Image: Movie stills
'అప్పు' అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే కన్నడిగుల ఆర్యాధ్య నటుడు పునీత్ రాజ్‌కుమార్. ఈ కన్నడ పవర్‌స్టార్ హఠాన్మరణం యావత్ పరిశ్రమను ,అభిమానులను బాధించింది... కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం జేమ్స్ ఈ రోజుప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం భారీగానే విడుదల చేసారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 250 కి పైగా స్క్రీన్స్‌లో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది...కథేంటి...వర్కవుట్ అయ్యే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
James Puneeth Rajkumar Movie released
కథ
సంతోష్ కుమార్ (పునీత్ రాజ్ కుమార్) సెక్యూరిటీ ఏజెన్సీ రన్ చేస్తూంటాడు. ఎలాంటి రిస్క్ తీసుకుని అయినా తను సెక్యూరిటీ ఇచ్చేవాళ్లను రక్షిస్తూంటాడు. ఈ క్రమంలో విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్) ఫ్యామిలీ కు అతను సెక్యూరిటీ ఇచ్చే భాధ్యతను తీసుకుంటాడు. విజయ్ గైక్వాడ్ ఫ్యామిలీ అండర్ వరల్డ్ మాఫియా. అతనుకు వేరే గ్రూప్ నుంచి థ్రెట్ ఉంటుంది. అతని తండ్రిని ఆల్రెడీ చంపేసి ఉంటారు ప్రత్యర్దులు. అంతేకాదు తమకు వార్నింగ్ ఇస్తారు. ముఖ్యంగా విజయ్ గైక్వాడ్ కు తన చెల్లెలు నిషా (ప్రియా ఆనంద్)ని టార్గెట్ చేస్తారనే భయం ఉంటుంది. ఈ క్రమంలో సంతోష్ రంగంలోకి దిగి దడదడలాడిస్తాడు. ప్రత్యర్దులకు చెందిన వాళ్లని అరవీర భయంకరుడులా మారి అంతం చేస్తాడు. ఇది చూసిన విజయ్ గైక్వాడ్ తన చెల్లికి సరైన జోడు సంతోష్ అని భావించి ఎంగేజ్మెంట్ పెడతాడు. కానీ అదే సమయంలో విజయ్ కు సంతోష్ గురించిన ఓ షాకిచ్చే నిజం తెలుస్తుంది. కావాలనే తన కుటుంబానికి దగ్గరయ్యాడని అర్దమవుతుంది. అసలు సంతోష్ ఎవరు, గత జీవితం ఏమిటి..విజయ్ ఫ్యామిలీకు దగ్గర అవటం వెనక అతని ఆలోచన ఏమిటి, జేమ్స్ టైటిల్ కు ఈ కథకు సంభందం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Image: Priya AnandInstagram
విశ్లేషణ
ఈ సినిమా చూస్తుంటే మనకు తెలుగులో బోయపాటి,రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయరామ గుర్తుకు వస్తుంది. అలాగే అంతకు ముందు వచ్చిన రామయ్యవస్తావయ్యా వంటి అనేక తెలుగు డిజాస్టర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. అలాగే మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు కూడా కలిపారు. వాటిన్నిటిని మిక్సీలో వేసి రుబ్బి ఈ కథ తయారు చేసినట్లు అర్దమవుతుంది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి..భాషా ఫార్మెట్ లోకి కథ మారిపోయి..అందరూ హీరోని చూసి షాక్ అయ్యి..నువ్వు జేమ్స్ వా అనటంతోనే మనకు సెకండాఫ్ లో ఏమి జరగబోతుందో అర్దమైపోతుంది. మన ఊహలకు తగ్గట్లే కథ సాగుతుంది. ఎక్కడా ఉత్కంఠ కానీ ఉత్సుకత కానీ లేకుండా స్క్రీన్ ప్లే నడుస్తూంటుంది. కథ,కథనంలో ఎక్కడా ఒరిజినాలిటి అనేది కనపడదు. రీరికార్డింగ్ చూస్తే తెరపై ఏదో జరిగిపోతున్నట్లే కనపిస్తుంది. ఇంతా చేస్తే ఏమీ ఉండదు.
క్లైమాక్స్ కు వచ్చేసరికి దారుణంగా గ్రాఫ్ పడిపోతుంది. ఫక్తు రివేంజ్ కథకు దేశభక్తి అద్దే ప్రయత్నం చేసారు. కానీ నాన్ సింక్ లో నడిచింది. అలాగే కేజీఎఫ్ ఇంపాక్ట్ అనుకుంటాను...విలన్స్ , రౌడీలు తెర నిండా కుప్పలు తెప్పలు గా కనపడుతూంటారు. విలన్స్ ని ..పెద్ద మాఫియా అని చెప్తారు. కానీ వాళ్లు మాట్లాడే భాష,చేతలు ఫ్యాక్షనిజంలో పండిపోయిన బ్యాచ్ లా ఫక్తు రౌడీల్లా ఉంటుంది. సినిమా ప్రారంభం మాఫియాని ఇంట్రడ్యూస్ చేయటం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే పునీత్ క్యారక్టర్ ఇంట్రడ్యూస్ చేయటం బాగుంటుంది. కానీ అక్కడ నుంచే డ్రాప్ అవుతూ ఇంటర్వెల్ కు కాస్త పికప్ అవుతుంది. సెకండాఫ్ అయితే దారుణం అనిపిస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ అయితే ఎందుకంత సాగ తీసారో డైరక్టర్ కే తెలియాలి. ఎనభైల్లో వచ్చే సినిమాల్లాగ ఉంటుంది ఆ ప్లాష్ బ్యాక్ సీన్.
నచ్చినవి
యాక్షన్ ఎపిసోడ్స్
పునీత్ రాజ్ కుమార్ యాక్షన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
విలన్స్ గా చేసిన శ్రీకాంత్, శరత్ కుమార్ లుక్స్
నచ్చనవి
పరమ రొటీన్ కథ
విసుగించే స్క్రీన్ ప్లే
దర్శకత్వం సరిగ్గా లేకపోవటం
టెక్నికల్ గా...
చరణ్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే పాటల్లో ట్రేడ్ మార్క్ సాంగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే బాగా ఖర్చు పెట్టారు. రిచ్ విజువల్స్ తెర నిండా పరుచుకున్నాయి. యాక్షన్ పార్ట్ అయితే కేక పెట్టించింది.య ఎడిటింగ్ సెకండాఫ్ లాగ్ లు లేపేస్తే బాగుండేది. తెలుగు డబ్బింగ్ ఓకే. డైరక్టర్ గా చేతన్ కుమార్ కష్టమనిపించాడు. మాస్ ఎలిమెంట్స్ పెట్టుకున్నాడు కానీ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు.
నటీనటుల్లో పునీత్ యాక్షన్ సీన్స్ లో అదరకొట్టారు. ప్రియా ఆనంద్ సీన్స్ లో డెప్త్ లేదు. ఆమెపై వచ్చిన ట్విస్ట్ లు కూడా పెద్దగా పండలేదు. విలన్స్ గా తెలుగు నుంచి చేసిన శ్రీకాంత్ కూల్ గా ఉన్నారు. లుక్స్ పరంగానూ కొత్తగా ఉన్నారు. గెస్ట్ లు గా చేసిన పునీత్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
ఫైనల్ థాట్
పునీత్ మనకు ఇక లేరు అనే ఎమోషన్ కన్నడ ప్రేక్షకులకు కనెక్ట్ చేయగలుగుతుంది కానీ, తెలుగు వారికి కష్టమే.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2
ఎవరెవరు..
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్,
పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: చరణ్ రాజ్,
సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ,
ఆర్ట్: రవి శాంతేహైక్లు,
పీఆర్వో: బి. వీరబాబు
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్,
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
విడుదల తేదీ: 17, మార్చి 2022