
ప్రేమ, పెళ్లి, బంధాలు.. ఈ మూడు అంశాల చుట్టూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనలు, పెళ్లికి ముందు ఏర్పడుతున్న సంబంధాలు, వివాహంపై మారుతున్న అభిప్రాయాలను ప్రధానంగా తీసుకొని తెరకెక్కిన చిత్రం 'ఐ హేట్ మ్యారేజ్'. సుగి విజయ్, జుప్సీ భద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వం వహించారు. ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మాడమ్, కార్తీక్ వెంపటి నిర్మించారు.
ట్రైలర్‌లోని బోల్డ్ డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రేమ కథకి సంబంధించి బోల్డ్ కంటెంట్‌తో రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్ 27న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
ప్రేమ, పెళ్లిపై పెద్దగా నమ్మకం లేని రామ్(సుగి విజయ్) సినిమాల్లో దర్శకుడిని అవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటాడు. అమ్మ పెళ్లి గురించి ఎంత చెప్పినా నో చెబుతుంటాడు. నిజమైన ప్రేమను కోరుకునే సంప్రదాయ భావాలున్న జాహ్నవి(జుప్సీ).. రామ్ వ్యక్తిత్వం నచ్చి ఆయనతో రిలేషన్‌లో ఉండాలనుకుంటుంది. అది కూడా కండీషన్స్ తో. ఎట్టకేలకు ఈ ఇద్దరు జర్నీ స్టార్ట్ చేస్తారు. తమ కథనే సినిమా కథగా మలుస్తాడు రామ్. దానికి కొన్ని మార్పులు చేస్తారు. అది నిర్మాత వద్ద ఓకే అవుతుంది. సెకండాఫ్ ఎలా ఉండాలనేది సస్పెన్స్ గా మారుతుంది.
కట్ చేస్తే రామ్.. జాహ్నవితో ప్రేమలో పడతాడు. మరి ఆమె తన ప్రేమని ఒప్పుకుందా? ఇంతకి రామ్‌కి ఆమె పెట్టిన కండీషన్స్ ఏంటి? నేటి అమ్మాయిలు పెళ్లికి ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? కన్యత్వం, హైమెనోప్లాస్టీ కథేంటి? అమ్మాయిలు తప్పులు చేసి ఎలా కవర్ చేస్తున్నారు? బయట ప్రస్తుతం అమ్మాయిలు ఎలా ఉంటున్నారు? రామ్, జాహ్నవి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది ఈ సినిమా కథ.
సాధారణ ప్రేమకథలకు భిన్నంగా నేటి యువత ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రం. పెళ్లికి దూరంగా లివింగ్‌లో ఉంటూ, తమ కోరికలు తీర్చుకొని హ్యాపీగా ఉండాలని నేటి అమ్మాయిలు కోరుకుంటున్నారనే విషయాన్ని చాలా బోల్డ్ గా చెప్పిన తీరు బాగుంది. అదే సమయంలో ఎన్నో ఆశలతో, ఆశయాలతో గ్రామాల నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిలు హాస్టల్స్ లో ఉండి ఎలా చెడిపోతున్నారు, ఎలా తమ లక్ష్యాలను మర్చిపోతున్నారని కళ్లకి కట్టినట్టు చూపించిన చిత్రం `ఐ హేట్ మ్యారేజ్`.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా? లేక కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని అంగీకరించాలా? అనే సంఘర్షణతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛ, నమ్మకం, నిజాయతీ వంటి అంశాలను దర్శకుడు టచ్ చేశారు. అయితే ఇలాంటి సున్నితమైన కథాంశాలను ఎంత బాధ్యతగా, సహజంగా చూపించారనేది కీలకం. ఓ వైపు నేటి యువత ట్రెండ్‌ని ఆవిష్కరిస్తూనే, రెస్పాన్సిబులిటీస్‌కి సంబంధించిన అంశాలను చూపించిన తీరు బాగుంది. అందరు చెడిపోరు, లక్ష్యంతో ముందుకు వెళ్లేవారు కూడా ఉంటారని చెప్పిన తీరు బాగుంది.
ఇక మ్యారేజ్‌కి సంబంధించి అభిప్రాయాలను ఓపెన్‌గా చర్చించారు. కూతురు కోసం ఏమైనా చేసే పేరెంట్స్, ఆమె మనసులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసే విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తారు అనే ఓపెన్‌గా చెప్పారు. ఆ విషయంలో మంచి సందేశాన్ని అందించే సినిమా అవుతుంది. అయితే ఇలా ప్రేమ, పెళ్లి, కన్యత్వం వంటి అంశాలను బోల్డ్ గా చర్చించినా, దాన్ని అంతే ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మాత్రం వెనకబడ్డారు దర్శకుడు.
మేకింగ్ పరంగా క్వాలిటీ మిస్ అయ్యింది. టేకింగ్ పరంగానూ తడబాటు కనిపిస్తుంది. చాలా స్లోగా సాగుతుంది, డైలాగులు రొటీన్‌గా ఉంటాయి. కథనం ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో సక్సెస్ కాలేదు. నటీనటులు నటన పరంగానూ ఇంకా బెటర్‌మెంట్ అవసరం. సహజత్వం, ఫీల్, ఎమోషన్స్ వంటి అంశాలపై మరింతగా ఫోకస్ పెట్టాల్సింది. కాకపోతే క్లైమాక్స్ ఫర్వాలేదనిపిస్తుంది.
సుగి విజయ్ రామ్ పాత్రలో నటించాడు. పెళ్లిపై భిన్న భావాలు, దర్శకుడు కావాలనే కసి ఉన్న వ్యక్తిగా బాగా చేశాడు. పెళ్లిని అసహ్యించుకునే రామ్ ఆ తర్వాత ప్రేమలో పడటం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆయా సన్నివేశాల్లో సుగి విజయ్ బాగా చేశాడు. జుప్సీ భద్ర జాహ్నవి పాత్రలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. నేటి ట్రెండ్‌ని ఎంజాయ్ చేయాలనే ఆధునిక భావాలున్న అమ్మాయిగా చాలా బాగా నటించి మెప్పించింది. హారిక రాజేందర్, సాహితి కృష్ణ, డాక్టర్ పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి వంటివారు కీలక పాత్రలు పోషించారు. పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగానే ఉంది. క్వాలిటీ మిస్ అయ్యింది. వరికుప్పల యాదగిరి సంగీతం బాగుంది. దొంగ ముండా పాట హైలైట్ గా నిలుస్తుంది. ఆయనకు మంచి ఫ్యూచర్ ఉంది. ప్రవీణ్ ఇమ్మడి నేపథ్య సంగీతం ఫర్వాలేదు. కాకపోతే సీరియల్‌ని తలపిస్తుంది. ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. ఆయన తన అనుభవాన్ని ఇందులో జోడించారు. చాలా షార్ప్ గా కట్ చేశారు. సీన్ సీన్‌కి లింక్ చేసిన తీరు బాగుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ హైలైట్‌గా నిలుస్తుంది. దర్శకుడు మంచి పాయింట్ ని తీసుకున్నారు. బోల్డ్ గా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో తడబాటు కనిపిస్తుంది. మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా చాలా వర్క్ చేయాల్సింది.
పెళ్లి, ప్రేమ, కన్యత్వం విషయంలో నేటి యువత ఆలోచనలను బోల్డ్‌గా చర్చించిన సినిమా 'ఐ హేట్ మ్యారేజ్'.
రేటింగ్ : 2.5