Kantara Chapter 1 Movie Review: `కాంతారః చాప్టర్ 1` మూవీ రివ్యూ, రేటింగ్‌.. కాంతారలా మ్యాజిక్ చేసిందా?

Published : Oct 02, 2025, 02:56 AM IST

`కాంతార` మూవీ మూడేళ్ల క్రితం వచ్చి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా `కాంతారః చాప్టర్‌ 1` వచ్చింది. రిషబ్‌ శెట్టి రూపొందించిన ఈ మూవీ `కాంతార` స్థాయిలో మ్యాజిక్ చేసిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
17
`కాంతారః చాప్టర్ 1 మూవీ రివ్యూ, రేటింగ్‌

మూడేళ్ల క్రితం వచ్చిన `కాంతార` మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. వాహ్‌ అనిపించింది. గూస్‌ బంమ్స్ తెప్పించింది. దీంతో దానికి ప్రీక్వెల్ గా ఇప్పుడు `కాంతారః చాప్టర్‌ 1`ని రూపొందించారు దర్శకుడు రిషబ్‌ శెట్టి. ఇందులో ఆయనే హీరో. ఆయనకు జోడీగా రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. జయరాం, గుల్జన్‌ దేవయ్య ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని నేడు(అక్టోబర్‌ 2) గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ముందు రోజు రాత్రినే ప్రెస్ ప్రీమియర్‌ని ప్రసాద్‌ ఐమాక్స్ లో వీక్షించాను. `కాంతార` హిట్‌ కావడంతో ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. దీంతో సెలబ్రిటీలు కూడా ఇందులో సందడి చేశారు. స్టార్‌ డైరెక్టర్స్, నిర్మాతలు, బయ్యర్లు కనిపించడంతో థియేటర్ కళకళలాడింది. భారీ అంచనాలతో థియేటర్‌లోపలికి వెళ్లాను. మరి `కాంతార` మ్యాజిక్‌ ఇందులో వర్కౌట్ అయ్యిందా? రిషబ్‌ శెట్టి ఈ మూవీని ఆకట్టుకునేలా తెరకెక్కించాడా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
`కాంతారః చాప్టర్‌ 1` కథ ఏంటంటే?

`కాంతార` ముగింపు నుంచి ఈ కథ ప్రారంభమవుతుంది. హీరో దేవుడిగా ఎలా మారాడు, ఎలా భూమిలో మాయమైపోతాడు. అసలు తమ దైవం కథేంటి? అనేది పిల్లవాడికి కథ చెబుతుంటారు. దీంతో పూర్వీకుల కాలంలోకి కథ వెళ్తుంది. అప్పటి కాలంలో కర్నాటక దక్షిణ ప్రాంతంలో దట్టమైన అడవి ఉంటుంది. అందులో మూడు తెగలు ఉంటాయి. వారిలో కాంతార తెగ చాలా పవర్‌ఫుల్‌. వాళ్లు అడవిని కాపాడుతూ ఉంటారు. వారి దైవమైన శివుడిని కాపాడుకుంటారు. వారి నాయకుడైన బర్మె(రిషబ్‌ శెట్టి)లో ఆ దైవ శక్తి ఉంటుంది. ఆ దేవుడిని, అడివిని తమ వశం చేసుకోవాలని పింజర్ల తెగ ప్రయత్నిస్తుంటుంది. కానీ సాధించలేకపోతారు. మరోవైపు కాంతార అడవిని ఆక్రమించుకోవాలని, అందులోని సుగంధ ద్రవ్యాలను దోచుకోవాలని, వ్యాపారం చేయాలని బంగ్రా రాజ్యపు రాజు విజయేంద్ర ప్రయత్నిస్తాడు. కానీ దైవం అతన్ని చంపేస్తుంది. తండ్రి మరణాన్ని రాజశేఖరుడు(జయరాం)యువరాజు స్వయంగా చూస్తాడు. అతను పెద్ద అయి రాజ్యపాలన తీసుకుంటారు. ఆయనకు కొడుకు కులశేఖరుడు(గుల్షన్‌ దేవయ్య) కూతురు కనకవతి(రుక్మిణి వసంత్‌) ఉంటారు. రాజశేఖరుడికి వయసు పెరగడంతో రాజ్యపాలన బాధ్యతలను కొడుకు కులశేఖరుడికి అప్పగిస్తారు. కానీ ఆయన సరిగ్గా రాజ్యపాలన చేయలేకపోతాడు. నిత్యం మత్తులో జోగుతుంటాడు. దీంతో రాజశేఖరుడు, అతని కూతురు కనకవతినే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కాంతార అడవిలోని శివపూదోటపై అందరి కన్ను పడుతుంది. కానీ అందులోకి వెళితే బయటకు రాలేరు, బతకలేరు. దానిలోకి వెళ్లాలనేది కనకవతి, అలాగే రాజు కులశేఖరుడు భావిస్తారు. ఓ సారి కులశేఖరుడు ప్రయత్నం చేయగా, దైవం వేటాడుతుంటుంది. కానీ కాంతార జనమే వారిని తరిమేస్తారు. అందులో ఒక సైనికుడు వాళ్లకి దొరికిపోతాడు. అతని సహాయంతో బర్మె, అతని సహచరులు బంగ్రా రాజ్యంలోకి వస్తారు. అక్కడి అభివృద్ధి, ఆ ప్రజలను, వారు వాడే వస్తువులను, మార్కెట్‌ని చూసి ఆశ్చర్యపోతారు. తమ అడవి నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని, వాళ్లు కూడా వ్యాపారం ప్రారంభిస్తారు. అందుకు కనకవతి సహకరిస్తుంది. అంతేకాదు బర్మెకి దగ్గరవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. బంగ్రా రాజ్యంలోని బందర్‌ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని వ్యాపారం చేస్తుంటారు బర్మె వర్గం. వారి చర్యలు మితిమీరిపోతున్నాయని భావించిన కులశేఖరుడు తానేంటో చూపించేందుకు సైన్యంతో అడవికి వచ్చి అందరిని చంపేస్తాడు. మరి తమ ప్రజలను కాపాడుకునేందుకు బర్మె ఏం చేశాడు? ఆయనలోకి దైవం(శివుడు) ఎలా వచ్చింది? కులశేఖరుడి అంతు ఎలా చూశారు? కొడుకు కోసం రాజశేఖరుడు ఏం చేశారు? కనకవతిలోని మరో కోణం ఏంటి? వీటన్నింటిని బర్మె ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగిలిన కథ.

37
`కాంతారః చాప్టర్‌ 1` మూవీ విశ్లేషణః

కథ ప్రారంభంలో చెప్పినట్టుగా `కాంతార` ముగింపులోని అంశాలను పరిచయం చేస్తూ గతంలోకి వెళ్తుంది ఈ మూవీ స్టోరీ. కాంతారల పూర్వీకులు ఏం చేశారనేది? అప్పుడు ఆ జనం ఎలా ఉండేవారు, ఆ గిరిజనులు ఎలా జీవనం సాగించేవారు, వారి దైవం వంటి అంశాలను ఇందులో ప్రారంభంలో చూపించారు. అదే సమయంలో అప్పటి బంగ్రా రాజ్యంలోని రాజుల పాలన ఎలా ఉండేదనేది ఇందులో చూపించారు. కథ పరంగా రెండూ సేమ్‌. కాకపోతే `కాంతార`లో అడవిలో ఒక జమిందారుని చూపించారు, ఇందులో రాజులు, రాజ్యాన్ని చూపించారు. అందులో తమ భూమి కోసం పోరాటం, ఇందులో తమ ప్రాంతం కోసం, తమ సహజమైన ఆస్తుల కోసం పోరాటం. `కాంతార`లో వ్యాపారం అనే ఆలోచన లేదు. కానీ పూర్వీకుల్లో వ్యాపారం అనే ఆలోచన కలగడం విశేషం. అడవిపై దుష్టుల కన్నుపడినప్పుడు దైవం ఏదో రూపంలో వస్తుంది. కాపాడుతుందనేది ఈ చిత్రంలో బలంగా చూపించారు. మధ్య మధ్యలో దాన్ని ఆవిష్కరించారు. అయితే ఎక్కువగా కాంతార తెగ నాయకుడు బర్మె, వారి మనుషులు వ్యాపారం చేయాలనుకోవడం, బానిసత్వం నుంచి తమ వారికి విముక్తి కలిగించాలని చేసే పోరాటం ఇందులో హైలైట్‌ చేశారు. రాజుల కాలం, దాని సెటప్‌, రాజ్యం చుట్టూ కథని నడిపే విధానం బాగుంది. రాజుల కాలం నాటి సాంప్రదాయాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. అందులోనే హీరో, రాజకుమారితో ప్రేమాయణం, మార్కెట్‌లో యాక్షన్‌ సీన్లు ఆకట్టుకున్నాయి. వీటితోపాటు అడవిలో కాంతార తెగ చేసే యాక్షన్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అనిపిస్తుంది. మొదటి భాగం మొత్తం అటు కాంతార వాళ్లు మనుగడ కోసం పోరాటం, మరోవైపు రాజు మత్తులో జోగడం, ఆయనొక జోకర్‌గా ఎస్లాబ్లిష్‌ చేయడం మెయిన్‌గా చూపించారు. ఇంటర్వెల్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌తో గూస్‌ బంమ్స్ తెప్పించారు.

47
`కాంతారః చాప్టర్‌ 1` మూవీలో హైలైట్స్, మైనస్‌లు

సెకండాఫ్‌ కాంతార ప్రజలకు, బంగ్రా రాజ్యానికి మధ్య ప్రతీకారం ప్రధానంగా నడుస్తుంది. ఆ తర్వాత భారీ యాక్షన్‌తో అటు కాంతార వారికి జరిగిన ప్రాణనష్టాన్ని, ఇటు రాజుకి జరిగిన నష్టాన్ని చూపించారు. అనంతరం దైవం కోసం యాగాలు చేయడంలోని డ్రామాని బాగా ఆవిష్కరించారు. క్లైమాక్స్ ని తీర్చిదిద్దిన తీరు అదిరిపోయింది. సినిమాలో మెయిన్‌గా విజువల్స్ మతిపోగొడతాయి. యాక్షన్‌ ఎపిసోడ్స్ వాహ్‌ అనిపిస్తాయి. అందులో హీరో రిషబ్‌ శెట్టి పడ్డ కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. రాజుల కాలంనాటి సెటప్‌ కనువిందుగా ఉంటుంది. చాలా లార్జ్ స్కేల్‌లో లావిష్‌గా ఉంటుంది. లవ్‌ ట్రాక్‌ కూడా అలరించేలా ఉంటుంది. ఇంటర్వెల్‌ ఫైట్‌ మాత్రం అదిరిపోయింది. సెకండాఫ్‌లోనూ యువరాజు దాడులు, ప్రతిదాడులు, ఆ సమయంలో హీరోలోకి దైవం రావడంతో మరోసారి `కాంతార` గుర్తుకు వస్తుంది. గూస్‌ బమ్స్ తెప్పిస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ కూడా సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది.

అయితే `కాంతార` మూవీలో ప్రారంభం నుంచే భూత కోల, పంజుర్లి పండుగలను, వారాహ దైవాన్ని ఎస్లాబ్లిష్‌ చేశారు. దైవం తాలూకు ఎమోషన్స్ ని బలంగా చూపించారు. దీంతో సినిమా మొత్తం అంతర్లీనంగా ఆ దైవం, దాని భావోద్వేగాలు ఆడియెన్స్ ని వెంటావుతుంటాయి. ఎంతటి ఫన్‌ సీన్లు పెట్టినా, థ్రిల్లర్‌ ఎలిమెంట్లు పెట్టినా అది క్యారీ అవుతూనే ఉంటుంది. వరాహం రూపంలో దాన్ని చూపిస్తూనే ఉంటారు. కానీ ఇందులో శివుడి దైవత్వాన్ని చూపించారు. కానీ ఇందులో ఆ ఎమోషన్‌ క్యారీ అవలేదు. దైవం తాలుకూ భావోద్వేగం బలంగా చూపించలేదు. అది పండలేదు. దీంతో డ్రై ఫీలింగ్‌ అనిపిస్తుంది. రాజ్యంలో వ్యాపారం కోసం ప్రయత్నాలు, యువరాణితో ప్రేమాయణం అంతా ఒక డ్రామా క్రియేషన్‌లాగా ఉంది తప్పితే కథకి సింక్‌ అయినట్టుగా లేదు. అంతేకాదు ఆయా ఎపిసోడ్లు కూడా రాంగ్‌ ట్రాక్‌లో అనిపిస్తాయి. ఇక రాజు కులశేఖరుడి ఎపిసోడ్‌ బోరింగ్‌గా, కథని డైవర్ట్ చేసేలా ఉంటుంది. కథకి ఏమాత్రం సెట్‌ కాలేదు, అది ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. ఆ ఎపిసోడ్‌ డిస్టర్బ్ చేసేలా ఉంటుంది. హీరోలోకి దైవం వచ్చే సీన్ బాగున్నా, బలంగా అనిపించలేదు. వాహ్‌ ఫ్యాక్టర్‌ మిస్‌ అయ్యింది. ఫస్టాఫ్‌ మొత్తం సాగదీసినట్టుగా ఉంటుంది. సెకండాఫ్‌లో ప్రతికారం వైపు ఎక్కువగా నడుస్తుంది. అదే సమయంలో మళ్లీ ట్రాక్ తప్పినట్టుగా ఉంటుంది. కథని అనవసరమైన ట్రాక్‌లు ఎక్కించి డైవర్ట్ చేసి అటు, ఇటు తిప్పి చివరికి ఎండ్‌ పాయింట్‌కి తీసుకొచ్చినట్టుగా ఉంది. యాక్షన్‌ సీన్లు తప్ప మరేవి అంతగా మెప్పించలేకపోయాయి. క్లైమాక్స్ ని మాత్రం ఓ రేంజ్‌లో డిజైన్‌ చేశారు. అది బాగా వర్కౌట్‌ అయ్యింది. సినిమా చూస్తున్నంత సేపు అడవి ఎపిసోడ్లు `కంగువా`ని, యుద్ధం ఎపిసోడ్లు `బాహుబలి`ని, క్లైమాక్స్ లో హీరో ఆడదైవంగా మారడం `పుష్ప2`ని తలపించడం గమనార్హం.

57
`కాంతారః చాప్టర్‌ 1` చిత్రంలోని నటీనటుల పర్‌ఫెర్మెన్స్ ఎలా ఉందంటే?

బర్మెగా రిషబ్‌ శెట్టి నటన వాహ్‌ అనిపిస్తుంది. ఇందులో లవ్‌ ట్రాక్‌కి, రొమాన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. హీరోయిజంపై ఎక్కువగా ఫోకస్‌ చేశారు. ఆయన ఈ పాత్రలో అదరగొట్టారు. కాకపోతే అతనిలోకి దైవం వచ్చే సీన్లు ఎందుకో మొదటి భాగం స్థాయిలో లేవు. యాక్షన్‌ సీన్లలో మాత్రం దుమ్ములేపాడు రిషబ్‌. ఇక కనకవతిగా యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్‌ చాలా బాగా చేశారు. బలమైన పాత్ర ఆమెది. ఆమె పాత్రలోని ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ లో ఆకట్టుకుంటుంది. రాజు రాజశేఖరుడుగా జయరాం సెటిల్డ్ గా బాగా చేశారు. కులశేఖరుడిగా గుల్షన్‌ దేవయ్య పాత్రలో ఒదిగిపోయారు. కానీ ఆయన పాత్ర మాత్రం ఆడియెన్స్ ని ఇరిటేట్‌ చేస్తుంది. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఆకట్టుకున్నాయి. అందరు చాలా బాగా చేశారు. ఒదిగిపోయారు. ఇంకా చెప్పాలంటే జీవించారు. సినిమా కోసం ప్రాణం పెట్టారు.

67
`కాంతారః చాప్టర్‌ 1` టెక్నీషియన్ల పనితీరు

`కాంతార 2` మూవీ టెక్నీకల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా రాజుల కాలం నాటి ఆర్ట్ వర్క్ అదిరిపోయింది. వాహ్‌ అనిపిస్తుంది. ప్రతిదీ డీటెయిలింగ్‌గా వర్క్ చేశారు. ఆ విషయంలో తీసుకున్న కేర్‌ స్పష్టంగా కనిపిస్తుంది. కనువిందుగానూ ఉంటుంది. రాజులు, రాజ్యానికి సంబంధించిన విజువల్స్ వాహ్‌ అనిపిస్తాయి. కెమెరా వర్క్ బ్రిలియంట్‌. అరవింద్‌ కె కశ్యప్‌ మంచి విజువల్స్ అందించారు. సినిమాకి అవి పెద్ద అసెట్‌గా నిలిచాయి. ఎడిటింగ్‌ పరంగా సురేష్‌ మలయ్య ఇంకా వర్క్ చేయాల్సింది. సినిమాని కొంత ట్రిమ్‌ చేయాల్సింది. సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. మొదటిభాగాన్ని మించలేదు కదా, దానికి సమానంగా కూడా లేదు. వరాహ సాంగ్‌ని మళ్లీ పెట్టినా బాగుండేది. యాక్షన్ సీన్లలో బిజీఎం పర్వాలేదు. కానీ ఆ ఇంపాక్ట్ కనిపించలేదు. దైవం వచ్చే సీన్లు కొంత వరకు ఓకే. కానీ ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ కాలేదు. నిర్మాణ విలువలకు కొదవలేదు. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ఇక దర్శకుడు రిషబ్‌ శెట్టి సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది. తన ప్రాణం పెట్టాడని, ప్రతి సీన్లో తెలుస్తోంది. కానీ అంతే బాగా కథనాన్ని రాసుకోవడంలో సక్సెస్‌ కాలేదు. అనవసరమైన సీన్లతో కాలయాపణ చేసినట్టుగా ఉంది. చెప్పాల్సిన విషయం చిన్నది కావడంతో రెండున్నర గంటల సినిమాని నడిపించడానికి కొన్ని సంబంధం లేని, మరికొన్ని అవసరం లేని సీన్లని బలవంతంగా జోడించినట్టుగా ఉంది. ఆ ఒక్క విషయంలోనే ఆయన మిస్‌ లీడ్ అయ్యారు. అదే సమయంలో భావోద్వేగాల కంటే హంగులు, ఆర్భాటాలకే ప్రయారిటీ ఇచ్చారు. అదే ఇందులో మైనస్‌గా చెప్పొచ్చు. క్లైమాక్స్ ని మాత్రం బాగా డిజైన్‌ చేశారు. కథని నడిపించే విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో రిషబ్‌ శెట్టి ది బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు.

77
ఫైనల్‌గాః

 `కాంతార`ని మించి లేదు, కనీసం `కాంతార`లాగా కూడా లేదు. `కాంతార`ని చూసిన వారికి అంతగా ఎక్కదు, చూడని వారికి నచ్చే చిత్రమవుతుంది. ఓవరాల్‌గా `కాంతార` మ్యాజిక్‌ వర్కౌట్‌ కాలేదు.

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories