
ప్రస్తుతం సినిమాలకు దీటుగా వెబ్ సిరీస్‌లు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. అలా తెలుగులో బాగా పాపులర్ అయిన వెబ్ సిరీస్ `సేవ్ ది టైగర్స్`. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ వచ్చింది. ఈ గురువారం(జూన్ 19) అర్థరాత్రి నుంచి ఇది జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవియాని శర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, గుండు సుదర్శన్, అవినాష్, అభయ్ వంటివారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ని దర్శకుడు మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం సృష్టించగా, శ్రీరామ్ ఎరగం దర్శకత్వం వహించారు. మరి ఈ రోజు రాత్రి నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌ని సెలబ్రిటీలకు, మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కోటి అరగంట నిడివితో ఉంది. మరి సిరీస్ ఎలా ఉంది? గత రెండు సీజన్ల కంటే బెటర్‌గా నవ్వించిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
సేవ్ ది టైగర్స్ సిరీస్ కథ సింపుల్.. ముగ్గురు జంటల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గంటా రవి(ప్రియదర్శి)పాల వ్యాపారం చేస్తాడు. ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. కానీ అది బెడిసి కొడుతుంది. భార్య హైమావతి(జోర్దార్ సుజాత) కోరిక మేరకు గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. అక్కడ తంటాలు పడుతుంటాడు. రాహుల్(అభినవ్ గోమటం) రైటర్ కావాలనుకుంటాడు, కానీ అది తేడా కొడుతుంది. దీంతో భార్య మాధురి(పావణి గంగిరెడ్డి)తో గొడవలు జరుగుతుంటాయి. అత్తారింట్లో కూడా రెస్పెక్ట్ లేదు. ఇక విక్రమ్(చైతన్య కృష్ణ) రొమాంటిక్ బాయ్. ఆయన క్రియేటివ్ యాడ్, రైటర్. ఆయన భార్య రేఖ(దేవియాని శర్మ) విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో సీజన్‌లో గంటా రవి, విక్రమ్, రాహుల్ కలిసి ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు. తన పాత ఇంటికి తీసుకెళ్తాడు గంటా రవి. అక్కడ వీరు ముగ్గురు బాగా తాగి సోయి లేకుండా పడిపోతారు. నెమ్మదిగా కిడ్నాప్‌కి గురైన ముగ్గురు మత్తులో నుంచి బయటకు వస్తారు. వాళ్లు వచ్చి చూస్తే, అచ్చం తమలాగే ఈ ముగ్గురు ఉంటారు. వీళ్లకు సృహ వస్తుంది. అసలేం జరిగిందని చూస్తే, విక్రమ్, గంటా రవి, రాహుల్ ఓ రోజు బార్‌లో బాగా తాగి.. పెళ్లిళ్లు స్వర్గలోకంలో నిర్ణయించబడతాయని పెద్దలు చెబుతారు. తమకి భార్యల ద్వారా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన స్వర్గలోకాన్ని, ఇంద్రుడుని పట్టుకొని తిడుతుంటారు. దీన్ని స్వయంగా ఇంద్రుడు(వెన్నెల కిశోర్) చూస్తాడు. దీంతో మనిషిని పోలిన వాళ్లు ఏడుగురు ఉంటారని అంటారు కదా. సరిగ్గా ఇలానే ఉన్న మరో ముగ్గురుతో ఈ ముగ్గురుని స్వాప్ చేస్తాడు. అంటే వీరి భార్యల వద్దకు మరో లోకంలో ఉన్న ముగ్గురుని పంపిస్తాడు. ఆ తర్వాత ఎలాంటి ఫన్నీ, క్రేజీ, ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సిరీస్ కథ.
మూడో సీజన్ సిరీస్.. ప్రియదర్శి, అభినవ్, చైతన్య కృష్ణ ముగ్గురిని కిడ్నాప్ చేయడంతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ఫన్ మొదటి సీన్ నుంచే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే అంతలోనే తమని పోలిన మరో ముగ్గురు కనిపించే ట్విస్ట్ అదిరిపోయింది. అది ఎవరూ ఊహించరు. ఈ సిరీస్‌లో అస్సలు ఊహించరు. అదే పెద్ద ట్విస్ట్ గా చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంద్రలోకం సీన్లు కామెడీగా ఉంటాయి. వాళ్లు భూమిపైకి వచ్చి ముగ్గురిని స్వాప్ చేయడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. అయితే ప్రారంభంలో వాళ్లకు ఉన్న కన్‌ఫ్యూజనే ఆడియెన్స్ కూడా కలుగుతుంది. మూడు ఎపిసోడ్ల వరకు కొంత ఫన్, కొంత కన్‌ఫ్యూజన్ అనేలా వెళ్తుంది. ఇక నాల్గో సీజన్ నుంచి కథ మారిపోతుంది. ఫన్ డోస్ పెరిగింది. ట్విస్ట్ లు రివీల్ అవ్వడం, పాత్రల్లో రియలైజేషన్ రావడం, ఒక ప్రపంచంలో ఈ ముగ్గురు చేసిన తప్పులను కొత్తగా వచ్చిన వారు సరిచేసే ప్రయత్నం చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో ఫన్ అదిరిపోయింది. తమ భర్తలుగా కొత్తగా వచ్చిన వారిని చూసి భార్యల రియాక్షన్, వారికి వీరిచ్చే రియాక్షన్ వింతగా ఉండటంతో అది ఆడియెన్స్ ని నవ్విస్తుంది. ఒక ప్రపంచంలో తీరని కోరికలు, రెండో ప్రపంచంలో తీరడం ఇందులో మరో ఆసక్తికర విషయమని చెప్పొచ్చు. ఇదే ఇందులో హైలైట్‌గా నిలుస్తుంది. ఐదో ఎపిసోడ్ నుంచి ఫన్ కాస్త ఆలోచింప చేస్తుంది. ఆ తర్వాత ఎమోషనల్‌గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలు చాలా ముఖ్యమని, అదే సమయంలో అండర్ స్టాండింగ్ చాలా ముఖ్యమని, కొన్నింటికి అడ్జస్ట్ కావాలని, ఆవేశానికి పోవొద్దని చెప్పే విషయాలు ఆకట్టుకుంటాయి. ఎపిసోడ్ ఎండింగ్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే ప్రారంభంలో ఫన్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. మార్పుకి సంబంధించిన సన్నివేశాల్లోనూ ఫీల్ కొంత తగ్గినట్టుగా ఉంటుంది. ఎండింగ్ బాగుంది. అయితే ఈ సిరీస్ ముగించినట్టుగా ఈ ఎండింగ్ ఉండటం విశేషం. మొదటి రెండు సీజన్లతో పోల్చితే ఇందులో ట్విస్ట్ లు, ఎంటర్టైన్‌మెంట్ డోస్ ఎక్కువగానే ఉంది. మొదటి రెండు సిరీస్‌లు ఎంజాయ్ చేసిన వాళ్లు దీన్ని మరింత బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు.
గంటా రవిగా ప్రియదర్శి రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో మెరిసి ఆకట్టుకున్నాడు. కామెడీని పంచడంలో సక్సెస్ అయ్యాడు. రెండు రకాలుగా ప్రవర్తించే విషయంలో చూపించి డిఫరెన్స్ బాగుంది. విక్రమ్ పాత్రలో చైతన్య కృష్ణ..ఓ వైపు రొమాంటిక్‌గా, మరోవైపు ఇన్నోసెంట్‌గా రెండు వేరియేషన్స్ ని బాగా చూపించాడు. ఆకట్టుకున్నాడు. ఇక రాహుల్ గా అభినవ్ గోమటం కూడా అదరగొట్టాడు. నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన కామెడీలో కొంత బ్రహ్మానందం కనిపించాడని చెప్పొచ్చు. ప్రియదర్శి భార్యగా సుజాత మరోసారి అదే స్థాయిలో నటించి మెప్పించింది. రెండు పాత్రల్లో అలరించింది. అలాగే రాహుల్ భార్యగా పావణి గంగిరెడ్డి తనదైన స్టయిల్‌లో ఆకట్టుకుంది. హుందాగా కనిపించి అలరించింది. ఇంకోవైపు విక్రమ్ భార్యగా దేవియాని శర్మ.. ఇన్నోసెంట్‌గా, డేర్ ఉన్న లాయర్‌గా విభిన్న షేడ్స్ ని చూపించి అదరగొట్టింది. వెన్నెల కిశోర్ ఎప్పటిలాగానే నవ్వించే ప్రయత్నం చేశారు. గుండు సుదర్శన, అభయ్ వంటి వారు ఫర్వాలేదనిపించారు. గంగవ్వ కామెడీ నవ్విస్తుంది.
టెక్నీకల్‌గా సిరీస్ రిచ్‌గా, సాలిడ్‌గా ఉంది. విజువల్స్ అదిరిపోయాయి. పెద్ద సినిమా స్థాయిలో ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది. ఆర్‌ఆర్ సినిమాకి ప్లస్ అయ్యింది. రైటింగ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. డైలాగ్ నవ్వించడంతోపాటు ఆలోచింప చేస్తాయి. దర్శకత్వం సినిమాకి మరో ప్లస్ అని చెప్పొచ్చు. ట్విస్ట్ లతో, కామెడీతో, ఎమోషన్స్ తో ఇలా అన్ని మిక్స్ చేసి దీన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించారని చెప్పొచ్చు.
ఫైనల్‌గా
భార్యాభర్తలు చూడాల్సిన సిరీస్. ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇదొక మంచి టైమ్ పాస్ ఎంటర్‌టైనింగ్ సిరీస్ అవుతుంది.
రేటింగ్: 2.75