రూప సైతం హుందాగా చేసింది. అదరగొట్టింది. ఇతర పాత్రధారులు అంతా బాగా చేశాడు. సస్పెన్స్ మెయింటేన్‌ చేస్తూ రక్తికట్టించడంలో తమ వంతు భాగమయ్యారు. 

టెక్నీకల్‌గాః 
దర్శకుడు పోలూరు కృష్ణ.. ఈ వెబ్‌ సిరీస్‌ కథని సస్పెన్స్ తో రాసుకోవడం, సస్పెన్స్ అంతే బాగా పండేలా తెరపైకి ఆవిష్కరించడంలో సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడిగా అతని టేకింగ్‌ చాలా బ్రిలియంట్‌. చాలా కేర్‌ఫుల్‌గా సిరీస్‌ని తీసుకెళ్లాడు. సస్పెన్స్ తో ఎంగేజ్‌ చేస్తూ నడిపించిన తీరు, ట్విస్ట్ లు, టర్న్‌ లు, సరికొత్త అంశాలను తెరపైకి తీసుకురావడం వంటివి ఆకట్టుకున్నాయి. ఆ విషయంలో దర్శకుడి బ్రిలియన్స్ ని మెచ్చుకోవాల్సిందే. అయితే మొదటి సీజన్‌ మొత్తం సస్పెన్స్ లో పెట్టి, అసలు విషయం చెప్పకుండా సిరీస్ ని ముగించడం అసంతృప్తిగా మారింది. కెమెరా వర్క్ అదిరిపోయింది. విజువల్స్ బాగున్నాయి. క్లైమాక్స్  సీన్‌ని చూపించిన తీరు వాహ్‌ అనిపిస్తుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీరామ్ మద్దూరి పాటలు, ఆర్‌ఆర్‌ మరో హైలైట్‌ అని చెప్పొచ్చు. అదే ఈ సిరీస్‌కి బ్యాక్‌ బోన్‌లా నిలిచింది. మరింతగా ఎంగేజ్‌ చేయడంలో కీలక భూమిక పోషించింది.  

ఫైనల్‌గాః  `వధువు` మొత్తం సస్పెన్సే. 

రేటింగ్‌ః 2.75 

Latest Videos

click me!