`శివం భజే` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Aug 1, 2024, 4:20 PM IST

యాంకర్‌ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా బలంగా నిలబడేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన `శివంభజే` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

స్టార్‌ యాంకర్‌, డైరెక్టర్‌ ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తున్నా, సరైన బ్రేక్ రావడం లేదు. గత చిత్రం `హిడింబా` థియేటర్లలో ఆడకపోయినా, ఓటీటీలో బాగానే ఆదరణ పొందింది. ఇప్పుడు మరో కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌తో వచ్చాడు. శివుడి ఎలిమెంట్లతో తెరకెక్కిన చిత్రమిది. అప్సర్‌ దర్శకత్వం వహించగా, గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్‌ రెడ్డి మూలి నిర్మించారు. అశ్విన్‌ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించింది. హైపర్‌ ఆది, మురళీ శర్మ, సల్మాన్‌ తమ్ముడు అర్బాజ్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రమిది. అశ్విన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఈ గురువారం(ఆగస్ట్ 1)న విడుదలైంది. మరి ఈ సారైనా అశ్విన్‌కి హిట్‌ పడిందా? కొత్త దర్శకుడు తన సత్తా చాటాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
చందు(అశ్విన్‌బాబు) ఫైనాన్స్ రికవరీ ఏజెంట్‌. తన ఫ్రెండ్‌(హైపర్‌ ఆది)తో కలిసి రికవరీ చేస్తుంటాడు. ఓ చిన్న విలన్‌ గ్యాంగ్‌(షకలక శంకర్‌) వద్ద ఈఎంఐ వసూలు చేసే క్రమంలో వాళ్లతో గొడవపడి చితక్కొడతాడు. మరో రోజు మరో కస్టమర్‌ వద్ద ఈఎంఐ రికవరీ కోసం వెళ్లగా అక్కడ శైలజ(దిగంగనా సూర్యవంశీ)ని చూసి ఆమెకి తొలి చూపులోనే పడిపోతాడు చందు. వరుసగా రెండు మూడు సార్లు ఆమెని కలుస్తాడు. త్వరగానే ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే ఇలా సరదాగా సాగుతున్న సమయంలోనే విలన్‌ గ్యాంగ్‌ చందుపై రివేంజ్‌ తీసుకోవాలని వస్తారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలో చందుని వాళ్లు బాగా కొడతాడు. కారు అద్దాలపై పడటంతో ఆ గ్లాసెస్‌ కుచ్చుకుని చందుకి కళ్లుపోతాయి. ఐస్‌ డోనర్‌ అవసరం ఏర్పడుతుంది. ఆ సమయంలోనే మరో వ్యక్తి చనిపోయాడని చెప్పి కళ్లు దానం చేస్తారు. ఆ కళ్లు చందుకి పెడతాడు డాక్టర్‌(బ్రహ్మాజీ). ఆ ఆపరేషన్‌ తర్వాత నుంచి కొందరు వ్యక్తులను చూసినప్పుడు చందులో విపరీతమైన తలనొప్పి వస్తుంది. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక డాక్టర్‌ వద్దకు వెళ్లగా, పెద్ద డాక్టర్‌(మురళీ శర్మ) ఇది చూసి షాక్‌ అవుతాడు. అతనికి కుక్క కళ్లు పెట్టినట్టు టెస్ట్ లో తేలుతుంది. దీంతో అంతా షాక్‌. కళ్ల ఆపరేషన్‌ తర్వాత చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఓ గుడిలో అఘోర చందుని చూసి శివుడు వచ్చినట్టుగా ఫీలవుతుంటాడు. మరోవైపు ఈ కథకి పారలల్‌గా ఓ మెడికల్‌ ల్యాబ్‌కి చెందిన డాక్టర్లు, టెక్నీషియన్లు వరుసగా హత్యకు గురవుతుంటారు. ఆ కేసుని ఏసీపీ మురళీ(అర్బాజ్‌ ఖాన్‌) ఇన్వెస్టిగేషన్‌ చేస్తుంటాడు. అవి అంతుచిక్కని మిస్టరీగా ఉంటాయి. దీంతోపాటు ఇండియాలో చొరబాటుకి పాకిస్తాన్‌, చైనా కుట్రలు పన్నుతుంటాయి. దాడులకు ప్లాన్‌ చేస్తుంటాయి. మరి ఆ ప్లాన్స్‌ ఏంటి? చందుకి కుక్క కళ్లు పెట్టడం వెనుక ఉన్న ఏంటి? చందుకి శివుడికి సంబంధం ఏంటి? వరుస హత్యలకు కారణమేంటి? చందుకి తెలిసిన నిజాలేంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ. 


విశ్లేషణః
సినిమా ట్రెండ్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్‌ నడుస్తుంది. ఇప్పుడు యాక్షన్‌, థ్రిల్లర్‌, మైథలాజికల్‌ కాన్సెప్ట్ తో కూడిన చిత్రాల హవా నడుస్తుంది. `విరూపాక్ష`, `సలార్‌`, `కల్కి`, `హనుమాన్‌` వంటి సినిమాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. సోషియో ఫాంటసీ, ఫిక్షన్‌, పీరియాడికల్‌ యాక్షన్‌ అంశాలతో కూడిన చిత్రాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే మేకర్స్ కూడా తమ సినిమాల్లో అలాంటి అంశాలుండేలా చూసుకుంటున్నారు. కరెట్ట్ గా వాటిని వాడుకున్న వాళ్లు హిట్‌ కొడుతున్నారు. ఆడియెన్స్ కి థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందిస్తున్నారు. తాజాగా `శివం భజే` చిత్రంతో దర్శకుడు అప్సర్‌ అదే పంథాని అనుసరించాడు. థ్రిల్లర్‌ జోనర్‌కి యాక్షన్‌, చిన్న సోషియో ఫాంటసీ ఎలిమెంట్‌ టచ్‌ ఇచ్చి ఈ సినిమాని తెరకెక్కించారు. ఆడియెన్స్ వీక్‌నెస్‌ అయిన దేవుడి రిలేటెడ్‌ అంశాలను జోడించి వారిని ఆకర్షించేలా, వారికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతోపాటు కేవలం యాక్షన్‌, థ్రిల్లర్‌ ఎక్స్ పీరియెన్సే కాదు, మెడికల్‌ మాఫియాకి, దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా అంతర్లీనంగా జోడించి మరింత రక్తికట్టించే ప్రయత్నం చేశాడు. 
 

సినిమాగా చూసినప్పుడు శివుడి ఇంట్రోతోపాటు హీరో చందు క్యారెక్టరైజేషన్‌ ఎస్టాబ్లిష్‌ చేశారు. మరోవైపు పారలల్‌గా మెడికల్‌ ల్యాబ్‌కి చెందిన సిబ్బంది హత్యలను చూపించాడు. ఈ అంశాలతో ప్రారంభం నుంచి సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్‌ చేశారు. పాత్రల పరిచయం, లవ్‌ ట్రాక్‌ చకచకా కానిచ్చేశాడు. ఎక్కువ టైమ్‌ తీసుకోలేదు. ఇది ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా, ఆ ఎలిమెంట్లు రొటీన్‌గానే ఉంటాయి కాబట్టి, దర్శకుడు చెప్పాలనుకున్న అసలు ఉద్దేశ్యం అది కాదు కాబట్టి అలా చూపించడమే బెటర్‌ అనిపిస్తుంది. హీరో కి కుక్క కళ్లు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, దాని వెనుక దేవుడి రహస్యమేంటి? దేశంలో జరిగే కుట్రలను ఆపేందుకు హీరో ఏం చేశాడనేది సినిమా ద్వారా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. అందుకే చాలా వేగంగా అసలు కథలోకి వెళ్లాడు. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ సినిమాకి పెద్ద హైలైట్‌. అది సినిమా రేంజ్‌ని మార్చేసిందని చెప్పొచ్చు. అప్పటి వరకు లవ్‌ ట్రాక్‌, హైపర్‌ ఆదితో కామెడీ ట్రాక్‌లతో వెళ్లిన సినిమా ఇంటర్వెల్‌తో సీరియస్‌గా మారుతుంది. ఊహించని మలుపుతో అందరిని షాక్‌కి గురి చేస్తుంది. 
 

సెకండాఫ్‌ మొత్తం వరుస హత్యలకు కారణమేంటి? వెనుక ఎవరున్నారనే మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. అనుమానిత పాత్రలను ట్రాక్‌లోకి తీసుకొచ్చి ఆడియెన్స్ ని మరింత సస్పెన్స్ లో పెట్టే ప్రయత్నం చేశారు.  ఆడియెన్స్ మైండ్‌ని డైవర్ట్ చేసి గేమ్‌ ఆడారు మేకర్స్. మరోవైపు చందుకి వస్తున్న మెమొరీస్‌ మరింత క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంటాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆతృత ఆడియెన్స్ లో పెంచుతుంది. అలా సస్పెన్స్ అంశాలతో కథనాన్ని నడిపించి, క్లైమాక్స్ లో అసలు ట్విస్ట్ ఇచ్చాడు. అది సినిమాకి మరో హైలైట్‌ పాయింట్ చెప్పొచ్చు. అస్సలు ఊహించని ట్విస్ట్ అందరిని థ్రిల్‌కి గురి చేస్తుంది. దీనికితోడు శివుడి ఎలిమెంట్లు సైతం గూస్‌బంమ్స్ తెప్పిస్తాయి. అయితే సినిమాలో లవ్ ట్రాక్‌ మైనస్‌గా చెప్పొచ్చు. ప్రారంభంలో చాలా వరకు సీన్లు అంత సహజంగా అనిపించవు. ఇంటర్వెల్‌ వరకు ఏదో అలా సాగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ట్విస్ట్ తర్వాత సెకండాఫ్‌లో భారీ స్థాయిలో ఏదో ఉండబోతుందనే ఊహలు ఆడియెన్స్ లో పెరుగుతాయి. కానీ ఏదో మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇంకా బెటర్‌గా ఏదో ఉంటే బాగుండేదనిపిస్తుంది. సడెన్‌గా సినిమాని ముగించడంతో కొంత వెలితి ఫీలింగ్‌ కలుగుతుంది. ఇంకోవైపు ఏ సినిమాకైనా ఓ సోల్‌ ఉంటుంది, ఓ త్రెడ్ ఉంటుంది. దాని చుట్టూతే కథ నడుస్తుంది. అది ఇందులో అక్కడక్కడ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. పైగా పాకిస్తాన్‌, చైనా ఎలిమెంట్లు కన్విన్సింగ్‌గా అనిపించవు. అవి లేకపోవడమే బెటర్‌ అనిపిస్తుంది. ఆ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. థ్రిల్లింగ్‌ పార్ట్, శివుడికి సంబంధించిన పార్ట్ ని మరింత సమర్థవంతంగా వాడుకుంటే సినిమా `హనుమాన్‌` తరహాలో మరో రేంజ్‌ ఫిల్మ్ అయ్యేది. 

నటీనటులుః
చందుగా అశ్విన్‌బాబు బాగా చేశాడు. గత చిత్రాలతో పోల్చితే నటనలో బెటర్‌మెంట్‌ కనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో అదరగొట్టాడు. లవ్‌ ట్రాక్‌ విషయంలోనే అంతగా కనెక్ట్ కాలేదు. ఇక యాక్షన్‌ విషయంలో మాత్రం మాస్‌ కటౌట్‌ అనిపించుకున్నాడు. హీరోయిన్‌గా దిగంగనా సూర్యవంశీ.. అందంతో ఆకట్టుకుంది. గ్లామర్‌ సైడ్‌ పోకుండా చాలా పద్ధతిగా కనిపించి అలరించింది. తన పాత్ర పరిధి మేరకు మెప్పించింది. ఏసీపీగా అర్బాజ్‌ ఖాన్‌ నటన బాగుంది. అతని పాత్రని నడిపించిన తీరు బాగుంది. ఆయన్ని చూస్తుంటే చాలా చోట్లు అన్న సల్మాన్‌ ఖాన్‌ గుర్తొస్తున్నాడు. చాలా సెటిల్డ్ గా బాగా చేశాడు. ఆయన పాత్ర ఎండింగ్‌ ఇంకా బాగా చేయాల్సింది. హైపర్‌ ఆది తన మార్క్ పంచ్‌లతో నవ్వించాడు. సినిమాకి ఆయన పాత్ర మంచి వినోదాన్ని పంచిందని చెప్పొచ్చు. డాక్టర్లుగా మురళీ శర్మ, తనికెళ్ల భరణి ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ పాత్ర, షకలక శంకర్‌ పాత్ర నవ్వించింది. అయ్యప్ప శర్మ, తులసి, ఇనయ సుల్తానాలు కూడా మెప్పించారు. 
 

టెక్నీషియన్లుః
ఈ సినిమాకి పెద్ద అసెట్‌ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్‌. వికాస్‌ బడిస మ్యూజిక్‌ బాగుంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ విషయంలోగానీ, బీజీఎం విషయంలోగానీ అదరగొట్టాడు. పెద్ద రేంజ్‌ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. చాలా చోట్ల గూస్‌బంమ్స్ తెప్పించాడు. రొటీన్ బీజీఎం కాకుండా తన మార్క్ ప్రత్యేకతని చాటుకుని కొత్త ఫీలింగ్‌ కలిగించారు. ఆయనకు మంచి భవిష్యత్‌ ఉంది. దాశరథి శివేంద్ర కెమెరా వర్క్ బాగుంది. థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాల టోన్‌ కనిపిస్తుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. ఎడిటర్‌ కాస్త ఎక్కువ కట్‌ చేసినట్టు అనిపించినా, సుత్తి లేకుండా చేశాడని చెప్పొచ్చు. ఇక దర్శకుడు అప్సర్‌ ఎంచుకున్న పాయింట్‌, సినిమాని నడిపించిన తీరు బాగుంది. దర్శకుడిగా మొదటి సినిమా అయినా ఈ రేంజ్‌లో తీయడం మామూలు విషయం కాదు. పెద్ద మాస్‌ డైరెక్టర్‌ రేంజ్‌లో సినిమాని తెరకెక్కించాడు. అంతేకాదు రెండు మూడు అంశాలను ఒకే కథలో కన్విన్సింగ్‌గా చెప్పడం పెద్ద టాస్క్. అది ఏ దర్శకుడికైనా చాలా క్లిష్టమైన విషయం. దాన్ని చాలా సులువుగా డీల్‌ చేశాడు దర్శకుడు. ఆ విషయంలో అప్సర్‌ని అభినందించాల్సిందే. అయితే సెకండాఫ్‌ విషయంలో కొంత క్లారిటీ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. బలమైన ఎలిమెంట్లని ఎంచుకున్నాడు. కానీ వాటిని అంతే బలంగా చెప్పడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఇంకా బలంగా రాసుకుని, పర్‌ఫెక్ట్ గా ప్లాన్‌ చేస్తే సినిమాది వేరే లెవల్‌. 

ఫైనల్‌గాః `శివం భజే`.. కొత్త ఎక్స్ పీరియెన్స్ నిచ్చే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం.  

రేటింగ్‌ః 2.75

నటీనటులుః అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు.   

టెక్నీషియన్లుః 
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్,
మ్యూజిక్ డైరెక్టర్ : వికాస్ బడిస
ఫైట్ మాస్టర్: పృథ్వి, రామకృష్ణ 
డీ ఓ పి: దాశరథి శివేంద్ర
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫని కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టాక్ స్కూప్
నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి
దర్శకత్వం : అప్సర్.
 

Latest Videos

click me!