
ఒకప్పుడు మంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు వడ్డే నవీన్. ఇరవై ఏళ్ల క్రితం స్టార్ హీరోగా రాణించాడు. మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన సినిమాలు తగ్గించారు. ఓ దశలో సినిమాలు చేయడమే మానేశారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు `ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ మూవీని నిర్మించడం విశేషం. ఇందులో వడ్డే నవీన్ హీరోగా నటించగా, రాశీ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ప్రమోదిని, బేబీ ఊహా, దేవిప్రసాద్, రఘుబాబు,ఆడుకాలం నరేన్, శివన్నారయణ, వడ్లమాని శ్రీనివాసరావు వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(జూన్ 19) విడుదలైంది. మరి వడ్డే నవీన్ రీఎంట్రీ మూవీ ఎలా ఉంది? ఆయనకు హిట్ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
త్రిమూర్తులు(వడ్డే నవీన్) నిజాయితీకి మారుపేరు. తన నిజాయితీ వల్ల వరుసగా ట్రాన్స్ ఫర్ అవుతుంటారు. దీంతో ఆయన్ని ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు అంటారు. తాను పనిచేసే నియోజవర్గంలో సీఎం కొడుకు పోటీ చేస్తుంటాడు. తన కొడుకు కోసం సీఎం కమల(శిల్ప తులస్కర్) ప్రచారానికి వస్తుంది. అందులో ప్రత్యర్థి పార్టీల వాళ్లు తనపై దాడి చేసినట్టుగా ప్లాన్ చేసి సింపతీ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తారు. కానీ దాన్ని కానిస్టేబుల్ త్రిమూర్తులు అడ్డుకుంటాడు. సీఎం ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆమె సీరియస్ అవుతుంది. తన చుట్టూ ఇలాంటి నిజాయితీ గల అధికారులు ఉండొద్దని చెబుతుంది. దీంతో త్రిమూర్తులుకి మరోసారి ట్రాన్స్ ఫర్ తప్పదు. అయితే ఈ సారి తన నాన్న శ్రీనివాసులు(దేవి ప్రసాద్) పనిచేసిన పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. అయితే అక్కడ తనని ఏ పనిచేయనివ్వరు. ఓ దశలో పాత పోలీస్ స్టేషన్‌కి పంపిస్తారు. అక్కడ త్రిమూర్తులు ఖాళీగా కూర్చోలేక పాత ఫైల్స్ వెతుకుతుంటాడు. ఈ క్రమంలో ప్రియమ్మ అనే గిరిజన యువతిపై సీఎం కొడుకు సంతోష్ బాబు చేసిన అత్యాచారానికి సంబంధించిన కేసు ఫైల్ బయటపడుతుంది. దానికి సంబంధించిన కేస్ ఎఫ్‌ఐఆర్ కాపీ దొరుకుతుంది. త్రిమూర్తులు తన నాన్న చనిపోయిన రోజే ఈ కేసు నమోదవుతుంది. ఆ కేసుని త్రిమూర్తులు తండ్రినే రాస్తాడు. అది చూసి ఇంకా ఫైల్స్ వెతకగా ఈ కేసుకి సంబంధించిన మరో ఎఫ్‌ఐఆర్ కాపీ ఉంటుంది. అందులో ఆ అమ్మాయే సంతోష్ బాబుని మోసం చేసినట్టుగా ఉంటుంది. దీంతోపాటు మరో కాపీలో ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు ఉంటుంది. దీంతో ఈ కేసుని విచారించగా, షాకింగ్ నిజాలు బయటపడతాయి? మరి ఆ నిజాలేంటి? నిజంగానే ప్రియమ్మపై సీఎం కొడుకు అత్యాచారం చేశాడా? ఆమెనే మోసం చేసిందా? సీఎం అసలు నిజ స్వరూపం ఏంటి? ఈ కేసుని త్రిమూర్తులు ఎలా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులకు గురయ్యాడనేది మిగిలిన కథ.
నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. దానికి ఒక గిరిజన యువతిపై రాజకీయ నాయకురాలి కొడుకు అత్యాచారం చేయడం, తమ పవర్ ఉపయోగించి అతను బయటకు వచ్చి, ఏకంగా సీఎం అయ్యేందుకు ప్లాన్ చేయడం, ఈక్రమంలో అతన్ని బండారాన్ని బయటపెట్టేందుకు హీరో చేసే పోరాటమే ఈ మూవీ. ఇలాంటి కథతో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అమ్మాయిలపై లైంగిక దాడి చేసిన నాయకులు బిందాస్‌గా రాజకీయాల్లో పదవులు అనుభవించడం, వాటిని బయటకు తీసుకురావడం కోసం సినిమాలోని మెయిన్ లీడ్ ప్రయత్నించి, వారి ఆటగట్టించడం రొటీన్, ఓల్డ్ ఫార్మూలా. ఈ కాన్సెప్ట్ సినిమాలను మన ఆడియెన్స్ నిత్యం చూస్తూనే ఉన్నారు. మనోళ్లు ఇలాంటి సెంటిమెంట్, ఎమోషనల్ అంశాలకు ప్రయారిటీ ఇస్తారు, సినిమాలను చూస్తారనే భావనతో పదే పదే ఇలాంటి అంశాలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇదొక ఈజీ మెథడ్‌గానూ మారింది. అయితే దాన్ని అంతే రియాలిటీగా, కన్విన్సింగ్‌గా చెబితే బాగుండేది. కానీ ఇందులో అది మిస్ అయ్యింది. ఈ కథలో ఈ కేసుని బలవంతంగా పెట్టినట్టుగానే, ఇరికించినట్టుగానే ఉంటుంది. అందులో రియాలిటీ మిస్ అయ్యింది. ప్రారంభం నుంచి సినిమా చాలా డ్రైగా, స్లోగా సాగుతుంది. వడ్డే నవీన్‌ని ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఆయన పాత్రలో ఆ పవర్‌లేదు. ఆయనలోనూ ఆ ఈజ్ మిస్ అయ్యింది. దీంతో ఆయా సీన్లు పెద్దగా పండలేదు. హీరో మరీ మంచోడు కావడం, నిజాయితీ పరుడు కావడమనేది ఓల్డ్ ఫార్మూలా. ఇప్పుడిది పెద్దగా నచ్చదు. అదే ఇందులో మైనస్‌గా చెప్పొచ్చు. అలాగే సీఎంకి సంబంధించిన సీన్లు కూడా చాలా సిల్లీగా, లాజిక్ లెస్‌గా ఉన్నాయి. బలమైన సీన్లు ఒక్కటి కూడా కనిపించలేదు. ఇంటర్వెల్.. అటు సీఎం,ఇటు త్రిమూర్తులు అనేలా చూపించి హైప్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత సీన్లు ఆ స్థాయిలో లేవు. త్రిమూర్తులుని వేరే స్టేషన్‌కి పంపించడం, ఆయన ఒంటరిగా ఉండి, ఫైల్స్ ని వెతకడం అందులో కేసు బయటపడటం ఇరికించినట్టుగా ఉంది. అందులో ఏమాత్రం ఫీల్ లేదు. ఒక్కో సీన్‌లాగ్ ఉంది. స్లోగా సాగుతుంది. క్లైమాక్స్ లో కోర్ట్ రూమ్ డ్రామా కూడా నీరసంగా ఉంది. ఏమాత్రం రక్తికట్టించేలా లేదు. దీంతో బోరింగ్ గా అనిపిస్తుంది. వడ్డే నవీన్ ఫైట్ సీన్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఆయన నటుడిగా మెప్పించాడు, కానీ ఈజ్ మిస్ అయ్యింది. అది సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. మెయిన్‌గా మూవీలో బలమైన ఎమోషన్ లేదు, సినిమాని నడిపించే త్రెడ్ లేదు. కేవలం కేసుని పట్టుకొని ఈ మూవీని తీసినట్టుగానే ఉంది.
త్రిమూర్తులుగా వడ్డే నవీన్ ఉన్నంతలో మెప్పించాడు. నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్‌గా బాగా సెట్ అయ్యాడు. నటుడిగా ఫర్వాలేదనిపించాడు. కానీ ఎక్స్ ప్రెషన్స్ విషయంలో వేరేయేషన్ మిస్ అయ్యింది. అందం విషయంలో అప్పటికంటే ఇప్పుడే బాగున్నాడు. ఫిట్ నెస్ పరంగానూ ఏమాత్రం తగ్గలేదు. లుక్ వైజ్ గా అదిరిపోయాడు. కానీ హీరోయిజం విషయంలోనే కొంత విఫలమైనట్టు అనిపిస్తుంది. ఆయన భార్య పాత్రలో రాశీ సింగ్ బాగా చేసింది. పాత్రకి యాప్ట్ గా నిలిచింది. ఉన్నంతలో మెప్పించింది. సీఎంగా శిల్ప తులస్కర్ బాగా చేసింది. ఆమె ఉన్నంత సేపు అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంది. అలాగే ఆమె కొడుకు సంతోష్‌బాబుగానటించిన ఆర్టిస్ట్ కూడా మెప్పించాడు. ఆడుకాలం నరేన్ ఉన్నంతలో ఫర్వాలేదు. త్రిమూర్తులు తండ్రిగా దేవిప్రసాద్ కనిపించిన కాసేపు మెప్పించాడు. రఘుబాబు నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన వారు ఓకే అనిపించారు.
సినిమాకి కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్ కూడా బాగుంది. ఆకట్టుకునేలా ఉంది. చాలా సన్నివేశాలను హైలైట్ చేసింది. కానీ ఆ స్థాయి సీన్లు లేకపోవడం మైనస్. ఇక విజువల్స్ బాగున్నాయి. నీట్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా మూవీని ఇంకా షార్ప్ చేయాల్సింది. అనవసరమైన సీన్లు చాలా ఉన్నాయి. దర్శకుడు కమల్ తేజ నార్ల దాదాపు ఓ ఇరవై ఏళ్ల క్రితం నాటి కథని ఇప్పుడు తీసినట్టు ఉంది. కథలో బలం లేదు, కథనంలో బలం లేదు. సినిమాని తీయడంలోనూ ఆ బలం కనిపించలేదు. రొటీన్ స్టోరీతో నడిపించాడు. వడ్డే నవీన్‌ని మారలేదని అనిపించేలా చేశాడు. హీరోకిది రాంగ్ ఛాయిస్ అనే చెప్పాలి.
కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, రొటీన్, బోరింగ్, ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ తో తీసిన మూవీ `ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు`. వడ్డే నవీన్ రీఎంట్రీ బెడిసికొట్టిందని చెప్పొచ్చు.
రేటింగ్: 2