
క్రిస్మస్ కానుకగా తెలుగు దాదాపు ఆరేడు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించాయి. మరికొన్ని దారుణంగా ఉన్నాయి. కానీ చివర్లో వచ్చిన మూవీ `పతంగ్`. కొత్త కుర్రాళ్లు వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాలతోపాటు విష్ణు ఓఐ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్, వడ్లమానిశ్రీనివాస్, అను హసన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సినిమాటిక్ ఎలిమెంట్స్, రిషాన్ సినిమాస్, నాని బండ్రెడ్డి ప్రొడక్షన్స్ పతాకాలపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ రెడ్డి కొత్తింటి సంయుక్తంగా నిర్మించారు. ఈ గురువారం(డిసెంబర్ 25)న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో విస్కీ(వంశీ పూజిత్), అరుణ్(ప్రణవ్ కౌశిక్)చిన్నప్పట్నుంచి జిగిరీ దోస్తులు. రిచ్ కిడ్ అయిన అరుణ్‌కి ప్రపంచం అంటే ఏంటో చూపిస్తాడు విస్కీ. అందుకే అతనంటే ఎంతో ఇష్టం. ఇరవై ఏళ్లుగా తమ స్నేహాన్ని చాటుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకుంటారు. వీరికి నాలుగైదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కడికి వెళ్లినా ఈ గ్యాంగ్ ఉండాల్సిందే. అరుణ్‌ని లక్ష్మి అనే అమ్మాయి ఇష్టపడుతుంది. కానీ మనోడు పట్టించుకోడు. అయితే విస్కీ లైఫ్‌లోకి ఐశ్వర్య(ప్రీతి పగడాల) అనే అమ్మాయి వస్తుంది. ఐశ్వర్య క్లారిటీ లేని అమ్మాయి. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేదు. విస్కీ, ఐష్‌లది క్రేజీ లవ్ స్టోరీ. అయితే విస్కీని ప్రేమించిన ఐశ్వర్య క్రమంగా అరుణ్‌కి పడిపోతుంది. విస్కీకి హ్యాండిచ్చి ఈ ఇద్దరు తిరుగుతుంటాడు. ఈ విషయం విస్కీకి తెలుస్తుంది. దీంతో అతని రియాక్షన్ ఏంటి? ఇరవైఏళ్ల స్నేహాన్ని రెండు వారాల ప్రేమ విడగొడుతుంద, ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతుంది. అయితే ఐశ్వర్య ఎవరికి కావాలనేది నిర్ణయించుకునేందుకు పతంగ్ ఎగరేసే పోటీలు నిర్వహిస్తారు. విస్కీ టీమ్‌లో ఆయన ఫ్రెండ్స్ ఉంటే, అరుణ్ టీమ్‌లో నాన్న(ఎస్పీ చరణ్), చెల్లి, ఫ్రెండ్, లక్ష్మి ఉంటారు. మరి ఈ పతంగ్ గేమ్‌లో ఎవరిది విజయం? ఇందులో గౌతమ్ మీనన్ పాత్రేంటి? నిర్ణయంలో క్లారిటీ లేని ఐశ్వర్య ఫైనల్‌గా ఎవరిని ఎంచుకుంది? విడిపోయిన విస్కీ, అరుణ్ మళ్లీ కలిశారా? లేదా? అనేది మిగిలిన కథ.
సినిమాగా పతంగ్ చాలా చిన్న పాయింట్‌తో రూపొందించారు. ఇరవై ఏళ్ల స్నేహం, ఒక అమ్మాయితో విడిపోతుంది. లవర్ కారణంగా విడిపోయిన ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మళ్లీ కలిశారా? లేదా? ఈ క్రమంలో ఎలాంటి ఆసక్తికర, క్రేజీ పరిణామాలు చోటు చేసుకున్నాయి? పతంగ్ గేమ్ వీరిలో ఎలాంటి మార్పు తెచ్చిందనేది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అది ఇందులో క్రేజీగా ముగియడం విశేషం. పతంగ్ పోటీలకు కోసం గ్రౌండ్‌లో దర్శకుడు గౌతమ్ మీనన్.. హీరోయిన్ వద్దకు వెళ్లి పరిచయం చేసుకోవడం, ఆమె ఆయనకు తమ కథ చెప్పడం నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో విస్కీ బ్యాచ్‌ని పరిచయం చేస్తారు. విస్కీ, అరుణ్‌ల స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వీరంతా చేసే అల్లరి చిల్లర పనులు చూపిస్తూ సరదాగా నడిపించారు. ఆ తర్వాత వీరి లైఫ్‌లోకి ఐశ్వర్య రావడంతో లవ్ స్టోరీ వైపు టర్న్ తీసుకుంటుంది. ఈ జర్నీని ఆద్యంతం ఫన్నీగా తీసుకెళ్లారు. డైలాగ్ కామెడీ అదిరిపోయింది. అదే సమయంలో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక నేటి ట్రెండ్‌ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు యువత ఎలా ఉందనేది చూపించారు. ఫ్రెండ్ లవర్‌ని మరో ఫ్రెండ్ ఇంప్రెస్ చేయడం, ప్రియుడి స్నేహితుడికి లవర్ ఇంప్రెస్ అవ్వడం క్రేజీగా ఉంది. ఈ క్రమంలో వచ్చే సీన్లు అదిరిపోయాయి. కడుపుబ్బ నవ్విస్తాయి. మరోవైపు విస్కీని ఐశ్వర్య నుంచి డైవర్ట్ చేయడానికి అరుణ్ తన చెల్లినే వాడుకోవడం టూ క్రేజీ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో ఇది హైలైట్‌గా నిలుస్తుంది. సెకండాఫ్‌లో లవర్ కోసం కైట్ పోటీ నిర్వహిస్తుంటారు. ఈ పతంగ్ పోటీలకు కామెంటరీగా కమెడియన్ విష్ణు ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మరో స్థాయికి వెళ్తుంది. సాధారణంగా కైట్ ఎగరేయడం కొంత వరకు ఓకే, ఆ తర్వాత దాన్ని చూడటం చాలా కష్టం. కానీ విష్ణు తన కామెంటరీతో నవ్వులు పూయించారు. ఎలాంటి బోర్ లేకుండా చేయడమే కాదు, నవ్వుల వర్షం కురిపించాడు. అక్కడక్కడ కొంత సాగదీసినట్టుగా ఉన్నా, ఓవరాల్‌గా విష్ణు సెకండాఫ్‌ని నిలబెట్టాడు. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య ఎమోషనల్ సీన్లు గుండెని కాస్త బరువెక్కిస్తాయి. అదే సమయంలో అరుణ్ పేరెంట్స్ మధ్య సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. ముగింపు మాత్రం టూ క్రేజీగా ఉందని చెప్పొచ్చు. రెండు వారాల ప్రేమ కంటే ఇరవై ఏళ్ల స్నేహం గొప్పదని చెప్పే సందేశం బాగుంది.
విస్కీ పాత్రలో వంశీ పూజిత్ ఇరగదీశాడు. సినిమాని తనే తన భుజాలపై నడిపించాడు. ఫుల్ ఎనర్జీతో నటించి మెప్పించాడు. పాత్రలో జీవించాడు. ఇక అరుణ్ పాత్రలో ప్రణవ్ కౌశిక్ కూడా అదరగొట్టాడు. సైలెంట్‌గా ఉండే చివరికి అందరి హృదయాలను దోచుకున్నాడు. అమ్మాయి హృదయం కూడా. వీరి స్నేహం బాగా ఆకట్టుకుంటుంది. ఎమోషనల్‌గా ఉంటుంది. ఐశ్వర్య పాత్రలో ప్రీతి పగడాల సింపుల్‌గా చించ్చేసింది. ఆమె నటన అదిరిపోయింది. ఆమె పాత్ర ట్రెండీగా ఉండటం విశేషం. ఆమె ఇచ్చే ట్విస్టులు అదిరిపోయాయి. కుర్రాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. గౌతమ్ మీనన్, ఎస్పీ చరణ్ అదరగొట్టారు. గౌతమ్ మీనన్ సైలైంట్‌గా ఎంటర్‌టైన్ చేశాడు. ఎస్పీ చరణ్ పతంగ్ పోటీలో ఆకట్టుకున్నారు. విష్ణు సెకండాఫ్‌ని నిలబెట్టాడు. హీరోల ఫ్రెండ్స్ బ్యాచ్ కుర్రాళ్లు ఇరగదీశారు. అనుహాసన్ సైతం మెప్పించింది. లక్ష్మీ పాత్ర చేసిన అమ్మాయి ఇకపై బిజీ అయిపోతుంది. మిగిలిన పాత్రదారులు ఫర్వాలేదనిపించారు.
జోష్ జిమ్మి సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. బిజీఎం, సాంగ్స్ పాత సినిమాల పాటలను తలపిస్తాయి. బ్లాక్ బస్టర్స్ మూవీస్ ట్యూన్స్ ని కొంత వాడుకున్నారు. కానీ అవే ఈ సినిమాకి ప్లస్‌గా నిలిచాయి. ఆయా మ్యూజిక్ వచ్చినప్పుడు సినిమా లేస్తుంది. ఆయా సీన్లు ఎలివేట్ అవుతాయి. ఇక శక్తి అరవింద్ విజువల్స్ అదిరిపోయాయి. సినిమా ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంది. కునువిందుగా ఉంది. చూడ్డానికి తెర చాలా బాగుంది. ఇటీవల వచ్చిన మంచి కలర్‌ఫుల్ మూవీ పతంగ్ అని చెప్పొచ్చు. చాణక్య రెడ్డి తూర్పు ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఎంచుకున్న కథ, కథనం బాగుంది. దాన్ని ట్రెండీగా తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. జెన్యూన్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ప్రతి సీన్‌ని ఫన్నీగా, కామెడీ తీసిన తీరు ఆకట్టుకుంది. అదే సమయంలో డైలాగ్‌లు సినిమాకి పెద్ద ప్లస్. స్క్రీన్‌ప్లే బాగా రాసుకున్నారు. అంతే బాగా తెరపై ఆవిష్కరించారు. స్నేహంపై ఇచ్చిన కన్‌క్లూజన్ బాగుంది. నిర్మాణ విలువలకు కొదవలేదు.
పతంగ్ నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు రాలేదు. దీంతో ఇదొక కొత్త ఫీల్‌ని ఇస్తుంది. అదే సమయంలో కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ సర్‌ప్రైజ్ చేస్తుంది. ఫైనల్‌గా మంచి కలర్‌ఫుల్ కామెడీ రైడ్ `పతంగ్` అని చెప్పొచ్చు.
Note: సినిమాకి పెద్ద మైనస్ ప్రమోషన్స్ లేకపోవడం. ఈ క్రిస్మస్‌కి ఈ సినిమా వస్తుందని జనాలకు తెలియదు. ఎలాంటి హడావుడి లేదు. దీంతో బజ్ లేదు. సినిమాకి అతిపెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అది ప్రమోషన్స్ సరిగా చేయకపోవడమే. సినిమా ఆడకపోతే నిర్మాతలే తప్పు అవుతుంది. బాగా ప్రమోట్ చేస్తే ఈ క్రిస్మస్ విన్నర్ ఇదే అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.