Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?

Published : Sep 24, 2026, 03:24 AM IST

నాని హీరోగా రూపొందిన మూవీ `ది ప్యారడైజ్‌`. శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు గురువారం(సెప్టెంబర్‌ 24)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే?

PREV
17
ప్యారడైజ్‌ మూవీ రివ్యూ

నాని, శ్రీకాంత్‌ ఓడెల కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ `ది ప్యారడైజ్‌`. `దసరా` తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో మోహన్‌ బాబు, రాఘవ్‌ జుయల్‌ విలన్లుగా నటించార. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సంపూర్నేష్‌ బాబు కీలక పాత్ర చేశారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. టీజర్‌, పాటలతోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌ రిలీజ్‌ చేయకపోయినా హైప్‌ మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో సినిమా దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో తాజాగా నేడు గురువారం(సెప్టెంబర్‌ 24)న సినిమా విడుదలైంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది? నాని మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడా? శ్రీకాంత్‌ ఓడెల అదరగొట్టాడా? మోహన్‌బాబు విలన్‌గా విశ్వరూపం చూపించాడా? ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
ప్యారడైజ్‌ మూవీ స్టోరీ

ప్యారడైజ్‌ ప్రాంతంలోకి సవారీలు కొన్నేళ్ల క్రితం వలస వస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా వాళ్లకి మాత్రం రాలేదు. ఇంకా బానిసలుగానే బతుకుతారు. కనీసం గుర్తింపు కూడా లేదు. వాళ్లని శికంజి మాలిక్‌(మోహన్‌ బాబు) ఫ్యామిలీ బానిసలుగానే చూస్తుంది. తమ కాళ్ల కింది వాళ్లులాగే ట్రీట్‌ చేస్తారు. కాదని తిరగబడితే ఊచకోతే. దీంతో ఆ భయానికి ఎవరూ వారికి ఎదురుతిరిగే ప్రయత్నం చేయరు. కానీ తమ గుర్తింపు కోసం సమ్మక్క(సోనాలి కులకర్ణి) సారథ్యంలోని సవారీలు కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉంటారు. ఓ సారి తన భర్త చనిపోయినప్పుడు నిండు గర్భంతో ఉన్న సమ్మక్క అతని శవంతో ప్రభుత్వ ఆఫీస్‌ ముందు తమ గుర్తింపు కోసం ధర్నా చేస్తుంది. దీంతో రంగంలోకి దిగిన మాలిక్‌ ఆమెకి కరెంట్‌ షాక్‌ పెడతాడు. ఆ బాధలో కవలలకు జన్మనిస్తుంది సమ్మక. అందులో కూతురు చనిపోగా, కొడుకు బతుకుతాడు. అతనే జడల్‌(నాని). కూతురు చనిపోయి కొడుక్కి ప్రాణం పోసిందని అతనికి జడలు వేసి పెంచుతుంది వాళ్లమ్మ. కానీ అమ్మ చేసిన తప్పుకి జడల్ ఆమెని అసహ్యించుకుంటాడు.

14ఏళ్లపాటు జైల్లో ఉన్నా కూడా ఆమెని ద్వేషిస్తూనే ఉంటాడు. జైలు నుంచి వచ్చినా కూడా ఆమెని ద్వేషిస్తూనే ఉంటాడు. గుర్తింపు కోసం కలెక్టర్‌ ద్వారా ప్రయత్నించిన నేపథ్యంలో మాలిక్‌ కొడుకు(రాఘవ్‌) వచ్చి ఊరు జనాలను ఇబ్బంది పెడతాడు. అమ్మని అందరిలోనూ అవమానిస్తాడు. తల్లి గురించి నిజాలు తెలుసుకున్న జడల్‌.. ఆమె కోసం ఏం చేశాడు? తమ సవారిల గుర్తింపు కోసం ఎలాంటి తిరుగుబాటు చేశాడు? ఇంతకి తల్లి చేసిన తప్పేంటి? మాలిక్‌ జడల్‌ని ఎందుకు అవమానించాడు? సుబ్బు(కయాదు లోహర్‌)తో ప్రేమ కథేంటి? బిర్యానీకి జడల్‌ అవమానానికి ఉన్న సంబంధం ఏంటి? ఇందులో కేసీఆర్, ఎన్టీఆర్‌ల పాత్రేంటి? చివరికి సవారీల తిరుగుబాటు, జడల్‌ పోరాటం ఫలించిందా లేదా? అన్నది సినిమా కథ.

37
ప్యారడైజ్‌ మూవీ విశ్లేషణ

తమ గుర్తింపు కోసం ప్యారడైజ్‌లోని సవారీలు చేసిన తిరుగుబాటు, సవారీల నాయకుడు జడల్ చేసిన పోరాటం ప్రధానంగా సాగే మూవీ. ఇదొక ఫిక్షన్‌ స్టోరీ. కానీ కొన్ని రియల్‌ ఎలిమెంట్లని మేళవించడం విశేషం. సినిమా ఓ వైపు తమ గుర్తింపు కోసం సవారీలు చేసే తిరుగుబాటు చుట్టూ, మరోవైపు తల్లికొడుకుల మధ్య బాండింగ్‌ చుట్టూ తిరుగుతుంది. దీనికి మించిన యాక్షన్‌ ప్రధానంగా నడుస్తుంది. అందులోనే లవ్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది. మరోవైపు రియల్‌ రాజకీయాలకు సంబంధించిన ఎలిమెంట్లు ఉన్నాయి.

కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కానీ దాన్ని అంతే అర్థవంతంగా తెరకెక్కించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రారంభంలో శికంజి మాలిక్‌ పాత్రల పరిచయం, వారి నేపథ్యం, అలాగే సవారీలు వలస రావడం, 200 ఏళ్లుగా బానిసలుగానే ఉండటమనే ఎలిమెంట్లని పరిచయం చేసిన తీరు బాగుంది. అది మూవీపై ఆసక్తిని పెంచింది. సవారీల పోరాటం, వారి స్ట్రగుల్స్, జడల్‌ పాత్ర పుట్టక వరకు ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత సన్నివేశాల్లో ఆ డెప్త్ మిస్‌ అయ్యింది. మాలిక్‌.. జడల్‌ని అవమానించడం, అదే అవమానంతో మాలిక్‌పై కక్ష్య పెంచుకోవడం చూపించారు. ఆయా ఎలిమెంట్లు కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కానీ ఆ తర్వాత తల్లిని అసహ్యించుకోవడం, మరోవైపు సుబ్బుతో లవ్‌ ట్రాక్‌ అంతగా సెట్‌ కాలేదు. చుక్క చిత్రాలతో హీరోయిన్‌ చేసే రచ్చ మాత్రం అదిరిపోయింది. గ్లామర్ ట్రీట్‌ అని చెప్పొచ్చు.

ఆ తర్వాత కథ రకరకాలుగా తిరుగుతుంది. కానీ తల్లీ, కొడుకుల ఎమోషన్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్‌కి ముందు ఎపిసోడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ మాత్రం అదిరిపోయింది. వాహ్‌ అనిపిస్తుంది. అయితే కథ అక్కడితోనే మేజర్‌గా పూర్తయిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లో మాలిక్‌తో జడల్‌ పోరాటం చూపించారు. అది యాక్షన్‌కే పరిమితం చేశారు. ఆ తర్వాత కథ మరోలా టర్న్ తీసుకుంటుంది. కొత్త పాత్రల ఎంట్రీ ఉంటుంది. అందులో కేసీఆర్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. హిలేరియస్‌గా ఉంటుంది. అదే సమయంలో కొంత డైవర్ట్ అనిపిస్తుంది. సెకండాఫ్‌ చాలా వరకు సాగదీశారు. చివర్లో చిన్న పాప ఎపిసోడ్‌, దాని చుట్టూ యాక్షన్‌ కనెక్టింగ్‌గా లేదు. ఇరికించినట్టుగా ఉంది. క్లైమాక్స్ ముగింపు కూడా చప్పగా ఉంది.

47
ప్యారడైజ్‌ మూవీలో ప్లస్ లు, మైనస్‌లు

సినిమాలో మెయిన్‌గా యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. అదే సమయంలో యాక్షన్‌ ఓవర్‌ డోస్‌ అయ్యింది. తల్లి కొడుకుల మధ్య ఎమోషన్‌ కొన్ని చోట్ల మెప్పించింది. కాకి, జడల్‌కి ఉన్న సంబంధం మాత్రం ఫర్వాలేదు. అమ్మోరు ఆవాహించినట్టు వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్ అదిరిపోయింది. బీజీఎం సినిమాకి ప్లస్‌, అనిరుధ్‌ దుమ్ములేపారు. కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్ లు మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి. హీరోయిన్‌ పాత్ర చేసే సినిమాలకు సంబంధించిన సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌లో కేసీఆర్‌ ఎపిసోడ్‌ బాగుంది. ఇలా అక్కడక్కడ కొన్ని బ్లాక్‌లు బాగున్నాయి. వాటి చుట్టూనే సినిమా కథని రాసుకున్నట్టుగా ఉంది. మోహన్‌ బాబు పాత్ర బలంగా ఉంది. కానీ ముగింపు తేలిపోయింది.

నాని పాత్ర హైలైట్‌, అదే సమయంలో అదే మైనస్‌ కూడా. ఎందుకంటే కథ చాలా బలమైన యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీ. దానికి నాని సరిపోలేకపోతున్నారనే ఫీలింగ్‌ కలుగుతుంది. తన స్థాయికి మించిన కథగా అనిపిస్తుంది. దీనికితోడు సినిమాలో కనెక్టివిటీ మిస్‌ అయ్యింది. చాలా చోట్ల లాజిక్‌లు మిస్‌ అయ్యాయి. మెయిన్‌గా ఎమోషన్స్ పండలేదు. దీంతో సీన్లు తేలిపోయాయి. క్లైమాక్స్ ని మరింత బాగా డీల్‌ చేయాల్సింది. సెకండాఫ్‌ ని కొంత ట్రిమ్‌ చేసి కనెక్టివిటీ బాగా పెట్టుకోవాల్సింది.

అయితే ఫిక్షన్‌ స్టోరీని రియల్‌ లైఫ్‌ రాజకీయాలకు లింక్‌ చేసే కనెక్షన్‌ కరెక్ట్ గా కుదరలేదు. సినిమా కథ ఒకలా వెళ్తుంది, చివర్లో మరోలా టర్న్ తీసుకుంది. ఈ విషయంలోనే పొంతన కుదరలేదు. శంకర్‌ పాత్ర ద్వారా కేసీఆర్‌ని రిప్లెక్ట్ చేశారు. ఆ పాత్రని హీరో చేసే ప్రయత్నం కనిపించింది. ఎన్టీఆర్‌ ని పాజిటివ్‌గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కనిపించింది. దీంతో మూవీ ప్యారడైజ్‌ లోని సవారీల కథ పక్కకెళ్లి.. వారికి కేసీఆర్‌, ఎన్టీఆర్‌ లైఫ్‌ ఇచ్చారనేలా ప్రొజెక్ట్ అయ్యింది. ఈ విషయంలో క్లారిటీ మిస్‌ అయ్యింది. ఓవరాల్‌గా ఎమోషన్స్, లాజిక్‌లు లేని ఊరమాస్‌ యాక్షన్‌ డ్రామాగా నిలిచింది ప్యారడైజ్‌.

57
ప్యారడైజ్‌లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

జడల్‌ పాత్రలో నాని ఇరగదీశాడు. ఆయన మూవీకోసం ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టం మొత్తం సినిమాలో కనిపిస్తుంది. ఎమోషనల్‌ సీన్లలో సెటిల్డ్ గా చేసి ఆకట్టుకున్నాడు. హవభావాలతోనే నటించాడు. అలాగే పాత్రలోనూ జీవించి విశ్వరూపం చూపించారు. డాన్స్‌ లతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అయితే రెచ్చిపోయాడు. నాని నుంచి ఇదొక కెరీర్‌ బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ గా చెప్పొచ్చు. అయితే ఈ కథకి నాని సెట్‌ కాలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది.

శికంజి మాలిక్‌ పాత్రలో మోహన్‌ బాబుని గతంలో ఎప్పుడూ చూడని విధమైన పాత్రలో చూడొచ్చు. విలన్‌గా అదరగొట్టాడు కలెక్షన్‌ కింగ్‌. ఆ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ముగింపే తేలిపోయినట్టుగా ఉంది. ఆయన కొడుకుగా రాఘవ్‌ ఉన్నంతసేపు అదరగొట్టాడు. అమ్మగా సోనాలి కులకర్ణి బాగా చేసింది. ఈశ్వరీరావు పాత్ర సైతం బాగుంది. సంపూర్నేష్‌బాబుకి మంచి పాత్ర దక్కింది. తను కూడా బాగా చేశాడు. సుబ్బు పాత్రలో కయాదు లోహర్‌ పాత్ర సర్‌ప్రైజ్‌ చేస్తుంది. సత్యరాజ్‌ పాత్ర హడావుడి చేస్తుంది. ఆ తర్వాత తేలిపోయింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

67
ప్యారడైజ్‌ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

టెక్నీకల్‌గా మూవీ సాలిడ్ గా ఉంది. సీహెచ్‌ సాయి విజువల్స్ బాగున్నాయి. కొత్తగా ఉన్నాయి. కనువిందుగానూ ఉన్నాయి. నవీన్‌ నూలి ఎడిటింగ్‌లో చాలా లోపాలున్నాయి. ఇంకా బాగా చేయాల్సింది. సెకండాఫ్‌ కొంత ట్రిమ్‌ చేయోచ్చు. అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్‌ సినిమాకి ప్రాణం. పాటలు అదిరిపోయాయి. బీజీఎం సైతం కొత్తగా ఉంది. పూనకాలు తెప్పించేలా ఉంది. అయితే ఎమోషన్స్ మిస్‌ కావడంతో బీజీఎం కూడా తేలిపోయిన ఫీలింగ్‌ కలిగింది. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి రాజీ లేకుండా నిర్మించారు. బాగా ఖర్చు చేశారు. ఆ ఖర్చు చాలా వరకు వృధాగానే మిగులుతుంది. దర్శకుడు శ్రీకాంత్‌ ఓడెల ఒక బలమైన కథ చెప్పాలనుకున్నారు. ఎత్తుకున్నది, ముగింపు కరెక్ట్ గా ఉంది. కానీ మధ్యలో గాడి తప్పింది. ఏటేటో వెళ్లింది. లవ్‌ ట్రాక్‌ కాలేదు. నేపథ్యంలో, టైమింగ్‌, హీరో డ్రెస్‌ సెన్స్ ఇలా లాజిక్‌లకు అందనివి చాలానే ఉన్నాయి. కొన్ని బ్లాక్స్ రాసుకొని సినిమాని తెరకెక్కించినట్టు ఉంది. కానీ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. కానీ అది సినిమాలో కుదరాలి, ఎమోషనల్‌గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, అప్పుడే కష్టానికి ఫలితం దక్కుతుంది. ఈ మూవీకి సంబంధించి ఆ విషయంలో తేడా కొట్టింది. దర్శకుడు ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఇంకా బాగా తీయాల్సింది. క్లారిటీగా తీయాల్సింది. డైవర్షన్‌ లేకుండా చేయాల్సింది. రాజకీయాలను ఇన్‌వాల్వ్ చేసి కథ లక్ష్యమే మారిపోయింది.

77
ఫైనల్‌గా

యాక్షన్‌ మీద పెట్టిన దృష్టి ఎమోషన్స్ మీద పెడితే సినిమా బాగుండేది. నానినికాదు, కేసీఆర్‌ని హీరోని చేసిన చిత్రమిది.

రేటింగ్‌ : 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories