Radhe Shyam Review: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రివ్యూ అండ్‌ రేటింగ్‌..

First Published | Mar 11, 2022, 1:09 PM IST

ప్రభాస్ నుంచి  ‘సాహో’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ప్రభాస్ అభిమానులలో ఆసక్తి నెలకొంది. అయితే ‘రాధే శ్యామ్’ అంచనాలని తలక్రిందులు చేసింది. సాహో సినిమా కంటే పూర్తి భిన్నంగా రూపొందింద‌ని చెప్ప‌వ‌చ్చు.


ప్రభాస్ వంటి ప్యాన్ ఇండియా స్టార్ల‌తో సినిమాలు తీసే అవ‌కాశం కెరీర్ ప్రారంభంలోనే  దొరికేయటం దర్శకుడుకి అదృష్టమే. సినిమా తీయగలం ,మాలో విషయం ఉందని ప్రూవ్ చేసుకుంటే చాలు .... స్టార్లు పిలిచి మ‌రీ ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. లేకపోతే ప్రభాస్ తో సినిమా తీసే అవ‌కాశం రావ‌డం అంటే మామూలు మాట‌లు కాదు. రాధాకృష్ణ కుమార్ కిది గోల్డెన్ ఛాన్స్. అతని తొలి సినిమా `జిల్ ` (గోపీచంద్) యావరేజ్ అనిపించుకున్నా అందులో లవ్ స్టోరీ చాలా మందికి నచ్చింది. దాంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు.  ముఖ్యంగా ప్రభాస్ కు కొత్త వారితో ప్రయాణం పెట్టుకుందామనుకున్నప్పుడు ఈ దర్శకుడు కనిపించాడు. ఇక  ఈ సినిమాలో మ్యాటర్ ఏంటన్నది ఇప్పటికే బయిటకు వచ్చిన ట్రైల‌ర్లు, టీజ‌ర్లు,మీడియాలో వ‌చ్చిన ఫీల‌ర్ల‌ని బ‌ట్టి అర్థ‌మైపోతుంది. అంతకు మించి ఏమైనా ఉందా అనేది సగటు ప్రేక్షకుడుకి ఆసక్తికలిగించే అంశం. అదే అభిమానికి అంత ఉంటే చాలు అబ్బా హిట్ కొట్టేస్తాడు అనే ధీమా. సాహో తో బాహుబలితో వచ్చిన ఇమేజ్ కొంత స్వాహా అయ్యింది. మరి ఈ లవ్ స్టోరీతో మళ్లీ ఆ ఇమేజ్ ని ప్రభాస్ గెయిన్ చేసుకున్నాడా? ఎంతో మంది స్టార్ డైరక్టర్స్ లైన్ లో ఉండగా ...కేవలం ఒక సినిమా (జిల్) మాత్రమే వయస్సు ఉన్న దర్శకుడుతో చేయటానికి వెనుక ఉన్న కారణమేంటి? అంతగా ఆ కథలో నచ్చేసిన విషయం ఏమిటి? వంటి విషయాలు చూద్దాం.


కథ

వరల్డ్ ఫేమస్ అస్ట్రాలజర్  విక్రమాధిత్య (ప్రభాస్). అతనేది చెప్తే అది జరిగిపోవాల్సిందే. అతనెంత గొప్పోడు అంటే ఇందిరాగాంధీ ని కలిసి ..ముందే ఎమర్జన్సీ గురించి చెప్తాడు. ఆ తర్వాత దేశం వదిలి విదేశాల్లో సంచారం చేస్తూంటాడు. ఆ క్రమంలో ఇటలీ వెళ్తాడు. అక్కడ ప్రేరణ (పూజా హెగ్డే) అనే ఓ డాక్టర్. కానీ గీతాంజలిలో హీరోయిన్ లా అల్లరి పిల్ల. ఆమెను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమెమందే లేని ఓ ప్రాణాంతక జబ్బు బాధపడుతూంటుంది. కానీ ఆమె ఆ విషయం ఎవరికీ చెప్పదు. కానీ నాటకీయంగా ఓ రోజు విక్రమాదిత్యకు తెలుస్తుంది. ఆమె చెయ్యి చూసి నువ్వు నిండు నూరేళ్లు బ్రతుకుతావని చెప్తాడు. మరో ప్రక్క విక్రమాదిత్య కు కూడా ప్రాణ గండం ఉంటుంది. అలాగే అతని జీవితంలో జాతకం ప్రకారం ప్రేమ,పెళ్లి ఉండవు. మరి వీళ్లిద్దరూ బ్రతికారా...అదే జరిగితే విక్రమాదిత్య చెప్పే జాతకం తప్పిందా? ఈ జంట  ప్రేమ సక్సెస్ అవుతుందా? విక్రమాదిత్య జీవితంలో ఏం తెలుసుకున్నాడు..షిప్ ఎపిసోడ్ విషయం ఏమిటి, పరమహంస (కృష్ణంరాజు) కథలో పాత్ర ఏమిటి... వంటి సంగతులు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స్క్రీన్ ప్లే ఎనాలసిస్...

జ్యోతిషం, హ‌స్త‌సాముద్రికం వంటి వాటిని చాలామంది ట్రాష్ అని కొట్టేస్తుంటారు. కానీ, అవి కూడా శాస్త్రాలేన‌ని, నూటికి 99 శాతం ఖ‌చ్చితంగా జ‌రిగి తీరుతాయ‌ని, ఏదో ఒక్క శాతం మంది వారికి వారే త‌మ రాత‌ను మార్చుకోగ‌ల‌ర‌ని చెప్పటమే దర్శకుడు ఉద్దేశ్యం. రాతలను చేతలతో మార్చుకోవాలని సందేసం ఇద్దామని మొదలెట్టిన చిత్రం ఇది. అయితే సినిమాకు మాత్రం రాత బాగోనప్పుడు ఎంత చేతలు ఉన్నా ఏం చెయ్యలేం. అదే ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది. ప్రభాస్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోకు ఇలాంటి కథ చెప్పాలనిపించటం ఓ ఎత్తు అయితే..ప్రభాస్ ఒప్పుకుని చేయటంఆశ్చర్యం అనిపిస్తుంది. సినిమాలో ఓ డైలాగు ఉంటుంది. హీరోయిన్ అర్దం రూపాయి విలువైన హెయిర్ పిన్ కోసం తాను ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో హీరో చెప్తాడు. ఆ కాస్ట్ కాదు..వాల్యూ చూడమంటాడు. అలాగే ఈ కథ కోసం అంత ఖర్చు పెట్టడం కూడా అలాగే అనిపిస్తుంది.


 'సినిమా తీయడానికి నాలుగేళ్లు పట్టింది. కానీ రాయడానికి మాత్రం పద్దెనిమిదేళ్లు పట్టింది' అన్నారు డైరక్టర్ ఈ సినిమా కథ కోసం పడ్డ కష్టం గురించి ఓ ఇంటర్వూలో చెప్తూ. దాంతో ఖచ్చితంగా ఈ కథలో పద్దెనిమిదేళ్ల కష్టం వెతకాలనిపిస్తుంది. అలాగే  ఈ కథని మొదట యేలేటి చంద్రశేఖర్.. వెంకటేష్ తో చేద్దామనుకున్నారు. అయితే అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి దాని జాతకం ప్రభాస్ దగ్గర తేలింది. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గ కథేనా...వెంకీ వద్దనటానికి కారణాలు ఎన్నైనా ఉండచ్చు. కానీ ప్రభాస్ ఓకే చెప్పటానికి ఏదో ఒక బలమైన కాంప్లిక్ట్స్ అయితే కథలో ఉందనిపిస్తుంది. వాస్తవానికి  ‘బాహుబలి’ఇమేజ్ నుంచి ఇప్పుడిప్పుడే ప్రభాస్ బయిటకు వస్తున్నాడు. అంత పెద్ద హిట్ సినిమా తర్వాత తను చేసే  ప్రతీ సినిమాపైనా ఆ ఇంపాక్ట్ ఉంటుందని తెలుసు. అందుకే డిఫరెంట్ కథలు ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే ప్రభాస్ వంటి యాక్షన్ స్టార్...ప్యూర్ లవ్ స్టోరీ చేయటమేంటి..అదీ టీనేజ్ దాటేసాకా అనిపిస్తుంది. ఈ ఛాలెంజ్ ఉంటుందని దర్శకుడుకు కథ చెప్పేటప్పుడే అర్దమై ఉంటుంది. అయితే మెచ్యూర్డ్ లవ్ స్టోరీలకు మెచ్యూరిటీ ఉన్న ఆర్టిస్ట్ లు అవసరం అనిపించి ఉండవచ్చు. అయితే  సినిమాలో అంత విషయానికన్నా విజువల్స్ కే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు. అయితే అవీ ఫస్టాఫ్ దాకానే.  అవన్నీ ప్రక్కన పెడితే...అంత గొప్పగా హైపు చేసిన  టైటానిక్ సీన్ ని గుర్తు చేసే క్లైమాక్స్ ఓడ సీన్ అయినా బాగుందా అంటే దారుణంగా అనిపిస్తుంది.


సినిమాని దర్శకుడు ఎక్కువగా ఆర్టిస్టిగా, విజువల్ విస్పోటనంలా చూపించాలని ప్రయత్నించారు. ఫస్టాఫ్ అలాగే సాగింది..కొంతమేర సాగ తీసారు. ఇంటర్వెల్ దాకా కథ..కాంప్లిక్ట్ లోకే వెళ్లదు. హీరోయిన్ కు జబ్బు అని తెలియటం కాంప్లిక్ట్ అనుకుంటే...అక్కడే ఇంటర్వెల్ వేసారు. దాంతో  అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి అప్పటికైనా ఇలాంటి సినిమాకు కావాల్సిన మినిమం కథ,కథనం కరువు అవటంతో ఏం చూస్తున్నాము అనే వెలితి మొదలైంది. దానికి తగ్గట్లు సినిమా స్లో పేస్ లోకి జారటం మొదలైపోయింది. అప్పటికీ ప్రభాస్ తనదైన శైలిలో ఆ క్యారక్టర్ ని ఓన్ చేసుకున్నారు. కానీ పూజ పాత్రకు అది జరగలేదు. దాంతో రెండు పాత్రలు నాన్ సింక్ లో నడుస్తున్నట్లు అనిపిస్తూంటాయి. కాకపోతే ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతకు మించి ఏమీ లేదు. ఏదైమైనా చూసినవాడి జాతకం బాగోలేదు అని తేల్చేసారు.


ఫస్టాఫ్ లో రొమాంటిక్ ఫన్ లవ్ స్టోరీగా క‌థ‌ను నడిపే ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌కుడు.. ద్వితీయార్ధంలో కాసేపు దాన్ని  థ్రిల్ల‌ర్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ఈ క్ర‌మంలో దర్శకుడు వేసిన ప్ర‌తి స్టెప్ సాగ‌తీత వ్య‌వ‌హారంలాగే న‌డిచింది త‌ప్ప‌.. ఎక్క‌డా కథనంలో ఊపు తీసుకురాలేక‌పోయింది.   ఇంటర్వెల్ కు  క‌థ కాస్త ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ట్లు అనిపించినా.. ఆ త‌ర్వాత వ‌చ్చే ఎపిసోడ్‌తో అదంతా నీరుగారిపోతుంది. లవ్  సీక్వెన్స్  విజువల్స్  మాత్రం ప్రేక్ష‌కుల‌కు మంచి కాల‌క్షేపాన్నిస్తాయి. ఇక  క్లైమాక్స్ కు ముందు హీరో,హీరోయిన్స్ తిరిగి క‌లిసిన తీరు..  వర్కౌట్‌ కాలేదు. సినిమా మొత్తం సాగదీసినట్లు ఉంటుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. క్లైమాక్స్‌లో కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది.

టెక్నికల్ గా...

ఇలాంటి భారీ సినిమాల్లో  టెక్నికల్ వాల్యూస్ కు లోటేముంటుంది. అన్ని హై  హై స్టాండర్డ్స్ లో ఉంటాయి..ఉన్నాయి. రాధేశ్యామ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే విజువల్ ఎఫెక్ట్స్, సెట్టింగ్స్ కే ఎక్కువ ప్రయారిటీ. ఇవే సినిమాకు ప్రాణం పోశాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో సినిమాను విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.  ఆ భారీ తనం ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది.  ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఓ కొత్త ప్రపంచాన్ని కళ్ల  ముందు సృష్టించాడు. ప్రతి  ప్రేమ్‌ కూడా చెక్కినట్లుగా ఉంది సినిమాటోగ్రఫీ . హీరో హీరోయిన్ల ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు కంటే చూపించిన విధానం బాగుంది. క్లైమాక్స్ కొంచెం తేలిపోయినట్లు అనిపించింది.  ఇక డైరక్టర్ రాధాకృష్ణ...ఈ పీరియాడిక్ డ్రామాను కేవలం విజువల్స్ పేర్చటమే కాకుండా కాస్తంత కథ కూడా ఉండేలా చూసుకుంటే బాగుండేది. ముఖ్యంగా ప్రబాస్ ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది.   ప్రతి ఒక్క ప్రేమ్‌ కూడా పెయింటింగ్ లా ఉంది కానీ ప్రాణం లేదు.

Radhe Shyam


థమన్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిసొచ్చింది. కొన్ని సీన్స్ ని  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది. సెకండ్‌ హాఫ్‌  మరీ స్లో అవకుండా . ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ముఖ్యంగా ర‌వీంద‌ర్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ ఈ సినిమాని నెక్ట్స్ లెవిల్ అని చెప్పాలి.  ‘ఎవ‌రో నీవెవ‌రో’, ‘ఛ‌లో ఛ‌లో’ పాట‌లు వినటానికి ఓకే అన్నట్లున్నాయి.    ఫస్ట్‌ హాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బాగా సాగదీసిన ఫీల్ వచ్చింది. డైలాగ్స్ బాగున్నాయి.  స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు రాధాకృష్ణ తడబడ్డాడనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే కాస్త డిజైన్ చేసి  ఉండి ఉంటే విజువల్స్ కు మ్యాచ్ అయ్యి నెక్ట్స్ లెవిల్ లో ఉండేది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ..ప్రభాస్ సొంత సినిమా పేరు పెట్టేదేముంది. 


నటీనటుల్లో...

ప్ర‌భాస్‌(Prabhs) బయిట కన్నా బాగున్నాడు. నటన ఎప్పటిలాగే కూల్ గా చేసుకుంటూ వెళ్లాడు. పూజా(Pooja hegde)తో పెయిర్ అందంగా ఉంది. విక్ర‌మాదిత్య‌కి గురువు పాత్ర‌లో కృష్ణంరాజు(krishnam raju) క‌నిపించారు. వయస్సు మీద పడి చేయలేకపోవటం, ఓపిక లేనట్లుగా ఉన్నారు.  భాగ్య‌శ్రీ(Bhagya sri) ప్ర‌భాస్‌కి త‌ల్లిగా క‌నిపించింది. కానీ, ఆమెని హిందీ మార్కెట్ కోసం పెట్టారేమో... ఎందుకంటే ఆ పాత్ర‌కి కొద్దిగా కూడా ప్రాధాన్యం లేదు.  జ‌గ‌ప‌తిబాబు, జ‌యరాం త‌దిత‌ర న‌టులున్నా  పోస్టర్, ట్రైలర్ కోసం వాడినట్లు ఉన్నారు. స‌చిన్ ఖేడేక‌ర్, ప్రియదర్శి  పాత్రలే పెద్దవి.


నచ్చినవి
రాజమౌళి వాయిస్ ఓవర్
ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్టాఫ్ లో కొన్ని  విజువల్స్
ప్రభాస్ తన ఇమేజ్ ని ప్రక్కన పెట్టి ఓ లవ్ స్టోరీ లో ఇమిడే ప్రయత్నం చేయటం
 
నచ్చనవి

ప్రభాస్ ని ఇలాంటి కథలో చూడటం కష్టం
ఉందా లేదా అన్నట్లున్న కథ, కథనం
ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాకపోవటం
విసిగించే కామెడీ సీన్స్


ఫైనల్ థాట్

ఈ సినిమా చూసాక 'సాహో'  మంచి సినిమా అనిపించటంలో వింతేమీ లేదు


---సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2.5/5


ఎవరెవరు...

బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
పిఆర్ఓ : ఏలూరు శ్రీను
Run Time: 2 గంటల 18 నిముషాలు
విడుదల తేదీ: 11 మార్చి, 2022

Latest Videos

click me!