
ఈ వినాయకచవితి పండుగని పురస్కరించుకుని ఆడియెన్స్ ని అలరించేందుకు సరికొత్త సినిమాలు వచ్చాయి. నారా రోహిత్ `సుందరకాండ`తోపాటు మరో చిన్న మూవీ `కన్యా కుమారి` కూడా నేడు బుధవారం(ఆగస్ట్ 27న) విడుదలైంది. ఇందులో శ్రీచరణ్ రాచకొండ, గీత్ సైనీ జంటగా నటించారు. సృజన్ అట్టాడ దర్శకత్వం వహించడంతోపాటు రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించడం విశేషం. హీరోయిన్ మధుశాలిని సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ కాన్సెప్ట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అనేక మంది సెలబ్రిటీలు ఈ మూవీని ప్రమోట్ చేయడం విశేషం. ఎట్టకేలకు సినిమా ఈ బుధవారం విడుదలైంది. మరి ఈ ఆర్గానిక్ లవ్ స్టోరీ ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
తిరుపతి(శ్రీచరణ్ రాచకొండ) శ్రీకాకుళంలోని పెంటపాడు అనే గ్రామంలో వ్యవసాయం చేసుకునే కుర్రాడు. చిన్నప్పుడు స్కూల్‌లో స్టూడెంట్స్ అంతా తాను డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అవుతానని చెబితే, తిరుపతి మాత్రం రైతు అవుతానని చెబుతాడు. దీంతో రైతు అవ్వాలనుకుంటే చదువు అవసరం లేదని టీచర్ చెప్పడంతో అప్పుడే బడి మానేస్తాడు. తండ్రితోపాటు వ్యవసాయం చేసుకుంటూ తనకు నచ్చినట్టు జీవిస్తాడు. ఇక పెళ్లీడు రావడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వ్యవసాయం చేస్తుండటంతో ఎవరూ పిల్లనిచ్చేందుకు ముందుకురారు. చివరికి తన మేనమామ వద్దకు వెళ్లినా తాను ఉద్యోగం చేసేవాడికి పిల్లనిస్తాను, నీకు ఇవ్వను అని మొహం మీదనే చెబుతాడు. దీంతో ఏడాది తిరిగేసరికి మంచి చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా చూడు అని మామకి సవాల్ విసురుతాడు తిరుపతి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ పిల్లనివ్వరు. మరోవైపు పక్క ఊరిలో కన్యాకుమారి(గీత్ సైని) పరిస్థితి కూడా అంతే. తనకు నచ్చినట్టు చదివించలేదు, ఇంజనీరింగ్ చేస్తానంటే చేయించలేదని, కనీసం పెళ్లి అయినా తనకు నచ్చినట్టు చేయాలని తల్లిదండ్రులకు కండీషన్స్ పెడుతుంది. తాను కోరుకున్న క్వాలిటీ ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దీంతో ఆమె క్వాలిటీస్‌కి తగ్గ కుర్రాడు దొరక్కపోవడంతో బాధపడుతుంది. డిగ్రీ వరకు చదివిన కన్యాకుమారి పట్టణంలో ఓ బట్టల షాప్‌లో పనిచేస్తుంటుంది. ఆటోలో షాప్‌కి వెళ్లి వస్తుండగా, ఈ పెళ్లి చర్చ వస్తుంది. ఆ ఆటో డ్రైవర్ తన ఫ్రెండ్ ఒకడు ఇలానే పెళ్లికోసం తిరుగుతున్నాడని చెబుతాడు. ఇద్దరిని కలుపుతాడు. తీరా చూస్తే చిన్నప్పుడు తిరుపతి, కన్యాకుమారి కలిసి ఒకే స్కూల్‌లో చదువుకుంటారు. వీడితో పెళ్లేంటి అని ఛీ కొట్టి వెళ్లిపోతుంది కన్యాకుమారి. కానీ చూడగానే ఆమెకి పడిపోతాడు తిరుపతి. దీంతో ఎలాగైనా ఆమెని ప్రేమలోకి దించాలనుకుంటాడు. చివరికి కనెక్ట్ అయ్యే సమయంలోనే కన్యాకుమారికి పెళ్లి సంబంధం కుదురుతుంది. తాను కోరుకున్న క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరకడంతో పెళ్లికి ఓకే చెబుతుంది. దీంతో అసలు కథ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓ వైపు ప్రేమించినవాడు, మరోవైపు కోరుకున్న సంబంధం కన్యాకుమారి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇంతకి తాను కోరుకున్న లక్షణాలేంటి? తిరుపతి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? వీరిద్దరు కలిశారా? ఈ పల్లెటూరి ప్రేమకథ సాడ్‌గా ముగిసిందా? సుఖాంతం అయ్యిందా? అనేది మిగిలిన సినిమా.
ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినా ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రేమ తాలుకూ బ్యాక్ డ్రాప్‌లు మారినా ప్రేమ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. సరికొత్తగా, కాలానికి అనుగుణంగా చెప్పే ప్రేమ కథలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే `కన్యా కుమారి` మూవీ. పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో సాగే సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రమిది. క్యాప్షన్‌లో ఇచ్చినట్టుగానే ఇదొక ఆర్గానిక్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. విలేజ్ ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందులో ఎలాంటి పాలిష్ ఉండదు. మనసులో ఉన్న ఫీలింగ్ ని చెప్పే ప్రయత్నం, అమ్మాయిని ఆకట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు కూడా చాలా సహజంగా ఉంటాయి. ఎలాంటి డ్రామాలకు, ఓవర్ యాక్షన్‌కి తావుండదు. ఇది కూడా అలానే సాగిందని చెప్పొచ్చు. వ్యవసాయం చేసుకుంటూ తనకు నచ్చిన జీవితాన్ని గడిపే కుర్రాడికి, పెద్ద చదువులు చదివి, ఇంజనీర్‌గా జాబ్ చేస్తూ గొప్ప లైఫ్‌ని ఊహించుకునే పల్లెటూరి అమ్మాయికి మధ్య లవ్ స్టోరీ నడిపించిన తీరు బాగుంది. అదే సమయంలో చాలా కొత్తగా, ఫ్రెష్ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది. వ్యవసాయం చేసుకునే కుర్రాడికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం, చిన్నచూపుగా చూడటం అనేది రియాలిటీకి దగ్గరగా ఉంది. అది ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. ఇంకోవైపు విలేజ్‌లో ఉండే అమ్మాయిలు గొప్ప కలలు కనడం, కానీ రియాలిటీ వేరేలా ఉండటం, దీంతో ఏం చేయలేక, డిగ్రీ చదివినా బట్టల షాప్‌లో పనిచేయడం, ఇష్టం లేని జాబ్ చేయడం ఒక అమ్మాయి రియాలిటీని చూపించారు. ఇక నచ్చిన అమ్మాయి కోసం ఓ కుర్రాడు చేసే ప్రయత్నాలు, చెర్వుగట్టు వద్ద లైటింగ్ కొట్టడం, ఆమె ఛీ కొట్టినా తుడిచేసుకుంటూ వెళ్లడం, పొలంలో పంట పండిచినట్టుగానే తన ప్రేమలో నీరు పోసి, దుక్కిదున్ని, గింజలు వేసి పంట పండించినట్టుగానే, ప్రేమని పండించుకునేందుకు ఆ కుర్రాడు చేసే ప్రయత్నాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రేమని వ్యక్తం చేశాక చోటు చేసుకునే ట్విస్ట్ లు, టర్న్ లు కూడా ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఉత్కంఠకి గురి చేస్తాయి.
ఇక సెకండాఫ్‌లో లవ్ ప్రపోజ్ చేశాక అమ్మాయిలో కలిగే భావనలు కూడా అంతే బాగున్నాయి. అమ్మాయి పెళ్లి సెట్ అయిన తర్వాత చోటు చేసుకున్న ట్విస్ట్ లు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత సన్నివేశాలు ఊహించేలా, రెగ్యూలర్‌గానే అనిపిస్తాయి. ఆ తర్వాత సహజత్వం మిస్ అయ్యింది. క్లైమాక్స్ మాత్రం కొంత క్రేజీగా మార్చిన తీరు బాగుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు హంగులు ఆర్బాటాలకు పోకుండా చాలా రియాలిటీగా కథని, ప్రేమ కథని నడిపించిన తీరు బాగుంది. అయితే ఎమోషన్స్ పండించేందుకు చేసిన ప్రయత్నం సినిమాని స్లోగా మార్చింది. ప్రారంభం నుంచి కూడా స్లోగానే సాగుతుంది. మధ్య మధ్యలో కొంత హ్యూమర్ యాడ్ చేసినా అది కొంత వరకే పరిమితమయ్యింది. దీంతో చాలా చోట్ల డ్రై ఫీలింగ్ తెప్పిస్తుంది. సెకండాఫ్‌లో కన్యాకుమారి ఫ్యామిలీలోని సీన్లు ఆశించిన స్థాయిలో పండలేదు. సినిమాలో ఫన్‌కి చోటున్నా, దాన్ని సరిగా వాడుకోలేకపోయాడు దర్శకుడు. లైట్ హార్టెడ్ ఫన్‌తో నడిపించారు. సినిమా కూడా అలానే సాగింది. ప్రేమలో బ్రేకప్, కలవడం వంటి సీన్లు కూడా రొటీన్ ఫీలింగ్‌ని తెస్తాయి. క్లైమాక్స్ లో కొంత రియాలిటీ మిస్ అయ్యింది. ఎమోషన్స్ లో డెప్త్ మిస్ అయ్యింది. ఫన్నే కాదు, ఎమోషన్స్ కూడా లైట్ హార్టెడ్‌లాగానే ఉన్నాయి. శ్రీకాకుళం యాస స్వచ్ఛంగా ఉంది. ఆకట్టుకుంటుంది. సినిమాలో డైలాగ్‌లు అదిరిపోయాయి. ట్రెండీగా ఉన్నాయి. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అదే సమయంలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు కూడా కొదవలేదు. కాకపోతే వాటికి యూత్ ఎంజాయ్ చేస్తారు.
కన్యా కుమారిగా గీత్ సైని చాలా బాగా చేసింది. ఇంకా చెప్పాలంటే ఆమె పాత్ర చుట్టూతే కథ తిరుగుతుంది. హీరోని డామినేట్ చేసే పాత్ర ఆమెది. దర్శకుడు ప్రత్యేకంగా హీరోయిన్ పాత్రని రాసుకున్నట్టుగా ఉంది. ఆమెని అంతే బాగా చూపించాడు. గీత్ సైని కూడా అంతే బాగా చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం యాస బాగా సెట్ అయ్యింది. హీరోయిన్ పాత్ర సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక తిరుపతి పాత్రలో శ్రీచరణ్ రాచకొండ అదరగొట్టాడు. రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రలో ఒడిగిపోయాడు. హీరోయిన్‌కి దీటుగా చేశాడు. ఆయనకు నటుడిగా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. సినిమాలో ఈ రెండు పాత్రలే మెయిన్. ఆ తర్వాత భద్రం కాసేపు కనిపించి నవ్వించాడు. మురళీధర్ గౌడ్ ప్రారంభంలో కనిపించి తనదైన స్టయిల్‌లో ఆకట్టుకున్నాడు. హీరో ఫ్రెండ్స్ గా సాయికృష్ణ యశోద, మదన్ చాలా సహజంగా నటించారు. ఊర్లో ముసలావిడ పాత్ర గుర్తిండిపోతుంది. హీరో హీరోయిన్ల చిన్ననాటి పాత్రలు చేసిన లయనేశ్వర్, హన్సిని రెడ్డి కూడా సహజంగా కనిపించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
సినిమాకి రవి నిడమర్తీ సంగీతం అందించారు. కథలాగే పాటలు ఫెష్‌గా ఉన్నాయి. పెద్ద సినిమా రేంజ్‌లో ఉన్నాయి. ఆర్ఆర్ కూడా అంతే బాగుంది. ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద అసెట్. మరోవైపు సినిమాటోగ్రాఫర్ శివ గాజుల విజువల్స్ బాగున్నాయి. ఊరుని చాలా బాగా చూపించారు. నరేష్ అడుప ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాతలు సినిమా కథ డిమాండ్ మేరకు ఖర్చుపెట్టారు. దర్శకుడు సృజన్ ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని అంతే సహజంగా తెరపై ఆవిష్కరించాడు. ఫ్రెష్ లవ్ స్టోరీని చూపించాడు. అయితే లవ్ లో డెప్త్, ఎమోషన్స్ లో డెప్త్ మిస్ అయ్యాయి. ఇలాంటి లవ్ స్టోరీస్‌కి ప్రేమలోని ఎమోషన్స్ చాలా ముఖ్యం. అవి ఎంతగా పండితే సినిమా అంతగా రక్తికడుతుంది. ఆడియెన్స్ కి ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో ఆ డోస్ లైటర్ వేలోనే ఉందనిపిస్తుంది. ఒక మంచి ఆర్గానిక్ లవ్ స్టోరీని అందించడంలో మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మంచి ప్రయత్నంగా చెప్పొచ్చు.
ఫైనల్ నోట్‌ః నెమ్మదిగా సాగే ఆర్గానిక్ లవ్ స్టోరీ `కన్యాకుమారి`.
రేటింగ్‌ః 2.5