Bhogi Movie Review: భోగి మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి మరో హిట్‌ పడిందా? డిజాస్టర్‌ తప్పదా?

Published : Nov 27, 2026, 12:13 PM IST

Bhogi Movie Review: శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి నటించిన `భోగి` మూవీ నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా?

PREV
16
భోగి మూవీ రివ్యూ

శర్వానంద్‌ ఇటీవల వరుస సినిమాలతో అలరిస్తున్నారు. `నారి నారి నడుమ మురారి`, `బైకర్‌` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు `భోగి` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించారు. శ్రీ సత్య ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్‌ 27)న విడుదలైంది. మరి మూవీ ఎలా ఉంది. శర్వానంద్‌ కి కమర్షియల్‌ బ్రేక్‌ దక్కిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
భోగి మూవీ కథ ఇదే

ఆదిలాబాద్‌ జిల్లాలోని బొగ్గులగుట్టలో 1963లో జరిగే కథ ఇది. ఊర్లల్లో పటేల్‌ వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజులు. ఓసారి చెరువు కట్ట తెగి ఊరంతా కొట్టుకుపోతుంది. ఇలాంటి విపత్తుల నుంచి బయటపడాలంటే అమ్మోరికి పండగా చేయాలని ఊరి పెద్ద పటేల్‌(శరత్‌ లోహితస్వ) నిర్ణయిస్తారు. ఆ రోజు రాత్రి ఊర్లో కొందరు పాలేగాళ్లు అర్థరాత్రి అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి అడవుల్లో వదిలేస్తారు. ఇలా వరుసగా ఊర్లల్లో అమ్మాయిలు రాత్రిళ్లు పడుకున్నోళ్లు పడుకున్నట్టుగానే మాయమవుతుంటారు. అదొక మిస్టరీగా ఉంటుంది.

ఇక గంగా(శర్వానంద్‌) విషయానికి వస్తే ఆయనకు ఐదుగురు చెల్లెళ్లు, అమ్మానాన్న లేరు. తనే వాళ్లకి అమ్మా నాన్న. ఆ పక్కనే మరదలు సులోచన(అనుపమా పరమేశ్వరన్‌) ఉంటుంది. ఆమెని చిన్నప్పట్నుంచి ప్రేమిస్తాడు గంగా. ఇంతలో గంగా అన్న మాయదారి రోగంతో మంచానపడతాడు. ఊర్లో చాలా మంది జనం ఇలాంటి రోగాల బారిన పడుతుంటారు.

దీనికి మరోసారి అమ్మోరుకి పండగా చేయాలని నిర్ణయిస్తాడు పటేల్‌. ఆ రోజు రాత్రి ఎప్పటిలాగే అమ్మాయిల కిడ్నాప్‌ కోసం పాలెగాళ్లు వెళ్తారు. తన అన్న స్థానంలో గంగా వెళ్లాల్సి వస్తుంది. అప్పటి వరకు వీళ్లు ఏం చేస్తున్నారనేది ఆయనకు తెలియదు. అమ్మాయిలను కిడ్నాప్‌ చేస్తున్న విషయం తెలిసి వాళ్లని అడ్డుకొని ఆ అమ్మాయిలను కాపాడతాడు. దీంతో తన పటేల్‌ చేయాల్సి యాగం భగ్నం అవుతుంది. అతన్ని చంపేయాలని పటేల్‌ ఆదేశిస్తాడు. కానీ అంతలోనే గంగా అన్న చనిపోతాడు.

ఆ తర్వాత పటేల్‌ గంగాని పిలిచి వార్నింగ్‌ ఇవ్వగా, పటేల్‌కి ఎదురుతిరుగుతాడు గంగా. బలిని అడ్డుకుంటానని సవాల్‌ విసురుతాడు. కానీ ఆ రోజు రాత్రి తన ఐదుగురు చెల్లెళ్లు కిడ్నాప్‌ అవుతారు. మరి వారిని గంగా కాపాడుకున్నాడా? పటేల్‌ అమ్మోరికి బలిచ్చాడా? ఈ అమ్మోరు బలివెనుక ఉన్న కుట్ర ఏంటి? వరుసగా అమ్మాయిలు ఎందుకు బలవుతున్నారు? ఇందులో మందారం(డింపుల్‌ హయతి) పాత్రేంటి? క్లైమాక్స్ లో ఉన్న ట్విస్ట్ ఏంటి? అనేది మిగిలిన సినిమా.

36
భోగి మూవీ విశ్లేషణ

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ యాస, ప్రాంతం, కల్చర్‌ని ఆవిష్కరించడం విశేషం. ఇలాంటి చిత్రాలు ఆదరణ పొందుతున్నాయి. కానీ వీటిలో సరైన కథాబలం లేకుండా చాలా సినిమాలు వస్తున్నాయి. మొన్న వచ్చిన `ప్యారడైజ్‌` అలాంటిదే, ఇప్పుడు వచ్చిన `భోగి` కూడా ఆ కోవకు చెందినదే. యాక్షన్‌, రా అండ్‌ రస్టిక్‌ అంశాలను తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌ని మేళవించి చేసిన ప్రయత్నం ఈ చిత్రం.

కానీ ఆ స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో మాత్రం మేకర్స్ ఫెయిల్‌ అయ్యారు. సినిమాని ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభించారు. సస్పెన్స్ అంశాలతో, భారీతనంతో కథని ఓపెన్‌ చేసిన తీరు బాగుంది. సినిమాపై అంచనాలను పెంచింది. పటేల్‌ వ్యవస్థ, దానికిచ్చిన హైప్‌ బాగుంది. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో లేదు. క్రమంగా గ్రాఫ్‌ పడిపోతూ వస్తుంది.

శర్వానంద్‌ మడుగుల్లో పడిపోయిన సీన్‌ బాగుంది. దాన్ని ఇంటర్వెల్‌కి జస్టిఫికేషన్‌ చేయడం కూడా బాగుంది. కానీ హీరో వారి చెల్లెళ్లతో వచ్చే సీన్లు, వారికి మ్యారేజ్‌ సీన్లు అంతగా సహజంగా అనిపించలేదు. వారిటిలో ఎమోషన్‌ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు. కాకపోతే శర్వానంద్‌, అనుపమా మధ్య వచ్చే సీన్లు కొంత వరకు మెప్పిస్తాయి. అమ్మాయి కిడ్నాప్‌, దాన్ని హీరో ఎదురించడం, అనంతరం పర్యావసనాలు ఊహించినట్టుగానే ఉంటాయి. కానీ ఇంటర్వెల్‌లో హీరో ఏం చేయలేకపోవడం, బలికి సంబంధించిన సీన్లతోనే సినిమా అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అక్కడ హీరోయిజం చచ్చిపోయింది.

సెకండాఫ్‌ అంతా పటేల్‌పై ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. ఇంతలో అమ్మోరు బలి వెనుక ఉన్న ట్విస్ట్ లు, టర్న్ లో కూడా ఏమాత్రం పండలేదు. సెకండాఫ్‌ని నడిపించడం కోసం అల్లిన కథలుగానే ఉన్నాయి. సినిమాకి అవి న్యాయం చేయలేకపోయాయి. పటేల్‌పై హీరో ప్రతీకారం కూడా బాగా సాగదీశారు. ఒకటి రెండు సార్లు ఎటాక్‌ చేసినా తప్పించుకోవడం కనెక్టింగ్‌ గా లేదు. బొగ్గు డ్రామా పండలేదు. చివరికి విలన్‌ ఎవరనేది క్లారిటీ మిస్‌ అయ్యింది.

సెకండాఫ్‌ మొత్తం యాక్షన్‌ ప్రధానంగానే సాగుతుంది. ఇక వాటిలో ఎన్ని తలలు లేస్తాయనేది లెక్కేలేదు. తన చెల్లెళ్లకి సంబంధించిన పెయిన్‌ ని శర్వానంద్‌ క్యారీ చేయలేకపోయారు. దీంతో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. దీనికితోడు వరుసగా చంపడం, నరకడం కామన్‌గా మారిపోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఏమాత్రం పండలేదు. దీంతో సినిమా తేలిపోయింది.

ఆర్‌ఆర్‌ కొంత వరకు బతికించే ప్రయత్నం చేసినా, సరైన కథాగమనం, లేకపోవడం, ముగింపు లేకపోవడం సినిమానే చంపేశాయని చెప్పొచ్చు. డింపుల్‌ హయతి పాత్ర కూడా ఇరికించినట్టుగానే ఉంటుంది. దీంతో `టాక్సిక్‌`, `ప్యారడైజ్‌` లాగా భారీతనం, భారీ కథ, నరబలికి సంబంధించిన అంశాలు, హీరో కష్టం ఇలా అన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోయింది.

46
భోగి మూవీలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

గంగా పాత్రలో శర్వానంద్‌ అదరగొట్టాడు. పాత్రలో జీవించే ప్రయత్నం చేశాడు. కానీ తెలంగాణ యాస విషయంలో తేలిపోయాడు. నటుడిగా మెప్పించాడు. యాక్షన్‌ తో అదరగొట్టాడు. సులోచనగా అనుపమా పరమేశ్వరన్‌ నేచురల్‌గా చేసి మెప్పించింది. డీ గ్లామర్‌ లుక్‌తోనూ మెప్పించింది. ఉన్నంతసేపు అందరి దృష్టి తనవైపు తిరిగేలా చేసింది.

పటేల్‌గా శరత్‌ లోహితస్వ బాగా మెప్పించాడు. పటేల్‌ని గుర్తు చేశాడు. అదే సమయంలో రెగ్యూలర్‌ విలన్‌ని తలపించాడు. మందారంగా డింపుల్‌ గ్లామర్‌కి పరిమితమయ్యింది. ఆమెపై వచ్చే సీన్లు కొన్ని ఆకట్టుకుంటాయి. గంగా మామగా లాల్‌ పాత్రలో జీవించాడు. గంగా చెల్లెళ్లుగా చేసిన అమ్మాయిలు కూడా అంతే సహజంగా చేసి మెప్పించారు. పూజరి, ఇతర పాత్రలు పోషించిన వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

56
భోగి మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

విజువల్‌గా సినిమా బాగుంది. గ్రాండియర్‌ గా ఉన్నాయి. లొకేషన్లు బాగున్నాయి. కలర్‌ టోన్‌ కూడా గ్రాండియర్‌నెస్‌ని తీసుకొచ్చింది. ఇక భీమ్స్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. నర్సిరెడ్డి పాడిన పాటలు, అన్నా చెల్లెళ్లలపై వచ్చే పాట, మాంటేజ్‌ సాంగ్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే అవి ఇంకా బాగా ఎలివేట్‌ కావాల్సింది. బీజీఎం అదిరిపోయింది. బీజీఎం రేంజ్‌లో సీన్లు లేకపోవడంతో చాలా సీన్లు తేలిపోయాయి. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి.

సినిమా రిచ్‌గా ఉంది. రాజీ లేకుండా నిర్మించారు. కానీ అనవసరమైన భారీతనం అని చెప్పొచ్చు. దర్శకుడు సంపత్‌ నంది మంచి కథని ఎంచుకున్నాడు. కథనం విషయంలో మిస్‌ ఫైర్‌ అయ్యాడు. డైలాగ్స్ అదిరిపోయాయి. పాత్రల పేర్లు, డైలాగుల, పోయెటిక్‌ నెస్‌, రైటింగ్‌ బాగుంది. కొన్ని సీన్లకి లింక్‌ చేసిన తీరు బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఆయన సక్సెస్‌ కాలేకపోయారు. తలాతోక లేని సినిమాని తీసిన ఫీలింగ్‌ని కలిగించారు. కాకపోతే కొన్ని సీన్లని మాత్రం బాగా డీల్‌ చేశాడని చెప్పొచ్చు.

66
ఫైనల్‌గా

మూఢనమ్మకాలతో చేసే నరబలి ఎంత ప్రమాదకరం అనేది తెలియజేసే చిత్రమిది. దానికి తెలంగాణ పటేల్‌ వ్యవస్థ నేపథ్యాన్ని మేళవించి రూపొందించిన తీరు బాగున్నా, దాన్ని తెరపై ఆవిష్కరించడంలో, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌ని కూని చేసిన మరో సినిమా.

రేటింగ్‌: 1.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories