`డ్రింకర్‌ సాయి` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Dec 27, 2024, 3:07 PM IST

చిన్న సినిమాలతో ఈ ఏడాది ముగియబోతుంది. అందులో భాగంగా వచ్చిన చిత్రం `డ్రింకర్‌ సాయి`. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

2024 ఏడాదికి ముగింపు పలకడానికి చిన్న సినిమాలు వస్తున్నాయి. ఈ వారం అన్ని చిత్రాలే విడుదలవుతున్నాయి. అందులో భాగంగా కాస్త బజ్‌ ఉన్న మూవీ `డ్రింకర్ సాయి`. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా నటించారు. కిర్రాక్‌ సీత, రీతూ చౌదరి, పోసాని, భద్రం, సమీర్‌, కాంచి ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కిరణ్‌ తిరుమల శెట్టి దర్శకత్వం వహించారు.  ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్‌, ఇస్మాయిల్‌ షేక్‌, బసవరాజు లహరిధర్‌ సంయుక్తంగా నిర్మించారు. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం నేడు శుక్రవారం(డిసెంబర్‌ 27)న విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
సాయి(ధర్మ)కి అమ్మానాన్న లేరు. ఒంటరిగా ఉన్న బాగా రిచ్‌. ఫ్రెండ్స్ తో అవారాగా తిరుగుతుంటాడు. ఓ రోజు భాగి(ఐశ్వర్య శర్మ) తన స్కూటీతో గుద్దేసి పోతుంది. ఆ అమ్మాయిని చూసి  ప్రేమలో పడతాడు సాయి. ఆమె వెంటపడుతుంటాడు. కానీ అతనంటే భాగికి ఇష్టం లేదు. భాగి నేచురోపతిని ఇష్టపడుతుంది. నేచురోపతి గురువు వంతెన(భద్రం)ని గురువుగా ఆరాధిస్తుంది. ఆయన తర్వాత ఆయనలా ఎదగాలనుకుంటుంది. అయితే సాయి ఎప్పుడు సిగరేట్లు తాగుతూ, డ్రింక్‌ చేస్తూ ఉంటారు. ఏ పని చేయడు. సాయిలోని ఈ లక్షణాల కారణంగా అతనంటే భాగికి ఇష్టం ఉండదు. కానీ తనని ఏమైనా చేస్తాడేమో అని ప్రేమిస్తున్నట్టు అబద్ధం చెబుతుంది. రెండు మూడు సార్లు అలానే మ్యానేజ్‌ చేస్తుంది. కానీ ఆమె పుట్టిన రోజు సాయి చేసిన పనికి ఛీ కొడుతుంది. అతనెవరో తెలియదని పొరిగింటి వారితో చెప్పి కొట్టిపిస్తుంది. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆమె వెంటపడుతుంటాడు. అనంతరం సాయి ఫ్రెండ్‌ ఒకరు అతని గర్ల్ ఫ్రెండ్‌(రీతూ చౌదరీ) చేతిలో మోసపోతాడు. నా లాంటి పరిస్థితి నీకు రాకుండా చూసుకో అని చెబుతాడు. దీంతో సాయిలో అనుమానం స్టార్ట్ అవుతుంది. తన ప్రేమ విషయం తేల్చుకోవాలనుకుంటాడు. అతని ఫ్రెండ్‌ చెప్పినట్టుగానే జరుగుతుంది. తనకు ఇష్టం లేదని చెబుతుంది భాగి. దీంతో పిచ్చోడవుతాడు. మరింత తాగుడికి బానిసై కాలేజీలో గొడవ చేస్తుంటాడు. మరి అతన్నుంచి భాగి ఎలా బయటపడింది? సాయి పాత్రలో ఉన్న ట్విస్ట్ ఏంటి? భాగిలో ప్రేమ పుట్టిందా? పూర్తిగా వదిలేసిందా? ఈ క్రమంలో అటు భాగి, ఇటు సాయి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలేంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 
యదార్థ సంఘటనలతో కూడిన సినిమాలు ఇటీవల మంచి ఆదరణ పొందుతున్నాయి. రియలిస్టిక్ మూవీస్‌ బాగుంటే జనం ఆదరిస్తున్నారు. `ఆర్‌ఎక్స్ 100` నుంచి ఇలాంటి కథలు సక్సెస్‌ అవుతున్నాయి. అయితే `డ్రింకర్‌ సాయి` అలాంటి రా, మాస్‌ మూవీ కాదు, క్లాసీగా సాగే లవ్‌ స్టోరీ. రియలిస్టిక్‌ అంశాలతోనే ఈ మూవీని కూడా తెరకెక్కించారు. గతంలో చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం, హీరో అవారాగా తిరుగుతుంటాడు, అమ్మాయి బాగా చదువుతూ, సిస్టమాటిక్‌గా ఉంటుంది. అతని ప్రేమని ఛీ కొట్టి, ఆ తర్వాత బ్రేకప్‌ జరిగి, వాస్తవాలు తెలిశాక మళ్లీ అతని ప్రేమించడం సాధారణంగానే జరుగుతుంది. ఇది కూడా అలాంటిదే కానీ, చివర్లో చిన్న ట్విస్ట్. అదే ఇందులో ఎమోషనల్‌ పాయింట్‌, యూఎస్‌పీ. అదే సమయంలో మందు, సిగరేట్‌ వంటివి జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయనే అంశాన్ని కూడా ప్రేమ కథకు జోడించిన తీరు బాగుంది. భాగి మందుకు బానిస అవుతున్న కుర్రాళ్లకి హితబోధ చేయడం నుంచి ఈ కథ స్టార్ట్ అవుతుంది. తన జీవితంలోకి సాయి ఎలా వచ్చాడు, తమ ప్రేమ కథ ఎలా స్టార్ట్ అయ్యిందనేది చెబుతుంది. దీంతో ఫ్లాష్‌ బ్యాక్లోకి వెళ్తుంది. ప్రారంభంలో సీన్లు సరదాగా సాగుతుంటాయి. సాయి.. భాగి వెంటపటడంతోనే నడుస్తుంది. ఆమెకి ఇష్టం లేకపోయినా ప్రేమిస్తున్నా అని  చెప్పడం దాన్ని మ్యానేజ్‌ చేయడం, అందుకు మరో ఫ్రెండ్‌ కిర్రాక్‌ సీతను వాడుకోవడం వంటి సీన్లు ఫన్నీగా సాగుతాయి. మరోవైపు సాయి ఫ్రెండ్‌ మందార పువ్వుకోసం తిరిగే తిరుగుడు కామెడీగా ఉంటుంది. ఇలా ఫస్టాఫ్‌ అంతా కాస్త రొటీన్‌గానే సాగిపోతుంది. అందులోనూ భాగి ఇష్టం లేదంటూనే సాయికి హగ్గులు, ముద్దులు ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 
 

ఇక సెకండాఫ్‌లో కథ స్పీడందుకుంటుంది. నేచురోపతి గురువు వద్ద శిక్షణ, అక్కడ మరో చిన్న కుర్రాడు రావడం, సాయి కూడా రావడంతో మరోసారి ఫన్‌ వైపు వెళ్తుంది. కానీ అనంతరం చోటు చేసుకున్న సీన్లు సీరియస్‌గా మారుతాయి. చివర్లో హీరో పాత్రలోని ట్విస్ట్ ఎమోషనల్‌ వైపు టర్న్ తీసుకుంటుంది. అయా సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ వరకు ఆడుతూ పాడుతూ అన్నట్టుగా తీసుకెళ్లి క్లైమాక్స్ లో గుండెని బరువెక్కిస్తారు దర్శకుడు. ఆయా సీన్లే సినిమాకి ఆయువు పట్టు. దీంతో ప్రారంభం నుంచి చూసిందంతా మర్చిపోయేలా చేస్తుంది. సినిమా స్టోరీ ఓల్డ్ గానే అనిపిస్తుంది. కానీ దాన్ని నడిపించిన తీరు కొత్తగా ఉంటుంది. నేటి ట్రెండ్‌ని ఫాలో అయినట్టుగా ఉంటుంది. కామెడీకి చాలా స్కోప్‌ ఉన్నా, ఆయా సీన్లు అంతగా పండలేదు. మరోవైపు లవ్‌ స్టోరీ సీన్లలోనూ మరింత డెప్త్, ఎమోషన్స్ ఉంటే బాగుండేది. లవ్‌ స్టోరీస్‌లో ఫీల్ అనేది చాలా ముఖ్యం. ఇందులో ఆ ఎలిమెంట్లు తగ్గినట్టుగా ఉంటుంది. ఇలా కొన్ని డ్రా బ్యాక్స్ ఉన్నా క్లైమాక్స్ మాత్రం సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. ఎమోషనల్‌గా ఆడియెన్స్ గుండెని బరువెక్కించి పంపిస్తుంది. 
 

నటీనటులుః 
సాయి పాత్రలో ధర్మ చాలా బాగా చేశాయి. చూడ్డానికి లవర్‌ బాయ్ గా ఉన్నా, గెడ్డంలో మాస్‌ లుక్‌లో అదరగొట్టాడు. నటుడిగా మంచి భవిష్యత్‌ ఉందని చెప్పొచ్చు. డాన్సులు కూడా బాగా చేశాడు, ఆరోగెంట్‌ సీన్లు, ఎమోషన్స్ సీన్లలో బాగా మెప్పించాడు. ఇక భాగి పాత్రలో ఐశ్వర్య శర్మ క్యూట్‌గా ఆకట్టుకుంది. చూడ్డానికి చిన్న పిల్లలా ఉంది. కానీ నటనతో, ఎక్స్ ప్రెషన్స్ పరంగా బాగా చేసింది. అమ్మాయి ఫాదర్‌గా కాంచి తనకు బాగా సెట్‌ అయ్యే పాత్రలో ఒదిగిపోయాడు. కిర్రాక్‌ సీతకు మరో ప్రామినెంట్ రోల్‌ దక్కింది. భద్రం గురువు వంతెనగా కనిపించి ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.  
 

టెక్నీషియన్లుః 

సినిమా టెక్నీకల్‌గా చాలా బాగుంది. రిచ్‌గా ఉంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారు. ఓ పెద్ద సినిమా రేంజ్‌ లో కనిపిస్తుంది. ప్రశాంత్‌ అంకిరెడ్డి కెమెరా వర్క్ అందంగా, కలర్‌ఫుల్‌గా ఉంది. మార్తాండ్‌ కె వెంకటేష్‌ తన అనుభవానికి పూర్తి స్థాయిలో పని చెప్పలేదనిపిస్తుంది. కొన్ని సీన్లు కట్‌ చేయాల్సింది. మ్యూజిక్‌ శ్రీవసంత్‌ బాగా చేశాడు. పాటలు కమర్షియల్‌ సినిమాలను తలపించాయి. బీజీఎం కూడా బాగానే చేశాడు. దర్శకుడు కిరణ్‌ తిరుమల ఎంచుకున్న రియల్‌ స్టోరీలో కొంత రెగ్యూలర్‌ ఎలిమెంట్లు ఉన్నా, నడిపించిన తీరు బాగుంది. క్లైమాక్స్ ని, ముగింపు విషయంలో బాగా చేశాడు. ఆడియెన్స్ ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. చివరికి హీరో పాత్ర ద్వారా మందుబాబులకు, స్మోకర్స్ కి ఇచ్చిన సందేశం బాగుంది. నేచురల్‌గా ఉంది. 

ఫైనల్‌గా ః  సందేశాన్నిచ్చే సరికొత్త లవ్‌ స్టోరీ. 

రేటింగ్‌ః 2.75

read more: కిచ్చ సుదీప్‌ `మాక్స్` మూవీ రివ్యూ, రేటింగ్‌

Latest Videos

click me!