
Pelli Kani Prasad Movie Review : పెళ్లికాని కుర్రాళ్ల కథలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఈ హాట్ బర్నింగ్ టాపిక్ ని తీసుకుని సప్తగిరిని ప్రధాన పాత్రలో చూపిస్తూ చేసిన సినిమా ఇది. అసలు ప్రసాద్ కు ఎందుకు పెళ్లి కావటం లేదు,
పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన సమస్యలు ఏమిటి అనే యాంగిల్ లో నడిపిన ఈ కథ హాస్య ప్రధానంగా చేసిన సినిమా. ఈ సినిమాతో సప్తగిరి కి హిట్ పడిందా, ఏ మాత్రం నవ్వించారు. సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
‘పెళ్లికాని ప్రసాద్’ స్టోరీ లైన్
38 ఏళ్లు వచ్చినా ప్రసాద్(సప్తగిరి) కి పెళ్ళి కాదు. అందుకు కారణం వాళ్ల నాన్న(మురళీధర్)కి ఉన్న కట్నం ఆశ. మలేషియాలో జాబ్ చేస్తున్న అతనికి రెండు కోట్లు కట్నం డిమాండ్ చేయటమే అందుకు కారణం.
అయితే అసలే అమ్మాయిలు దొరకటం ఇబ్బందిగా ఉన్న టైమ్ లో కట్నం పెద్ద సమస్యగా మారటంతో లేటు అవుతూ వచ్చి చివరకు ప్రియా(ప్రియాంక శర్మ) రూపంలో ఓ దారి కనపడుతుంది.
ప్రియ ఆలోచన పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనేది. అంతేకాదు ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకునాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ప్రసాద్ గురించి తెలుస్తుంది. ఫారిన్ వెళ్ళాలనే తమ కోరికను నెరవేర్చుకోవడం కోసం మలేసియాలో ఉండే ప్రసాద్ ను హీరోయిన్ ఫ్యామిలీ ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తుంది.
ప్రసాద్ కు కూడా ఆమె వర ప్రసాదంలా కనపడి పెళ్లి జరుగుతుంది. అయితే ఇక్కడే ఓ మెలికపెడుతుంది. ప్రసాద్ కు విదేశాలకు వెళ్లాలని ఉండదు. ఇండియాలో ఉండాలనుకుంటాడు. అప్పుడు ప్రియ వేసిన ప్లాన్ తెలుస్తుంది. అప్పుడు ప్రసాద్ ఏం చేసాడు, ప్రియ ఏం నిర్ణయం తీసుకుంది. ప్రసాదం వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చాయనేది మిగతా కథ.
ఎనాలసిస్
ఇది పెళ్లి చుట్టూ తిరిగే కథ అయినా నిజానికి అమ్మాయిలకు ఉన్న ఫారిన్ సంభందాల మోజును చూపిస్తుంది. అక్కడే మిగతా కథలకు ఈ కథకు తేడా చూపిస్తాడు. అయితే ఐడియా లెవిల్ లో కథ బాగుంది. కానీ ట్రీట్మెంట్ కు వచ్చేసరికి సమస్యలు మొదలయ్యాయి.
ఫస్టాఫ్ ..కట్నం పేరుతో చేసే కామెడీలు కాసేపు నవ్విస్తాయి. అలాగే ఫారిన్ వెళ్ళాలనే తమ కోరికను నెరవేర్చుకోవడం కోసం మలేసియాలో ఉండే ప్రసాద్ ను హీరోయిన్ ఫ్యామిలీ ప్రేమ పేరుతో ట్రాప్ చేసే మలుపు నచ్చుతుంది. ప్రసాద్‌ని ట్రాప్ చేయడానికి ఖుషీ సీన్ రిపీట్ చేయడం వంటివి బాగున్నాయి. అయితే ఆ తర్వాత కథ ఎటు తిప్పాలో ఎలా చేయాలో అర్దం కాలేదు.
ఏదైమైనా దొందూ దొందూ టైప్ లో ప్రసాద్ కు పెళ్లి కావాలి, ఆమెకు ఫారిన్ వెళ్లాలి. ఈ రెండు మ్యాచ్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత కథ కదలనని మొరాయించింది. సప్తగిరి చేసే కామెడీ నవ్విస్తున్నా, అసలు కథ పెద్దగా సెకండాఫ్ లో కదలదు.
దానికి తోడు మధ్యలో చాలా వరకూ చాలా సినిమాల్లో చూసిన సీన్స్ అటూ ఇటూగా మారి వస్తూంటాయి. కథలో సమస్య ఆమె ఫారిన్ వెళ్ళాలనుకోవటం, అతను వద్దనుకోవటమే అయ్యినప్పుడు ఆ దిశగా వచ్చే సీన్స్ కోసమే చూస్తూంటాము.
అవి పెద్ద ఆకట్టుకునేలా లేవు. సాగతీత బాగా ఎక్కువైపోయింది. వాటిని బాగా డిజైన్ చేసి ఉంటే ఖచ్చితంగా నెక్ట్స్ లెవిల్ స్క్రిప్టు అయ్యేది. సప్తగిరి కెరీర్ లో గుర్తుంచుకోదగ్గ సినిమా అయ్యేది.
టెక్నికల్ గా
దర్శకుడులో మంచి కామెడీ సెన్స్ ఉందని కొన్ని సీన్స్ ప్రూవ్ చేస్తాయి. మీమ్ కంటెంట్ ని బాగానే వాడారు. అలాగే సిట్యువేషన్ కామెడీని బాగా పండిచారు. కథ సహకరించి ఉంటే డైరక్టర్ కు పేరు వచ్చేది. ఇక సంగీతం ఈ సినిమాకు బాగానే ప్లస్ అయ్యింది.
కామెడీ తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫి అద్బుతం కాదు కానీ బాగుంది. సెకండాఫ్ కథని పరుగెత్తించేలా ఎడిటింగ్ ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని డైలాగులు బాగా పేలాయి.
నటీనటుల్లో ...
సప్తగిరి మొత్తం భుజాన మోసాడు. కొన్ని సీన్స్ లో బాగా నవ్వించాడు. ఇక మురళీధర్ గౌడ్ కామెడీ రొటీన్ గా అనిపించినా సిట్యువేషన్స్ లో బాగానే నవ్వించింది. హీరోయిన్ ప్రియాంక్ శర్మ జస్ట్ ఓకే.
అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, భాషా ట్రాక్ బాగా డిజైన్ చేసారు. వాళ్లు బాగా చేసారు. మీసాల లక్ష్మణ్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్, జెన్ని, నాగ మహేశ్ వంటి సీజనల్ ఆర్టిస్ట్ లు తమ పాత్రలను బాగానే చేసుకుంటూ వెళ్లారు.
ఫైనల్ థాట్
ఫుల్ లెంగ్త్ కామెడీ అని చెప్పలేం కానీ కొంతమేరకు నవ్వించింది. కామెడీ సినిమాలకు కాస్తంత కసరత్తు ఎక్కువే కావాలి. కేవలం ఆర్టిస్ట్ లను నమ్ముకుంటే సరిపోదు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
తెర వెనుక..ముందు
బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ, వడ్లమాని శ్రీనివాస్, మురళీ గౌడ్, ప్రమోదిని, రోహిణి, భాషా తదితరులు..
డిఓపి: సుజాత సిద్దార్థ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల