`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ పోతినేనికి ఎట్టకేలకు హిట్‌ పడిందా?

Published : Nov 27, 2025, 01:21 PM IST

రామ్‌ పోతినేని హీరోగా నటించిన `ఆంధ్ర కింగ్‌ తాలూకా` నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. మరి ఈ సినిమా ఆకట్టుకునేలా ఉందా? 

PREV
17
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ రివ్యూ

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేనికి సక్సెస్‌ లేక చాలా కాలం అవుతుంది. ఆరేళ్లుగా ఆయనకు హిట్లు లేవు. చివరగా `ఇస్మార్ట్ శంకర్‌`తో హిట్‌ కొట్టాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు రామ్‌. ప్రస్తుతం ఆయన `ఆంధ్ర కింగ్‌ తాలూకా` అనే చిత్రంలో నటించారు. ఇందులో హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` ఫేమ్‌ మహేష్‌ బాబు పి దీనికి దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ నేడు గురువారం (నవంబర్‌ 27) విడుదల అయ్యింది. మరి సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? రామ్‌ పోతినేనికి హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ కథ ఏంటంటే

సూర్య(ఉపేంద్ర) పెద్ద స్టార్‌ హీరో. ఆయన నటిస్తున్న 100వ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. సినిమా పూర్తి చేయడానికి ఇంకా మూడు కోట్లు కావాలని, తన వద్ద బడ్జెట్‌ అయిపోయిందని నిర్మాత చేతులెత్తేస్తాడు. సినిమా ఆగిపోవడంతో సూర్యకి ఒక్కసారిగా జీరో అయిన పరిస్థితి. తనకు తెలిసిన చాలా మంది నిర్మాతలను అడిగినా ఎవరూ ముందుకు రారు. ఆయనకు వరుసగా ఫ్లాప్‌లు ఉండటంతో ఎవరూ ఆ సాహసం చేయరు. దీంతో చివరికి ఓ నిర్మాత డిమాండ్‌ మేరకు క్యారెక్టర్‌ చేయడానికి కూడా రెడీ అవుతాడు. ఆ సమయంలో సూర్య ఖాతాలో రూ.3కోట్లు డిపాజిట్‌ అవుతాయి. ఆ డబ్బువేసింది ఎవరని ఆరా తీస్తే తన ఆంధ్ర కింగ్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు సాగర్‌(రామ్‌ పోతినేని) అని తెలుస్తుంది. అతన్ని కలిసేందుకు హీరో సూర్య స్వయంగా రాజమండ్రి వెళ్తాడు. ఈ క్రమంలో అతని గురించి ఆరా తీయగా, చిన్నప్పట్నుంచి అతను తన అభిమాని అని, కరెంట్‌ కూడా లేని రాజమండ్రి దగ్గర్లోని గోడపల్లి లంక గ్రామానికి చెందిన కుర్రాడు అని తెలుస్తోంది. సాగర్‌ని చదివించాలని నాన్న(రావు రమేష్‌) చాలా ప్రయత్నిస్తాడు. కానీ స్కూల్‌ టీచర్లు తక్కువ చేసి మాట్లాడతారు. దారుణంగా అవమానిస్తారు. ఆ అవమానం సమయంలో హీరో సూర్య ఓ సినిమాలో చెప్పిన మాటలు ఆయన్ని బాగా ప్రభావితం చేస్తాయి. పడి లేవాలని, నిలబడి పోరాడాలనే ధైర్యాన్నిస్తాయి. అదే ధైర్యంతో ముందుకు సాగుతాడు. తనలో ధైర్యం నింపిన హీరో సూర్యని చిన్నప్పట్నుంచి ఆరాధిస్తుంటాడు సాగర్‌. అందరు అభిమానుల్లాగే తన హీరో సినిమా రిలీజ్‌ అవుతుందంటే హడావుడి, హంగామా చేస్తుంటారు. తాను చదివే కాలేజీలోనూ సూర్యపై అభిమానం చూపిస్తుంటాడు. మహాలక్ష్మి థియేటర్‌ వీరికి అడ్డా. అందులో ఓ సారి షో లేట్‌ అవుతుంది. దీంతో థియేటర్‌ అద్దాలు పగలగొడతాడు. ఆ సమయంలో మహాలక్ష్మి(భాగ్యలక్ష్మి బోర్సే) కనిపిస్తుంది. ఆమె థియేటర్‌ ఓనర్‌ పురుషోత్తమ్‌(మురళీ శర్మ) కూతురు. వీరిద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలిసి పురుషోత్తమ్‌ దారుణంగా అవమానిస్తాడు. ఆ అవమానం భరించలేక ఆయనతో ఒక సవాల్‌ విసురుతాడు. ఆ సవాల్‌ ఏంటి? అందులో సక్సెస్‌అయ్యాడా? మహాలక్ష్మిని తన వశం చేసుకున్నాడా? అభిమాన హీరోని కలిశాడా? సూర్యని నిలబెట్టేందుకు సాగర్‌ ఎంతటి త్యాగం చేశాడనేది మిగిలిన కథ.

37
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ విశ్లేషణ

సినిమా కథలతో, అందులోనూ హీరో, అభిమాని మధ్య బాండింగ్‌ నేపథ్యంలో అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ అరుదు అనే చెప్పాలి. అవి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలోనే విఫలమవుతున్నాయి. కాకపోతే క్రిటికల్‌గా ప్రశంసలందుకుంటాయి. ఇటీవల వచ్చిన `కాంత` కూడా నిరాశ పరిచింది. తాజాగా `ఆంధ్ర కింగ్‌ తాలూకా` హీరో కోసం అభిమాని చేసిన త్యాగం నేపథ్యంలో సాగే చిత్రం. ఒక అభిమాని బయోపిక్‌ గా చెప్పొచ్చు. అయితే సినిమా అంశాలు పక్కన పెడితే ఇందులో హీరో తాలూకూ బాల్యంలోని స్ట్రగుల్‌ ఉంటుంది. అవమానాలు ఉంటాయి. హీరోని అభిమాన హీరో మాటలు ప్రభావితం చేయడం ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. అదే సమయంలో సినిమా 1986 నుంచి 2002 మధ్య జరుగుతున్న నేపథ్యంలో అప్పటి లంక గ్రామాల పరిస్థితులను కళ్లకి కట్టినట్టు చూపించారు. దీనికితోడు హీరోయిన్‌తో లవ్‌ట్రాక్‌ ఉంటుంది. ఇలా మూడు అంశాలను బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్లారు. అదే సమయంలో కాలేజీలో గొడవలు కూడా ఉంటాయి. వీటిని మేళవిస్తూ రూపొందించిన తీరు బాగుంది. ఇక హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్‌ కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఆకట్టుకునేలా ఉంటుంది. యూత్‌కి కొన్ని ఎలిమెంట్లు బాగా కనెక్ట్ అవుతాయి. హీరోయిన్‌ ఫాదర్‌తో హీరో రామ్‌ సవాల్‌ చేయడం, దానికోసం ఆయన పడే తపన, ఊరిని మేల్కొలిపే సీన్లు ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. సెకండాఫ్‌ అంతా ఎమోషనల్‌గా, సీరియస్‌గా సాగుతుంది. ప్రేమ కోసం, అటు అభిమాని హీరో కోసం, థియేటర్‌ కట్టాలనే తపన కోసం, మరోవైపు సినిమాలో హీరోని నిలబెట్టడం కోసం పడే తపన ఆద్యంతం కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా రన్‌ అవుతుంది. అభిమాని కోసం హీరో వెళ్లడం, ఈ జర్నీలో అతని గురించి ఒక్కో విషయం రివీల్‌ అయిన తీరు ఎంగేజ్‌ చేస్తుందని చెప్పొచ్చు. మధ్య మధ్యలో అడపాదడపా ఫన్‌ కూడా ఉంటుంది.

47
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీలోని హైలైట్స్, మైనస్‌లు

సినిమాలో హీరోయిన్‌ పరిచయం చేసే సీన్లు, ఆమెతో లవ్‌ ట్రాక్‌, సత్య కామెడీ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. మరోవైపు హీరో ఉపేంద్ర సీన్లు కూడా మెప్పిస్తాయి. అభిమాని కోసం వస్తూ ఆయన మరో అభిమానిని కలిసినప్పుడు వచ్చే సీన్లు వాహ్‌ అనిపిస్తాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది. ఎమోషనల్‌గా కట్టిపడేస్తుంది. దీనికితోడు రామ్‌ లుక్‌, ఆయన డైలాగ్స్ బాగుంటాయి. ఊరిని ఇన్‌స్పైర్‌ చేసే సీన్లు బాగుంటాయి. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషనల్‌ సీన్లు కూడా బాగుంటాయి. హీరోయిన్‌ తండ్రితో హీరో చేసే సవాల్‌ మెప్పిస్తుంది.

కానీ సినిమా చాలా వరకు రొటీన్‌ గా సాగుతుంది. ఫస్టాఫ్‌ అంతా చాలా డ్రైగా సాగుతుంది. ఫన్‌ ఆశించిన స్థాయిలో లేదు. సినిమాకి సంబంధం లేని సీన్లు కనిపిస్తాయి. కథని డైవర్ట్ చేస్తుంటాయి. సెకండాఫ్‌ మొత్తం రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాని తలపిస్తుంది. చాలా రొటీన్‌గా ఉంటుంది. ఏమాత్రం కొత్తదనం కనిపించదు. వంద సినిమాలు చేసిన హీరో మూడు కోట్లకి ఇబ్బంది పడటం, మళ్లీ జీరో అయిపోవడమనే ఎలిమెంట్‌ లాజిక్‌ లెస్‌గా ఉంది.  క్లైమాక్స్ లో ఫ్లడ్‌ ఎలిమెంట్‌ ఎమోషన్స్ కోసం పెట్టారు, కానీ అవి సినిమాకి అస్సలు సెట్‌ కాలేదనిపిస్తుంది. అంతిమంగా సినిమా అభిమానుల కోసం ఈ సినిమా తీసినట్టుగా ఉందిగానీ, సాధారణ ఆడియెన్స్‌ సినిమాని ఎందుకు చూడాలనే విషయంలో ఇది ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది.

57
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీలో నటీనటులు ఎలా చేశారు?

సాగర్‌ పాత్రలో హీరో రామ్‌ అభిమానిగా చాలా బాగా చేశాడు. బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఈ సినిమా నటుడిగా రామ్‌కి మంచి పేరుని తెస్తుంది. ఎమోషనల్ సీన్లు, నత్తి సీన్లలో అదరగొట్టాడు. లవ్‌ ట్రాక్‌లోనూ బాగా చేశాడు. ఒక అభిమానిగా ఆయన పడే తపన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాకపోతే రామ్‌ తాలూకూ యాక్షన్‌ కొంత మిస్‌ అయిన ఫీలింగ్‌ అనిపిస్తుంది. ఇక మహాలక్ష్మి పాత్రలో హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే ఉన్నంతలో బాగా చేసింది. ఆమె లుక్‌ చాలా బాగుంది. ఆకట్టుకుంటుంది. కాకపోతే ఆమె పాత్రకి ఎక్కువగా స్కోప్‌ లేదు. ఇక సాగర్‌ తండ్రిగా రావు రమేష్‌ ఇరగదీశాడు. అవమానాలతో మదనపడే పాత్రలో బాగా చేశాడు. హీరోయిన్‌ తండ్రిగా మురళీ శర్మ తనకు యాప్ట్ గా నిలిచే పాత్రలో మెప్పించాడు. హీరో సూర్య పాత్రలో ఉపేంద్ర యాప్ట్ అనిపించుకున్నారు. ఆయన నటన అదిరిపోయింది. బాధపడే సీన్లు, అభిమాని కోసం ఆయనే స్వయంగా వచ్చే సీన్లలో ఉపేంద్ర అదరగొట్టారు. క్లైమాక్స్ ని తనవైపు తిప్పుకున్నారు. రాహుల్‌ రామకృష్ణ కూడా చాలా రోజుల తర్వాత తనకు యాప్ట్ అయ్యే పాత్రలో అలరించారు. సత్య కామెడీ నవ్విస్తుంది. ఈ సినిమాకి కామెడీ పరంగా సత్య పాత్ర ఒక్కటే రిలీఫ్‌ అని చెప్పొచ్చు. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

67
`ఆంధ్ర కింగ్‌ తాలూకా` మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

వివేక్‌, మెర్విన్‌ సంగీత ద్వయం మ్యూజిక్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. పాటలు బాగున్నాయి. బీజీఎం కూడా అదిరిపోయింది. సిద్ధార్థ నూని కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కట్టిపడేస్తాయి. కొత్తగానూ ఉంటాయి. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ మైనస్ గా చెప్పొచ్చు. సినిమా చాలా స్లోగా, సాగదీసినట్టుగా ఉంటుంది. చాలా అనవసరమైన సీన్లు ఉంటాయి. వాటిని కట్‌ చేయోచ్చు. దర్శకుడు మహేష్‌ బాబు పి ఎంచుకున్న కథనే చాలా హార్డ్ గా ఉంది. ఇది రెగ్యూలర్‌ ఆడియెన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందనే లాజిక్‌ మిస్‌ అయ్యారు. సినిమా జనాలకు అర్థమయ్యేలా ఉంటుందిగానీ, కామన్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. పైగా హీరో, అభిమాని మధ్య బాండింగ్‌ అని చెప్పి, రెగ్యూలర్‌ కమర్షియల్‌ ట్రాక్‌లో తీసుకెళ్లడం పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషనల్‌ సీన్లని బాగా డీల్‌ చేశాడు. ఫన్‌పై మరింత వర్క్ చేయాల్సింది. హీరో, అభిమాని మధ్య బాండింగ్‌ని కూడా ఇంకా బాగా చూపించాల్సింది.

77
ఫైనల్‌ రిపోర్ట్

సినిమా వాళ్లకి తప్ప, కామన్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేని `ఆంధ్ర కింగ్‌ తాలూకా`.

రేటింగ్‌ః 2.25

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories