`ప్రేమ్‌ కుమార్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Aug 18, 2023, 3:59 PM IST

సక్సెస్‌ కోసం చాలా రోజులుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్న యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ తాజాగా `ప్రేమ్‌ కుమార్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ శుక్రవారం సినిమా విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

సంతోష్‌ శోభన్‌.. హీరోగా నిలబడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల కాలంలో ఆయన నటించిన `లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌`, `శ్రీదేవి శోభన్‌బాబు`, `అన్ని మంచి శకునములే` చిత్రాలు బాక్సాఫీసు వద్ద డీలా పడ్డాయి. ఇప్పుడు `ప్రేమ కుమార్‌` అంటూ మన ముందుకు వచ్చాడు. పెళ్లి గొడవ నేపథ్యంలో సాగే కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రైటర్‌ అభిషేక్‌ మహర్షి దర్శకుడిగా పరిచయ అవుతున్నారు. ఇందులో సంతోష్‌ శోభన్‌కి జోడీగా రాశీ సింగ్‌, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై లిమిటెడ్‌ పతాకంపై శివ ప్రసాద్‌ పన్నీరు నిర్మించారు. నేడు శుక్రవారం(ఆగస్ట్ 18)న విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
ప్రేమ్‌ కుమార్‌(సంతోష్‌ శోభన్‌) పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోతుంది. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినిమా హీరో రోషన్‌(చైతన్య కృష్ణ)తో వెళ్లిపోతుంది. దీంతో డిజప్పాయింట్‌ అయిన ప్రేమ్‌ కుమార్‌.. మళ్లీ పెళ్లికి సిద్ధమవుతాడు. అది కూడా సేమ్‌. ఇలా వందల పెళ్లిళ్లు, పెళ్లి చూపులు క్యాన్సిల్‌ అవుతాయి. ఇక తనకు పెళ్లి కాదని ఫిక్స్ అవుతాడు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటాడు. భార్యా భర్తలు ఎవరితో ఎఫైర్లు నడిపిస్తున్నారో కనిపెట్టే డిటెక్టీవ్‌లుగా మారి సక్సెస్‌ అవుతారు. దీంతో ఏకంగా పెళ్లి చెడగొట్టే ఆఫీస్‌ స్టార్ట్ చేస్తారు. బాగా రన్‌ అవుతున్న సమయంలో తమ వ్యాపారానికి అడ్డు పడుతుంది నేత్ర(రాశీ సింగ్‌). ఈమె ప్రేమ్‌ కుమార్‌ మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు. అప్పుడు హీరో రైజింగ్‌ స్టార్‌ రోషన్‌తో వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆమె మ్యారేజ్‌ ఈవెంట్లు నిర్వహిస్తుంటుంది. దీంతో వీరిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఇద్దరి వ్యాపారాలు దెబ్బతింటాయి. దీంతో ఓ రాజీకి వస్తారు. ఇంతలో నేత్ర చేసుకోబోయే రైజింగ్‌ స్టార్‌ రోషన్‌ మరో రిచ్‌ అమ్మాయి అంగనని మ్యారేజ్‌ చేసుకునేందుకు రెడీ అవుతాడు. ఈ విషయం తెలిసిన నేత్ర ఆ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తుంది, కానీ దాన్ని ప్రేమ్‌ కుమార్‌ ఆ పెళ్లి చేయాలనుకుంటాడు. రోషన్‌, అంగనని పెళ్లి చేసుకుంటే తాను నేత్రని మ్యారేజ్‌ చేసుకోవచ్చనేది అతని ప్లాన్‌. మరి ఇద్దరిలో ఎవరు గెలిచారు? ఎవరి ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యింది? ఎవరిది బెడిసి కొట్టింది? రోషన్‌ ఏం చేశాడు? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః

ఇప్పుడు చాలా వరకు డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలతో వస్తున్నారు యంగ్‌ మేకర్స్. హీరోలు కూడా అలాంటి సినిమాలను ఎంకరేజ్‌ చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. కాన్సెప్ట్ బాగుండి, సినిమాని ఎంగేజింగ్‌గా తీస్తే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇటీవల చాలా సినిమాలు వర్కౌట్‌ అయ్యాయి. ముఖ్యంగా వినోదం ఉన్న చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. `సామజరవరగమన` ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఇలాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలు వస్తోన్న సమయంలో చాలా వీక్‌ స్టోరీతో వచ్చిన మూవీ `ప్రేమ్‌ కుమార్‌`. పెళ్లి పీఠల మీదే అతని మ్యారేజ్‌ ఆగిపోతుంటుంది. దీంతో దాన్నే తన అసెట్‌గా మార్చి, ప్రస్తుతం సమాజంలో ఉన్న ఎఫైర్ల అంశాన్ని ఆసరగా చేసుకుని పెళ్లిళ్లు పెటాకులు చేయడం, భార్య భర్తల ఎఫైర్లని కనిపెట్టి డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత దాని కారణంగా ఎదురైన సమస్యలు, దాన్నుంచి బయటపడటం, చివరికి అది తన పెళ్లికి ముడిపడి ఉండటమనేది సింపుల్‌గా ఈ సినిమా కథాంశం. ఈ కాన్సెప్ట్ తో కామెడీని పండిస్తూ సినిమాని తెరకెక్కించాలనుకున్నారు. సందర్భానుసారమైన హాస్యంతో, సన్నివేశాల నుంచి పుట్టి కామెడీతో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు అభిషేక్‌ మహర్షి. ఆయన ఆలోచన బాగుంది. కానీ ఆ కామెడీని వర్కౌట్‌ కాలేదు. దీంతో కిచిడి అయిపోయింది. 
 

సినిమా కామెడీ ప్రధానంగా రూపొందించారు. కానీ అది మాత్రమే పండలేదు. సినిమాల్లో వాళ్లు వాళ్లు నవ్వుకుంటారు. చూసే వారికి మాత్రం ఏడుపు తెప్పించేలా ఉంది. పైగా యాక్టర్స్ ఓవర్ యాక్టింగ్‌ మరింత ఇబ్బంది పెట్టే అంశం. ఏ సన్నివేశం ఎందుకొస్తుందో అర్థం కాదు, ఏం జరుగుతుందో కన్‌ఫ్యూజన్‌. ఈ సీన్ లోనూ ఫీల్‌ లేదు. సీన్‌ బై సీన్‌ చేసుకుంటూ వెళ్లారు, పేర్చుకుంటూ వెళ్లారు. కానీ ఏదీ కనెక్ట్ కాలేదు. కామెడీ కోసం వాళ్లు పడే తంటాలు నవ్వులు పూయించకపోగా, మరింత చిరాకు తెప్పించేలా మారడం బాధాకరం. లవ్‌ స్టోరీస్‌లో ఫీల్‌ లేదు, యాక్టింగ్‌లో ఫీల్‌ లేదు. దీంతో బోరింగ్‌ మూవీలా మారిపోయింది. ఏ సినిమాకైనా ఓ త్రెడ్‌ ఉంటుంది. దాని చుట్టూ కథ నడుస్తుంది. అదే సినిమా ఆత్మగా చెబుతుంటారు. ఇందులో అదే లేదు. దీనికితోడు కుళ్లు కామెడీ మరింత విసుగు పుట్టిస్తుంది. రెండున్నర గంటల పాటు పరీక్ష పెట్టేలా సినిమా సాగడం బాధాకరం. సినిమాకి ఏదో ఒకటి ప్లస్‌ ఉంటాయి. ఇందులో అలా చెప్పే అంశం ఒక్కటి కూడా లేదు. పెళ్లిళ్లు ఆగిపోయే సీన్లు, ఎఫైర్లు బయటపెట్టే సీన్లు ఎక్కడా పండలేదు. ఆ ఎఫైర్ల విషయాలను బయటపెట్టడం వంటి వాటి ద్వారా ఐనా ఫన్‌ జనరేట్‌ అవుతుంటుంది. కానీ ఇందులో అదీ కూడా లేదు. దీంతో ఇదొక బోరింగ్‌ మూవీలా మారిపోయింది. 

నటీనటులుః

సంతోష్‌ శోభన్‌.. లుక్‌ ప్లజెంట్ గా ఉంది. అతని యాక్టింగ్ మొదట్లో బాగా అనిపించేది. కానీ ప్రతి సినిమాలో ఒకేలా ఉండటం బోరింగ్‌గా ఉంది. పైగా ఆయన కామెడీ చేస్తున్నట్టుగా యాక్ట్ చేయడమే మరింత బాధాకరం. ఆయన సెటిల్డ్ గా యాక్ట్ చేస్తే బాగుంటుందేమో చూడాలి. కానీ బాధాకరమైన సీన్లలో ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్లు రాశీ సింగ్ బాగా చేసింది. ఉన్నంతలో మెప్పించింది. రుచిత సాధినేని డామినేటింగ్‌ నటనతో ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్‌ సుందర్‌ లింగంగా కృష్ణ తేజ, డాడీగా సుదర్శన్‌ ఆకట్టుకున్నారు. సినిమాలో ఏదైనా బాగుందంటే వీరిద్దరి పాత్రలే. రోషన్‌ పాత్రలో చైతన్య కృష్ణ మెప్పించలేదు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి. 
 

టెక్నీషియన్లుః 
సినిమాకి దర్శకుడు అభిషేక్‌ మహర్షి తొలి ప్రయత్నంతో మెప్పించలేకపోయాడు. సన్నివేశాల్లో ఫీల్‌ని తీసుకురాలేకపోయాడు. పైగా ఒక వీక్‌ స్టోరీ కూడా పెద్ద మైనస్‌. డైరెక్షన్‌ తేలిపోయింది. మ్యూజిక్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. ఎస్‌ అనంత్‌ శ్రీకర్‌ సంగీతం ఏమాత్రం హెల్ప్ కాలేదు. బీజీఎం కూడా మెప్పించలేకపోయింది. గ్యారీ బీ హెచ్‌ ఎడిటింగ్‌ పరంగా చేయడానికి ఏం లేదనిపించింది. సినిమాలో టెక్నికల్‌గా బాగున్నదేదైనా ఉంటే అది కెమెరా వర్క్ మాత్రమే. ర్యాంపీ నందిగమ్‌ విజువల్‌ బాగున్నాయి. రీచ్‌గా ఉన్నాయి. నిర్మాత శివ ప్రసాద్‌ సినిమాకి తగ్గట్టుగా బాగానే పెట్టారు. సినిమాలో మ్యాటర్‌ లేకపోవడంతో అన్ని వృథా అని చెప్పాలి. 

ఫైనల్‌గాః బాబోయ్‌.. `ప్రేమ్‌ కుమార్‌`తో పెట్టుకుంటే చుక్కలే.
రేటింగ్‌ః 1.5 

 

Latest Videos

click me!