Chandramukhi 2 review
స్టోరీ లైన్
రంగనాయకి (రాధిక శరత్ కుమార్) ఫ్యామిలీకు గత కొంత కాలంగా ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. దానికి పరిష్కారంగా స్వామీజీ (రావు రమేష్) ఫ్యామిలీ మొత్తం కలసి కుల దైవం గుడిలో పూజ చేయాలని చెప్తాడు. దీంతో వేరే దారి లేక గతంలో వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించి లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వాళ్ళద్దరితో పాటు గార్డియన్ గా మదన్ (రాఘవ లారెన్స్) కూడా అక్కడికి వస్తాడు. ఇక అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (అప్పటి చంద్రముఖిలో ఉన్న బిల్డింగ్) ఉంటుందిఅయితే ఇప్పుడు అక్కడ యజమానులు ఎవరూ ఉండటం లేదు. బసవయ్య (వడివేలు) మాత్రమే ఉంటూంటాడు. ఆ ఇంట్లో రంగనాయకి కుటుంబం దిగుతుంది. అప్పుడు బసవయ్య ఓ కండీషన్ పెడతాడు.
ఆ ఇంట్లో దక్షిణం వైపు వెళ్లవద్దని అంటాడు. కానీ ఏదైతే చూడకూడదు..ఎటైతే వెళ్లకూడదు అంటామో అటే వెళ్లాలనిపిస్తుంది కదా. అలా కొందరు దక్షిణం వైపు వెళ్తారు. ఆ తర్వాత అక్కడ దెయ్యంగా ఉన్న చంద్రముఖి (కంగనా రనౌత్) రాధిక కూతురు దివ్య (లక్ష్మీ మీనన్) లోకి ప్రవేశిస్తుంది.అక్కడ నుంచి కథలోకి చంద్రముఖి (కంగనా రనౌత్) ప్రవేశిస్తుంది. అదే సమయంలో వేటయ్య అలియాస్ సింగోటయ్య (రాఘవ లారెన్స్) ఆత్మ మదన్ మీదకు ఆవహిస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? ఈ కథలో వేటయ్య రాజు (ఇంకో రాఘవ లారెన్స్) పాత్ర ఏంటి, అసలు వీరి మధ్య జరిగిన అసలైన కథేంటి.. వేట్టయ రాజాపై చంద్రముఖి ఈ సారైనా ప్రతీకారం తీర్చుకుందా? ఆమె పగ చల్లారిందా? మళ్లీ ఇంకో సీక్వెల్ కు కథగా ఆ పగని దాచి పెట్టుకుందా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎనాలసిస్...
రాజాధిరాజ.. రాజ గంభీర.. రాజ మార్తాండ.. రాజ కుల తిలక అంటూ వేట్టయ రాజా మళ్లీ వేంచేసారు. 17 సంవత్సరాల క్రితం చంద్రముఖి తను బందీగా ఉంటున్న గది తలుపులు తెరుచుకుని వేట్టయ రాజాపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నించి విఫలమైంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తన పగ తీర్చుకోవటానికి వచ్చేసింది. అయితే అప్పుడు చంద్రముఖి ని ఆవాహన చేసుకున్న అమ్మాయి చంద్రముఖిలా బిహేవ్ చేసి హంగామా చేస్తే ..ఇప్పుడు అసలైన చంద్రముఖి రంగంలోకి దిగేసింది. ఇదే పి.వాసు దగ్గర ఉన్న లైన్. అయితే దాన్ని యాజటీజ్ చేస్తే...ఓ బంగ్లాలో చంద్రముఖి దెయ్యం, దాన్ని వదిలించే ప్రయత్నం సాగే రొటీన్ సాదా సీదా కథగా కనపడుతుంది. అయితే చంద్రముఖి సీక్వెల్ అనగానే ఈ స్టోరీ చుట్టూ స్పెషల్ ఆరా ఏర్పడుతుంది. అదే దర్శకుడు పి.వాసుచేసింది. అంతకు మించి ఈ కథలో ఆయన ప్రత్యేకంగా చేసిందేమీ కనపడదు. సినిమా బాగోలేదా అంటే ఇలాంటివి బోలెడు చూసేసాం అనిపిస్తుంది.
పోనీ చంద్రముఖి సీక్వెల్ అనే యాంగిల్ లో చూస్తే చంద్రముఖినే ఫాలో అయ్యి చూడటంతో పెద్దగా ఏమీ అనిపించదు. అయినా రాజుని చూసిన కళ్లతో మరొకర్ని చూడలేం అన్నట్లు...రజనీకాంత్ ని చూసిన కళ్ళతో లారెన్స్ ని ఆ పాత్రలో చూడలేము. అన్నిటికన్నా పెద్ద సమస్య ఏమిటంటే రజనీకాంత్ ..చంద్రముఖి చేసేనాటికి ఆయన తొలి హారర్ తో సాగే సైక్లాజికల్ చిత్రం. అసలు రజనీకాంత్ ని అలాంటి కథలో ఎవరూ ఊహించరు. కానీ ఇక్కడ లారెన్స్ వైపు నుంచి చూస్తే ఇప్పటికే ముని, కాంచన అంటూ వరస పెట్టి దెయ్యం సీరిస్ లు చేసేసి ఉన్నాడు. దాంతో లారెన్స్ నుంచి ఈ తరహా కథాంశం కొత్తగా అనిపించదు. స్క్రీన్ ప్లే సైతం సాదాసీదాగా అనిపిస్తుంది. చంద్రముఖి స్క్రీన్ ప్లే (ఒరిజనల్ మళయాళం)ని ఫాలో అవ్వటం మూలానో ఏమో కానీ ఇప్పటికి ఫ్రెష్ గా ఉంటుంది. ఇది దుమ్ము కొట్టిన బిల్డింగ్ లోకి ప్రవేశిస్తున్నట్లే ఉంటుంది. ఏదైమైనా చంద్రముఖి ఈ సారి అంతగా భయపెట్టలేదు. వడివేలు నవ్వించలేదు. సోసోగా ఉంది. ఇవన్నీ చాలదన్నట్లు తమిళ నేటివిటి మాటిమాటికి అడ్డుపడుతూంటుంది. క్లైమాక్స్ జస్ట్ ఓకే అనిపిస్తుంది.
ఎవరెలా చేసారంటే..
లారెన్స్ కొంత ఓవర్ అనిపించినా...కొన్ని సీన్స్ లో అదరకొట్టాడు. కంగనా హార్రర్ సీన్స్ బాగానే పేలాయి. రాధిక గురించి చెప్పేదేముంది. లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేష్ అలా చేసుకుంటూ వెళ్లిపోయారు.
టెక్నికల్ గా ..
దర్శకుడిగా పి వాసు హర్రర్ అండ్ కామెడీ తో అప్పటి మ్యాజిక్ ని రిపీట్ చేద్దామనుకునే ప్రయత్నంలో అప్పటి సీన్స్ నే రిపీట్ చేసారు. మారిన కాలంలో కామెడీ మారిందనే విషయం ఆయన గమనించలేదు. అప్పటి మోటు కామెడీనే ఇప్పటికీ ఇచ్చి నవ్విద్దామనుకున్నారు. సినిమాటోగ్రఫీ హర్రర్ సీన్స్ లో బాగుంది. గ్రాఫిక్స్ కూడా అద్బుతం అని చెప్పలేం కానీ బాగున్నాయి. ఎం. ఎం. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది అని ప్రతీ సారి అనిపిస్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సుభాస్కరన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
chandramukhi 2
ప్లస్ లు
లారెన్స్ కు అలవాటైన జానర్ కావటం
కంగనా రనౌత్ పర్ఫార్మెన్స్
ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
మైనస్ లు
నవ్వించకుండా నేరేషన్ కు అడ్డుపడే కామెడీ
పాత చంద్రముఖి స్క్రీన్ ప్లేనే యాజటీజ్ ఫాలో అవటం
రజనీ లేని లోటు కనపడటం
Chandramukhi 2
ఫైనల్ థాట్
సీక్వెల్ అంటే సీన్ టు సీన్ అదే రిపీట్ చేయటం కాదేమో. అయినా ఒకసారి జరిగిన మ్యాజిక్ ప్రతీ సారి రిపీట్ కాదు.ఈ సినిమా సైతం అందుకు మినహాయింపు కాదు. అప్పటి చంద్రముఖి భవంతిలో మళ్లీ అప్పటి కథ చెప్పారు. సీక్వెల్ అనటం కన్నా రీమేక్ అంటే బాగుండేదేమో.
చంద్రముఖి -2 అంటే అర్దం...రజనీ,జ్యోతిక ఇద్దరూ ఈ సినిమా నుంచి మైనస్ అని ..అదే మైనస్ అని తేల్చారు
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.25
Chandramukhi 2
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్,
నటీనటులు: రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్ రావు రమేష్, సాయి అయ్యప్పన్, సురేష్ మీనన్, శత్రు, టి.ఎం.కార్తీక్ తదితరులు.
సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్,
ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి,
మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి,
ఎడిటర్: ఆంథోని,
స్టంట్స్: కమల్ కన్నన్, రవివర్మ, స్టంట్ శివ, ఓం ప్రకాష్,
లిరిక్స్: యుగ భారతి, మదన్ కర్కి, వివేక్, చైతన్యప్రసాద్,
కాస్ట్యూమ్స్: పెరుమాల్ సెల్వం,
కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా, దొరతి,
మేకప్: శబరి గిరి,
స్టిల్స్: జయరామన్,
ఎఫెక్ట్స్: సేతు,
ఆడియోగ్రఫీ: ఉదయ్ కుమార్, నాక్ స్టూడియోస్,
దర్శకత్వం: పి.వాసు,
నిర్మాత: సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్ హెడ్.. జి.కె.ఎం.తమిళ్ కుమరన్,
విడుదత తేదీ: సెప్టెంబర్ 28,2023.