#RamSetu:అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ రివ్యూ!

First Published | Oct 25, 2022, 6:11 PM IST

రామసేతును రక్షించడం కోసం ఒక పెద్ద రోబెటిక్ సబ్‌మెరిన్‌ సాయంతో అక్షయ్ కుమార్ సముద్ర గర్భంలోకి వెళ్లడం  వంటి సీన్స్‌ను ఇందులో చూడవచ్చు. ఇందులో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు.

ఇప్పుడు వరసపెట్టి పౌరాణికాలు ,ఇతిహాస పాత్రలు,ఆధ్యాత్మకత చుట్టూ తిరిగే కథలు తెరపై చెప్పటానికి దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. మొన్న వచ్చిన కార్తికేయ 2 పెద్ద హిట్.  అదే ఊపులో ‘రామ్ సేతు’ కూడా రంగంలోకి దూకింది. దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం శ్రీరాముడుచే నిర్మించబడింది అని చెప్పబడుతున్న  ‘రామసేతు’ బ్రిడ్జి నేపథ్యంలో ‘రామ్ సేతు’ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. ట్రైలర్, విజువల్స్ పరంగా ప్రేక్షకులలో  బాగానే హైప్ క్రియేట్ చేసింది.  యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది...కథేంటి....తెలుగులోనూ రిలీజైన ఈ చిత్రం ఇక్కడ వారికీ నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం!


స్టోరీలైన్:

నాస్తికుడు,ప్రతీ విషయాన్ని హేతుబద్దతతో ఆలోచించే ఆర్యన్ (అక్షయ్ కుమార్) ఓ పురాతత్వ శాస్త్రవేత్త . తన వృత్తిలో నిజాలు తెలుసుకోవటం కోసం ఎంతటి సాహసానికైనా ఒడికట్టి,ప్రాణాలను సైతం పణంగా పెడుతూంటాడు. అలాంటి ఆర్యన్ కు ఓ వర్క్ వస్తుంది.  ప్రభుత్వ మద్ధతుతో ప్రారంభమైన ఓ ప్రాజెక్టులో భాగంగా రామ్ సేతును ధ్వంసం చేయాలని ఓ పారిశ్రామిక వేత్త (నాజర్) తన టీమ్ తో ప్లాన్ చేస్తాడు. అయితే  శ్రీరాముని దైవంగా కొలిచే దేశంలో అది సాధ్యమయ్యే పనిలా కనపడదు. దాంతో అసలు రామసేతు ... శ్రీరాముడు కట్టినదని కాదని, సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడినదని రిపోర్ట్ ఇస్తే ఎటువంటి వివాదం ఉండదని భావించి... ఆ బాధ్యతను ఆర్యన్ చేతిలో పెడతారు. 



 ఆర్యన్ తనకున్న పరిమత వనరులతో పరిశీలించి... తన రిపోర్టులో రామ్ సేతు గురించి రాయడంతో పాటు రామాయణం ఒక మహా కావ్యమని, రచన అని, అది నిజంగా జరిగిందని చెప్పే ఆధారాలు ఏవీ లేవని ఆర్యన్ పేర్కొంటాడు. అది పెద్ద వివాదానికి దారి తీస్తుంది. ప్రజలు తిరగబడతారు. దాంతో ప్రభుత్వం  ఆర్యన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తుంది. ఈ క్రమంలో తన రిపోర్టు వల్ల మొదలైన వివాదానికి తానే ముగింపు పలకాలని ఆర్యన్ అనుకుంటాడు.  రామ్ సేతుపై పరిశోధన చేయటానికి ఇంద్రకాంత్ (నాజర్) ముందుకు వస్తాడు. ఈ క్రమంలో కొన్ని నిజాలు బయిటకు వస్తాయి. ఇంద్రకాంత్ అసలు ఉద్దేశ్యం బయిటపడుతుంది.  ఈ క్రమంలో అతడికి ఏ ప్రమాదాలు ఎదురయ్యాయి? ఈ జర్నీలో అతడికి సహాయం చేసిన ఏపీ (సత్యదేవ్) ఎవరు?. నాస్తికుడైన ర్యన్.. రామసేతు ఉనికిని కనుగొనడంలో విజయం సాధిస్తాడా లేదా? అనేది తెరపై చూడాల్సిందే.

ఎనాలసిస్ ...

రామసేతుపై చర్చ ఇప్పుడు  కొత్తగా మొదలైందేమీ కాదు. 2005లో యూపీఏ-1 ప్రభుత్వం సేతుసముద్రం ప్రాజెక్టులో భాగంగా 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పు ఉన్న కాలువ తవ్వేందుకు అనుమతి ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఈ ప్రాజెక్టు బంగాళా ఖాతం, అరేబియా సముద్రాల మధ్య స్ట్రైయిట్ గా మార్గాన్ని ఏర్పరుస్తుంది. కానీ దాని వల్ల రామసేతును బద్దలు కొట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఓడలన్నీ శ్రీలంక చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా వాదిస్తున్న వాళ్లు సేతుసముద్రం ప్రాజెక్టుతో 36 గంటల సమయం, ఇంధనం ఆదా అవుతాయని వాదిస్తున్నారు. హిందూ సంస్థలు ఈ ప్రాజెక్టు వల్ల 'రామసేతు' ధ్వంసం అవుతుందని వాదిస్తున్నారు. భారతదేశం, శ్రీలంకకు చెందిన పర్యావరణవేత్తలు ఈ ప్రాజెక్టు వల్ల గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధుల్లో సముద్ర పర్యావరణం దెబ్బ తింటుందని అంటున్నారు. ఇప్పుడీ ఈ అంశాన్ని తీసుకునే సినిమా తీసారు.


అయితే సినిమా చూసాక..రామసేతు అంశాన్ని ..క్యాష్ చేసుకునేందుకు చేసిన సినిమాలా అనిపిస్తుంది. ఎక్కడా నిబద్దత ఉండదు. ఫస్టాఫ్ మొత్తం డాక్యుమెంటరీ నేరేషన్. అయితే కొత్తగా ఏమన్నా చెప్తారేమో అని వెతుకుతూ ..ఎంగేజ్ అవుతాం. అక్షయ్ కుమార్ ఇంట్రోని... కమర్షియల్ సినిమాలాగానే చేసారు. ఇంట్రస్టింగ్ గా చెప్పబోతున్నారనుకుంటే అక్కడనుంచి ప్లాట్ గా మారిపోతుంది.  ఆ తర్వాత రామసేతు ని ప్రూవ్ చేసే నీళ్లలో తేలే రాయిని ...చూపటం దగ్గర నుంచి మనకు ఆసక్తి పోతుంది. ఆ రాయి ఏదో సెట్ ప్రాపర్టీలా ఉంటుంది తప్పించి నిజమైన రాయిలా అనిపించదు. ఆ మాత్రం జాగ్రత్త కూడా తీసుకోలేదు అనిపిస్తుంది.  ఇక సెకండాఫ్ లో రామసేతు మూలాలను ప్రూవ్ చేయడానికి డాక్టర్ ఆర్యన్ జర్నీ కొద్దో గొప్ప ఆసక్తికరంగా సాగింది. అయితే కొత్తగా ఏమీ చెప్పినట్లు అనిపించదు. 

ఎడ్వంచర్స్ కూడా ఏమీ గొప్పగా ఉండవు. గొప్ప విజువల్స్ లేవు.  సబ్ మెరైన్ లో లైఫ్ జాకెట్స్ లేకుండా హీరో వెళ్లి ఏమైనా చేసేయడం, హీరోయిన్ సబ్ మెరైన్ లో ఆక్సిజన్ ఎలా కాపాడుకోవాలో చెప్పడం లాంటి సీన్స్ తో అరాచకం సృష్టించారు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా నీరసంగా..ప్రెడిక్టబుల్ గా జరుగుతూంటుంది. చివరకు కోర్ట్ లో ఆధారాలు సబ్మిట్ చేయటం కూడా సినిమాటెక్ గానే ఉంటుంది. ఎక్కడా మనం ఇన్వాల్వ్ కాలేము. కార్తికేయ 2 లో జరిగినట్లు ...ఇక్కడ శ్రీరాముడు కు చెందిన అంశాలని మ్యాజిక్ లా వాడుకోలేదు. ఇలాంటి స్పిరుట్యువల్ థ్రిల్లర్స్ లో  చిన్నపాటి మార్మికత ఉంటేనే నచ్చుతుంది. హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ 'రామ్ సేతు' సహజ సిద్ధంగా ఏర్పడినది కాదని, సాక్షాత్ శ్రీరాముడు సంకల్పిత నిర్మాణమని సినిమాలో చెప్పటమే ఈ సినిమా చేసింది. అది మనకు ఈ సినిమాకు వెళ్లకముందే తెలిసే విషయం. సత్యదేవ్ పాత్ర ట్విస్ట్ బాగా పేలింది. 
 


టెక్నికల్ గా..

ఎప్పుడైతే స్క్రిప్టులో విషయంలేదో మిగతా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా ఫలితం కనపడదు. అయితే టేకింగ్ అండ్ మేకింగ్ పరంగా సినిమా బాగుంది.  ప్రతి క్రాఫ్ట్ లో బాగానే వర్క్ చేసారు. అయితే  వీ.ఎఫ్.ఎక్స్ మాత్రం దారుణం.  కెమెరా వర్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని బాగా  కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్  కూడా బాగున్నాయి.   దర్శకుడు అభిషేక్ శర్మ స్క్రీన్ ప్లే పై ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.


నటీనటుల్లో ...

అక్షయ్ కుమార్ నటన  ఆర్టిఫియల్ గా ఉంది.  ఫైనల్ కోర్ట్ సీన్ లో ఆయన అనుభవం కనపడింది. ఆయన భార్యగా నుష్రత్ బాగా చేసింది.  జాక్వలిన్, జెన్నిఫర్, నాజర్ ఓకే ..ఓకే అన్నట్లు చేసుకుంటూ పోయారు. 'రామ్ సేతు'లో   సత్యదేవ్. ఏపీ పాత్రలో బాగా చేసారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్... అన్నీ బాగా కుదిరాయి.  

బాగున్నవి:
ఎత్తుకున్న పాయింట్
సత్యదేవ్
సినిమాటోగ్రఫీ
యాక్షన్ సీక్వెన్స్

బాగోలేనివి:
కథ కన్నా యాక్షన్ సీక్వెన్స్ లపై దృష్టి పెట్టడం
బోర్ కొట్టే సాంగ్స్
నిబద్దత లేని స్క్రిప్టు

ఫైనల్ థాట్

అప్పట్లో  'రామ్ సేతు' ను ధ్వంసం చేస్తానని అన్నారు కానీ ..ఇప్పుడు నిజంగా ఈ సినిమాతో థ్వసం చేసినట్లు అనిపించింది. 
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 1.5


నటీనటులు : అక్షయ్‌ కుమార్‌, సత్యదేవ్‌, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌, నుష్రత్‌ బరూచా, నాజర్‌, ప్రవేశ్‌ రాణా, శుభం జైకర్‌, జెన్నిఫర్‌ పిసినెటో తదితరులు
ఛాయాగ్రహణం : అశీమ్‌ మిశ్రా
సంగీతం: డేనియల్‌ బి జార్జ్‌
నిర్మాణ సంస్థలు : కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌, లైకా ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ వీడియో, అబడాన్షియా ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు : అరుణ్‌ భాటియా, విక్రమ్‌ మల్హోత్రా, సుభాస్కరన్! 
రచన, దర్శకత్వం : అభిషేక్‌ శర్మ
విడుదల తేదీ: అక్టోబర్ 25, 2022

Latest Videos

click me!