
రాజ్ తరుణ్ తన లైఫ్‌లో వివాదాల మాదిరిగానే సినిమా కెరీర్ కూడా సాగుతుంది. చాలా కాలంగా ఆయనకు హిట్లు లేవు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా కనిపించిన ఆయన ఇప్పుడు హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల `చిరంజీవ` చిత్రంతో ఓటీటీలోకి వచ్చారు. రెండు వారాల్లోనే ఇప్పుడు `పాంచ్ మినార్` చిత్రంతో థియేటర్లోకి వచ్చారు. రాశీసింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న ముఖ్య పాత్రలు పోషించారు. గోవింద రాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ పతాకంపై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మించారు. దీనికి రామ్ కడుముల దర్శకుడు. ఈ చిత్రం ఈ శుక్రవారం(నవంబర్ 21న) విడుదలైంది. మరి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ హిట్ కొట్టాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కిట్టు అలియాస్ కృష్ణ చైతన్య(రాజ్ తరుణ్) ఉద్యోగం లేక బేవార్స్ గా తిరుగుతుంటాడు. జాబ్ కోసం నానా తంటాలు పడుతుంటాడు. ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే తన ప్రియురాలు ఖ్యాతి(రాశీ సింగ్) ఉద్యోగం కోసం ఒత్తిడి చేస్తుంది. ఏదైనా జాబ్ చేస్తేనే తన నాన్నతో మాట్లాడటానికి ఉంటుందని, లేదంటే వేరే సంబంధం చూసి పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నాడని చెబుతుంది. దీంతో జాబ్ చాలా ఎమర్జెన్సీగా మారిన నేపథ్యంలో ఓ షెడ్‌లో కారుని రెంట్‌కి తీసుకుని క్యాబ్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు లవర్‌కి అబద్దం చెబుతాడు. లవర్ కే కాదు, ఇంట్లోనూ అదే అబద్దం చెబుతాడు. అయితే అంతకు ముందే బిట్ కాయిన్స్ ద్వారా లక్షలు, కోట్లు సంపాదించవచ్చని చెప్పి ఇంట్లో ఐదు లక్షల తీసుకుని ఆ బిక్ కాయిన్‌లో పెడతాడు. వాడు మోసం చేస్తాడు. ఇవన్నీ తప్పించుకునేందుకు ఓ క్యాబ్ ఆఫీస్‌లో పెద్ద జాబ్ చేస్తున్నట్టు చెబుతాడు. అటు లవర్‌ని, ఇటు పేరెంట్స్ ని మ్యానేజ్ చేస్తుంటాడు. కానీ తాను క్యాబ్ నడిపిస్తుంటాడు. ఓ రోజు తన క్యాబ్ బుక్ చేసుకున్న ఇద్దరు ఓ హత్య చేస్తారు. దానికి కిట్టు ప్రత్యక్ష సాక్ష్యం. దీంతో అతన్ని లేపేసేందుకు ఆ క్రిమినల్స్ ప్లాన్ చేస్తారు. దీంతో ఒకసారి వాళ్ల నుంచి తప్పించుకుంటాడు. అదే సమయంలో వాళ్లకి చెందాల్సిన ఐదు కోట్లు తాను తీసుకెళ్లిపోతాడు. ఆ ఐదు కోట్ల కోసం ఆ ఇద్దరు క్రిమినల్స్, క్యాబ్ రెంట్‌కి ఇచ్చిన మూర్తి(అజయ్ ఘోష్) మనుషులు వెంటాడుతుంటారు. కిట్టుని చంపేసేందుకు సీఐ(నితిన్ ప్రసన్న) మూర్తి వద్ద డీల్ సెట్ చేసుకుంటాడు. దీంతో వీళ్ల నుంచి తప్పించుకునేందుకు కిట్టు చేసిన సాహసం, ఈక్రమంలో తన ఫ్యామిలీ రిస్క్ లో పడటం, అనంతరం దాన్నుంచి బయటపడేందుకు ఆయన పడే స్ట్రగుల్సే ఈ మూవీ.
షార్ట్ కట్స్ ద్వారా, ఈజీ వేలో లక్షలు, కోట్లు సంపాదించి వెంటనే కోటీశ్వరులు కావాలని చేసే కొన్ని తప్పులతో హీరో ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు, దాన్నుంచి బయటపడేందుకు ఆయన పడే స్ట్రగుల్స్ నేపథ్యంలో సాగే చిత్రమే `పాంచ్ మినార్`. ఒక మర్డర్ కేసు చుట్టూ, ఐదు కోట్ల డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ చిత్రమిది. ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఈ మూవీని రూపొందించారు. ప్రారంభం నుంచి చివరి వరకు హీరో పడే తిప్పలు, అనేక సమస్యల నుంచి బయటపడేందుకు ఆయన చేసే ప్రయత్నాలు బెడిసికొట్టడం, అనంతరం చోటు చేసుకునే కామెడీ హైలైట్‌గా ఈ మూవీ సాగుతుంది. ఉద్యోగాలు చేయకుండా, ఈజీ మనీకోసం అడ్డదారులు వెళ్లడం, అవి బెడిసికొట్టడంతో హీరో పడే స్ట్రగుల్స్ నవ్వులు పూయిస్తాయి. ప్రారంభం నుంచి ఇలా ఫన్ రైడ్‌లా సాగుతుంది. రాజ్ తరుణ్, ఆయన ఫ్రెండ్ సుదర్శన్ మధ్య కన్వర్జేషన్, వాళ్లు కొట్టే బిల్డప్, ఆ తర్వాత పరిస్థితులు రివర్స్ కావడం కామెడీని పంచుతాయి. ఓ వైపు కామెడీగా కథని నడిపిస్తూనే ఒకదాని తర్వాత మరో ట్విస్ట్ ఇస్తూ, సస్పెన్స్ క్రియేట్ చేస్తూ, నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని జనరేట్ చేశారు. అదే ఈ మూవీలో హైలైట్‌గా చెప్పొచ్చు.
హత్య కేసు తర్వాత కిట్టు లైఫ్ టర్న్ తీసుకుంటుంది. పాంచ్ మినార్ అని చెప్పి ఐదు కోట్ల డబ్బు తీసుకోవడంతో ఇక ఆయనకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఒకటి తప్పించుకుంటే,మరోటి వెంటాడటం, ఓవైపు కిల్లర్స్, మరోవైపు కార్ రెంట్‌కి ఇచ్చిన మూర్తి గ్యాంగ్, ఇది కాదని, లవర్స్ తో గొడవ, ఇంట్లో ఫ్యామిలీ పెట్టే టార్చర్ ఇలా అన్నింటి మధ్య హీరో నలిగిపోయిన తీరు నవ్విస్తుంది. సెకండాఫ్ మొత్తం రోలర్ కోస్టర్‌లా సాగుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ చోటు చేసుకుంటుంది. ఒక గండం తప్పించుకునేలోపు, మరో గండం వెంటాడుతుంటుంది. ఇది ఆడియెన్స్ ని కడుపుబ్బ నవ్విస్తుంది. అయితే ఫస్టాఫ్ ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. ట్విస్ట్ లు బాగున్నాయి. సెకండాఫ్‌లో ట్విస్ట్ లు డబుల్ అవుతాయి. అడగడుగునా ట్విస్ట్ లే. అవి థ్రిల్‌నిస్తాయి. క్లైమాక్స్ ని కన్‌ఫ్యూజన్ కామెడీగా మార్చారు. అక్కడక్కడే కథని తిప్పారు. సినిమా ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్నట్టు ఉంటుంది. పైగా లౌడ్‌గా ఆర్టిస్ట్ లు అరవడం, సౌండ్, గోల ఇలా చిరాకు పెట్టిస్తుంది. డ్రామా నేపథ్యంలో వచ్చే కామెడీ అంతగా పండలేదు. ఓవర్ బోర్డ్ అనిపిస్తుంది. బలవంతంగా ఇరికించినట్టుగా ఉంటుంది. అయితే సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నా, ఓవరాల్‌గా మంచి ఫన్ రైడ్ అని చెప్పొచ్చు.
కిట్టుగా రాజ్ తరుణ్ అదరగొట్టాడు. ఒకప్పటి రాజ్ తరుణ్ కనిపించాడు. ఆ స్పీడ్, కన్‌ఫ్యూజన్ ఆకట్టుకుంటాయి. ఆయన కూడా రెచ్చిపోయి నటించాడు. ఆయన పాత్రలోని ఎంజాయ్‌మెంట్, టెన్షన్, బాధ, భయం ఇవన్నీ బాగా పలికించి అదరగొట్టాడు. ఆయన ప్రియురాలిగా రాశీసింగ్ చాలా బాగా చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ తండ్రిగా బ్రహ్మాజీ అదరగొట్టాడు. నవ్వులు పూయించారు. అలాగే మూర్తిగా అజయ్ ఘోష్ నటన ఆకట్టుకుంటుంది. నవ్విస్తుంది. నితిన్ ప్రసన్న సైతం మెప్పించారు. సుదర్శన్, లక్షణ్ కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. మిగిలిన ఆర్టిస్ట్ లు కూడా బాగా చేశారు.
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. పాటలు బాగున్నాయి. బిజీఎం సైతం అదిరిపోయింది. పెద్ద సినిమాల రేంజ్‌లో ఉంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్‌లో కొంత ట్రిమ్ చేయాల్సింది. ఇక నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు రామ్ కడుముల తీసుకున్న పాయింట్ బాగుంది. దాన్ని చాలా వరకు బాగా డీల్ చేశారు. అయితే చాలా చోట్ల డ్రామా, లౌడ్ నెస్ ఓవర్‌గా ఉంటుంది. చిరాకు తెప్పిస్తుంది. అదే సమయంలో లాజిక్ లెస్‌గానూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే కామెడీ మాత్రం బాగా వర్కౌట్ అయ్యింది.
ఫైనల్‌గా: సరదాగా నవ్వుకునే మూవీ `పాంచ్ మినార్`
రేటింగ్ : 2.75