Mr Pregnant Movie Review: `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

First Published | Aug 18, 2023, 1:26 AM IST

బిగ్‌ బాస్‌ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోహైల్‌ (సయ్యద్‌ సోహైల్‌ ర్యాన్‌). హీరోగా రెండు సినిమాలు చేశాడు. కానీ అవి డిజప్పాయింట్‌ చేశాయి. ఇప్పుడు మగవాళ్లు ప్రెగ్నెంట్‌ అవ్వడమనే ఓ కొత్త ప్రయోగంతో `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` సినిమా చేశాడు.  ఈ సినిమా నేడు శుక్రవారం(ఆగస్ట్ 18) విడుదలైంది. మరి డెలివరీ సాఫీగా జరిగిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

బిగ్‌ బాస్‌ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోహైల్‌ (సయ్యద్‌ సోహైల్‌ ర్యాన్‌). హీరోగా రెండు సినిమాలు చేశాడు. కానీ అవి డిజప్పాయింట్‌ చేశాయి. ఇప్పుడు మగవాళ్లు ప్రెగ్నెంట్‌ అవ్వడమనే ఓ కొత్త ప్రయోగంతో `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` అనే సినిమా చేశాడు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్ తో ఓ ప్రయోగం చేస్తున్నారు. దీనికి నూతన దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడువయుర్‌ హీరోయిన్‌గా నటించింది. మైక్‌ మూవీస్‌ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్లతో ఆకట్టుకుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసు దోచుకుంది. పలు పురుటి నొప్పుల అనంతరం ఈ సినిమా నేడు శుక్రవారం(ఆగస్ట్ 18) విడుదలైంది. మరి డెలివరీ సాఫీగా జరిగిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః

గౌతమ్‌(సోహైల్‌) అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగా పెరుగుతాడు. ఫేమస్‌ టాటూ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. అతనంటే మహి(రూపా కొడువయుర్‌)కి చచ్చేంత ప్రేమ. కానీ ఆమెని గౌతమ్‌ పట్టించుకోడు. మహి మాత్రం అతని వెంటపడుతూనే ఉంటుంది. మహి టార్చర్‌ ఎక్కవవడంతో అది భరించలేక ఆమె ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. పెళ్లి చేసుకునేందుకు ఓకే చెబుతాడు గౌతమ్‌. కానీ ఓ కండీషన్‌ పెడతాడు. తనకు పిల్లలంటే నచ్చదని, పిల్లలు వద్దు అని ఒప్పుకుంటేనే, అందుకు సిద్ధపడితేనే తాను పెళ్లి చేసుకుంటా అని చెబుతాడు. అందుకు మహి కూడా ఓకే చెబుతుంది. పెళ్లి అయిపోతుంది. ఎంతో అన్యోన్నంగా వీరి లైఫ్‌ సాగుతుంది. కానీ సడెన్‌గా పెద్ద ట్విస్ట్. మహి ప్రెగ్నెంట్‌ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గౌతమ్‌ రియాక్షన్‌ ఏంటి? తను ప్రెగ్నెంట్‌ ఎలా అయ్యాడు? ఎందుకు కావాల్సి వచ్చింది? దాని వెనకాల ఉన్న బ్యాక్‌ స్టోరీ ఏంటి? మగవాడు ప్రెగ్నెంట్‌ అంటే సమాజం ఎలా చూసింది? మేల్‌ ప్రెగ్నెంట్‌ డెలివరీ ఎలా జరిగింది? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః
రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలకు కాలం చెల్లిన రోజులివి. వినూత్న కాన్సెప్ట్ చిత్రాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. క్రేజీ కాన్సెప్ట్ లు బాగా ఆదరణ పొందుతున్నాయి. క్రిటికల్‌గా, కమర్షియల్‌గా సత్తా చాటుతున్నాయి. తాజాగా ఆ కోవలోకి `మిస్టర్‌ ప్రెగ్నెంట్‌` మూవీ చేరుతుంది. ఇదొక ప్రయోగాత్మకమైన ఫిల్మ్. మగవాడు ప్రెగ్నెంట్‌ కావడమనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇదే ఈ సినిమాలో క్రేజీ పాయింట్‌. అయితే అది ఎంత వరకు కన్విన్సింగ్‌గా ఉంటుందనేది ప్రశ్న. నిజానికి ఇలాంటి స్టోరీ కత్తిమీద సాములాంటిది. దాన్ని అంతే కన్విన్సింగ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు వింజనంపాటి. కొత్త దర్శకుడైనా చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. ఎలాంటి కన్‌ ఫ్యూజన్‌ లేకుండా క్లారిటీగా, చాలా అర్థవంతంగా తీసుకెళ్లాడు. ఆ విషయంలో టెక్నిషియన్‌గా సక్సెస్‌ అయ్యాడు. 
 

ఇలాంటి సినిమాని అన్ని అంశాల మేళవింపుతో తీయడం పెద్ద సవాల్‌. జనరల్‌గా ప్రయోగాత్మక చిత్రాలకు అన్ని అంశాలు సెట్ కావు. కానీ ఇందులో కామెడీ, కాస్త లవ్‌, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్లు, ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ పెయిన్‌ని ఇలా అన్నీ సమపాళ్లలో మేళవిస్తూ తెరకెక్కించారు. పైగా సినిమా ఎక్కడా వల్గారిటీ లేకుండా నీట్‌గా ఉంది.  అయితే మొదటి భాగంలో మాత్రం మరింత కేర్‌ తీసుకోవాల్సింది. లవ్‌ స్టోరీని ఇంకా ఫీల్‌ వచ్చేలా చెబితే బాగుండేది. హీరోని, హీరోయిన్‌ ఎందుకు అంతగా ఇష్టపడుతుందనే విషయాన్ని బలంగా చెప్పలేకపోయారు. అదే సమయంలో మొదటి భాగం రెగ్యూలర్ గా సాగిపోతున్నట్టుగా ఉంటుంది. ఎక్కడా హై మూమెంట్స్ లేవు. అందులో కామెడీకి స్కోప్‌ ఉన్నా ఆ దిశగా ప్రయత్నం లేదు. వినోదం పెంచితే ఆహ్లాదకరంగా సాగిపోయేది. అదే సమయంలో హీరో తాను ప్రెగ్నెంట్ కావాలనుకునేందుకు గల కారణాన్ని కూడా మరింత బలంగా, సంఘర్షణతో చూపిస్తే, మరింత కన్విన్సింగ్‌గా అనిపించేది. ప్రెగ్నెంట్‌ టైమ్‌లో, డెలివరీ టైమ్‌లో ఆడవాళ్లు పడే బాధని బలంగా చూపించాల్సింది. 

కానీ సెకండాఫ్‌ లో మాత్రం బ్రహ్మాజీ ఎపిసోడ్‌ అదిరిపోయింది. సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. యూత్‌కి కావాల్సిన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అనంతరం సోహైల్‌ ప్రెగ్నెంట్‌గా పడే బాధలు, రహస్యం తెలియడంతో బయటి వారి నిందనలు, అవమానాలు ఈ క్రమంలో సోహైల్‌, రూపా పడే మానసిక సంఘర్షణ గుండెని బరువెక్కిస్తుంది. ముఖ్యంగా సోహైల్‌ ప్రెగ్నెంట్‌గా ఉంటూ ఒంటరిగా ఇబ్బందులు పడుతున్న తీరు కన్నీళ్లు తెప్పిస్తాయి. దీనికితోడు ప్రెగ్నెంట్‌ ఉమెన్స్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇందులో చర్చించడం కనువిప్పుగా, ఆలోచింప చేసేలా ఉంది. ఆడవారి బాధలను ఇందులో ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. దాన్ని అంతే ఎమోషనల్‌గా చూపించడం విశేషం. దీంతో సెకండాఫ్‌ చివరి అరగంట ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌లా సాగుతుంది. అన్నింటికి కంటే ముఖ్యంగా అమ్మతనం గురించి హీరో చెప్పే డైలాగులు హృదయాన్ని టచ్‌ చేస్తాయి. మొత్తంగా అమ్మతనంలోని గొప్పతనం చెప్పే మంచి ఫ్యామిలీ మూవీ అవుతుంది. 
 

నటీనటులుః 

గౌతమ్‌ పాత్రలో సోహైల్‌ తన బెస్ట్ ఇచ్చాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. కెరీర్‌లో గుర్తిండిపోయే పర్ఫెర్మెన్స్ ఇచ్చాడు. అప్‌కమింగ్‌ హీరో ఆ రేంజ్‌లో యాక్ట్‌ చేయడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో సోహైల్‌ని అభినందించాల్సిందే. మహి పాత్రలో రూపా చాలా బాగా చేసింది. మెప్పించింది. వైవా హర్ష మరోసారి  తనదైన నటనతో అలరించాడు. బ్రహ్మాజీ పాత్ర మరో హైలైట్‌. ఆద్యంతం నవ్వులు పూయించింది. కాసేపు గేగా నటించిన సోహైల్‌ ఫ్రెండ్‌ పాత్ర సైతం అదరగొట్టాడు. సుహాసిని డాక్టర్‌గా ఆకట్టుకున్నారు. రాజా రవీంద్ర పాత్ర కూడా బాగుంది. మిగిలిన ఆర్టిస్టులు ఉన్నంతలో ఓకే అనిపించారు. 
 

టెక్నీకల్‌గాః
దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటికిది తొలి చిత్రమైనా ఇంత బాగా హ్యాండిల్‌ చేయడం విశేషం. రిస్కీ సబ్జెక్ట్ ని ఇంత ఈజీగా చెప్పడం గొప్ప విషయమనే చెప్పాలి. డైలాగులు, కథని నడిపించిన తీరు బాగుంది. ఈ సినిమాని ఇంకా బాగా చేయాల్సింది. దర్శకుడిగా శ్రీనివాస్‌కి మంచి భవిష్యత్‌ ఉంది. నిజార్‌ షఫీ కెమెరా వర్క్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్‌ ఎక్కడా కలగడు. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉంది. విజువల్స్ కనువిందు చేసేలా ఉన్నాయి. సినిమాకి పెద్ద బ్యాక్‌ బోన్‌ శ్రావణ్‌ భరద్వాజ్‌ సంగీతం, బీజీఎం. కథలో భాగంగా వచ్చే పాటలు, ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. బీజీఎం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఎమోషనల్‌ సీన్లకి ఎంతో హెల్ప్ అయ్యింది. కెమెరా, మ్యూజిక్‌ రెండు పిల్లర్లుగా నిలిచాయి.సినిమా నిడివి తక్కువే. చాలా క్రిస్పీగానే ఉంది. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ, `మిస్టర్ ప్రెగ్నెంట్‌` వంటి ప్రయోగాత్మక సినిమాని నిర్మించిన నిర్మాత అప్పిరెడ్డి గట్స్ కి అభినందించాలి. పైగా రాజీపడకుండా నిర్మించారు. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ రిచ్‌గా ఉన్నాయి. 
 

ఫైనల్‌గాః ప్రశంసనీయ ప్రయోగాత్మక మూవీ. అమ్మతనంలోని గొప్పతనం చెప్పే చిత్రమవుతుంది.

రేటింగ్‌ః 2.75

నటీనటులుః సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు. 
టెక్నీషియన్లుః  సినిమాటోగ్రఫీ - నిజార్ షఫీ, సంగీతం - శ్రావణ్ భరద్వాజ్, ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యానర్ - మైక్ మూవీస్, పీఆర్వో - జీఎస్కే మీడియా, నిర్మాతలు - అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి. రచన-దర్శకత్వం - శ్రీనివాస్ వింజనంపాటి.
 

Latest Videos

click me!