రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ

First Published | Jan 10, 2025, 9:37 AM IST

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ. కథ, కథనం, నటన, సాంకేతిక విలువల గురించి వివరణ.

Ram Charan, Game Changer, Movie Review

చాలా కాలంగా  అన్‌ప్రెడిక్ట‌బుల్ అంటూ  ఊరిస్తూ ఎట్టకేలకు  ‘గేమ్ ఛేంజర్’థియేటర్స్ లోకి దిగాడు. భారీ బడ్జెట్ తో శంకర్ రూపొందించిన ఈ సినిమాపై నమ్మకాలు ఉన్నాయి. అపనమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ 2 గాయబ్ అయ్యినప్పటినుంచి ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. అయితే ట్రైలర్ రిలీజ్ తో మళ్లీ బజ్ క్రియేట్ చేసి పాజిటివ్ వైపు టర్న్ చేయగలిగారు.

ఇక ఈ సినిమా దర్శకుడుగా శంకర్ కు, నిర్మాతగా దిల్ రాజుకు, గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా గా రామ్ చరణ్ కు కీలకమైంది. దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది. కథేంటి, శంకర్ మళ్లీ బ్యాంగ్ తో వచ్చి హిట్ ఇచ్చారా,  నిజంగానే సినిమా అన్‌ప్రెడిక్ట‌బుల్ గా ఉందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.


స్టోరీ లైన్
 
సొంత ఊరు వైజాగ్‌కి కలెక్టర్‌గా అడుగుపెడతాడు రామ్ నందన్ (రామ్ చరణ్). నీతి, నిజాయితీ ప్రాణంగా బ్రతికే ఈ  ఐఏఎస్ ఆఫీసర్‌ కి ఆవేశం కాస్త ఎక్కువే. డ్యూటీ ఎక్కిన వెంటనే అవినీతి పరులపై ఉక్కుపాదం మోపే డ్యూటీ ఎక్కేస్తాడు. అది  అవినీతిలో నిండా మునిగి తేలుతున్న మంత్రి  బొబ్బిలి మోపిదేవి (ఎస్.జే సూర్య)కి సహజంగానే నచ్చదు.

యథావిధిగా  తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోపిదేవి. మోపిదేవి ఎంత దుర్మార్గుడు అంటే అధికారం కోసం తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)నే లేపేస్తాడు. అయితే కొడుకు గురించి పూర్తిగా అర్దం చేసుకున్న సత్యమూర్తి ..ఎవరూ ఊహించని విధంగా  రామ్ నందన్‌ని తన వారసుడుగా రాష్ట్ర సీఎంగా ప్రకటిస్తాడు.  అది పార్టీలో ఎవరికీ నచ్చదు. మరీ ముఖ్యంగా మోపిదేవికు అసలు నచ్చదు. 
 



దాంతో రామ్ నందన్ సీఎం అవ్వకుండా అడ్డుపడి ఓ మెలిక పెట్టి తనే సీఎం అవుతాడు. కానీ రామ్ నందన్ తక్కువవాడా. తనూ మోపిదేవి కు ట్విస్ట్ ఇస్తాడు. అక్కడ నుంచి ఇద్దరి మధ్యా ఫేస్ టు ఫేస్  వార్  మొదలవుతుంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కి అవినీతి పరుడైన రాజకీయనాయకుడుకి మధ్య జరిగే ఈ యుద్దంలో ఎవరు గెలిస్తారో అందరికీ తెలుసు.

కానీ ఎలా రామ్ నందన్ గెలుస్తాడు అనేది కీలకం. అదెలా జరిగింది, అలాగే అసలు రామ్ నందన్ ఎవరు? అతని ప్లాష్ బ్యాక్ ఏంటి? హఠాత్తుగా  రామ్ నందన్‌ని ఎందుకు సత్యమూర్తి.... సీఎంగా ప్రకటించాడు? అలాగే అప్పన్న (రామ్ చరణ్)కి రామ్ నందన్‌కి ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 


విశ్లేషణ 

పొలిటికల్ డ్రామాలతోనే తన కెరీర్ ని మొదటి నుంచి నిర్మించుకుంటూ వస్తున్నారు దర్శకుడు శంకర్. అలాగే తను చేసే ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక సామాజిక సందేశం ఉండేలా చూసుకుంటున్నారు. అదే ఆయన్ని ప్రత్యేక దర్శకుడుగా నిలబెట్టింది. ఈసారి తెలుగులో స్ట్రెయిట్ సినిమా ,అదీ రామ్ చరణ్ తో అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఆ విషయం ఆయనకు తెలుసు. అయితే గత కొద్దికాలంగా  ఆయన కథలు గాడి తప్పుతున్నాయి. ఆసక్తికరంగా ఉండటం లేదు.

ఈ సినిమా కథ కూడా ప్రెడిక్టుబుల్ గానే ఉంది. కథ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంటే సమస్య ఉండదు. కానీ ఈ సినిమాలో కథ,కథనం రెండూ చాలా  ప్లాట్ గా నడుస్తూంటాయి.  ఫార్ములా ప్రకారం డిజైన్ చేసారని అర్దమవుతూ ఉంటాయి.  ముఖ్యంగా ఫస్టాఫ్ లో హీరోకు ఎక్కడా ఎదురనేది ఉండదు. కాంప్లిక్ట్ లో పడదు. చాలా ప్యాసివ్ గా ఉండటంతో ఏమీ అనిపించదు. గ్రాండియర్ మేకింగ్ తో చూస్తూండిపోతాం తప్పించి కథా పరంగా ఆసక్తి ఉండదు. 


సెకండాఫ్ కు వచ్చేసరికి మంత్రికి, ఓ ఐఏఎస్ కు మధ్య జరిగే కథగా ఇదీ ఫార్ములానే నడుస్తుంది. ఎక్కడా మనకు ఊహకు అందని మలుపులు కనపడవు. అలాగే హై ఇచ్చే ఎలిమెంట్స్ చాలా పరిమితంగా ఉంటాయి. ఇలాంటి భారీ సినిమాల్లో ఈ మధ్యన హై ఇచ్చే ఎలిమెంట్స్ దే ప్రాధాన్యత అన్నట్లుగా ఉంటున్నాయి.  జనం అవే ఎదురుచూస్తున్నారు. అవి మిస్సయ్యాయి. ఒకే ఒక్క‌డు, శివాజీ వంటి శంకర్ సినిమాలు పదే పదే గుర్తు వస్తూంటాయి.

సినిమాలో శంకర్ మార్క్ ఎక్కడ బాగా కనపడుతుంటే  విజువ‌ల్స్ లోనూ, సెకండాప్ లో వచ్చే  అప్ప‌న్న ఎపిసోడ్ లోనే.  శంకర్ సినిమాల్లో కనిపించే ఎమోషన్స్ సైతం ఇందులో కనిపించవు.  కథ దానిపాటికి అది నడుస్తూంటుంది కానీ మన హృదయాల్లోకి వెళ్లి ఇది మన కథే, హీరో గెలివాలి అనిపించేటంత భావోద్వేగాలు రైజ్ చేయలేకపోయారు. ఏమైపోయింది అపరిచితుడు, జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు నాటి మ్యాజిక్ అని పదే పదే అనిపిస్తుంది.
 


ప్లస్ లు 

పాటలు, గ్రాండియర్ గా తీసిన విజువల్స్
రామ్ చరణ్ లోని నటుడుని బయిటకు తీసుకువచ్చిన సీన్స్
అప్పన్న ఎపిసోడ్

మైనస్ లు 
పాత గా అనిపించే కథ, అందుకు తగినట్లే మరింత  సాగే కథనం
కియారా అద్వాని, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు
ఎమోషన్స్ ఈ భారీ సినిమాకు తగిన స్దాయిలో  పండించలేకపోవటం
 


టెక్నికల్ గా 

శంకర్ వంటి దర్శకుడు సినిమాలో టెక్నికల్ స్టాండర్డ్స్ కు లోటేముంటుంది.  ఛాయాగ్రాహకుడు   తిరు అదిరిపోయే విజువ‌ల్స్‌ ఇచ్చారు. శంకర్ తన మార్క్ తో ప్ర‌తి స‌న్నివేశం గ్రాండియ‌ర్‌గా క‌నిపిస్తుంది. త‌మ‌న్ పాటలు కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి బాగా మార్కులు పడతాయి.  

జ‌ర‌గండి, రా మ‌చ్చా పాట‌లు కు మంచి రెస్పాన్స్ వచ్చింది.   నానా హైరానాకి సినిమాలో పెట్టలేదు. ఎడిటర్ ఎక్కడా లాగ్ లేకుండా పరుగెత్తించాడు. అయితే కంటెంట్ లోనే లాగ్, రొటీన్ ఉండటమే ఇబ్బందిగా మారింది. డైలాగులు కొన్ని చోట్ల బాగానే  పేలాయి. ముఖ్యంగా విలన్ ఎస్ జే సూర్య కు రాసిన డైలాగులు బాగున్నాయి. దిల్ రాజు నిర్మాణ విలువలకు లోటు లేదు.
 


ఎవరెలా చేసారంటే...

రామ్ చరణ్ కు వేరియేషన్స్ చూపించగలిగే పాత్ర దొరకటంతో నటుడుని ఆవిష్కరించగలిగాడు. కియారా అడ్వాణీ  (kiara advani) కు చెప్పుకోవటానికి ఏమి లేదు.   పాటల్లో వచ్చి వెళ్లిపోతుంది. పార్వతిగా అంజ‌లికి మంచి పాత్ర దొరికింది. ఆమె మేకప్ కూడా డిఫరెంట్ గా ఉంది.  

మినిస్ట‌ర్ మోపిదేవిగా  ఎస్‌.జె.సూర్య (SJ Surya) ..నాని శనివారం నాది తర్వాత మరో సారి తన విశ్వరూపం చూపించాడు.   శ్రీకాంత్ లుక్ డిఫరెంట్ గా ప్రజెంట్ చేసి సర్పైజ్ చేసారు.   జ‌యరాం, స‌ముద్ర‌ఖ‌ని, రాజీవ్ క‌న‌కాల జస్ట్ ఓకే అన్నట్లుగా ఉంటారు. సునీల్‌ది సైడ్ యాంగిల్ పాత్ర‌ బాగానే ఉంది. బ్ర‌హ్మానందం గెస్ట్ అప్పీరియన్స్. పృథ్వీ, ర‌ఘుబాబు ఉన్నారంటే ఉన్నారు. లేరంటే లేరు. అలాంటి పాత్రలు.
 

game changer movie


ఫైనల్ థాట్

శంకర్ వంటి దర్శకుడుకి సుజాత వంటి రచయిత మరొకరు దొరకకపోవటం ఎంత ఇబ్బందో మరోసారి ఈ సినిమా తో అర్దమైంది. స్క్రిప్టు పరంగా నాశిగా ఉంటే ఎవరు ఎంత కష్టపడ్డా కొంతవరకే  గేమ్ నిలబడుతుంది. ఛేంజ్ అయ్యేటంత అద్బుతాలు జరగవు. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating: 2.5

Ram Charans Game Changer film

తెర వెనుక..ముందు 

నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, అంజలి, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, జయరామ్‌, నవీన్‌ చంద్ర, వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల తదితరులు; 
సంగీతం: తమన్‌; 
సినిమాటోగ్రఫీ: తిరు; 
ఎడిటింగ్‌: సమీర్‌ మహ్మద్‌, రుబెన్‌; 
కథ: కార్తిక్‌ సుబ్బరాజ్‌; 
నిర్మాత: దిల్‌రాజు;
 స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.శంకర్‌; 
విడుదల తేదీ: 10-01-2025

Latest Videos

click me!