
కీర్తిసురేష్ కి హిట్లు లేక చాలా కాలం అవుతుంది. ఆమె చివరగా `దసరా` మూవీతో హిట్ కొట్టింది. ఆ తర్వాత చిరంజీవితో `భోళా శంకర్` చిత్రంలో నటించింది. ఈ సినిమా డిజప్పాయింట్ చేసింది. అప్పట్నుంచి మళ్లీ తెలుగులో కనిపించలేదు. కాకపోతే ఆ మధ్య ఓ ఓటీటీ మూవీలో మెరిసింది. ఇప్పుడు తమిళంలోనే బిజీగా ఉంటుంది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ రాణిస్తోంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. ఇప్పటికైనా హిట్ కొట్టాలని ఇప్పుడు `రివాల్వర్ రీటా` అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంలో రూపొందింది. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం(నవంబర్ 28న)ని తమిళంతోపాటు తెలుగులోనూ అదే పేరుతో విడుదలయ్యింది. మరి ఈ చిత్రంతో అయినా కీర్తి సురేష్ హిట్ కొట్టిందా అనేది తెలుసుకుందాం.
రీటా(కీర్తి సురేష్) ఒక బేకరీలో పనిచేస్తుంటుంది. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ చెల్లమ్మ(రాధికా శరత్ కుమార్) తమ ముగ్గురు ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఓ రోజు రీటా అక్కడ కూతురు బర్త్ డే. సాయంత్రం చుట్టుపక్కన ఉన్నవాళ్లందరిని పిలిచి కేక్ కట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇంతలోనే పాండిచెర్రిలోనే పెద్ద రౌడీ అయిన డ్రాకులా పాండియన్ తన ఇంటికి వస్తాడు. అమ్మాయి కోసం వేరే ఇంటికి వెళ్లాల్సిన పాండియన్ మత్తులో రీటా ఇంటికి వచ్చి వాళ్లని గన్‌తో బెదిరిస్తాడు. దీంతో ఏం చేయాలో తోచక రీటా, వాళ్ల అమ్మ అతని తలపై గట్టిగా కొట్టడంతో కిందపడి చనిపోతాడు. దీంతో ఏం చేయాలో తెలియని ఆయోమయంలో పడతారు. ఆ రాత్రికి బాడీని ఫ్రిజ్‌లో దాచి మార్నింగ్ బయటకు తీసుకెళ్లి పూడ్చిపెట్టాలని ప్లాన్ చేస్తారు. ఏం తెలియనట్టుగానే ఆ రాత్రి బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు. ఇక బాడీని బయటకు తీసుకెళ్లడానికి ఓ కారుని కొంటారు. బ్యాగ్‌లో బాడీని కుక్కి కారు డిక్కీలో వేసుకొని ఓ ఫారెస్ట్ లో పాతిపెట్టాలని ప్లాన్ చేస్తారు. మధ్యలో పెట్రోల్ బంక్ వద్ద వెనకాల డ్రాకులా బాబీ(సునీల్) మనుషుల కార్ అనుకోకుండా ఢీ కొడుతుంది. ఫారెస్ట్ లోకి వెళ్లాక ఆ డిక్కీ ఓపెన్ కాదు. దీంతో లాభం లేదని భావించి మొదట పాండిచ్చెరి యూనివర్సిటీలో రీటా చెల్లిని డ్రాప్ చేసి మెకానిక్ షాప్‌కి వెళ్తారు. మెకానిక్ తాత్కాలికగా డిక్కీ రిపేర్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్లే సమయంలోనే మధ్య పోలీసు ఇన్‌స్పెక్టర్ కామరాజ్(జాన్ విజయ్) అడ్డు పడతాడు. అతనికి అప్పటికే పాండ్యన్ మిస్సింగ్ విషయం తెలిస్తోంది. కొడుకు డ్రాకులా బాబీ(సునీల్) ఓ వైపు, ఈ పోలీసులు మరో వైపు వెతుకుతుంటారు. ప్యాండ్యన్ కారుని రీటా వాళ్లే వాడుతున్నారని తెలుస్తుంది. దీంతో ఈ కేసులో రీటా ఇరికించాలనుకుంటాడు పోలీస్. వీరికి గతంలో ఓ గొడవ ఉంటుంది. ఆ గొడవకి సంబంధించి ఈ రూపంలో ప్రతీకారం తీసుకోవాలని పోలీస్ భావిస్తాడు. మరోవైపు పాండ్యన్‌ని చంపేందుకు రెడ్డి దగ్గర సుఫారీ తీసుకుంటుంది మాస్టర్ గ్యాంగ్. పాండ్యన్‌ని చంపేశామని రెడ్డితో ఐదు కోట్ల డీల్ సెట్ చేసుకుంటారు. రీటా వద్ద ఉన్న పాండ్యన్ బాడీని తీసుకెళ్లి రెడ్డికి ఇచ్చి ఐదు కోట్లు కొట్టేయాలన్నది వాళ్ల ప్లాన్. పాండ్యన్ కేసు చుట్టూ అటు పోలీసులు, ఇటు డ్రాకుల బాబీ, రెడ్డి, రీటా ఫ్యామిలీ తిరుగుతుంది. మరి ఈ కేసు నుంచి రీటా ఫ్యామిలీ ఎలా బయటపడింది? ఈ క్రమంలో వాళ్లు వేసిన స్కెచ్ ఏంటి? దీనికి ఎవరెవరు బలి అయ్యారు, ఎవరు బకరా అయ్యారు, రీటా తండ్రి మరణానికి, రెడ్డికి ఉన్న సంబంధమేంటి? అనేది మిగిలిన కథ.
కామెడీ నేపథ్యంలోసాగే క్రైమ్ డ్రామా చిత్రాలు రెగ్యూలర్‌గానే వస్తుంటాయి. ఒక శవాన్ని బేస్ చేసుకుని దాని చుట్టూ కామెడీ డ్రామా మేళవింపుతోనూ చాలా సినిమాలు వస్తున్నాయి. ఇందులో కామెడినే చాలా ముఖ్యం. సినిమాలోని ఆయా పాత్రలు ఫేస్ చేసే కన్‌ఫ్యూజన్, భయం, టెన్షన్ నుంచి కామెడీని జనరేట్ చేస్తుంటారు. అది ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అందులో కామెడీ పండితేనే సినిమా హిట్, లేదంటే నిరాశ తప్పదు. ఇప్పుడు `రివాల్వర్ రీటా` విషయంలోనూ అదే జరిగింది. శవన్నా మాయం చేయడం కోసం రీటా ఫ్యామిలీ పడే బాధలు, ఆ శవం కోసం రౌడీ గ్యాంగ్ వెతకడం, మరోవైపు ఆ రౌడీ కొడుకు వెతకడం, ఇంకోవైపు ఆ శవంపై కోట్ల విలువ చేసే డీల్ నడవడం వంటివి ఇందులో ఆసక్తికర ఎలిమెంట్లు. ఈ నాలుగు రకాల స్టోరీలను మిక్స్ చేసి ఈ సినిమాని రూపొందించారు. అన్నింటిని ఒక చోటుకి తీసుకొచ్చి ఫినిషింగ్ టచ్ ఇవ్వడమే ఈ సినిమా కథ. ఈ జర్నీలో రీటా ఫ్యామిలీ సడే స్ట్రగుల్స్ కామెడీగా చూపించారు. కానీ అదే ఇందులో వర్కౌట్ కాలేదు. ప్రారంభంలోనే ఈ కథేంటో అర్థమైపోతుంది. దాన్ని ఎలా తీసుకెళ్లారనేది ముఖ్యం. కానీ ఇందులో కామెడీ వర్కౌట్ కాకపోవడంతో చాలా డ్రైగ్‌గా సాగుతుంది. డ్రామా ఏమాత్రం పండలేదు. డ్రామా, టెన్షన్, రేసింగ్ ఏదీ ఆసక్తికరంగా అనిపించవు. ఎంగేజ్ చేసే ఎలిమెంట్లు ఒక్కటి కూడా లేవు. ఒక గ్యాంగ్ తర్వాత మరో గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడం, డబ్బు కోసం ఒకనొకరు చంపుకోవడం బాగా సాగదీసినట్టుగా రొటీన్‌గా అనిపిస్తుంది. రీటా ఫ్యామిలీ మధ్య సీన్లలోనూ కామెడీ తేలిపోయింది. ఇక ఒక గ్యాంగ్ తర్వాత మరో గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడం కూడా ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. రెడ్డి పాత్ర సైతం బాగా చిరాకు తెప్పిస్తుంది. ఆయన ఎంతసేపు ఒకే డైలాగ్‌తో వాగుతా ఉంటాడు. అదే బోరింగ్‌గా ఉంటుంది. కథ ఎంతసేపు అక్కడే ఆగిపోయినట్టుగా ఉంటుంది. క్రైమ్‌లో సీరియస్ నెస్ లేదు, కామెడీలో రియాలిటీ లేదు. దీంతో సీన్లు వస్తూ పోతుంటాయి తప్పితే, ఎక్కడా ఆడియెన్స్ సినిమాతో కనెక్ట్ కాలేకపోతుంటారు. దీంతో నవ్వించలేక, ఎంగేజ్ చేయలేకపోయింది. సెకండాఫ్‌లో వరుసగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు పెట్టారు. ఎలివేషన్లు ఇచ్చారు. కానీ అవన్నీ టైమ్ పాస్ వ్యవహారాలుగానే ఉన్నాయి. రైటింగ్ చాలా వీక్‌గా ఉంది. స్క్రీన్‌ప్లే రొటీన్‌గా అనిపించింది. సినిమాలో రెడిన్ కింగ్‌స్లే పాత్ర కాస్త రిలీఫ్ అని చెప్పొచ్చు. ప్రారంభంలో ఆయన పాత్ర కూడా చిరాకుగానే ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో మాత్రం నవ్వించింది. క్లైమాక్స్ కాస్త ట్విస్ట్ లు, టర్న్ లతో ఫర్వాలేదనిపిస్తుంది. కానీ సినిమా మొత్తం బోరింగ్‌గా సాగుతుందని చెప్పొచ్చు.
రీటా పాత్రలో కీర్తి సురేష్ చాలా బాగా నటించింది. ఆమె కామెడీ వర్కౌట్ కాకపోయినా, నటిగా మాత్రం మెప్పిస్తుంది. ఆమె ఇచ్చే ట్విస్ట్ లు మాత్రం వాహ్ అనిపిస్తాయి. ఇక తల్లి పాత్రలో రాధికా శరత్ కుమార్ బాగా చేసింది. ఆమె పాత్ర కొంత వరకు నవ్వించిందని చెప్పొచ్చు. డ్రాకులా బాబీగా సునీల్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. కాకపోతే చివరికి ఆయన పాత్ర తేలిపోయింది. రెడ్డి పాత్రలో అజయ్ ఘోష్ బాగా చేశాడు. తనకు మంచి పేరు తెచ్చే పాత్ర అవుతుంది. పోలీస్‌గా జాన్ విజయ్ పాత్ర సైతం అలరిస్తుంది. చెతా గా రెడిన్ కింగ్ స్లే మాత్రం నవ్వించాడు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
సినిమాలో సీన్‌రోల్డన్ సంగీతం ఫర్వాలేదు. బీజీఎం ఆకట్టుకుంది. కానీ ఎలివేట్ అయ్యేలా లేదు. దినేష్ క్రిష్ణన్ కెమెరా వర్క్ కూడా బాగుంది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రవీన్ కేఎస్ ఎడిటింగ్ ఇంకా క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. దర్శకుడు జేకే చంద్రు ఒక రొటీన్ స్టోరీని ఎంచుకున్నారు. దాన్ని కామెడీగా, ఎంగేజింగ్‌గా, ట్విస్ట్ లతో నడిపించాడా అంటే అది కూడా లేదు. ట్విస్ట్ ల మీద ట్విస్టులు బాగానే రాసుకున్నాడు, కానీ అవి అంతగా కనెక్ట్ అయ్యేలా, వాహ్ అనే ఫీలింగ్‌ని తీసుకురాలేకపోయాయి.
ఫైనల్‌గా: రొటీన్ క్రైమ్ కామెడీ డ్రామా `రివాల్వర్ రీటా`. కీర్తి సురేష్ మరోసారి డిజప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు.
రేటింగ్ 2