
తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలకు నిదర్శనంగా నిలిచాయి. 1967 జూలై 1న విడుదలైన ‘సాక్షి’ సినిమా కూడా అలాంటి సినిమానే. ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ముళ్ళపూడి వెంకట రమణ 1959లో రాసిన కథ ఆధారంగా రూపొందింది.
సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాటి కాలంలో సాధారణ వాణిజ్య సూత్రాలకు భిన్నంగా, అవుట్డోర్ లొకేషన్లలో, సహజమైన వాతావరణంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
సాక్షి సినిమా సమాచారం..
‘సాక్షి’ చిత్రాన్ని నందన ఫిల్మ్స్ పతాకంపై సురేష్ కుమార్, శేషగిరి రావు నిర్మించారు. కథను ముళ్ళపూడి వెంకట రమణ అందించగా, స్క్రీన్ప్లే ,దర్శకత్వ బాధ్యతలను బాపు నిర్వహించారు. డైలాగ్స్ ను రమణ రాజమండ్రి యాసకు దగ్గరగా, సహజంగా ఉండేలా రాశారు. ఎడిటింగ్ సత్యం, సంగీతం కె.వి. మహదేవన్ అందించారు. సుమారు 142 నిమిషాల నిడివితో బ్లాక్ అండ్ వైట్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ కిష్టయ్య పాత్రలో నటించారు. అమాయకంగా, పల్లెటూరి పడవ నడిపే వ్యక్తిగా కనిపించి, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితుల వల్ల కఠినంగా మారే పాత్ర ఇది.
విజయనిర్మల చుక్క పాత్రలో నటించారు. విజయలలిత రత్తి పాత్రలో.. జగ్గారావు ప్రమాదకరమైన నేరస్థుడు ఫకీరు పాత్రలో కనిపించారు. రమణ పంతులు (మునసబు), రాజబాబు (మునసబు కొడుకు), చలపతి రావు (గౌరయ్య), అల్లు వెంకటేశ్వర్లు (గోపి), ఆర్. రంగారావు (కరణం) పాత్రలో కనిపించారు. ఈ సినిమాతోనే నటుడిగా పరిచయమైన రంగారావు ఆ తర్వాత ‘సాక్షి’ రంగారావుగా ప్రసిద్ధి చెందారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని దాచంపాడు అనే ఊరిలో కిష్టయ్య అనే సాధారణ పడవ నడిపే యువకుడు నివసిస్తుంటాడు. అతను అమాయకుడు, పల్లెటూరి సరళత్వంతో ఉంటాడు. అదే ప్రాంతంలో ఫకీరు అనే క్రూరమైన నేరస్థుడు ఉంటాడు. ఊరి పెద్ద అయిన మునసబు తన కొబ్బరికాయలను పట్టణానికి తరలించే లారీ డ్రైవర్గా ఫకీరును నియమించుకుంటాడు. ఫకీరుకు ఊరిలో తన చెల్లెలు చుక్క అంటేనే అభిమానం. తనను గాఢంగా ప్రేమించిన రత్తిని అతను నిర్లక్ష్యం చేస్తాడు.
ఈ క్రమంలో జరిగే హత్యలకు కిష్టయ్య ఒక్కడే ప్రత్యక్ష సాక్షిగా మిగులుతాడు. ఊరి పెద్దలు అతనిపై ఒత్తిడి తెచ్చి కోర్టులో ఫకీరుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తారు. ఫకీరు అరెస్టవుతాడు కానీ, ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. జైలు నుంచి తప్పించుకున్న ఫకీరు నుంచి కిష్టయ్యకు ఊరిలో ఎవరూ ఆశ్రయం ఇవ్వరు. తన అన్నయ్య కిష్టయ్యను చంపకుండా ఉంటాడేమోనన్న ఆశతో చుక్క అతడిని పెళ్లి చేసుకుంటుంది. సమాజం వల్ల మోసపోయిన, అణచివేతకు గురైన ఒక సాధారణ వ్యక్తి పరిస్థితుల ప్రభావంతో ఎలా మారతాడు, ఆపద సమయంలో మనుషులు ఒకరికొకరు ఎలా నిలబడాలి అనే అంశాలను కథ చుట్టూ అల్లారు. ఈ కథపై 1952లో వచ్చిన అమెరికన్ చిత్రం ‘హై నూన్’ ప్రభావం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం విషయానికి వస్తే.. ముళ్ళపూడి వెంకట రమణ రాసిన కథకు బాపు దృశ్యరూపం ఇచ్చిన తీరు సాధారణ మసాలా సినిమాలకు భిన్నంగా ఉంటుంది. కథలోని ఘర్షణ, సాక్షిగా నిలిచిన వ్యక్తి ఎదుర్కొనే ఒంటరితనం, సమాజం చూపే నిర్లక్ష్యం — ఇవన్నీ నాటకీయత కంటే వాస్తవికతకు దగ్గరగా సాగుతాయి. రాజమండ్రి ప్రాంతపు మాటతీరు డైలాగ్స్ కు సహజత్వాన్ని చేకూరుస్తుంది. బాపు తొలి సినిమాలోనే తనదైన దృశ్య దృష్టిని చూపించడానికి ప్రయత్నించారు.
ఇక నటీనటులు విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కిష్టయ్య పాత్రలో కృష్ణ అమాయకత్వం నుంచి కఠినత్వానికి మారే ప్రయాణాన్ని తన శైలిలో చూపించారు. చుక్క పాత్రలో విజయనిర్మల పాత్ర పరిధికి తగ్గట్టుగా నటించారు. జగ్గారావు పోషించిన ఫకీరు పాత్ర కథలోని ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఇతర సహాయక నటులు తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు.
ఇక ఈ సినిమా టెక్నికల్ గా కూడా సత్తా చాటింది. అవుట్డోర్ వాతావరణాన్ని, గోదావరి పరిసరాలను పి.ఎన్. సెల్వరాజ్ కెమెరా పనితనం సహజంగా బంధించింది. సత్యం ఎడిటింగ్ కథా గమనానికి అనుగుణంగా ఉంది. కె.వి. మహదేవన్ బాణీలు, ఆరుద్ర, దాశరథి సాహిత్యం సినిమాకు సాంస్కృతిక, భావోద్వేగ బలాన్ని ఇచ్చాయి.
‘సాక్షి’ చిత్రానికి సంబంధించి సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ అనేక విశేషాలు ఉన్నాయి. బాపు దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఇదే కావడం ఒక విశేషమైతే, దర్శకుడిగా మాత్రమే కాకుండా కళాదర్శకుడిగా (ఆర్ట్ డైరెక్టర్) కూడా బాపు పనిచేశారు. తెలుగులో పూర్తిస్థాయి అవుట్డోర్ లొకేషన్లలో చిత్రీకరించిన తొలి సినిమాగా ఇది నిలిచింది. గోదావరి నది ఒడ్డున ఉన్న పులిదిండి గ్రామంలో షూటింగ్ జరిగింది. యూనిట్ రాకపోకల కోసం భావరాజు సీతారాముడు అనే ఇంజనీర్ కొత్త రోడ్లు వేయించి సహకరించారు.
నటీనటుల మేకప్ విషయంలో కూడా ఈ సినిమా ఒక భిన్నమైన ప్రయత్నం చేసింది. అప్పట్లో పెద్దగా పరిచయం లేని జంట అయిన కృష్ణ, విజయనిర్మల అవుట్డోర్ సన్నివేశాల్లో మేకప్ లేకుండా నటించడం నాటి వాస్తవిక ధోరణికి నిదర్శనం. అంతే కాదు ఈ సినిమా తర్వాతే కృష్ణ విజయనిర్మల మధ్య ప్రేమ చిగురించిందని అంటుంటారు. కానీ ఆ ప్రేమ బయటపడటానికి చాలా కాలమే పట్టింది.
అలాగే ఈ సినిమా ద్వారా కరణం పాత్రతో పరిచయమైన రంగారావు, ఆ తర్వాత ‘సాక్షి’ రంగారావుగా గుర్తింపు పొందారు. ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా’ ఈ చిత్రాన్ని 1960ల చివరిలో తెలుగులో కనిపించిన అరుదైన ‘న్యూ ఇండియన్ సినిమా’ సౌందర్య ధోరణికి ఉదాహరణగా పేర్కొంది. విడుదలైన సమయంలో కమర్షియల్గా ఇది ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ప్రయోగాత్మక చిత్రంగా, గ్రామీణ రాజకీయాలు, సామాజిక స్పృహ ఉన్న చిత్రంగా విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది.