Stand Up Rahul: రాజ్ తరణ్ `స్టాండప్ రాహుల్` రివ్యూ

First Published | Mar 18, 2022, 2:04 PM IST

హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`.  కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌.  శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.  ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు.

నవ్వించటం కష్టం. అందులో స్టాండప్ కామెడీ చేసి మరీ కష్టం. ఇక స్టాండప్ కామెడీ బేస్ చేసి సినిమా ఒప్పించటం మహా కష్టం. స్టాండప్ కామెడీ అనేది తెలుగులో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. లక్కీగా  పూజా హెగ్డే ఈ మధ్యనే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో స్టాండప్‌ కమెడియన్‌ వైభ పాత్రలో కనిపించారు. కొద్దో గొప్పో కొందమందికి ఇలాంటి వృత్తి ఒకటి ఉంటుందని తెలిసింది. ఆ పాత్ర కొనసాగింపు అన్నట్లుగా హీరో ...స్టాండప్ కమిడియన్ గా చూపిస్తూ  ఈ చిత్రం వచ్చింది. మరి రాజ్ తరుణ్ ఆ పాత్రకు ఎంత వరకూ న్యాయం చేసారు. అలాగే రాజ్ తరుణ్ కెరీర్ కు ఈ సినిమా ఎంతదాకా న్యాయం చేయబోతోంది. అసలు కథేంటి?

కథ

 ప్రకాష్ (మురళీశర్మ) ఓ సినిమా డైరెక్టర్. ఆయన తొలి  సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వస్తుంది. కానీ తర్వాత సినిమా మాత్రం  రాదు. అయినా ఓపిగ్గా ట్రైల్స్  చేస్తూనే ఉంటాడు. ఆయన భార్య ఇందుమతి (ఇంద్రజ) ఓ ఎయిర్ హోస్టస్. తన భర్త సినిమా పిచ్చిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసారని కొడుకుని తీసుకుని విడిపోయి తన బ్రతుకు తాను బ్రతుకుతుంది. ఇవన్నీ చూస్తూ పెరుగుతాడు రాహుల్(రాజ్ తరణ్). అతనికి చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే ఓ రకమైన ఏహ్య భావం ఏర్పడుతుంది. అలాగే రాహుల్ కు స్టాండప్ కమిడియన్ అవ్వాలని కోరిక. ఈ క్రమంలో అందరి మీదా జోకులు వేస్తూ ప్రతీ ఉద్యోగం ఊడకొట్టుకుని కెరీర్ లో సెటిల్ కాడు. ఇది చూసిన అతని తల్లికి బెంగ పట్టుకుంటుంది. తన భర్త లాగే జీవితంలో సంపాదన లేకుండా ఫ్యామిలీకు దూరంగా మిగిలిపోతాడని భయపడుతూంటుంది. ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అవ్వమని కొడుక్కు నూరిపోస్తుంది. మరో ప్రక్క తండ్రి ప్రకాష్ మాత్రం తన కొడుక్కు..నీ జీవితం..నీకు ఇష్టమైన వృత్తిలో బ్రతుకు అని చెప్తూంటాడు. వీటి మధ్య నలిగిపోతున్న రాహుల్ ..హైదరాబాద్ వస్తాడు.


హైదరాబాద్ లో అతనికి శ్రేయ (వర్ష బొల్లమ్మ) కలుస్తుంది. రాహుల్ చిన్నప్పటి క్లాస్ మేట్ అయిన ఆమెతో కలిసి ఓ సాప్ట్ వేర్ డవలప్ మెంట్ కంపెనీలో జాయిన్ అవుతాడు. ఇద్దరూ మెళ్లిగా ప్రేమలో పడతారు. అయితే పెళ్ళి అంటే ఇష్టపడని రాహుల్ ఆ విషయం చెప్పేస్తాడు. దాంతో ఆమె పోనీ పెళ్లి కాకపోతే ...  లివ్ ఇన్ రిలేషన్ కు అయినా రెడీ అంటుంది. ఈ క్రమంలో ఏం జరిగింది. అయితే వారి స‌హ‌జీవ‌నం పెళ్లికి దారి తీసిందా, రాహుల్ ఎక్కడా సెటిల్ కాడు, ఉద్యోగాలకు పనికిరాడనేనే ముద్ర చెరిపేసుకోగలిగాడా, తనకు ఇష్టమైన స్టాండప్ కామెడీ చేస్తూ జీవితంలో నిలబడ్డాడా, చివరకు ఏం జరిగింది అనేది మిగ‌తా క‌థ.
 

స్క్రీన్ ప్లే విశ్లేషణ
 
స్టాండప్ కామెడీ లో ఎంతో అనుభవం ఉంటే తప్ప స్టేజి మీద జోక్ లు పేల్చటమే కష్టం. అలాంటిది సినిమా తెరపైకి వాటిని తీసుకొచ్చి జనాలను ఆకట్టుకోవాలనుకోవటం కొద్దిగా సాహసమైన పోగ్రామే. ఏదో క్యారక్టర్ ఇంట్రడక్షన్ లో కామెడీ చేయటం కాకుండా అవకాసం దొరికినప్పుడల్లా మైక్ పట్టుకుని రాజ్ తరుణ్ జోక్స్ వేస్తూంటే..విసుగు వస్తుంది. ఆ జోక్స్ కు నవ్వేది, టప్పట్లు కొట్టేది...ఎదురుగా కనపడే ఓ క్యారక్టర్..అదీ  డైరక్టరే (తెర మీద). ఆయన తప్పించి ఎవరూ ఎంజాయ్ చేసినట్లు కనపడదు. అది ప్రక్కన పెడితే సినిమా ప్రారంభంలో వచ్చే టాయిలెట్ కామెడీకు మనకు వాంతు వస్తుంది. రాజ్ తరుణ్  దుస్దితికి జాలేస్తుంది. సర్లే తర్వాత అయినా కుదురుగా కామెడీనో,లవ్ స్టోరీనో నడుపుతాడనుకుంటే కథలో హీరోకు ఉన్న కన్ఫూజన్ డైరక్టర్ కు ఉంది. ఏం చెప్తున్నాడో..ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో అర్దం అవదు...వరసగా సీన్స్ వస్తూంటాయి. ఏదీ ఇంప్రెస్ చేయదు. హీరో  internal conflict ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో క్లారిటీ మిస్సైపోయింది.  internal conflict అంతా మెయిన్ క్యారక్టర్ తలలోనే ఉంటుంది.

Stand Up Rahul


తన నమ్మకాలకు, తన చుట్టూ ఉన్న నమ్మకాలకు,అబిప్రాయాలకు మధ్య జరిగే యుద్దం. ఆ సమస్య ను తీర్చటానికి కుటుంబం,స్నేహితులు ఏం చేయలేరు. తనంతట తానే సాల్వ్ చేసుకుని గెలిచి ముందుకు వెళ్తారు. ఇక్కడ రాజ్ తరుణ్ పాత్ర  internal conflict ఉంటుంది కానీ దానితో పోరాటం, తీసుకునే నిర్ణయాలు, వాటి నుంచి వచ్చే సమస్యలు..వాటిని పరిష్కరించుకుంటూ తాను గెలవటం అనేది ఎక్కడా కనపడదు. ఇలా ఎత్తుగడలో ఉన్న  internal conflict ని చివరి దాకా తీసుకెళ్లటంలో దర్శకుడు స్క్రీన్ ప్లే పరంగా ఫెయిల్ అయ్యారు. అలాంటిటప్పుడు కథని హిమాచల్ ప్రదేశ్ తీసుకెళ్తే ఏమిటి..హైదరాబాద్ మూసీ నదిలో దూకేస్తే ఏమిటి... ఉద్యోగం చేస్తూ కూడా పేషన్ ను వదులుకోవద్దు, పెళ్ళి జంఝాటంలో పడద్దు, లివ్ ఇన్ రిలేషన్ షిప్  ముద్దు అంటూ చెప్దామనుకున్నారు. కానీ అక్కడా అది చెప్పచ్చా ...చెప్పకూడదా అనే డౌట్ తో చెప్తున్నట్లు ఉంటుంది. స్టాండప్ రాహుల్ విషయమై దర్శకుడు ఏ స్టాండ్ తీసుకోకోపోవటంతో విసుగ్గా ఉంటుంది. అదే సినిమాని దెబ్బ తీసింది.

Stand Up Rahul

టెక్నికల్ గా

సినిమాకు అవసరమైన స్క్రిప్టు సరిగ్గా లేనప్పుడు మిగతావి ఎన్ని ఉన్నా ఏమి లాభం... సినిమాటోగ్రఫీ  చాలాబాగుంది. శ్రీకర్ అగస్తీ ఇలాంటి ప్రేమకథకు అవసరమైన పాటలు,నేపధ్య సంగీతం ఇచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరక్షన్ ..సోసోగా ఉంది. విజువల్స్ కు,డైలాగ్స్,మ్యూజిక్ కు ,ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ కు ఎక్కడా సింక్ కనపడదు.


నటుడుగా జీవితంలో ఏ నిర్ణయం వెంటనే తీసుకోలేని కుర్రాడిగా, సమస్యలనుండి ఎస్కేప్ అయ్యే వాడిగా రాజ్ తరుణ్ బాగానే చేసాడు కానీ గెటప్ బాగోలేదు. కామెడీ టైమింగ్ ఉన్న రాజ్ తరణ్ ..చెప్పిన జోక్ లకు నవ్వు రాలేని పరిస్దితి. వర్ష బొల్లమ్మ తన వంతు ప్రయత్నం చేసింది. వెన్నెల కిషోర్ చేసిన పాత్ర కొత్తేం కాదు. .స్టాండప్ కమెడియన్స్ క్లబ్ కు చెందిన వ్యక్తిగా ‘కేరాఫ్ కంచరపాలెం’ డైరెక్టర్ వెంకటేశ్ మహా నటించాడు.  ఓ ఫెయిల్డ్ హజ్బెండ్ గా మురళి శర్మ, ఓ పక్క ఉద్యోగం చేస్తూ, కుటుంబ బాధ్యతలు నెరవేర్చే మహిళగా ఇంద్ర‌జ‌ క్యారెక్టర్ ను తీర్చిదిద్దారు.ఇతర పాత్రల్లో మధురిమ, దేవి ప్రసాద్, రాజ్ కుమార్ కశిరెడ్డి, తేజోయ్ భట్టార్, అనీశ్ అల్లారెడ్డి తదితరులు పాత్రోచితంగా చేసుకుంటూ వెళ్లారు.

Stand Up Rahul


ఫైనల్ థాట్

ఈ సినిమాలో ఓ డైలాగు... 'ఏవరేజ్ జోకులకు జనం చప్పట్లు కొట్టరు'..అది నిజం అని ఈ సినిమా  ప్రూవ్ చేస్తుంది.
సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

Stand Up Rahul

ఎవరెవరు..

బ్యానర్: డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్, హై ఫైవ్ పిక్చ‌ర్స్

నటీనటులు: రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ, 'వెన్నెల' కిషోర్, ఇంద్రజ, మురళీ శర్మ తదితరులు  
సంగీతం: స్వీకర్ అగస్తి
సినిమాటోగ్ర‌ఫి: శ్రీరాజ్ రవీంద్రన్
ఎడిటింగ్: రవితేజ గిరజాల
పాటలు: అనంత్ శ్రీరామ్,  కిట్టు విస్సాప్రగడ,రెహమాన్, విశ్వా
నిర్మాతలు: నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
దర్శకత్వం: సాంటో మోహ‌న్ వీరంకి
విడుదల తేదీ: మార్చి 18, 2022

Latest Videos

click me!