'మార్కెట్ మ‌హాల‌క్ష్మీ' చిత్రం ఓటిటి రివ్యూ

First Published Jul 8, 2024, 8:21 AM IST

చిన్న సినిమాల తాకిడి ఓటిటి  తెరపై ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి సినిమాలలో ఒకటిగా వచ్చిందే 'మార్కెట్ మహాలక్ష్మి'. 

Market Mahalakshmi OTT Review


ఓ సాప్ట్ వేర్ అబ్బాయి..మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయితో ప్రేమలో పడితే ... వాళ్ళిద్దరి కుటంబాలు ఓకే చేసి పెళ్లి చేస్తారా...అసలు ఆమె ఓకే చేస్తుందా...ఇలాంటి గమ్మత్తైన ఆలోచనతో వచ్చిన ఈ చిత్రం ఈ వారం ఓటిటిలో రిలీజైంది. చిన్న సినిమాకు కూడా గమ్మత్తైన స్టోరీ లైన్ ఉంటే ఇంట్రస్ట్ పుడుతుంది. అయితే కేవలం ఆ స్టోరీ లైన్ తోనే సినిమా మొత్తం సరిపెట్టకుండా ...విస్తరణ కరెక్ట్ గా జరిగితేనే సినిమా చివరి దాకా చూడగలం..ఇంతకీ మార్కెట్ మహాలక్ష్మి ఎలా ఉంది..కథేంటి...చూడదగ్గ సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

గవర్నమెంట్ ఆఫీస్ లో చిరుద్యోగి (కేదార్‌ శంకర్‌) తన కొడుకు (పార్వతీశం) పై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటాడు. తన కొడుకు ఇంజినీరింగ్ చదివి అమెరికా వెళ్ళి గొప్ప సంభందం చేసుకుని సెటిల్ అవువాలని ఆశిస్తాడు. అప్పుులు చేసి మరీ చదివిస్తాడు. కొడుక్కి కూడా  చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది.  దాంతో లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితో పెళ్లి చేసి తను ఖర్చు పెట్టిన  డబ్బులు రికవరీ చేసుకోవాలనుకుంటాడు.
 

Latest Videos



అయితే అందుకు దగ్గ గొప్ప సంభందాలు ఏమీ తెచ్చినా పార్వతీశంకు నచ్చవు. ఇదిలా ఉండగా  పార్వతీశం అమాంతం ఓ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. ఆమె మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్‌ ‘మార్కెట్‌ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా). ఆమెతో లవ్ ఎట్ ఫస్ట్ లాగా తొలి చూపులోనే పూర్తిగా ప్రేమలో పడిపోయి, చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్సై పోతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం పార్వతీశం ప్రేమని ప్రక్కన పెట్టేస్తుంది. దాంతో ఆమె స్నేహితురాళ్లను మంచి చేసుకుని వారి సాయింతో ఆమెను ఒప్పించేందుకు ట్రైల్స్ వేస్తాడు. అందులో భాగంగా మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. 


మరో ప్రక్క ఈ ప్రేమ విషయం పార్వతీశం ఇంట్లో తెలుస్తుంది. వాళ్లు షాక్ అయ్యి..మార్కెట్లో పనిచేసే అమ్మాయని ఇంటి కోడలుగా తేవటం కుదరదు అంటారు. అటు మహాలక్ష్మి నో చెప్తుంది. ఇటు ఇంట్లోనే వ్యతిరేకతే. వీటిన్నటినీ ఛేదించి పార్వతీశం ఆమెను ఎలా వివాహం చేసుకున్నాడు. అసలు ఇంత బాగా సంపాదించే మంచి కుర్రాడుని మహాలక్ష్మి ఎందుకు వద్దనుకుంది...చివరకు ఆమెను ఒప్పించటానికి ఏమి నిర్ణయం తీసుకున్నాడు..ఫైనల్ గా  ఏమైంది అనేదే మిగతా కథ.
 

విశ్లేషణ

మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమా స్టోరీ లైన్ గా ఇంట్రస్టింగ్ గా ఉంది. అయితే అక్కడ నుంచి కథ విస్తరణే జరగలేదు. అదే పాయింట్ మీద కథ వెళ్లటంతో ఒకే చోట తిరుగుతున్న ఫీల్ వచ్చింది. దానికి తోడు పాయింట్ కొత్తదైనా సీన్స్ పాతవైపోయాయి. ఎక్కడో చూసినట్లు అనిపించే సీన్స్ బోలెడు ఉన్నాయి. అలాగే ఇలాంటి కథలు ఎంచ నాచురల్ గా నడిపితే అంత బాగుంటాయి. కానీ చాలా చోట్ల సినిమాటెక్ గా లాగేసారు. స్క్రీన్ ప్లే లో కూడా చెప్పుకోదగ్గ మలుపులు,నేరేషన్ లో ఆసక్తి కలిగించే ఎలిమెంట్స్ ఏమీ పెట్టుకోలేదు.

దానికి తోడు హీరో పార్వతీశం చెప్పిందే చెప్తున్నట్లుగా ...ప్రతీ సారి  తాను ఎందుకు మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడో చెప్తూనే ఉంటాడు.  దాంతో అనుకున్నస్దాయిలో డ్రామా క్రియేట్ కాలేదు. సెకండ్ హాఫ్‌లో చాలా సీన్స్  మరీ సిల్లీగా అనిపిస్తాయి.   సినిమాలో క్లైమాక్స్ బాగానే ఉంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు. మహాలక్ష్మిని ఇంప్రెస్‌ చేయడం కోసం హీరో చేసే పనులు గతంలో వచ్చిన చాలా పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ప్రెడిక్టబుల్ గా సాగుతుంది.  


ఓటిటిలలో వచ్చే సినిమాలకు కథ ప్రధానం. స్టార్స్ సినిమాలు ఎలాగూ థియేటర్స్ లో చూసేస్తారు. ఇక్కడ చూసే సినిమాలు కాస్త విభిన్నత ఎక్సపెక్ట్ చేస్తున్నాడు ప్రేక్షకుడు. తెలుగు చిన్న సినిమా చాలా సార్లు పెద్ద హీరోల సినిమాలను అనుకరిస్తూ అది మిస్సై పోతోంది.  ఈ సినిమా   కోటి రూపాయల కట్నం కోసం ఎదురుచూసే తండ్రికీ .. కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని కోడలిగా తీసుకుని వెళ్లాలనే కొడుక్కి మధ్య జరిగే పోరాటమే   కథ. రెండు కుటుంబాల  .. ఒక కూరగాయల మార్కెట్ కి మధ్య్ ఈ కథ నడుస్తుంది.  అయితే అనుకున్న స్దాయిలో ఫన్ పండించి ఉంటే సినిమా నిలబడేది.  ఓవరాల్ గా ఫస్టాఫ్ ఫన్ తో వెళ్లిపోయినా సెకండాఫ్ మాత్రం ఎమోషన్స్ కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి చేతులారా సినిమాని నెక్ట్స్ లెవిల్ కు వెళ్లకుండా చేసుకున్నారు. 
 


ఎవరెలా చేసారు 

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన పార్వతీశంకే  ఎక్కువ మార్కులు పడతాయి. ‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు.చాలా ఈజ్ తో  బాగా నటించాడు. తన పాత్రకు తగ్గట్లు.. ఫన్నీ సీన్స్ బాగా చేసారు.   తన క్యారెక్టరైజేషన్ తో, తన టైమింగ్‌ తో  నవ్వించే ప్రయత్నం చేసాడు. పరిణితి చెందిన నటుడులా  సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రణీకాన్వికా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామర్ తోనూ మెప్పించింది. హీరోకి ఫ్రెండ్ గా నటించిన ముక్కు అవినాష్ బాగా ప్లస్ అయ్యాడు. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన హర్షవర్ధన్ మెప్పించాడు. మహబూబ్ బాషాతో పాటు ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. 

 
టెక్నికల్ గా 
చిన్న సినిమా అనగానే దాదాపు అన్ని క్రాఫ్ట్ నాశిగానే ఉంటున్నాయి . అందుకు ఆర్దిక కారణాలు కారణం  అయినా స్క్రిప్టు వంటి వాటి దగ్గర కూడా సరిగ్గా ఉండటం లేదు.  ఈ సినిమాదీ అదే పరిస్దితి.   సురేంద్ర ఫొటోగ్రఫీ .. సృజన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. విశ్వనాథ్ ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సోసోగా ఉన్నాయి. 

Market Mahalakshmi OTT Review


చూడచ్చా

కాసేపు అక్కడక్కడా నవ్వుకోవటానికి కాలక్షేపంగా చూడచ్చు. మరీ తీసిపారేసే సినిమానూ కాదు. అలాగని ఎగబడి అర్జెంట్ గా చూసేయాలి అనిపించే సినిమానూ కాదు. 

  ఎక్కడుంది:
  ఈ సినిమా ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది. 

నటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులు
నిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ 
నిర్మాత: అఖిలేష్ కలారు
దర్శకత్వం: వియస్ ముఖేష్
సంగీతం: జో ఎన్మవ్  
నేపథ్య సంగీతం: సృజన శశాంక
సినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుముల
ఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లి
 

click me!