తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' రివ్యూ : నవ్వించిందా?

First Published | Nov 3, 2023, 9:18 AM IST

 తరుణ్ భాస్కర్ రైటర్, డైరెక్టర్ మాత్రమే కాకుండా లీడ్ రోల్ కూడా ప్లే చేశాడు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం కూడా ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేసినిమా ఈ సినిమా ఎలా ఉంది

#KeedaaCola movie Review

నవ్వించటం..నవ్వుకున్నంత ఈజీ కాదు. ఈ విషయం చాలా మంది దర్శకులకు తెలుసు. అందుకే చాలా మంది ఆ జానర్ జోలికి పోరు. కానీ ఆ విద్య తెలిసిన వాళ్లు మాత్రం వేరే జానర్స్ జోలికి వెళ్లటానికి అంతగా ఆసక్తి చూపరు.  'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న తరుణ్ భాస్కర్ కు ఆ విద్య తెలుసు. అందుకే తన మూడో చిత్రంలో సైతం నవ్వించేందుకు రెడీ అయ్యారు. క్రైమా కామెడీగా రూపొందిన ఈ  సినిమా ఎలా ఉంది...నవ్వులతో థియేటర్స్ దద్దరిల్లేలా చేసారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్ :

కార్పోటర్ కావటానికి  అర్జెంట్ గా  జీవన్ (జీవన్ కుమార్) కు కోటి రూపాయలు కావాలి. ఆ విషయం తన భక్త అన్న నాయుడు  (తరుణ్ భాస్కర్) ని అడుగుతాడు. నాయుడు  20 ఏళ్ళ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు. ఓ స్కెచ్ వేస్తారు. కీడా కోలాలో బొద్దింక వేసి,అది చూపెట్టి కంపెనీ వాళ్లపై కేసు వేద్దాం అనుకుంటాడు. ప్లాన్ సజావుగా సాగుతుంది అనకుంటే ఆ కీడా కోలా ..డబ్బు విపరీతమైన అవసరం ఉన్న వాస్తు (చైతన్య రావు)  చేతికి వస్తుంది.  వాస్తు (చైతన్య రావు) అమ్మా,నాన్నా  యాక్సిడెంట్ లో చనిపోవటంతో ... చిన్నప్పటి నుంచి తాతయ్య (వరదరాజులు) సంరక్షణలో పెరుగుతూంటాడు. అతనికి ఓ బార్బీ బొమ్మ విషయంలో కోటి రూపాయల నష్ట పరిహారం కట్టాల్సి వస్తుంది. దాంతో ఆ డబ్బులు కోసం డెస్పరేషన్ లో ఉన్నప్పుడు  బొద్దింక ఉన్న 'కీడా కోలా' కూల్ డ్రింక్ చేతికి వస్తుంది. అంతే దాన్ని అడ్డం పెట్టి కంపెనీ నుంచి డబ్బులాగాలనుకుంటాడు. తన ప్రెండ్ లాయిర్ లాంచమ్ (రాగ్ మయూర్)  సలహాతో ముందుకు వెళ్తాడు. అయితే వీళ్లదగ్గర ఈ బాటిల్ ఉందన్న  విషయం తెలిసిన జీవన్,నాయుడు వాళ్లను కిడ్నాప్ చేసి టార్చర్ మొదలెడతారు.... మరో ప్రక్క  కీడా కోలా కంపెనీ సీఈవో (రవీందర్ విజయ్), అతని దగ్గర పనిచేసే షాట్స్ ('రోడీస్' రఘురామ్) కు ఈ విషయం మొత్తం తెలిసి వాళ్లు ఓ వైల్డ్  డెసిషన్ తీసుకుంటారు, ఆ వైల్డ్ డెసిషన్ ఏమనటి?మధ్యలో కోర్టు కు ఎక్కిన బార్బీ బొమ్మ కథ ఏంటి? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 


విశ్లేషణ:

లోకల్ పాత్రలను ఎంచుకుని వాటిని ఇంటర్నేషనల్ సినిమా స్దాయి స్క్రీన్ ప్లేలో కూర్చోబెట్టి నవ్వించటమే తరుణ్ చేస్తున్న పని. సినిమా క్రిస్ప్ గా ఇంపాక్ట్ గా చూసుకుని, వాటి మధ్య ఓ ఫన్నీ కాంప్లిక్ట్ సిట్యువేషన్ క్రియేట్ చేసి వదలిపెట్టి మజా చేస్తూంటాడు. అదే ఈ సినిమాలోనూ చేసేందుకు మాగ్జిమం ట్రై చేసాడు. అయితే పూర్తి స్దాయిలో సక్సెస్ అయ్యాడా అంటే చాలా వరకూ అని చెప్పాలి. నవ్వించాడు...నవ్వించాడు. కానీ బయిటకు వచ్చి ఏం చూసామా అంటే గుర్తు చేసుకునేలా లేదు. అయితే  థియేటర్ లో మాత్రం అతని పాత్రలకు అలవాటు పడి, జర్నీ చేసినవాళ్లకు మాత్రమే ... ఆ నవ్వులు సొంతం. కనెక్ట్ కాకపోతే మాత్రం కాస్త ఇబ్బందే అనిపిస్తుంది. ఇంత చిన్న విషయానికి అంత రచ్చ ఏమిటా అనిపిస్తుంది. ఆ సినిమాటెక్ లిబర్టీని ఏక్టెప్ట్ చేయగలిగితేనే ఎంజాయ్ చేస్తాము. అందుకే ఈ సినిమా అందరినీ అలరిస్తుందని చెప్పలేము. సీన్ , డైలాగు వైజ్ గా వచ్చిన నవ్వులు..టోటల్ సినిమాలో కనిపించవు. 


క్యారెక్టర్లతో, సన్నివేశాలతో కనెక్ట్ కానీ వారికి ఈ సినిమా ఓ శబ్ద కాలుష్యమే అనిపిస్తుంది.  సినిమా ప్రారంభంలో వచ్చే సీన్ ...  కారు డ్రైవింగ్ చేస్తున్న తండ్రి వెనుక సీటులో ఉన్న కుమారుక్కి జీవితంలో ముందుచూపు ఉండాలని చెబుతూంటాడు. అదే సమయంలో వెనక్కి తిరిగి కొడుకు వైపూ చూస్తూ..... రోడ్డుపై ముందు ఏం వస్తుందో చూడటం మానేసి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ సీన్ చూస్తే ఇలాగే మనమంతా చేస్తూంటాము కదా అనిపిస్తుంది. ఆ తరహా కామెడీ పాట్రన్ ఫాలో అవుతూ, టిపికల్ పంచ్ లైన్స్ తో కథలోకి వెళ్లాడు. ఫస్టాఫ్ కథా నేపధ్యం, పాత్రల పరిచయానికి వచ్చే సీన్స్ కు లీడ్ సెటప్స్, సెకండాఫ్ లో వచ్చే pay-offs లకు కావాల్సిన ప్లాంటిగ్ లు తో నడిపేసారు. దాంతో ఫస్టాఫ్ లో పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ బాగుంది ,సీన్స్ పరుగెట్టించారు. కానీ ఆ పాత్రలు ఎక్కితేనే ఫన్ జనరేట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ ఎంగేజింగ్ గా ఉంది. అయితే థిన్ లైన కావటంతో  సీన్స్ రిపీట్ అయ్యిన ఫీలింగ్ వచ్చింది. అలాగే ప్లాట్ predictable గా సాగుతూండటంతో ఓ రేంజి కిక్ అయితే దొరకదు.

టెక్నికల్ గా ...

దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ జనరేషన్ యూత్ కు తగ్గ సినిమాలు చేయటంలో పండిపోయారు. ఈ క్రమంలో ఆయన టెక్నికల్ గా పూర్తి అప్డేట్ గా ఉ్ంటారు. ఓ కామెడీ సినిమాలో ఇలాంటి టెక్నికల్ స్టాండర్డ్స్ ఊహించం. డైరక్షన్,  సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ సూపర్బ్ అనిపిస్తాయి. గట్టిగానే ఖర్చుపెట్టారు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది కానీ మిగతా డిపార్టమెంట్స్ తో పోటి పడలేదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో సంభందం లేకుండా వస్తుందనిపిస్తుంది. రన్ టైమ్ క్రిస్పీ గా రెండుగంటలకు పరిమితం చేయటం బాగుంది.
 


నటీనటుల్లో : 

 నటుడిగా తరుణ్ భాస్కర్ విశ్వరూపం ఈ సినిమా. సినిమాలో ఉన్నవాళ్లందరినీ డామినేట్ చేసేసాడు. బ్రహ్మానందం నుంచి ఎంత తక్కువ ఎక్సపెక్టేషన్ పెట్టుకుంటే అంత మేలు.  వాస్తు పాత్ర లో  చైతన్య రావు  బాగా చేసారు.'రోడీస్' షో ఫేమ్ రఘురామ్ ఫెరఫెక్ట్.  లాయిర్ గా రాగ్ మయూర్  (సినిమా బండి ఫేమ్) అదరకొట్టారు. అతను ఈ సినిమాతో నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాడనిపించింది. జీవన్, రవీందర్ విజయ్, 'గెటప్' శీను తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు.
 


నచ్చేవి
తరుణ్ భాస్కర్ నటన
సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ ,డైలాగులు
టెక్నికల్ బ్రిలియెన్స్ (Visuals & Editing)
ఇంగ్లీష్ కామెడీ సీన్స్ 

 నచ్చనవి
నవ్వించని బ్రహ్మనందం పాత్ర
తరుణ్ భాస్కర్ గత రెండు సినిమాల స్దాయిని అందుకోలేదనిపించటం
ప్రెడిక్టబుల్ గా అనిపించేలా రాసుకున్న స్క్రీన్ ప్లే
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 


ఫైనల్ థాట్

కామెడీ జనరేట్ చేసే ఓ క్రీడ (గేమ్) లా అందరూ ప్రొఫిషనల్ గానే ఆడారు. అయితే నవ్వులు మాత్రం మరీ వాళ్ల స్దాయికి తగినట్లు స్కోర్ చేయలేకపోయారు. ఈ మాత్రం నవ్వుకునే సినిమాలు అయినా ఎక్కడ వస్తున్నాయి రిలీఫ్ కోసం వెళ్దాం అనుకుంటే మాత్రం ఈ వీకెండ్ మంచి ఆప్షన్.
Rating: 2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల  
 


నటీనటులు : బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు, రాగ్ మయూర్, 'రోడీస్' రఘురామ్, జీవన్ కుమార్, రవీందర్ విజయ్, 'టాక్సీవాలా' విష్ణు తదితరులు
ఛాయాగ్రహణం : ఎజె ఆరోన్
సంగీతం : వివేక్ సాగర్
సమర్పణ : రానా దగ్గుబాటి 
నిర్మాతలు : కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్,  ఉపేంద్ర వర్మ
రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్ దాస్యం
విడుదల తేదీ: నవంబర్ 3, 2023  

Latest Videos

click me!