Lingoccha Movie Review : ‘లింగొచ్చా’ మూవీ రివ్యూ! పాతబస్తీ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

First Published | Oct 28, 2023, 11:53 AM IST

యంగ్ హీరో కార్తీక్ రత్నం నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘లింగొచ్చా’ (Lingochcha). తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కథలతో అలరిస్తున్న ఈ కుర్ర హీరో ‘లింగొచ్చా’తో ఎలా అలరించాడనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’, ‘అర్ధ శతాబ్దం’ వంటి చిత్రాలతో కార్తీక్ రత్నం (Karthik Rathnam)  తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘లింగొచ్చా’. హైదరాబాద్  ఓల్డ్ సిటీలో సాగే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 27న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మూవీకి సంబంధించిన విషయాలను సమీక్షలో చూద్దాం..
 

కథ :

శివ (కార్తిక్ రత్నం).. హైదరాబాద్ పాతబస్తీ లో నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడు. స్నేహితులతో కలిసి చిన్నప్పుడు అల్లరి చిల్లర వేషాలు వేసేశాడు. తమ వృత్తి కటింగ్ చేయటంలోనూ ప్రతిభగలవాడు. బార్బర్ కొడుకైనా శివ.. నవాబు కుటుంబానికి చెందిన నూర్జహాన్ ను ప్రేమిస్తాడు. వీరద్దరూ చిన్నప్పుడే ప్రేమలో పడతారు. ఆ వెంటనే నూర్హహాన్ ను తల్లిదండ్రులు దుబాయ్ కి పంపిస్తారు. కొన్నాళ్లకు నూర్జహాన్ తిరిగి వస్తుంది. అప్పటి వరకు శివ నూర్జహాన్ ను ప్రేమిస్తూనే ఉంటాడు. నవాబ్ కుటుంబంలోని నూర్జహాన్ శివను ఎలా కలిసింది? దుబాయ్ కి వెళ్లేందుకు కారణం ఏంటీ? హైదరాబాద్ కు ఏ రీజన్ పై వచ్చింది? ఆమెను మళ్లీ కలిసేందుకు శివ ఏం చేశాడు? వీరిద్దరి ప్రేమ ఫలించిందా? అందుకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనేది? కథ.. ఇంతకీ ఈ మూవీ టైటిల్ ‘లింగొచ్చా’ అని ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. 
 


విశ్లేషణ :

హైదరాబాద్ పాతబస్తీలోని సెలూన్ షాప్ నుంచి సినిమా ప్రారంభం అవుతుంది. శివ కుటుంబ గురించి చెబుతూనే.. చిన్నప్పుడు శివ చేసే అల్లరి పనులను చూపించారు. ఈ క్రమంలోనే నూర్జహాన్ ను శివ కలిసే సన్నివేశాలు ఉంటాయి. చిన్నప్పటి ప్రేమను చూపించేందుకు కాస్తా ఎక్కువ సీన్లే పెట్టారు. ఇంతకీ ఏం చెప్పబోతున్నారనేదానికే మొదటి అరగంట తీసుకోవడం ఆడియెన్స్ కు ఇబ్బందిగా ఉంటుంది. పాతబస్తీలో శివ స్నేహితులతో చేసే అల్లర్లు, తన ప్రేమ గురించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నూర్జహాన్ ఇంట్లో సాగే సీన్లూ బాగుంటాయి. ఇక నూర్జహాన్ దుబాయ్ కి వెళ్లి తిరిగి వచ్చే వరకు సినిమా సరదాగా సాగిపోతోంది. ఓల్డ్ సిటీలోని వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం బాగుంది.

నూర్జహాన్ తిరిగి వచ్చాక సెకండాఫ్ ప్రారంభమవుతుంది. స్నేహితులతో శివ కలిసి తాగే సన్నివేశాలు, కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు పర్లేదనేలా ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథ కాస్తా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా.. సినిమా చివరి అర్ధ గంట వరకు రోటీన్ సీన్లతోనే సాగుతుంటుంది. పాతబస్తీ ప్రేమ కథను  కొత్తగా చెప్పే ప్రయత్నం చేసినా ఆ ఫీల్ ఆడియెన్స్ కు ఎక్కలేదనిపిస్తోంది. కానీ చివరి 30 నుంచి 20 నిమిషాల వరకు కథను నడిపించిన తీరు బాగుంటుంది. ఎమోషన్, యాక్షన్ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. సందర్భానుసారంగా వచ్చే బీజీఎం, మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. చిత్రంలోని హిందూ, ఊర్దు, తెలుగు డైలాగ్స్, ఎమోషన్ సీన్స్, లవ్, శివ అటీట్యూడ్ తో ఓల్డ్ సిటీ వాతావరణంలో సాగిన ఈ చిత్రం పర్లేదనే అనిపించింది. సినిమా చివర్లో పెట్టిన శ్రద్ధ మిగితా సీన్లలోనూ వహిస్తే రిజల్ట్ ఇంకాస్తా మెరుగ్గా ఉండేది. హైదరబాదీలందరూ చూడాల్సిన సినిమా మాత్రమనే అభిప్రాయం కలిగింది.
 

నటీనటుల పెర్ఫామెన్స్ :

యంగ్ హీరో కార్తీక్ రత్నం ఇప్పటికే పలు చిత్రాల్లో నటించడం, పైగా థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో తన పాత్రకు న్యాయం చేశారు.  సినిమా మొత్తంగా కార్తీక్ పెర్ఫామెన్స్  అదిరిపోయిందనే చెప్పాలి. హీరోయిన్ సుప్యర్థ సింగి తన అందంతో, సీన్ కు తగ్గ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. హావభావాలను సులువుగా పలికించింది. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు స్టోరీ నేరేటర్స్ గా మెప్పించారు. మిగతా పాత్రలన్ని వాటి పరిధిలో అలరించాయి. 
 

టెక్నీకల్ : 

హైదరాబాద్ నేటివిటి స్టొరీస్ వచ్చి చాలా కాలమైంది.. ఈ క్రమంలో దర్శకుడు ఆనంద్ బడా పాతబస్తీ నుంచి తీసుకున్న ప్రేమకథా నేపథ్యానికి మొచ్చుకోవాల్సిందే. లవ్ స్టోరీని చెప్పే విధానం కొన్ని సీన్లతో అద్భుతమనిపించాడు. మరిన్ని చోట్లా ఇంకా మెరుగవ్వాల్సి ఉందనిపించింది. నటీనటుల నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్  తీసుకున్నారనేది అర్థమవుతోంది. బికాజ్ రాజ్ అందించిన మ్యూజిక్ పర్లేదనిపిస్తోంది. లవ్, ఎమోషన్ కు సరిపడా సంగీతాన్ని అందించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. డీవోపీ హైదరాబాద్ పాతబస్తీ లొకేషన్లను  బ్యూటీఫుల్ గా చూపించారు. కెమెరా వర్క్ బాగుంది. డైలాగ్స్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.. 

Latest Videos

click me!